అనంతపురం: 'మా అమ్మే కిరాయి హంతకులతో నా భర్తను చంపించింది' - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

కుల అహంకార హత్య

ఫొటో సోర్స్, Tulasi Prasad Reddy

    • రచయిత, ఎన్ తులసీ ప్రసాద్ రెడ్డి
    • హోదా, బీబీసీ కోసం

కులాంతర వివాహం చేసుకున్న ఒక యువకుడు అనంతపురం జిల్లా రాప్తాడు శివార్లలో జూన్ 16న దారుణ హత్యకు గురయ్యారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిందని పోలీసులు చెప్పారు. ఇది కుల అహంకార హత్యేనని మృతుడు చిట్రా మురళి భార్య, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

మురళి కురబ కులానికి చెందినవారని, ఆయన కమ్మ కులానికి చెందిన వీణ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారని, వీణ తల్లికి ఇది నచ్చేలేదని పోలీసులు చెప్పారు. ఆమెనే ఈ హత్య చేయించారన్నారు.

ఈ హత్యకు ముందు ఏం జరిగింది? మురళి భార్య వీణ ఏమంటున్నారు? పోలీసుల దర్యాప్తులో ఏం వెల్లడైంది? ఈ హత్యపై క్షేత్రస్థాయి నుంచి బీబీసీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇది.

మురళి, వీణ నేపథ్యం ఏమిటి?

మురళిని రాప్తాడు శివార్లలో జూన్ 16 మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో కిడ్నాప్ చేసి దగ్గర్లోని పొలాల్లో హత్య చేశారని పోలీసులు చెప్పారు.

మురళి, వీణలది సత్యసాయి జిల్లా కనగానపల్లి గ్రామం. కనగానపల్లి మండల కేంద్రం కూడా. వీరిద్దరూ పదో తరగతి వరకు ఒకే స్కూల్లో చదుకున్నారు.

మురళి ఎంబీయే చదివారు. పెనుగొండ దగ్గరున్న కియా కార్ల తయారీ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. వీణ బీటెక్ పూర్తిచేశారు. కనగానపల్లి మండలం ఏలకుంట్ల గ్రామ సచివాలయంలో ఆమె మహిళా పోలీసుగా పని చేస్తున్నారు.

వీడియో క్యాప్షన్, అనంతపురం: 'మా అమ్మే నన్ను నమ్మించి మోసం చేసింది... నా భర్తను చంపించింది'

ప్రాణభయంతో అనంతపురం వెళ్లారు,కానీ...

వీణ తండ్రి చాలా కాలం క్రితం చనిపోయారు. మురళిని వీణ ప్రేమించడం తల్లి యశోదమ్మకు నచ్చలేదని పోలీసులు చెప్పారు. మురళిని పెళ్లి చేసుకోవద్దంటూ వీణ బంధువులు కూడా ఆమెను బెదిరించారని, వీణ వీరి మాటను పక్కనబెట్టారని తెలిపారు.

పెళ్లికి ఆరు నెలలకు ముందే మురళితో ప్రేమ గురించి వీణ తన తల్లికి చెప్పారు. పెళ్లికి ఆమె తల్లి ఒప్పుకోలేదు.

తామిద్దరూ మేజర్లు కావడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి 2021 జూన్ 23న గుడిలో వివాహం చేసుకున్నట్టు బీబీసీతో చెప్పారు వీణ.

పెళ్లి తర్వాత ప్రాణ భయంతో రాప్తాడులోని అంబేడ్కర్ కాలనీలో మురళి తన భార్య వీణతో కలిసి నివాసం ఉంటున్నారు.

కుల అహంకార హత్య

ఫొటో సోర్స్, Tulasi prasad reddy

‘‘నా భర్త, నేను టెన్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్నాం. తర్వాత గ్రాడ్యుయేషన్ సమయంలో కలుసుకున్నాం. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల పరువు పోయిందనే ఉద్దేశంతో మా అమ్మే నా భర్తను చంపించింది. పెళ్లికి ఆరు నెలల ముందే చెప్పాను మా అమ్మతో. కానీ మా అమ్మ ఒప్పుకోలేదు. మా నాన్న చనిపోయారు. మాకు పెళ్లయిన కొత్తలో బెదిరింపులు వచ్చాయి. తర్వాత మా బంధువులు వచ్చి బెదిరించారు. అప్పుడే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. మా అమ్మను పోలీసులు పిలిచి మందలించారు. తర్వాత సైలెంట్‌గా ఉన్న మా అమ్మ 6 నెలల క్రితం నీ దగ్గరికి వస్తానని మా ఊరి పెద్దలతో పంచాయితీ పెట్టించింది. మా అమ్మపై నాకు నమ్మకం లేక వద్దు అని చెప్పాను” అని వీణ వివరించారు.

