సోనీ సోరీ: రాజద్రోహం కేసులో నిర్దోషి, ‘కానీ ఆ చట్టం ఆమె జీవితంలో 11 ఏళ్లను మింగేసింది’

ఫొటో సోర్స్, Alok Putul
- రచయిత, అలోక్ ప్రకాశ్ పుతుల్
- హోదా, బీబీసీ కోసం
ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత దంతేవాడకు చెందిన సామాజిక కార్యకర్త, గిరిజన నాయకురాలు సోనీ సోరీకి ఈ ఏడాది మార్చి 14న రాజద్రోహం కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించింది. అయితే, ఆమె 11ఏళ్ల పాటు రాజద్రోహం కేసులో విచారణ ఎదుర్కొన్నారు. తన ఆవేదనను ఆమె బీబీసీతో పంచుకున్నారు.
పాత రోజులను గుర్తు చేసుకుంటున్నప్పుడు సోనీ గొంతులో ఆవేదన కనిపించింది. మధ్యమధ్యలో కొంతసేపు ఆమె మౌనంగా ఉండిపోయారు.
‘‘11ఏళ్లపాటు నేను చిత్రహింసలు అనుభవించాను. ఆ ఆవేదన జీవితాంతం నన్ను వెంటాడుతుంది. ఎప్పటికీ నేను దాన్ని మరచిపోలేను. ఆ గాయాలు ఎప్పటికీ మానిపోవు’’ అని చిన్న స్వరంతో ఆమె చెప్పారు.
సోనీ జైలులో ఉన్నప్పుడే ఆమె తల్లి మరణించారు. ‘‘నా భర్త అనిల్ ఫుటానేను కూడా పోలీసులు వేధించారు. వేధింపుల నడుమే ఆయన అనారోగ్యంతో మరణించారు. నా పిల్లలు చదువుకు దూరమయ్యారు. మా కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమైంది’’అని ఆమె వివరించారు.
రాజద్రోహం చట్టం కింద కొత్త కేసులు నమోదు చేయొద్దని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ, జైలులో గడుపుతున్న వారు జామీనుకు దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

ఫొటో సోర్స్, Alok Putul
‘‘నాకు నమ్మకం లేదు’’
అయితే, ఆ ఆదేశాలపై తనకు ఎలాంటి నమ్మకమూ లేదని సోని సోరి అన్నారు. ‘‘రాజద్రోహ చట్టం కింద అరెస్టై నరకం చూస్తున్న ఎంతమందికి విముక్తి లభిస్తుంది’’అని ఆమె ప్రశ్నించారు.
ఈ ఏడాది మార్చి 14న దంతేవాడకు చెందిన ఆమెకు రాజద్రోహ ఆరోపణల నుంచి కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే, అప్పటికే ఈ ఆరోపణలతో ఆమె 11 ఏళ్లు గడిపారు. సుప్రీం కోర్టు ఈ చట్టంపై ఆదేశాలు ఇవ్వడానికి రెండు నెలలు ముందు ఆమెను నిర్దోషిగా ప్రకటించారు.
‘‘నేను 11ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. జైలులో కూడా గడిపాను. ఆ సమయాన్ని నాకు ఎలా తిరిగిస్తారు?’’అని ఆమె ప్రశ్నించారు.
‘‘నేను నిందలు మోస్తూ 11ఏళ్లు జీవించాను. ఈ దేశంలో పుట్టిన గిరిజన కుమార్తెనైన నేను భారత మాతకు వ్యతిరేకమైన పనులు చేశానని ఆరోపించారు. రెండున్నరేళ్లు ఒక జైలు గదిలో నన్ను ఉంచారు’’అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Alok Putul
‘‘ఎంతో బాధను అనుభవించాను’’
‘‘ఏదైనా పనికి వెళ్దామని అనుకుంటే... ఎవరూ నాకు పనిచ్చేవారు కాదు. మా తండ్రి భూమిలో ఏదైనా పంట వేద్దామని అనుకుంటే.. ప్రభుత్వ పథకాల కింద సాయం వచ్చేది కాదు. ఎక్కడకు వెళ్లినా నా నుదుటిపై వారికి రాజద్రోహం ఆరోపణలే కనిపించేవి. నాకు ఎక్కడా సాయం దొరకలేదు’’అని ఆమె అన్నారు.
