మహారాష్ట్ర: శివసేనలో ముసలం... సీఎం ఉద్ధవ్ ఠాక్రే తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలరా?

ఉద్ధవ్ ఠాక్రే

ఫొటో సోర్స్, ANI

మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. శివసేన సీనియర్ నేత, రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు బాట పట్టారు. ఆయన కొంత మంది ఎమ్మెల్యేలను తీసుకుని సూరత్ (గుజరాత్)లోని లీ మెరిడియెన్ హోటల్‌కు వెళ్ళిపోయారు.

ఏక్‌నాథ్ వెంట ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయంలో రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. కానీ, ఏ పార్టీ కూడా ఈ విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు.

ఏక్‌నాథ్ తిరుగుబాటుతో రాష్ట్రంలో ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగించగలదా? ఈ విషయం తెలియాలంటే రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఉన్నాయో తెలియాలి.

మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాల్లో ప్రస్తుతం ఒక సీటు ఖాళీగా ఉంది. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లట్కే మృతితో ఈ ఖాళీ ఏర్పడింది. అంటే, ఇప్పుడున్న 287 మంది శాసనసభ్యుల్లో ఎవరి బలం ఎంత అన్నది తెలియాలి.

అధికారంలో ఉండాలంటే సంకీర్ణ కూటమికి 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ప్రస్తుతం శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీల సంకీర్ణం రాష్ట్రంలో అధికారంలో ఉంది. 2019 నవంబర్ 30 అధికారంలోకి వచ్చిన ఈ కూటమికి అప్పట్లో 169 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు.

ప్రస్తుతం శివసేనకు అసెంబ్లీలో 55 స్థానాలు ఉన్నాయి. ఎన్‌సీపీకి 53, కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 105 స్థానాలు దక్కాయి. దానితోపాటు, పంధార్‌పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి తన సంఖ్యా బలాన్ని 106కు పెంచుకుంది.

ఏక్‌నాథ్ షిండే

ఫొటో సోర్స్, @mieknathshinde

ఫొటో క్యాప్షన్, ఏక్‌నాథ్ షిండే

ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో 13 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. వీరిలో ముగ్గురు - రాజేంద్ర పాటిల్ యెడ్రావకర్, శంకర్రావు గడక్, బచ్చు కాడు - శివసేన తరఫున మంత్రివర్గంలో ఉన్నారు.

వీరు కాకుండా జనసూరజ్య శక్తి పార్టీకి చెందిన వినయ్ కోరే, రాష్ట్రీయ సమాజ్ పక్షకు చెందిన రత్నాకర్ గుట్టేలు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. మరోవైపు, స్వాభిమాని పక్షకు చెందిన దేవేందర్ భూయార్, పీడబ్ల్యూకు చెందిన శ్యామ్‌సుందర్ షిండే ఎన్‌సీపీ వెంట ఉన్నారు.

ఏఐఎంఎం, సమాజ్‌వాది పార్టీలకు చెరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కూడా శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అయితే, బహుజన వికాస్ అఘాడికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం బీజేపీ వెంట ఉన్నారు.

వీరు కాకుండా, సీపీఐ (ఎం), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన, ప్రహార్ జనశక్తి పక్ష పార్టీలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు.

అయితే, ఏక్‌నాథ్ వెంట ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ సంఖ్యను తగ్గిస్తే శివసేన సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడుతుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఈ సంక్షోభంపై మాట్లాడుతూ శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్, "మేం ఏక్‌నాథ్ షిండేతో చర్చలు జరిపాం. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం" అని అన్నారు.

సంజయ్ రౌత్

ఫొటో సోర్స్, Ani

ఫొటో క్యాప్షన్, సంజయ్ రౌత్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, శివసేన ప్రధాన కార్యదర్శి మిళింద్ నార్వేకర్ మంగళవారం సాయంత్రం ఏక్‌నాథ్ షిండేను కలిసి చర్చలు జరిపారు. దాదాపు గంటసేపు జరిగిన ఈ భేటీలో నార్వేకర్‌తో పాటు శివసేన నేత రవీంద్ర పాఠక్ కూడా ఉన్నారు. సమావేశం తరువాత వారిద్దరూ తిరిగి ముంబయి వెళ్ళారు.

ఏఎన్ఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ''ఎక్‌నాథ్ షిండేతో చర్చలు జరిపాం. ఆయనతో మాకు మంచి సంబంధాలున్నాయి. మేం బీజేపీని ఎందుకు వీడామో ప్రతి ఒక్కరికీ తెలుసు'' అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ చెప్పారు.

ఇదిలావుంటే.. ముంబైలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన 'వర్ష'లో శివసేన ఎమ్మెల్యేలు, ఆఫీస్ బేరర్ల సమావేశం జరిగింది.

అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష నేత పదవి నుంచి ఎక్‌నాథ్ షిండేను తొలగించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ముంబైలోని షివిడీ నియోజకవర్గ ఎమ్మెల్యే అజయ్ చౌదరిని పార్టీ శాసనభా పక్ష నేతగా ఎంపిక చేశారు.

వీడియో క్యాప్షన్, ‘నీటి వసతి లేని ఊరికి పిల్లనివ్వం’ అంటున్న జనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)