మహారాష్ట్ర సంక్షోభం: ఒకప్పుడు ఆటో నడిపిన ఏక్‌నాథ్ షిండే... ఇప్పుడు శివసేనలో చక్రం తిప్పే స్థాయికి ఎలా వచ్చారు?

ఏక్‌నాథ్ షిండే

ఫొటో సోర్స్, ANI

మహారాష్ట్రలో ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల తరువాత శివసేన, మహావికాస్ అఘాడీల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదానికి అసలు కారణాలు తెలియకముందే శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు.

శివసేన సీనియర్ నేత ఏక్‌నాథ్ షిండే పలువురు ఎమ్మెల్యేలతో కలిసి రాత్రికి రాత్రే గుజరాత్‌లోని సూరత్‌ చేరుకున్నారు. దాంతో, మహారాష్ట్ర రాజకీయాల్లో ముసలం పుట్టింది.

శివసేనకు చెందిన 35 మంది ఎమ్మెల్యేలు ఏక్‌నాథ్‌తో ఉన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

ఏక్‌నాథ్ థానేలోని కోప్రి- పచ్పఖాడి స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అనేక దశాబ్దాలుగా పార్టీలో ముఖ్యమైన నేతగా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే, కల్యాణ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.

ఏక్‌నాథ్ చాలా ఏళ్లుగా శివసేన సభ్యుడిగా ఉన్నారు. థానే మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రతిపక్ష నేతగా పనిచేసిన తరువాత, 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

తొలినాళ్లల్లో ఆయన ఆటోరిక్షా నడిపేవారు.

థానేలోని వైభవ్ వార్తాపత్రిక సంపాదకుడు మిలింద్ బల్లాల్, ఏక్‌నాథ్ రాజకీయ ప్రయాణాన్ని విశ్లేషిస్తూ "దూకుడు తత్వం ఉన్న శివసైనిక్ నుంచి శాఖలో ముఖ్యుడిగా మారి, బాధ్యతాయుతమైన మంత్రిగా ఎదిగారు" అని అన్నారు.

"ఏక్‌నాథ్ స్వస్థలం సతారా. చదువుల కోసం ఆయన థానే వెళ్లారు. అక్కడ ఆయనకు ఆనంద్ దిఘేతో పరిచయం ఏర్పడింది. అలా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది" అని మిలింద్ బల్లాల్ వివరించారు.

ఏక్‌నాథ్ షిండే

ఫొటో సోర్స్, ANI

લાઇન

రాజకీయ ప్రస్థానం

લાઇન
  • 18 ఏళ్ల వయసులో శివసేనలో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.
  • దాదాపు దశాబ్దంన్నర పాటు పార్టీలో పనిచేసిన తరువాత 1997లో ఆనంద్ దిఘే.. ఏక్‌నాథ్‌కు థానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కౌన్సిలర్ టిక్కెట్ ఇచ్చారు.
  • ఈ మునిసిపల్ ఎన్నికల్లో గెలవడమే కాకుండా థానే మున్సిపల్ కార్పోరేషన్ హౌస్ లీడర్ కూడా అయ్యారు ఆయన.
  • ఆ తరువాత 2004లో థానే అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
  • 2009 నుంచి కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతిసారీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
  • 2015 నుంచి 2019 వరకు రాష్ట్ర ప్రజాపనుల శాఖ మంత్రిగా పనిచేశారు.
  • ప్రస్తుతం ఆయన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగానే కాకుండా థానే జిల్లాకు ఇన్‌ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు.
લાઇન

శివసేనపై కుట్ర: నీలం గోర్హే

ఏక్‌నాథ్ ఎమ్మెల్యేలతో కలిసి రాష్ట్రం నుంచి వెళ్లిపోవడం, తరువాత ఎవరికీ అందుబాటులో లేకపోవడం వంటి పరిణామాలు చూస్తుంటే శివసేన పార్టీలో పరిస్థితులు బాగా లేవనే అభిప్రాయం ఏర్పడుతోందని నిపుణులు అంటున్నారు.

అయితే, ఏక్‌నాథ్‌ను త్వరలోనే సంప్రదిస్తామని శివసేన నేత నీలం గోర్హే విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏక్‌నాథ్ షిండే

ఫొటో సోర్స్, ANI

వదంతులను నమ్మవద్దని శివసేన నేత, రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నీలం గోర్హే కోరారు.

"చాలా కాలంగా ఏక్‌నాథ్ మా సహచరుడు. పార్టీలో నేతలు రోజూ ఒకరినొకరు కలుసుకోరు కానీ, షిండే ఎల్లప్పుడూ ఇతర నాయకులను కలుస్తూనే ఉండేవారు. ప్రస్తుతం, ఆయనతో మాట్లాడే అవకాశం ఎప్పుడు వస్తుందో కచ్చితంగా చెప్పలేను" అని గోర్హే అన్నారు.

"ఆయన చాలా సమర్ధవంతుడైన నాయకుడు. కష్టపడి పనిచేసే వ్యక్తి. శాసన మండలి ఎన్నికల కోసం చాలా రోజులు శ్రమించారు. పగలు, రాత్రి పనిచేశారు. ముఖ్యమైన శాఖల బాధ్యతలు ఆయన భుజాల మీద ఉన్నాయి. ఎన్నికల తరువాత ఈ వారం మేం పార్టీ కార్యాలయంలో కలిసినప్పుడు ఏక్‌నాథ్ కూడా అక్కడ ఉన్నారు. ముఖ్యమంత్రి అక్కడికి వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ప్రస్తుతం వారంతా ఎక్కడ ఉన్నారు అనేదాని గురించి కంగారు పడక్కర్లేదు. త్వరలోనే అందరినీ సంప్రదిస్తాం" అని గోర్హే తెలిపారు.

"శివసేనపై కుట్రలు జరుగుతూనే ఉన్నాయి. కానీ, ఇలాంటి ఆలోచనలతో సాధించేదేమీ లేదు. ఇది శత్రువుల కుట్ర. ఎన్నికల సమయంలో నేను ప్రతి ఎమ్మెల్యేను కలిశాను. శివసేన అభ్యర్థులిద్దరూ చర్చల ద్వారానే ఎన్నికయ్యారు.

ఓట్ల షేరింగ్ జరిగిందనే వార్తలు నిరాధారమైనవి. ఏ ఎమ్మెల్యే ఓటు ఎక్కడ పడింది అనేది అధ్యయనం చేసి చర్చిస్తేనే తెలుస్తుంది" అని గోర్హే అన్నారు.

వీడియో క్యాప్షన్, ఈ హెల్మెట్ మ్యాన్ రెడ్ సిగ్నల్ పడగానే డ్యాన్సులు ఎందుకు చేస్తున్నాడు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)