‘‘మా కుటుంబం ముక్కలైంది. నా పిల్లలు చదువుకు దూరం అయ్యారు. నా భర్త, పిల్లలకు అవసరమైన సమయంలో.. నేను జైలులో గడపాల్సి వచ్చింది. నేను 50 మంది పిల్లలకు పాఠాలు చెప్పేదాన్ని. ఇప్పుడు వారిలో 30 మంది మావోయిస్టులు అయ్యారు. మిగతావారు కూడా చదువుకు దూరమయ్యారు. రాజద్రోహం ఆరోపణల వల్ల నేను వ్యక్తిగతంగా, సామాజికంగా.. అన్ని విధాలుగా నష్టపోయాను’’అని ఆమె వివరించారు.
12ఏళ్ల క్రితం సోనీ టీచర్‌గా ఉత్సాహంతో పనిచేసేవారు. 2005లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ‘‘సల్వాజుడుం’’ పేరుతో పోలీసులు ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. దీనికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అలా ఆరోపణలు ఎదుర్కొన్నవారిలో సోనీ ఒకరు.
2011లో సోనీపై రాజద్రోహం ఆరోపణలతో కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఆమె వార్తల్లో నిలిచారు. అప్పట్లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలో ఉండేది. రమణ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.
10 సెప్టెంబరు 2011న, దంతేవాడ ఎస్పీ అంకిత్ గార్గ్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ‘‘ఒక మల్టీనేషనల్ కంపెనీ మావోయిస్టులకు రూ.15 లక్షలు ఇవ్వాలని ప్రణాళికలు రచించింది. ఈ డబ్బును తీసుకునేందుకు మావోయిస్టుల తరఫున సోనీ సోరి వెళ్లారు’’ అని ఆయన చెప్పారు.
అయితే, ఘటన స్థలం నుంచి సోనీ పరారయ్యారని పోలీసులు చెప్పారు. కానీ, ఆమె మేనల్లుడు లింగారామ్ కోడోపిని అరెస్టు చేశామని అన్నారు.

ఫొటో సోర్స్, Alok Putul
టీచర్ నుంచి
ఈ అరెస్టుకు 15 రోజుల ముందు వికీలీక్స్ పేరుతో ఒక నివేదిక విడుదలైంది. ముంబయిలోని అమెరికా కాన్సులేట్ దౌత్యప్రతినిధుల వ్యాఖ్యలను దీనిలో ఉటంకించారు. ఛత్తీస్‌గఢ్‌లో గనుల తవ్వకం, స్టీల్ ప్రాజెక్టులకు అడ్డుతగలకుండా ఉండేందుకు ఒక మల్టీనేషనల్ కంపెనీ మావోయిస్టులకు డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.
అయితే, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూలేదని సమేలీ పాఠశాలలో టీచర్‌గా పనిచేసే సోనీ చెప్పారు. కానీ పోలీసులు తనను కూడా అరెస్టు చేస్తారని భయంతో ఆమె అజ్ఞాతంలోనే ఉండిపోయారు. పోలీసులు తనను కూడా ఫేక్ ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని భయపడ్డానని ఆమె చెప్పారు.
అయితే, సోనీ మేనల్లుడు లింగారామ్ మావోయిస్టని పోలీసులు ఆరోపించారు. కోర్టు జోక్యం చేసుకోవడంతో అతడిని విడుదల చేశారు.
ఆ తర్వాత, 5 అక్టోబరు 2011న దిల్లీ సాకేత్ కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాదిని కలవడానికి వెళ్లే సమయంలో సోనీని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె మావోయిస్టులకు సహకరించారని ఆరోపణలు మోపారు. రాజద్రోహం కేసు పెట్టారు.
‘‘చిత్రహింసలు పెట్టారు’’
పదిన్నరేళ్ల క్రితం తన అరెస్టు గురించి మాట్లాడుతూ.. పోలీసులు తనను చిత్ర హింసలకు గురి చేశారని సోనీ చెప్పారు.
‘‘మొత్తంగా నాపై ఆరు కేసులు పెట్టారు. అయితే, రాజద్రోహం కేసు నా జీవితాన్ని పూర్తిగా ఛిన్నాభిన్నం చేసింది. ఈ అన్ని కేసుల్లోనూ నన్ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది’’అని ఆమె చెప్పారు.
‘‘నన్ను చాలా హింసించారు. నా బట్టలను విప్పేసి కొట్టారు. నాతో పోలీసులు అసభ్యంగా మాట్లాడేవారు. పోలీసుల కస్టడీలో నన్ను నగ్నంగా ఉంచేవారు. చాలా మంది ఖైదీలు నన్ను దోషిలా చూసేవారు. అందరూ నన్ను ద్వేషించేవారు’’అని సోనీ చెప్పారు.

