పోలవరం ప్రాజెక్టు: మాకు అన్నంపెట్టే పొలం, అడవితల్లి.. రెండూ దూరమవుతున్నాయి: BBC River Stories

పడవ ప్రయాణం తప్ప వేరే దారిలేని పల్లెలివి. అన్నం పెట్టే పొలమూ, అడవీ దూరం అవుతూండడంతో, భవిష్యత్తుపై బెంగ పట్టుకుంది ఈ గిరిజనుల్లో. ఓ వైపు పోలవరం ప్రాజెక్టు ఎందరో రైతుల పొలాలకు నీరందిస్తుంటే, ఇక్కడున్న రైతులు మాత్రం రైతు కూలీలుగా మారిపోతారు.
పోలవరం ప్రాజెక్టు కింద 274 గ్రామాలు మునిగిపోతున్నాయి. వీటిలో గిరిజన గ్రామాలే ఎక్కువ. ఈ గ్రామాల్లో నివసించే గిరిజనులకు వారికున్న కొద్దిపాటి పొలం, పక్కనే ఉన్న కొండే జీవనాధారం. కానీ, పోలవరం ప్రాజెక్టుతో ఈ పొలాలన్నీ మునిగిపోతాయి. ఈ కొండకి వారు దూరం అవుతారు.
కొండ రెడ్లు ఎక్కువగా ఉండే మంటూరు గ్రామానికి బీబీసీ ప్రతినిధులు బళ్ల సతీశ్, నవీన్ కుమార్ వెళ్లారు.
వ్యవసాయం, కూలీ చేసుకునే ఇక్కడివారికి, ఏ పనీ దొరకనప్పుడు అడవే ఆధారం. వెదురు, చింతపండు వంటివి అడవి నుంచి తెచ్చి అమ్ముకుంటారు. అప్పుడప్పుడూ వేటాడుతుంటారు. కానీ ఇప్పుడు వీటన్నిటికీ దూరంగా, ఎప్పుడూ ఉండని ప్రాంతానికి తరలిపోవాల్సి వస్తోంది. మంటూరే కాదు, చాలా గిరిజన గ్రామాల్లో పరిస్థితి ఇదే.
"ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు వచ్చిన తరువాత మనకు ఓ పెద్ద చెట్టు అంటే సుమారు 20-25 అడుగుల నీరు వస్తది. అది మామూలుగా నిలకడగా ఉన్న టైములో. అదే వర్షా కాలంలో అయితే ఇంచుమించు 80 అడుగుల పైకి వస్తది అక్కణ్ణుంచి" అని మంటూరు గ్రామస్తుడు వీరప రెడ్డి చెబుతున్నారు.
"భూములు చూపెడ్తున్నారు. కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు ఉన్న భూములు చూపెడ్తున్నారు. అవి జనానికి నచ్చడం లేదు. అన్నీ పూర్తి చేయండి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులున్నారు. దాన్ని పరిష్కరించండి. ఆ తరువాత మీరెప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేస్తాం" అని ఆయన అంటున్నారు.

2015 నాటికి 18 ఏళ్లు నిండిన వారికే పోలవరం పరిహారం అందుతోంది. కానీ, ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి 18 ఏళ్లు నిండే వారందరికీ పరిహారం ఇవ్వాలనేది గిరిజనుల డిమాండ్.
"మా భూములు వదిలేసి వెళ్లాలంటే బంగారం వదిలి వెళ్లినట్టుంది. అక్కడికి వెళ్లాక ఎలాంటిది ఇస్తారో? ఏ కొండ రాళ్లు ఇస్తారో? డొంకలు నరుక్కొని మీరు సాగు చేసుకోండి అంటారేమో? మాకు ఊరు ఎక్కడుంటే అక్కడే పొలం కావాలి అంటున్నాం. మాకు అగ్గి పెట్టెల్లాంటి ఇళ్లు కట్టి చూపెడ్తున్నారు.
మాకు అలాంటి ఇళ్లు వద్దు. పొలం పని అయిపోతే అడవే మాకు ఆదాయం. అడవి లేనప్పుడు మాకు అది కూడా చూపాలి కదా, మేం బతకాలి కదా?" అని కొండ మొదలు పంచాయితీకి చెందిన పెద్దగూడెంలో నివసిస్తున్న నాగమణి ప్రశ్నిస్తున్నారు.
భద్రాచలం నుంచి రాజమండ్రి మధ్యలో ఉన్న అనేక గ్రామాలకు పడవ ప్రయాణమే ఆధారం. అయితే ఇకమీదట వారికి ఆ కష్టం తప్పనుంది.
అంటే దానర్థం ఇక్కడ వంతెనో, రోడ్లో వస్తున్నాయని కాదు. ఈ ఊర్లన్నీ మొత్తానికి గోదావరిలో కలిసిపోతున్నాయి.
ఇవి కూడా చదవండి.
- కాంక్రీటుకు గిన్నిస్ రికార్డు ఎలా సాధ్యపడింది? ఇంత కాంక్రీటు పోశారని ఎలా లెక్కిస్తారు?
- పోలవరం: ఎప్పుడు మొదలైంది? ఇప్పుడు ఎక్కడుంది?
- పోలవరం గ్రౌండ్ రిపోర్ట్: అసలేం జరుగుతోందక్కడ?
- 'అక్కడే చనిపోయినా బాగుండేది'
- కాళేశ్వరం ప్రాజెక్టు: కలల నిర్మాణం ఒక వైపు... కడతేరని విషాదం మరో వైపు
- కాళేశ్వరం ప్రాజెక్టు: ఎందుకింత ప్రత్యేకం
- 'గంగ ప్రక్షాళన జరిగిందా? మేం ఆ నీటిని పరీక్షించాం.. అందులో ఏం తేలిందంటే...'
- క్రికెట్: 2019 ప్రపంచ కప్లో భారత్-పాక్ మ్యాచ్ ఉంటుందా, ఉండదా...
- త్వరగా గడ్డకట్టేది చల్లటి నీళ్లా.. వేడి నీళ్లా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