ఇద్దరిదీ ఒకే ఊరు కావడంతో, తమ బంధువులను రెచ్చగొట్టినట్టు అవుతుందనే ఉద్దేశంతో పెళ్లి తర్వాత తాను ఎప్పుడూ అత్తగారి ఇంటికి కూడా వెళ్లలేదని వీణ చెప్పారు.

“పెళ్ళయిన కొత్తలో అనంతపురంలో కాపురం ఉన్నాం. ఆ తరువాత రాప్తాడు అంబేడ్కర్ కాలనీలో ఉన్నాం. నా భర్త నైట్ డ్యూటీ ముగించుకొని ఉదయం ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేశాను. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాను’’ అంటూ చెప్పుకొచ్చారు వీణ.

కుల అహంకార హత్య

ఫొటో సోర్స్, Tulasi Prasad Reddy

ఏప్రిల్‌లోనే హత్యకు పథకం వేశారా?

వీణ ప్రేమ వివాహం నచ్చని ఆమె తల్లి యశోదమ్మ అల్లుడిపై కక్ష పెంచుకున్నారని పోలీసులు చెప్పారు. ఎలాగైనా మురళిని చంపాలని పథకం వేశారని తెలిపారు. సమీప బంధువులైన అప్పన్నగారి వెంకటేశ్వర్లు, టీసీ సుబ్రమణ్యంతో అల్లుడిని చంపించేందుకు ఆమె పది లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు.

‘‘ఈ ఏడాది ఏప్రిల్ 26న రెండు లక్షలు అడ్వాన్సు ఇచ్చి మిగతా సొమ్ము హత్య అనంతరం ఇచ్చే విధంగా యశోదమ్మ ఒప్పందం చేసుకున్నారు. అప్పటి నుంచి మురళిని చంపేందుకు వెంకటేశులు, సుబ్రమణ్యం ఇద్దరూ, సాకే సర్దార్ ముఠాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సాకే సర్దార్ తన ముఠా సభ్యులైన రవి, సయ్యద్ సద్దాం, పెనకలపాటి సుబ్రమణ్యం, పెనకలపాటి ప్రకాశ్‌లను మురళి హత్యకు పురమాయించాడు.’’ అని అనంతపురం ఇన్‌చార్జ్ డిఎస్పీ ఆర్ల శ్రీనివాసులు మీడియాకు చెప్పారు.

తనకు ఆస్తి వద్దని చెప్పినా, ఇలా చేశారని వీణ వాపోతున్నారు.

“ఆస్తికి నాకు సంబంధం లేదని పెళ్లయిన కొత్తలో ఖాళీ బాండ్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నారు. నా దగ్గర ఉన్న స్కూటీ, ఫోన్ అన్నీ తీసేసుకున్నారు” అని వీణ చెప్పారు.

‘‘మా వస్తువులన్నీ ఇచ్చేస్తే ఏం చేయబోమని చెప్పింది. కానీ నమ్మించి మోసం చేసింది. ఆర్నెళ్ల నుంచి ఎటువంటి కాల్స్ నాకు రాలేదు. మా ఆయన డ్యూటీకి బయలుదేరి వెళుతున్నప్పుడు ఇలా జరిగింది. ఇలా చేస్తే నా కూతురు నా దగ్గరికి వస్తుంది కదా అని చేసింది. కానీ నేను అయితే వెళ్ళను. నా భర్త లాంటి మంచి మనిషిని చూస్తే అలా చేయాలని ఎలా అనిపించిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఆ చంపేదేదో నన్ను చంపుండచ్చు కదా... లేదా ఇద్దరిదీ తప్పు ఉంటుంది. ఇద్దరినీ చంపేసుంటే సరిపోయేది’’ అని వీణ వ్యాఖ్యానించారు.