ఫొటో సోర్స్, Alok Putul
అయితే, సోనీ ఆరోపణలను ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఖండించారు. జైలులో ఉన్నప్పుడు సోనీ ఆరోగ్యం క్షీణించింది. సుప్రీం కోర్టు ఆదేశాలపై ఆమెను కోల్‌కతా మెడికల్ కాలేజీలో చేర్పించారు.
ఆమె శరీరం నుంచి కొన్ని ‘‘వస్తువులు’’ బయటకు తీశామని ఆమెను పరీక్షించిన వైద్యులు చెప్పారు. అయితే, దంతేవాద ఎస్పీ అంకిత్ గార్గ్ ఆ రిపోర్టులను తప్పుపట్టారు.
‘‘ఆ తర్వాత కూడా నాకు జామీను దొరకలేదు. స్థానిక కోర్టు నుంచి హైకోర్టు వరకు.. కోర్టుల చుట్టూ తిరిగాను. రాజద్రోహం ఆరోపణల వల్ల నా కేసు వాయిదా పడుతూ వచ్చేది’’అని సోనీ చెప్పారు.
మొత్తంగా 770 రోజులు సోనీ జైలులో గడిపారని కోర్టు డాక్యుమెంట్లు చెబుతున్నాయి. ఆమె మేనల్లుడు కూడా 795 రోజులు జైలులో ఉండాల్సి వచ్చింది. అయితే, ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆ మల్టీనేషనల్ కంపెనీ మేనేజర్ బీవీసీఎస్ వర్మకు వంద రోజుల్లోనే బెయిలు వచ్చింది. కాంట్రాక్టర్ బీకే లాలా కూడా 147 రోజుల్లోనే బయటకు వచ్చారు.
కేసులు అలానే..
తీవ్రమైన కేసులను మొదట విచారణ చేపట్టాలని సోనీ అన్నారు. ‘‘ఎలాంటి దర్యాప్తు చేపట్టకుండానే రాజద్రోహం ఆరోపణలు మోపితే, ఒక్క రోజులోనే అందరి దృష్టిలో మనం విలన్ అయిపోతాం. రాజద్రోహం ఆరోపణలు మోపితే బెయిలు కూడా రాదు’’అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బస్తర్‌లో చాలామంది గిరిజునులపై ఇలానే రాజద్రోహం కేసులను పోలీసులు బనాయించేవారని సోనీ ఆరోపిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద ఎందరో గిరిజనులు ఏళ్ల నుంచి జైలులో గడుపుతున్నారని ఆమె అన్నారు. ‘‘హత్య కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొనే వారికి కూడా జామీను వస్తుంది. కానీ, రాజద్రోహం కేసుల్లో అంత తేలిక కాదు’’అని ఆమె వివరించారు.
బస్తర్ ప్రాంతంలో మానవ హక్కుల ఉలంఘన చాలా ఎక్కువగా ఉంటుందని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయవాది రజనీ సోరెన్ చెప్పారు.
‘‘సోని, ఆమె మేనల్లుడు అదృష్టవంతులు. కోర్టు జోక్యం చేసుకోవడంతో వారికి బెయిలు దొరికింది. కానీ, చాలా మందికి కనీసం న్యాయవాదిని నియమించుకునే స్తోమత కూడా ఉండదు. వారు ఏళ్ల తరబడి జైలులో అలా ఎదురుచూస్తూనే ఉంటారు’’అని రజనీ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు ఇచ్చేప్పుడు జాగ్రత్త.. ఉత్తర కొరియా వాళ్లు జాబ్‌లు కొట్టేస్తున్నారు’ - ఐటీ సంస్థలకు అమెరికా హెచ్చరిక
- చేతనా రాజ్: ప్లాస్టిక్ సర్జరీ తర్వాత మరణించిన కన్నడ నటి, అసలేం జరిగింది?
- రాజ్యసభకు వైసీపీ అభ్యర్థుల ప్రకటన.. చిరంజీవి ఆచార్య నిర్మాతకు, ఇద్దరు తెలంగాణ వారికి ఎంపీ పదవులు ఎందుకు ఇచ్చారంటే..
- వంటింట్లో మనకు తెలియకుండానే మనం చేసే 9 తప్పులు.. ఇవి చాలా ప్రమాదకరం అంటున్న నిపుణులు
- ఆన్లైన్ గేమ్సా... జూద క్రీడలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















