శ్రీలంక సంక్షోభం: 'నా దగ్గర మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి బతికిపోయాను... లేదంటే జైలే'

అప్పుడే పెళ్లయిన జంటలు కూడా అధ్యక్ష భవనం వద్ద నిరసనల్లో పాల్గొన్నాయి

ఫొటో సోర్స్, Priyantha Bandara Travel Photography

ఫొటో క్యాప్షన్, అప్పుడే పెళ్లయిన జంటలు కూడా అధ్యక్ష భవనం వద్ద నిరసనల్లో పాల్గొన్నాయి
    • రచయిత, సునీత్ పెరీరా
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా మొబైల్ ఫోన్‌ను ఆయుధంగా ఉపయోగించవచ్చా? దాదాపు 2.2 కోట్లమంది జనాభా, ప్రతి వందమందికి 135 యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌లు ఉన్న దేశంలో మొబైల్ ఫోన్ మీ జీవితాన్ని కాపాడ గలదా ? అవుననే అంటున్నారు శ్రీలంకలోని ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమకారులు.

"మేము నిరసనలో పాల్గొన్న ప్రతిసారీ, ఆ క్షణాలను రికార్డ్ చేయడానికి లేదా తర్వాత ఆ వీడియోలను పోస్ట్ చేయడానికి వీలుగా మేం సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తాం" అని మెలాని గుణతిలక అనే ఉద్యమకారుడు చెప్పారు.

"మల్టీమీడియా సౌకర్యం ఉన్న స్మార్ట్‌ఫోన్‌లకు ఫేస్‌బుక్, యూట్యూబ్, టిక్‌టాక్ వంటి సోషల్ మీడియా సర్వీసులు కూడా తోడై ప్రజాస్వామ్యాన్ని పునర్నిర్వచించాయి" అని డిజిటల్ మీడియా విశ్లేషకుడు నలక గుణవర్ధనే అన్నారు.

ఆందోళన నిర్వహించే ప్రతిచోటా తాను వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేస్తానని మెలానీ గుణతిలక చెప్పారు

ఫొటో సోర్స్, Melani Gunathilaka

ఫొటో క్యాప్షన్, ఆందోళన నిర్వహించే ప్రతిచోటా తాను వీడియో లైవ్ స్ట్రీమింగ్ చేస్తానని మెలానీ గుణతిలక చెప్పారు

శ్రీలంక అంతటా, ద్రవ్యోల్బణం, ఇంధనం, ఆహార కొరతకు కారణమైనందుకు అధ్యక్షుడు గోటాబయ రాజపక్స రాజీనామా చేయాలని లక్షలమంది శ్రీలంక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

లైవ్ స్ట్రీమింగ్ కారణంగా తాను, ఇతర నిరసనకారులు జైలుకు వెళ్లకుండా తప్పించుకోగలిగామని మెలానీ అనే ఉద్యమకారిణి నమ్ముతున్నారు.

''రాష్ట్రపతి మీద అవిశ్వాస తీర్మానం పై సంతకం చేయాలని ఎంపీల మీద ఒత్తిడి చేసేందుకు మాలో చాలామంది పార్లమెంట్ దగ్గర శాంతియుతంగా నిరసనలు తెలిపాం. ఒక సీనియర్ పోలీసు అధికారి వచ్చి మమ్మల్ని అక్కడి నుంచి తొలగించడానికి కోర్టు ఆర్డర్ ఉందని చెప్పారు. అప్పుడు మేం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాము. కోర్టు ఆర్డర్‌ చూపాలని అడిగాం. కానీ ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఒక పోలీసు వ్యాన్ మా ముందు ఆగింది. వాళ్లు మమ్మల్ని వ్యాన్ ఎక్కించారు. మేమిద్దరం లైవ్ స్ట్రీమింగ్ చేస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో వార్తలు వ్యాపించాయి. మా తరపున వాదించడానికి 200 మందికి పైగా న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు" అని మెలానీ చెప్పారు.

ఆందోళనకారులకు న్యాయవాదులు మద్దతు ప్రకటిస్తున్నారు
ఫొటో క్యాప్షన్, ఆందోళనకారులకు న్యాయవాదులు మద్దతు ప్రకటిస్తున్నారు

న్యాయ సహాయం

సుపున్ జయవీర, మరికొందరు యువ న్యాయవాదులు స్వచ్ఛందంగా మెలాని, మరికొందరికి న్యాయ సహాయం అందించారు. మెలానీ తీసిన వీడియోలతో పాటు, ఫేస్‌బుక్ లైవ్ లు వారు నిర్దోషులని తేల్చడానికి సహాయ పడ్డాయని ఆయన చెప్పారు.

