పెంపుడు జంతువుల వల్ల మీ పిల్లల మానసిక శక్తి పెరుగుతుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కెల్లీ వోక్స్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
చిన్న పిల్లల పుస్తకాల షెల్ఫ్‌లో జంతువుల పాత్రలతో కూడిన పుస్తకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ పుస్తకాల్లో ఆకలితో ఉన్న గొంగలి పురుగు నుంచి భారీ వేల్స్ వరకు ఉన్న పాత్రలు కనిపిస్తాయి. జంతువులంటే చాలా మంది పిల్లలకు ఆకర్షణ ఉంటుంది. ఇళ్లల్లో ఉండే పెంపుడు జంతువులు జంతు ప్రపంచం గురించి మరింత జ్ఞానాన్ని అందిస్తాయి.
పెంపుడు జంతువులతో ఉన్న సంబంధం మనుషులను చాలా విధాలుగా ప్రభావితం చేస్తుంది.
పిల్లలకు, జంతువులతో ఉన్న సంబంధాన్ని అర్ధం చేసుకోవడం ద్వారా తమ పిల్లలకు తగిన పెంపుడు జంతువును ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా వారి మధ్య బలమైన బంధం ఏర్పడేందుకు అవసరమైన అంశాల గురించి అవగాహన కూడా కలుగుతుంది.
చాలా మంది పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే చూస్తారు. చాలా పెంపుడు జంతువులు జంటలు తమ బంధాన్ని బలపరుచుకునేందుకు, పిల్లలు ఆడుకునేందుకు, వృద్ధులకు సహచరులుగా సహకారం అందిస్తూ ఉంటాయి.
అమెరికాలో 12 ఏళ్ల లోపు పిల్లలున్న 63% గృహాల్లో ఒక పెంపుడు జంతువు ఉన్నట్లు ఒక అధ్యయనం తెలిపింది.
పిల్లలు స్కూలుకు వెళ్లే సమయానికి పెంపుడు జంతువును పెంచుకునే వారి సంఖ్య 10% పెరుగుతోందని ఆస్ట్రేలియన్ అధ్యయనం చెబుతోంది.
పెంపుడు జంతువును చూసుకోవడం ద్వారా పిల్లలకు సంరక్షణ, బాధ్యత, దయ లాంటి లక్షణాలు నేర్చుకునేందుకు పాఠాలుగా పని చేస్తాయని చాలా మంది తల్లి తండ్రులు భావిస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
"ఇతరుల దృక్కోణం తమకు భిన్నంగా ఉంటుందని అర్ధం చేసుకునేందుకు ఇది చాలా ముఖ్యం" అని అమెరికాలో టఫ్ట్స్ యూనివర్సిటీలో హ్యూమన్ ఆనిమల్ ఇంటరాక్షన్ అసోసియేట్ ప్రొఫెసర్ మేగన్ ముల్లర్ చెప్పారు.
"తోబుట్టువుల నుంచి నేర్చుకోవడం కంటే జంతువుల దగ్గర నుంచి నేర్చుకోవడం సులభం" అని ఆమె అన్నారు.
పిల్లలు నలుగురితో కలిసే విధానం, శారీరక ఆరోగ్యం, మానసిక అభివృద్ధిని పెంపుడు జంతువులు ప్రభావితం చేస్తాయని చాలా మంది చెబుతారు. ఆటిజంతో ఉన్న పిల్లలున్న కుటుంబాల్లో పెంపుడు జంతువుల సంరక్షణ ఒత్తిడిని తగ్గించి, బంధాలను బలపరుచుకునే అవకాశాలను సృష్టిస్తుంది.
పెంపుడు జంతువుల వల్ల పిల్లలు చాలా ప్రయోజనాలను పొందుతారని చాలా అధ్యయనాలు చెప్పాయి.
గదిలో కుక్క ఉండగా, పిల్లలకు వస్తువులను గుర్తించే పనిని ఇచ్చినప్పుడు తప్పులు తక్కువగా చేసినట్లు, జ్ఞాపక శక్తికి సంబంధించిన పరీక్షల్లో ఎక్కువ ప్రోద్భలం కలిగించే అవసరం రాలేదని మరో అధ్యయనం చెబుతోంది.
పెంపుడు జంతువులను కుటుంబ సభ్యులుగా భావించడం ద్వారా జీవితం మెరుగ్గా అయిందని మరి కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మంది పెంపుడు జంతువుల వల్ల తమ ఆరోగ్యం, సంతోషం మెరుగయ్యాయని భావిస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
పెంపుడు జంతువులతో సహవాసం
పెంపుడు జంతువుల వల్ల ఉన్న ప్రయోజనాల వెనుక ఉన్న కారణాల గురించి ఆస్ట్రేలియాలోని పెర్త్ లో పాపులేషన్ అండ్ గ్లోబల్ స్కూల్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ హేలీ క్రిస్టియన్ అధ్యయనం చేస్తున్నారు.
