భారత్ ఇచ్చింది దానం కాదు, అప్పు అని శ్రీలంక ప్రధాని ఎందుకు అన్నారు

శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే

భారత్ అందించిన ఆర్థిక సహాయం 'విరాళం' కాదని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పార్లమెంట్‌లో అన్నారు.

దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, అప్పులను తిరిగి చెల్లించేందుకు ప్రణాళికలను రూపొందించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

1948లో స్వాతంత్ర్యం పొందిన తర్వాత శ్రీలంక ఎన్నడూ చూడనంత దారుణ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దీని కారణంగా అక్కడ ఆహారం, ఔషధాలు, వంటగ్యాస్, చమురు వంటి అత్యవసర వస్తువుల కొరత తీవ్రంగా ఉంది.

''భారతీయ క్రెడిట్ లైన్ కింద మేం 4 బిలియన్ డాలర్ల (రూ. 31,273 కోట్లు) అప్పు తీసుకున్నాం. మరిన్ని రుణాలు ఇవ్వాలంటూ భారతీయ సహచరులను అభ్యర్థించాం. కానీ, భారత్ నిరంతరం మనకు సహాయాన్ని అందించలేదు. సహాయం అందించడానికి కూడా పరిమితులు ఉంటాయి. మరోవైపు ఈ రుణాలు తిరిగి చెల్లించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉంది. ఇవి దానంగా వచ్చిన డబ్బులు కావు'' అని ఆయన పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు.

ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి పార్లమెంట్‌కు రణిల్ విక్రమసింఘే వివరించారని వార్తా సంస్థ ఐటీఐ తెలిపింది.

స్థానిక ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ)‌కు చెందిన ఉన్నతాధికారుల బృందం గురువారం కొలంబోకు చేరుకుంటుందని ఆయన చెప్పారు.

శ్రీలంక ఇప్పుడు ఇంధనం, గ్యాస్, విద్యుత్, ఆహారం కొరత కంటే కూడా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోందని అన్నారు.

శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే

ఫొటో సోర్స్, Getty Images

''మన ఆర్థికవ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. ఈరోజు మన ముందున్న అత్యంత తీవ్రమైన సమస్య ఇదే. శ్రీలంక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించగలం. ఇలా చేయాలంటే ముందుగా విదేశీ మారక నిల్వల సమస్యను పరిష్కరించాలి'' అని ఆయన చెప్పారు.

పూర్తిగా కుప్పకూలిన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం అంత సులభమైన పని కాదని ఆయన అన్నారు. విదేశీ మారక నిల్వలు, ప్రమాదకర స్థాయి కంటే కూడా దిగువకు పడిపోయిన దేశానికి ఇది మరింత కఠినమైన పని ఆయన వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఆశలన్నీ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)పైనే పెట్టుకున్నామని అన్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక: ఆర్థిక ప్రమాణాల్లో ముందున్న శ్రీలంక ఎందుకిలా కుదేలైంది?

2026 నాటికి శ్రీలంక మొత్తం 25 బిలియన్ డాలర్ల (రూ. 1,95,507 కోట్లు) రుణాలను చెల్లించాల్సి ఉంది. విదేశీ రుణాలు మొత్తం 51 బిలియన్ డాలర్ల (రూ. 3,98,835కోట్లు)కు చేరింది.

భారత్ నుంచి ఈ ఏడాది జనవరిలో అందిన క్రెడిట్ లైన్ శ్రీలంకకు అండగా నిలిచింది. వచ్చే సోమవారం అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక బృందం శ్రీలంకకు రానుందని విక్రమసింఘే తెలిపారు. జూలై నాటికి ఐఎంఎఫ్‌తో అధికారిక ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు.

దేశం దివాలా తీసినట్లు ప్రకటించేలా రాజపక్స కుటుంబం కుట్ర పన్నిందని ఆరోపణలు వస్తున్నాయి. రాజపక్స కుటుంబం బిలియన్ డాలర్ల సంపదను స్వాధీనం చేసుకొని వాటిని దుబయ్, సీషెల్స్, సెయింట్ మార్టిన్ బ్యాంకుల్లో దాచిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

నరేంద్ర మోదీ, రణిల్ విక్రమసింఘే

ఫొటో సోర్స్, Getty Images

చమురును కూడా కొనలేం...

చమురును దిగుమతి చేసుకోలేని అసమర్థ పరిస్థితుల్లో దేశం ఉన్నట్లు ఆయన పార్లమెంట్‌కు చెప్పారు. శ్రీలంక చమురు సంస్థలు భారీగా అప్పుల్లో కూరుకుపోయి ఉన్నందున చమురును కొనడం కష్టంగా మారిందని అన్నారు.

వార్తా ఏజెన్సీ ఏపీ ప్రకారం.. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ 700 మిలియన్ డాలర్ల (రూ. 5,473 కోట్లు) అప్పుల్లో ఉందని విక్రమసింఘే వెల్లడించారు. దీని ఫలితంగానే ప్రపంచంలోని ఏ దేశం, ఏ సంస్థ కూడా తమకు ఇంధనాన్ని ఇచ్చేందుకు ముందుకు రావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంకలో భారీ నిరసనలు జరిగాయి. వీటి తర్వాత విక్రమసింఘే, శ్రీలంక ప్రధాని అయ్యారు. గత ప్రభుత్వాలు సకాలంలో తగు చర్యలు తీసుకోలేదని ఆయన బుధవారం ఆరోపించారు.

''ఆర్థిక వ్యవస్థ పతనం వేగాన్ని తగ్గించేందుకు మొదట్లోనే చర్యలు తీసుకొని ఉంటే, ఈరోజు ఇంతకష్టాన్ని మనం ఎదుర్కొనే పరిస్థితి తలెత్తేది కాదు'' అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ముందున్న సవాళ్లేంటి?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)