"నిరసనకారులను అక్కడి నుంచి తొలగించడానికి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పోలీసు అధికారి తెలిపారు. ఆయన మాటలు ఫేస్‌బుక్ లైవ్‌లో రికార్డ్ అయ్యాయి. కానీ అలాంటివేమీ కోర్టు జారీ చేయలేదు. ఈ వీడియోను సాక్ష్యంగా మేజిస్ట్రేట్‌కి సమర్పించాం" అని జయవీర అన్నారు. అదే రోజు, కోర్టు మెలానీని, మరికొందరు ఆందోళనకారులను విడుదల చేసింది.

ఆందోళనల సమయంలో హత్యకు గురైన, కనిపించకుండా పోయిన జర్నలిస్టుల కోసం నిరసన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆందోళనల సమయంలో హత్యకు గురైన, కనిపించకుండా పోయిన జర్నలిస్టుల కోసం నిరసన

పోలీసుల స్పందన

దీని గురించి మాట్లాడటానికి తనకు మరింత సహాయం కావాలని శ్రీలంక పోలీసు ప్రతినిధి, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిహాల్ తల్దువా అన్నారు. శాంతియుత నిరసనలలో పోలీసులు ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని ఆయన బీబీసీతో అన్నారు.

రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని, అలాగే ఆ హక్కులను అనుమతించడానికి పరిమితులు ఉన్నాయని ఆయన అన్నారు. ఆయన ప్రస్తావించిన హక్కులలో వాక్ స్వాతంత్ర్యం, సమావేశం జరుపుకునే స్వేచ్ఛ కూడా ఉన్నాయి.

ప్రభుత్వ అనుకూల వాదుల దాడులు ప్రియాంగ విశ్వజిత్ లైవ్ వీడియోలో రికార్డయ్యాయి

ఫొటో సోర్స్, Priyanga Vishwajith

ఫొటో క్యాప్షన్, ప్రభుత్వ అనుకూల వాదుల దాడులు ప్రియాంగ విశ్వజిత్ లైవ్ వీడియోలో రికార్డయ్యాయి

గాల్ ఫేస్ నిరసనలు

దేశాధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొలంబోని గాల్ ఫేస్ బీచ్ దగ్గర్లో ఉన్న అధ్యక్ష భవనం ముందు యువ నిరసనకారులు క్యాంప్ చేస్తున్నారు. వారు దీనికి "గొటా-గో-గామ" (గొటా ఊరెళ్లిపో ) అని పేరు పెట్టారు. జయవీర లాంటి యువ న్యాయవాదులు ఈ గ్రూపులో ఉన్నారు.

మే 9న ప్రధానమంత్రి మహింద రాజపక్సను ఆయన అధికారిక నివాసంలో కలిసిన తర్వాత శాంతియుతంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై అనేక వందల మంది ప్రభుత్వ మద్దతుదారులు దాడి చేశారు. వీడియోలు, ప్రత్యక్ష ప్రసార రికార్డింగ్‌లలో ఈ దాడి దృశ్యాలు ఉన్నాయి.

ప్రియాంగ విశ్వజిత్ అనే ఆందోళనకారడు లైవ్ వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో రాజపక్స మద్దతుదారులు దాడి చేశారు. తమపై దాడి చేస్తున్న ప్రభుత్వ అనుకూలవాదులను గుర్తించడానికి ప్రియాంగ విశ్వజిత్ వీడియో ఉపయోగపడింది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ముందున్న సవాళ్లేంటి?

విచారణకు డిమాండ్

శ్రీలంక మానవ హక్కుల కమిషన్, బార్ అసోసియేషన్, విదేశీ దౌత్యవేత్తలు ఈ దాడిని ఖండించడమే కాకుండా, నిష్పాక్షిక విచారణకు పిలుపునిచ్చారు. మానవ హక్కుల కోసం ఐక్యరాజ్య సమితి హై కమీషనర్ మిచెల్ బాచెలెట్ శ్రీలంకలోని అధికారులు హింసను నిరోధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలపై ప్రజలు విశ్వాసం కోల్పోవడమే ఇలాంటి వీడియోలు తీయడానికి దారితీసిందని జయవీర చెప్పారు. పోలీసులపై వచ్చిన ఆరోపణలు, ప్రత్యేకించి సాక్ష్యాలు తారుమారు చేయడం ఇందుకు కారణమని ఆయన చెప్పారు.