పెంపుడు జంతువులు ఉండటం వల్ల తోటి వారితో వచ్చే సమస్యలు తక్కువగా ఉండటంతో పాటు ఇతరులతో కలిసే తత్త్వం బాగా ఉంటుందని క్రిస్టియన్ బృందం చేసిన అధ్యయనం తెలిపింది.
2-5 ఏళ్ళు వయసు ఉన్న పిల్లలున్న కుటుంబాల్లో పెంపుడు కుక్క ఉంటే పిల్లలు స్క్రీన్ చూసే సమయం తగ్గి, సగటున నిద్రపోయే సమయం పెరిగిందని కూడా మరో అధ్యయనం తెలిపింది.
పెంపుడు కుక్కను తిప్పేందుకు బయటకు వెళ్లడం కూడా శారీరక వ్యాయామానికి తోడ్పడుతుంది.
పెంపుడు కుక్క వల్ల శారీరక వ్యాయామం ఉన్న వారిలో మెరుగైన అభివృద్ధి కనిపించిందని గత ఏడాది ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది.
"చిన్న వయసులోనే పెంపుడు జంతువులతో గడపడం వల్ల పిల్లల మానసిక, సాంఘిక అభివృద్ధికి తోడ్పడింది" అని క్రిస్టియన్ అన్నారు.
అలా అని ప్రతీ కుటుంబం పెంపుడు జంతువును తెచ్చుకోవాలని లేదా పెంపుడు కుక్కలున్న కుటుంబాల్లో పిల్లలంతా మిగిలిన వారి కంటే మెరుగ్గా ఉంటారని చెప్పలేం.
ప్రవర్తనకు సంబంధించిన అంశాలు, క్లిష్టమైన వైద్య అవసరాలు, జంతువుల సంరక్షణ జీవితాన్ని మరింత కఠినతరం చేస్తాయి. పెంపుడు జంతువులు ఉండేందుకు అనువుగా లేని ఇళ్లల్లో వాటిని పెంచుకోవడం మరింత కష్టం.
"పిల్లలున్న కుటుంబాల్లో అందరూ ఒక కుక్కను పెంచుకోవాలని అయితే సూచించలేం" అని ముల్లర్ అన్నారు.
కోవిడ్-19 మహమ్మారిలో పెంపుడు జంతువులు ఉన్నటీనేజీ వయసు వారి మానసిక ఆరోగ్యం, పెంపుడు జంతువులు లేని వారి కంటే మెరుగ్గా ఉందో లేదోననే విషయం గురించి ముల్లర్ పరిశీలించారు. అయితే, వీరి మధ్య పెద్దగా వ్యత్యాసాలు కనిపించలేదు.
"నా దృష్టిలో కోవిడ్ చాలా ఒత్తిడిని కలిగించింది. ఆ ఒత్తిడిని జయించేందుకు ఏదీ పని చేసి ఉండకపోవచ్చు" అని అన్నారు.
"పెంపుడు కుక్కతో గడపడం వల్ల కొన్ని సాంఘిక ప్రయోజనాలుంటాయి. కానీ, పెంపుడు జంతువులు కూడా ఇతరులతో మాట్లాడేందుకు అవకాశాన్ని కల్పిస్తాయి" అని ముల్లర్ అన్నారు.
లాక్ డౌన్ సమయాల్లో చాలా మంది వారి కుక్కలను తీసుకుని బయటకు వెళ్లి ఉంటారు. కానీ, పక్క వారితో మాట్లాడి ఉండరు. దీంతో, ఇతరులతో మాట్లాడే ఆ చిన్న చిన్న క్షణాలను కోల్పోయారు.

ఫొటో సోర్స్, Getty Images
బలమైన బంధం
"పిల్లల పై పెంపుడు జంతువులు ప్రభావం చూపించాలంటే వారి మధ్య ఉన్న సంబంధం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. వారు ఒకే ఇంటి పై కప్పు కింద ఉంటే సరిపోదు" అని ముల్లర్ అన్నారు.
మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండటం పెంపుడు జంతువు కేవలం ఇంట్లో ఉండటం వల్ల మాత్రం కాకుండా ఇరువురి మధ్య ఉన్న సంబంధం పై కూడా ఆధారపడి ఉంటుంది.
