US Abortion law: గర్భ విచ్ఛిత్తి చేయించుకుంటే మహిళలను జైల్లో పెడతారా? 6 ప్రశ్నలు- సమాధానాలు

ఫొటో సోర్స్, Getty Images
సుమారు 50 ఏళ్లు అమలులో ఉన్న తర్వాత అబార్షన్ హక్కుకు ఉన్న రాజ్యాంగ రక్షణలను అమెరికా సుప్రీంకోర్టు తొలగించింది.
గతంలో వెలువడిన ‘రో వర్సెస్ వేడ్’ తీర్పును అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసి, దేశవ్యాప్తంగా గర్భవిచ్ఛిత్తికి ఉన్న రాజ్యాంగ హక్కును తొలగించింది
ఈ విషయంలో అమెరికాలో ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇకపై ఏం జరగనుంది అనేది బీబీసీ మీకు 6 ప్రశ్నలు, సమాధానాల రూపంలో తెలియజేస్తుంది.
అమెరికాలోని లక్షల మంది మహిళలపై ఈ తీర్పు ఎలాంటి ప్రభావం చూపుతుందనేదీ ఈ కథనంలో తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
1) అమెరికాలో అబార్షన్ల రద్దుపై సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది?
సంప్రదాయవాదులైన(కన్సర్వేటివ్) మెజారిటీ జడ్జ్‌ల మద్దతుతో అబార్షన్ కేసు తీర్పు వెలువడింది. బయట జీవించలేని స్థితిలో (23 వారాల లోపు వయసు గర్భస్థ దశ) ఉన్న పిండాన్ని అబార్షన్ చేసి తొలగించడం ఇక పై చాలా రాష్ట్రాలలో చట్టబద్ధం కాదు.
శుక్రవారం నాటి సుప్రీం కోర్ట్ తీర్పుకు మూలాలు 1973 నాటి డాబ్స్ వర్సెస్ జాక్సన్ వుమెన్స్ హెల్త్ ఆర్గనైజేషన్ కేసు(రో వర్సెస్ వేడ్ అని కూడా అంటారు) లో ఉన్నాయి. ఈ కేసులో 15 వారాల తర్వాత, సాధారణ పరిస్థితులతో పాటు అత్యాచార కేసుల్లోనూ అబార్షన్లను నిషేధించే మిసిసిపి రాష్ట్ర చట్టాన్ని అప్పట్లో రద్దు చేశారు. తాజా తీర్పులో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.
గతంలో మిసిసిపి రాష్ట్ర చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పును వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆ రాష్ట్ర ప్రస్తుత అటార్నీ జనరల్ లిన్ ఫిచ్ న్యాయస్థానాన్ని కోరారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో ఆరుగురు అబార్షన్ల రద్దు నిర్ణయానికి మద్దతు పలగకగా, ముగ్గురు వ్యతిరేకించారు. దీంతో రో వర్సెస్ వేడ్ తీర్పు రద్దయింది.
''అబార్షన్‌ను రాజ్యాంగ హక్కుగా తొలగించడమే ఈ తీర్పు ఉద్దేశం'' అని కాలిఫోర్నియాలోని శాన్‌జోస్ స్టేట్ యూనివర్శిటీలో క్రిమినలైజేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వ్యవహారాలలో నిపుణుడైన గ్రేస్ హోవార్డ్ బీబీసీతో అన్నారు.
అబార్షన్‌ను రాజ్యాంగబద్ధమైన వ్యవహారంగా 1973లో మార్చారని, అప్పట్లో రిపబ్లికన్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నియమితులైన జడ్జ్‌లు 14వ రాజ్యాంగ సవరణను గర్భవిచ్ఛిత్తిని మహిళల హక్కుగా పేర్కొన్నారని అన్నారు.
సుప్రీంకోర్టు తాజా నిర్ణయం గతంలో వెలువడిన తీర్పును తారుమారు చేయనుంది. అబార్షన్‌ను అనుమతించాలా లేదా అన్నఅధికారాన్ని ఆయా రాష్ట్రాల పాలకులకు కట్టబెడుతుంది ఈ తీర్పు.