"ఏదైనా సమస్య ఉంటే, ఈ నిరసనకారులకు స్పష్టమైన ఆధారాలు ఉండాలి. అక్రమ కార్యకలాపాలకు పాల్పడని నిరసనకారులను కూడా అనేక సందర్భాల్లో కారణం లేకుండా అరెస్టు చేశారు. కానీ తరువాత కోర్టు విడుదల చేసింది. అలాంటి అనేక సందర్భాల్లో, మొబైల్ ఫోన్‌లలో రికార్డ్ చేసిన వీడియో ఫుటేజీని సాక్ష్యంగా ఉపయోగించారు" అని జయవీర అన్నారు.

ఆందోళనకు దిగిన బౌద్ధ భిక్షువును ఎత్తుకెళుతున్న పోలీసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆందోళనకు దిగిన బౌద్ధ భిక్షువును ఎత్తుకెళుతున్న పోలీసులు

తిరస్కరించిన పోలీసులు

ఈ ఆరోపణలను శ్రీలంక పోలీసులు ఖండించారు. ''ఎవరైనా నిర్దోషి అయితే, వారు కోర్టులో నిరూపించుకోవచ్చు. పోలీసులకు కూడా ఇది వర్తిస్తుంది. కొందరు తాము చేసిన తప్పుల నుంచి బైటపడేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు'' అని శ్రీలంక పోలీసు ప్రతినిధి నిహాల్ తల్దువా అన్నారు.

2021లో విడుదలైన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల నివేదిక కస్టడీ మరణాలను వివరించింది. శ్రీలంకలో పోలీసులు హింసకు పాల్పడుతున్నారని ఆరోపించింది. శ్రీలంకపై మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు చాలాకాలం నుంచి వినిపిస్తున్నాయి.

అధ్యక్ష భవనం దగ్గర బస్సును తగలబెడుతున్న వ్యక్తి
ఫొటో క్యాప్షన్, అధ్యక్ష భవనం దగ్గర బస్సును తగలబెడుతున్న వ్యక్తి

బస్సుపై దాడి

ఇంధన కొరత, విద్యుత్ కోతల మధ్య, నిరసనకారులు మార్చి 31న అధ్యక్షుడు రాజపక్స ప్రైవేట్ నివాసం ముందు గుమిగూడారు. సమీపంలో ఆగి ఉన్న బస్సుకు ఎవరో నిప్పు పెట్టారు.

ప్రభుత్వ అనుకూల గ్రూపులే ఈ దాడికి కుట్ర పన్నాయని ప్రదర్శనకారులు ఆ తర్వాత ఆరోపించారు. ఆందోళనకారులు తాము లైవ్ స్ట్రీమ్ చేసిన వీడియోను విడుదల చేశారు. ఇందులో పోలీసులు అక్కడ నిలబడి ఉండగానే ఒక వ్యక్తి దానికి నిప్పుపెట్టడం కనిపించింది.

వీడియో క్యాప్షన్, శ్రీలంక దక్షిణ ప్రాంతంలోనే ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి

"తీవ్రవాదుల బృందం బస్సును తగలబెట్టిందని ప్రెసిడెంట్ మీడియా యూనిట్ ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ వీడియో సాక్ష్యం ఉన్నందున, దానిని తగలబెట్టిన వ్యక్తిని గుర్తించడానికి పోలీసులు ఒక ఫొటోను విడుదల చేయాల్సి వచ్చింది. ఆ వీడియోలు లేకుంటే, ఆ శాంతియుత నిరసనకారులపై తీవ్రవాదులనే ముద్ర వేసేవారు" అని జయవీర అన్నారు.

అధ్యక్ష భవనం దగ్గర మహిళల ఆందోళన

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అధ్యక్ష భవనం దగ్గర మహిళల ఆందోళన

గ్యాస్ సిలిండర్‌ల కోసం నిరసన

గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారంటూ నిరసనకు దిగిన వారిలో కొలంబో నివాసి మొహమ్మద్ ఫుజ్లీ కూడా ఉన్నారు.