పెంపుడు జంతువుతో గడిపే సమయం కూడా కొంత పాత్ర పోషిస్తుంది. మీ సోదరి లేదా సోదరుడి గదిలో ఒక చిట్టెలుక ఉన్నంత మాత్రాన దాంతో మీరు అనుబంధాన్ని ఏర్పర్చుకోరు.
పిల్లలు పెంపుడు జంతువులతో అనుబంధం ఏర్పర్చుకునేందుకు వారి వయసు కూడా నిర్ణయిస్తుంది. 6 - 10 ఏళ్ళు ఉన్న పిల్లలు పెంపుడు జంతువులతో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు. ఇది పిల్లులు, కుక్కలు లాంటి జంతువులతో ఎక్కువగా జరుగుతుంది.
కానీ, 11-14 ఏళ్ళు ఉన్న పిల్లలు ఎలుకలు లాంటి జంతువులతో కూడా అదే మాదిరి అనుబంధాన్ని ఏర్పరచుకుంటారు.
కుటుంబ శైలి కూడా కొంత పాత్ర పోషిస్తుంది. తోబుట్టువులు లేని పిల్లలు పెంపుడు జంతువుల వల్ల ప్రయోజనం పొందుతారు. ఇవి ఒక్కొక్కసారి సరోగసీ ద్వారా పుట్టిన తోబుట్టువులుగా ఉంటాయి.
"పెంపుడు కుక్కలు ఉండటం వల్ల పిల్లలు వాటితో కలిసి స్వతంత్రంగా తిరిగేందుకు అనుమతిస్తారు" అని క్రిస్టియన్ అన్నారు.
ఇళ్లల్లో కూడా ఒకరితో ఒకరు పరస్పరం గడిపేందుకు పెంపుడు కుక్కలు సహాయపడతాయి.
"పెంపుడు జంతువుల గురించి తెలుసుకున్న తర్వాత వాటి గురించి అవగాహన విస్తృతం చేసుకునే అవకాశం కలుగుతుంది
వారి పెంపుడు జంతువుల నుంచి మరింత అర్ధం చేసుకునే తత్త్వం, దయ, స్పందించే గుణాలను అలవరుచుకుంటారు" అని బ్రిస్టల్ యూనివర్సిటీలో జంతువుల ప్రవర్తన పై మాజీ రీడర్ జాన్ బ్రాడ్‌షా చెప్పారు.
ఆయన పిల్లులు, కుక్కల గురించి చాలా పుస్తకాలు రాశారు.
జంతువుల మనసు గురించి ఇళ్లల్లో పెంపుడు జంతువులున్న వారికి ఎక్కువగా తెలుస్తుంది అని యూకేలోని ఒక అధ్యయనం తెలిపింది.
జంతువులకు కూడా వాటి సొంత ఆలోచనలు భావాలు ఉంటాయని అర్ధమవుతుందని చెప్పింది.
"ఒక సింహం గురించి మీ మనసులో ఎన్నైనా ఊహలు ఉండొచ్చు. కానీ, మిమ్మల్ని ఎవరైనా ఆఫ్రికా తీసుకెళ్లే వరకూ మీరు నిజంగా సింహాన్ని చూసి ఉండరు" అని అన్నారు.
"కానీ, ఒక జంతువు ఎలా ఉంటుందో ఒక కుక్క లేదా పిల్ల తెలియచేస్తాయి. జంతువులు మనుషులు ఒకటి కాదని, వాటికొక ప్రత్యేక జీవితం ఉంటుందని చెబుతాయి" అని చెప్పారు.
ఇళ్లల్లో పెంపుడు జంతువులు ఉన్న ఇళ్లల్లో పసి పిల్లలు 10 నెలల వయసు వచ్చేసరికే జంతువులను గుర్తించగల్గుతున్నట్లు మరో అధ్యయనం చెబుతోంది.
పెంపుడు జంతువులతో పిల్లలకున్న సంబంధం వారికి ప్రకృతితో సంబంధాన్ని ఏర్పర్చుకునేందుకు తోడ్పడుతుంది.
"జీవితాన్ని ఆస్వాదిస్తూ, శ్వాసిస్తూ, ఇంట్లో అల్లరి చేసే ఒక పెంపుడు జంతువు తిరుగుతూ ఉంటే సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఉత్తమమైన మార్గంగా పని చేస్తుంది" అని బ్రాడ్‌షా అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
పిల్లల గురించి జంతువులెలా ఆలోచిస్తాయి?
జంతువుల మూలాల గురించి గుర్తు పెట్టుకోవడం ద్వారా అవి మన కుటుంబాలను చూసే దృక్కోణం అర్ధమవుతుంది.