''అబార్షన్లను రద్దు చేయాలా, కొనసాగించాలా అన్న విషయంలో రాష్ట్రాలపై సమాఖ్య పరిమితులు విధించలేదు. రాష్ట్రాలు తాము చేయాలనుకుంది చేయొచ్చు'' అన్నారు హోవార్డ్.
''ఒక గర్భిణి హక్కులను రక్షించాలనుకుంటే రాష్ట్రాలు రక్షించగలవు. వద్దనుకుంటే నిషేధించగలవు. అవసరం అనుకుంటే అబార్షన్ కోరిన మహిళలకు ఆ పని ఉచితంగానూ చేయగలవు'' అని హోవార్డ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
2) సుప్రీంకోర్టు నిర్ణయంతో ఎలాంటి మార్పులు వస్తాయి? అమెరికాలో అబార్షన్ చట్టవిరుద్ధం అవుతుందా?
ఒక దేశంగా అమెరికాలో గర్భస్రావం "చట్టబద్ధం" లేదా "చట్టవిరుద్ధం" అని నిర్ణయించడం కుదరదు. అమెరికా ఒక సమాఖ్య అయినందున, దేశ రాజ్యాంగంలో పొందుపరచని హక్కులు లేదా విధులపై నిర్ణయం తీసుకునే అధికారం అక్కడి ప్రతి రాష్ట్రానికి ఉంది" అని హోవార్డ్ అన్నారు.
అయితే, దీనిపై నిర్ణయం తీసుకోవడంలో రాజకీయ, సామాజిక అంశాలు ముడిపడి ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
''యునైటెడ్ స్టేట్స్‌లో ప్రసూతి మరణాల రేటులో 21% పెరుగుదల అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఈ సంఖ్య అత్యధికంగా ఉన్న దేశంగా అమెరికాకు చెడ్డ పేరుంది''
''చాలా రాష్ట్రాల్లో గర్భవిచ్ఛిత్తి చట్టబద్ధంగా జరగడం లేదు. కాబట్టి, ఇకపైనా చట్ట విరుద్ధమైన అబార్షన్లు కొనసాగుతాయి''
''కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ తీర్పు వల్ల మరింత మంది మహిళలు చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే వారు బలవంతంగానో లేదంటే శారీరకంగా సిద్ధం కాకముందే బిడ్డలకు జన్మనివ్వాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రాలపై దత్తత ఇచ్చే బిడ్డల భారం పెరుగుతుంది''
''మున్ముందు అనేక అరెస్టులు, కేసులు చూడాల్సి ఉంటుంది. చట్ట విరుద్ధంగా గర్భస్రావం చేయడం, చేయించుకోవడం, వారికి సహాయ పడటం లాంటి అంశాలలో కేసులు నమోదవుతాయి''
''కడుపులో బిడ్డకు ప్రమాదం జరిగే విధంగా వ్యవహరించిన గర్భిణుల గురించి రిపోర్ట్ చేయడానికి అనేకమంది వైద్యాధికారులను నియమించాల్సిన అవసరం రావచ్చు''
''గర్భస్రావాలు జరిగిన మహిళలకు కూడా ఇది సమస్యగా మారే అవకాశం ఉంది. చాలామంది తాము అబార్షన్ చేయించుకోలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అబార్షన్ అయిన మహిళలపై విచారణ ఉంటుంది. వారు దోషులుగా తేలితే, 10 నుంచి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశాలు కూడా ఉండొచ్చు''
''సులభంగా అబార్షన్ కావడానికి మహిళలు మాదకద్రవ్యాలు లేదా ఇతర పద్ధతులను ఉపయోగించారని ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వారు దోషులుగా నిర్ధరణ కావచ్చు కూడా''

ఫొటో సోర్స్, Getty Images
3) ఏయే రాష్ట్రాలలో ఇప్పటికే నిషేధం ఉంది, అమలు చేయబోయే రాష్ట్రాలు ఏవి?
మిస్సౌరీ, టెక్సస్‌లు సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడిన వెంటనే అబార్షన్ నియంత్రణ చర్యలు మొదలుపెట్టాయి.