"నేను ఆ నిరసనను ప్రత్యక్ష ప్రసారం చేసాను, మా నిరసనను అడ్డుకోవడానికి స్థానిక రాజకీయ నాయకుని మద్దతుదారులు ప్రయత్నించారు. ఇక్కడ ఆందోళన చేస్తున్న వారిలో చాలామంది మహిళలు, వృద్ధులు. వారు అక్కడి నుంచి పరుగులు తీశారు. నన్ను, మరో యువకుడిని దుండగులు తీవ్రంగా కొట్టారు. నేను ఆస్పత్రి పాలయ్యాను. పోలీసులు వచ్చారు. నేను పబ్లిష్ చేసిన లైవ్ వీడియోలో దాడి చేసినవారి ఫుటేజీ ఉన్నందున నేను దాన్ని పోలీసులకు షేర్ చేశాను. లైవ్ స్ట్రీమింగ్ వీడియో లేకపోతే, ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు తెలిసేది కాదు'' అని మొహమ్మద్ అన్నారు.

1988-1989 సంవత్సరంలో జనతా విముక్తి పెరుమన సభ్యులు అనేకమందిని ప్రభుత్వ దళాలు చంపేశాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 1988-1989 సంవత్సరంలో జనతా విముక్తి పెరుమన సభ్యులు అనేకమందిని ప్రభుత్వ దళాలు చంపేశాయి

డెత్ స్క్వాడ్స్

సైన్యానికి చెందిన డెత్ స్క్వాడ్స్ కారణంగా 1988 నుంచి 1990 మధ్య కాలంలో శ్రీలంక దక్షిణ ప్రాంతంలో 60,000 మంది వరకు హత్యకు గురయ్యారని హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదించింది. ఆ సమయంలో, శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్క్సిస్టులు, జాతీయవాద జనతా విముక్తి పెరమున నేతృత్వంలోని తిరుగుబాటును ప్రభుత్వం అణచివేసింది.

యువకుల మృతదేహాలను టైర్లలో వేసి కాల్చేశారు. చాలా మందిని విచారణ లేకుండానే జైలులో ఉంచారు. ఇందుకు ప్రతీకారంగా వందలమంది రాజకీయ ప్రత్యర్థులను, ప్రభుత్వ అధికారులను జనతా విముక్తి పెరమున హతమార్చింది.

2019 నాటి ఈస్టర్ డే మృతులకు కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లతో శ్రద్ధాంజలి ఘటిస్తున్న శ్రీలంకవాసులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2019 నాటి ఈస్టర్ డే మృతులకు కొవ్వొత్తులు, మొబైల్ ఫ్లాష్ లైట్లతో శ్రద్ధాంజలి ఘటిస్తున్న శ్రీలంకవాసులు

జనం కంటే మొబైల్స్ ఎక్కువ

శ్రీలంక ప్రజల జీవితాలను ఆధునిక కమ్యూనికేషన్ సాధనాలు మార్చేశాయి. ''శ్రీలంకలో నగరాలు, పట్టణాలు, గ్రామాలలో అనేక మిలియన్ల స్మార్ట్‌ఫోన్‌లు ఉపయోగంలో ఉన్నాయి'' అని డిజిటల్ మీడియా విశ్లేషకుడు నలక గుణవర్ధనే అన్నారు.

''రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, విద్యార్థి సంఘాలు నిర్వహించే సంప్రదాయ నిరసన కార్యక్రమాలలో భాగం కాని పౌరులకు ప్రత్యక్ష రాజకీయ భాగస్వామ్యానికి మొబైల్ ఫోన్లు కొత్త మార్గాలను తెరుస్తున్నాయి" అని గుణవర్ధనే అభిప్రాయపడ్డారు.

సుపున్ జయవీర వంటి శ్రీలంక యువకులు మునుపటి తరాలు ఎలాంటి పరిస్థితులను అనుభవించారో, ఇప్పటి ఘటనలు నాటికి ఎలా భిన్నంగా ఉండేవో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

"రాజ్యం అణచివేత చురుకుగా ఉన్న 1980ల చివరలో పుట్టాను. ఈ రోజు ఈ ఆధునిక సాంకేతికత, వనరులు లేకపోతే గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అణచివేతను ఎదుర్కొనేవాళ్లం'' అని జయవీర అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)