మనుషులతో కలిసి జీవనం సాగించే విధంగా కుక్కలు పరిణామం చెందాయి. ఇవి మనుషులతో బలమైన బంధాలను ఏర్పరుచుకుంటాయి. ఒక ఇంట్లో నివసించే సభ్యులందరినీ అవి ఒకే కుటుంబంలా చూస్తాయి.
"ఇంట్లో పెంపుడు పిల్లులు వాటి తోకలను పైకి ఊపుతూ, లేదా కాళ్ళను రుద్దుకుంటూ అభివాదం చేస్తాయి.
అవి మరో పిల్లిని కలిసినప్పుడు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తాయి" అని బ్రాడ్ షా 'ది ఆనిమల్స్ అమాంగ్ అజ్" అనే పుస్తకంలో రాశారు.
కానీ, ఇదే విధమైన భావన పిల్లలకు కూడా ఉంటుందా లేదా అనేది ఆ పెంపుడు జంతువు చిన్న వయసులోనే వారితో ఏర్పడిన అనుభవాల పై ఆధారపడి ఉంటుంది.
పిల్లులు, కుక్కలకు కూడా నేర్చుకునే కాలపరిమితి చాలా తక్కువగా ఉంటుంది. కుక్క పిల్లలు 8 నుంచి 16 వారాల వయసులో అవి ఎదురుపడిన అన్ని రకాల వ్యక్తుల గురించి తెలుసుకుంటాయి.
"కుక్కలు లేదా పిల్లులు వాటికి 6 నెలల వయసు వచ్చే లోపు పిల్లలను కలవని పక్షంలో అవి ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉంది" అని బ్రాడ్ షా అన్నారు.
"వాటికి చిన్నప్పుడే మనుషులను పరిచయం చేయకపోతే వారిని గుర్తించడం వాటికి కష్టమవుతుంది" అని అన్నారు.
ఒక జంతువు కోణం నుంచి చూస్తే అది సరైందే.
"కుక్క, పిల్లి పిల్లలను పెద్దవారిగా పరిగణించలేం. అవి నిలబడలేవు, పరిమాణంలో చిన్నగా ఉంటాయి. అవి చేసే శబ్దాలు భిన్నంగా ఉంటాయి. వాటి వాసన కూడా తేడాగా ఉంటుంది" అని ఆయన అన్నారు.
అందరూ కలిసి జీవించాలంటే ఒక జంతువు ప్రపంచాన్ని చూసే విధానాన్ని అర్ధం చేసుకోవడం అవసరం. ఒక పిల్లి ఇంట్లో మంచం పై మూత్ర విసర్జన చేస్తే చాలా సులభంగా ఒక నిర్ణయానికొచ్చేస్తాం.
కుక్కలు, పిల్లులు ప్రధానంగా వాసనపై ఆధారపడతాయి. పెంపుడు జంతువులు కొత్త వాసనలు గ్రహించినప్పుడు ఒకే సారి మీ ఇంటి గోడల రంగులు మారిపోయినట్లు మీకనిపించే భావన మాదిరి ఉంటుంది " అని బ్రాడ్‌షా అన్నారు.
వాటికి ముందుగానే తెలిసిన వాసనలొచ్చినప్పుడు అవి చాలా సంతోషంగా ఉంటాయి.
పిల్లల సంరక్షణ విషయంలో పెంపుడు జంతువులను మనుషుల మాదిరిగా భావించడానికి మాత్రం వీల్లేదు.
"ఒక కుక్క ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తుందో ఎప్పటికీ కచ్చితంగా చెప్పలేం" అని బ్రాడ్‌షా అన్నారు.
"ఒక కుక్క ప్రవర్తన మారేందుకు ఏ విషయమైనా ప్రేరేపించవచ్చు. ఇలాంటి ప్రవర్తనను ఆ కుక్క యజమాని కూడా ఎప్పుడూ చూసి ఉండకపోవచ్చు" అని ముల్లర్ అన్నారు.
"చాలా మంది పిల్లలు పెంపుడు జంతువులను వారి జీవితాల్లో ముఖ్యమైన భాగంగా భావిస్తారు. పెంపుడు జంతువులను మానసిక మద్దతు ఇచ్చేవారిగా చూస్తారు. వారి రహస్యాలను కూడా పంచుకుంటారు. అయితే, వీటి వల్ల కలిగే ప్రయోజనాలను కచ్చితంగా చెప్పలేకపోవచ్చు" అని బ్రాడ్ షా అన్నారు.
"ఈ ప్రయోజనాలను లెక్కించలేనంత మాత్రాన ఇది వాస్తవం కాదని చెప్పలేం" అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