వీరు ట్రిగ్గర్ చట్టాల ద్వారా నియంత్రణ చర్యలను ప్రారంభించారు. నిషేధం విధించిన వెంటనే యంత్రాంగాలు వీటిపై దృష్టిపెట్టడం ప్రారంభించాయి.
గర్భస్రావాన్ని నియంత్రించేందుకు ఇప్పటికే 11 రాష్ట్రాలలో చట్టాలున్నాయి. అయితే, సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత న్యూయార్క్, కాలిఫోర్నియా, వాషింగ్టన్‌తో సహా 16 రాష్ట్రాల్లో అబార్షన్ హక్కును రక్షించడానికి అధికారులు ట్రిగ్గర్ చట్టాలను ఆమోదించారు.
అబార్షన్‌పై విధించే పరిమితులు రాష్ట్రాలపై కూడా ఆధారపడి ఉంటాయి: ఇందులో కొన్ని రాష్ట్రాలు తల్లి ప్రాణానికి ప్రమాదంలాంటి వాటిని అనుమతిస్తాయి. ఒహియో వంటి రాష్ట్రాలు అత్యాచారం కారణంగా వచ్చిన గర్భాన్ని రద్దు చేయడాన్ని కూడా ఒప్పుకోవడం లేదు.
గట్‌మచర్ ఇన్‌స్టిట్యూడ్ చెప్పినదాని ప్రకారం అలబామా, అరిజోనా, అర్కాన్సాస్ వంటి కొన్ని రాష్ట్రాలు గర్భం ప్రారంభ దశ నుంచి గర్భస్రావాన్ని నిషేధిస్తుండగా, జార్జియా, ఇడాహో, అయోవా, కెంటకీ వంటి కొన్నిరాష్ట్రాలు ఆరు వారాల తర్వాత నుంచి గర్భ స్రావాన్ని నిషేధిస్తున్నాయి.
ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఫ్లోరిడా, ఇండియానా, మోంటానా, నెబ్రాస్కా రాష్ట్రాలు కూడా నిషేధాన్ని అమలు చేస్తాయని గట్‌మాషర్ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది.

ఫొటో సోర్స్, Getty Images
4) మహిళలు జైలుకు వెళతారా? అబార్షన్ నిషేధించిన రాష్ట్రాల్లో దీన్ని నేరంగా ఎలా పరిగణిస్తారు?
అనేక రాష్ట్రాలు ఇప్పటికే అబార్షన్లు చేసే వైద్యులు, క్లినిక్‌లకు జరిమానా విధించే చట్టాలను ఆమోదించాయి. ప్రాక్టీస్ లైసెన్సును రద్దు చేయడం నుంచి జైలు వరకు శిక్షలు ఉన్నాయి.
టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో అబార్షన్ చేసే వైద్యులు జీవితకాలం జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అయితే, చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రో అండ్ వేడ్ తీర్పు తర్వాత కూడా అబార్షన్‌లకు పాల్పడ్డ అనేకమంది మహిళలు జైలుకు వెళ్లారు.
ఫోర్ధమ్ యూనివర్సిటీ నివేదిక ప్రకారం 1973- 2005 మధ్య కనీసం 413 మంది ఈ తరహా కేసుల్లో జైలుపాలయ్యారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ సంఖ్య పెరుగుతుందని హోవార్డ్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
5) అసలు రో వర్సెస్ వేడ్ కేసు ఏమిటి?
1969లో 25 ఏళ్ల ఒంటరి మహిళ నార్మా మెక్‌కోర్వే 'జేన్ రో' అనే మారుపేరుతో టెక్సాస్ అబార్షన్ చట్టాలను సవాలు చేశారు. ఈ రాష్ట్రంలో తల్లి ప్రాణాలకు ముప్పు ఉన్న సందర్భంలో మినహా అబార్షన్లపై నిషేధం ఉంది.
1973లో ఆమె అప్పీల్ సుప్రీంకోర్టుకు చేరుకుంది. అబార్షన్ హక్కుకు రాజ్యాంగ హక్కు ఉందని వ్యాఖ్యానిస్తూ ఆమెకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
ఈ నిర్ణయం 'త్రైమాసిక'(ట్రైమ్‌స్టర్) వ్యవస్థను తీసుకొచ్చింది. అంటే అమెరికన్ మహిళలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లోపు అబార్షన్ చేసుకోవడానికి సంపూర్ణ హక్కును ఇచ్చింది.
3 నెలలు దాటితే కొన్ని నియంత్రణలతో అనుమతించింది.
గర్భం చివరి త్రైమాసికంలో ఉన్నప్పుడు.. అంటే ఆరు నెలల గర్భం దాటిన తరువాత అబార్షన్లను నిరోధించే, నిషేధించే హక్కును సుప్రీంకోర్టు రాష్ట్రాలకు ఇచ్చింది.
అబార్షన్ చేయించుకోవడానికి రాజ్యాంగపరంగా ఉన్న హక్కు మీద అనేక రాష్ట్రాలు 1990ల నుంచి పరిమితులను అమలు చేస్తున్నాయి. టెక్సాస్ వంటి కొన్ని రాష్ట్రాలలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా అబార్షన్ చేయించుకోవడం దాదాపు అసాధ్యం.
మిసిసిపి వంటి కొన్ని రాష్ట్రాలలో రాష్ట్రం మొత్తానికి ఒకే ఒక అబార్షన్ క్లినిక్ ఉంది. ఇరవై కంటే ఎక్కువ రాష్ట్రాల్లో గర్భిణులు వారి అబార్షన్ నిర్ణయంలో వారి తల్లిదండ్రులను లేదా న్యాయమూర్తి సమ్మతిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో ఒక మహిళ అబార్షన్ క్లినిక్‌ని తొలిసారి సందర్శించే సమయానికి, అబార్షన్ ప్రక్రియకు మధ్య కొంత వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది.
"దీనివల్ల చాలామంది మహిళలు ఎక్కువ దూరం ప్రయాణించవలసి వస్తోంది. ఖర్చు కూడా ఎక్కువే. ఇది పేద మహిళలు, ముఖ్యంగా ఆఫ్రికన్-అమెరికన్ మహిళలకు చాలా కష్టంగా మారింది'' అని హోవార్డ్ అన్నారు.
గర్భస్రావం హక్కులకు మద్దతిచ్చే ఎన్జీవో గట్‌మచర్ ఇన్‌స్టిట్యూడ్ ప్రకారం అమెరికాలో ఇప్పటికే ఉన్న చట్ట పరిమితుల కారణంగా ప్రతి సంవత్సరం 4,000 కంటే ఎక్కువ మంది మహిళలు అబార్షన్లు చేయించుకోలేకపోతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
6) సుప్రీంకోర్టు తీర్పును అమెరికా కాంగ్రెస్ పక్కనబెట్టగలదా? అబార్షన్‌ను చట్టబద్ధం చేయగలదా?
దాదాపు 50 ఏళ్లుగా, రో వర్సెస్ వేడ్ తీర్పు యునైటెడ్ స్టేట్స్‌లో అబార్షన్ అనుమతించింది తప్ప దేశం మొత్తానికి వర్తించే సమాఖ్య చట్టంగా మారలేదు.
అమెరికా కాంగ్రెస్ దేశంలో అబార్షన్ హక్కుకు హామీ ఇచ్చే చట్టాన్ని ఆమోదించే అధికారం ఉంది. రాష్ట్రాలు వాటి రాజకీయ అనివార్యతలతో సంబంధం లేకుండా వాటిని అనుసరించవలసి ఉంటుంది.
అయితే, రాజకీయంగా మారిన అంశం కాబట్టి ఈ విషయంపై చట్టాన్ని సెనేట్‌లో మెజారిటీ సభ్యులు ఆమోదించే అవకాశం లేదు. దీనికి కనీసం 60 ఓట్లు అవసరం కాగా, డెమొక్రాట్‌లకు ప్రస్తుతం 50 మంది సభ్యులే ఉన్నారు.
''తదుపరి ఎన్నికలలో రిపబ్లికన్లు సెనేట్‌లో అత్యధిక మెజారిటీతో గెలిస్తే దీనిపై బిల్లు వచ్చే అవకాశం ఉంది'' అని హోవార్డ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- పెంపుడు జంతువుల వల్ల మీ పిల్లల మానసిక శక్తి పెరుగుతుందా?
- నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