‘‘బయట వ్యక్తులకు కిరాయి ఇచ్చి నా భర్తను చంపించింది మా అమ్మ. చాలామంది ఇలా ప్రేమ వివాహాలు చేసుకున్నారు. కానీ మా అమ్మ చేసింది చాలా దారుణం. చేసిన పనికి వారికి శిక్ష పడాలి” అని వీణ బీబీసీతో చెప్పారు.

సుపారీగా ఇచ్చిన డబ్బు

ఫొటో సోర్స్, Tulasi Prasad reddy

ఫొటో క్యాప్షన్, సుపారీగా ఇచ్చిన డబ్బు

జనాల మధ్యలోనే కిడ్నాప్

మురళి కదలికలపై కిరాయి ముఠా రెక్కీ నిర్వహించినట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు.

పథకం ప్రకారం ఈ నెల 16న కియాలో విధులకు వెళ్లేందుకు రాప్తాడు హైవేలో బస్సు కోసం ఎదురుచూస్తున్న మురళిని బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి హత్య చేశారని ఇటుకలపల్లి సర్కిల్ ఇన్పెక్టర్ మురళిధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

‘‘మురళిని కిడ్నాప్ చేసే క్రమంలో అక్కడ పెద్ద డ్రామా నడిచింది. అతను ప్రతిఘటించడంతో స్థానికులు గుమిగూడారు. దీన్ని గమనించిన నిందితులు మా ఊరి యువకుడే, తమకు అప్పు ఇవ్వాలని ఇవ్వకుండా తిరుగుతున్నాడని అందుకే తీసుకెళుతున్నామని అక్కడి ప్రజలను నమ్మించి బలవంతంగా ఆటోలో తీసుకెళ్లారు” అని వివరించారు మురళిధర్ రెడ్డి.

కుల అహంకార హత్య

ఫొటో సోర్స్, Tulasi Prasad Reddy

‘‘సాయంత్రం షిఫ్ట్‌కి వెళ్లేందుకు ఈ నెల 16న మధ్యాహ్నం రెండున్నరకు బస్ కోసం హైవేపై వెయిట్ చేస్తుండగా నిందితులు వచ్చారు. అతణ్ని ఆటోలో కిడ్నాప్ చేసుకొని బెంగళూరు హైవే సమీపంలో రాప్తాడు మండలం బొమ్మేపర్తి దగ్గర పొలాల్లో గొంతు కోసి చంపేశారు’’అని ఆయన చెప్పారు.

భర్త ఇంటికి రాకపోవడంతో వీణ జూన్ 17 ఉదయం అందరినీ విచారించి తమకు ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు.

“మేం దర్యాప్తు సాగిస్తుండగా, ఒక గుర్తుతెలియని మృతదేహం పడి ఉందని సమాచారం వచ్చింది. అక్కడకు వెళ్ళి చూస్తే అది మురళి మృతదేహమని అని తేలింది. టెక్నికల్ డేటా అంతా చూసినప్పుడు వాళ్ళ అమ్మ పైనే అనుమానం వచ్చి నిఘా పెట్టాం. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించాం. నిర్ధారణ అయిన తరువాత ఎనిమిది మందిని అరెస్టు చేశాం. దానికి సంబంధించిన నగదు, ఆటో, కత్తి స్వాధీనం చేసుకున్నాము’’ అని సీఐ మురళిధర్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

మురళిది నిరుపేద కుటుంబం. మురళి తండ్రి నాగన్నకు మానసిక ఆరోగ్యం సరిగా లేదు.

వీడియో క్యాప్షన్, హైదరాబాద్: కాథలిక్ చర్చికి కార్డినల్‌గా ఎంపికైన తొలి దళితుడు పూల ఆంథోని

కూలి చేసి తన కొడుకును చదివించానని, భర్తకు మతిస్తిమితం లేకున్నా, కొడుకును చూసుకుంటూ బతికానని, తనకు దిక్కెవరంటూ బీబీసీ ముందు కన్నీరు పెట్టుకున్నారు మురళి తల్లి ముత్యాలమ్మ.

‘‘వద్దు నాయనా మనకు.. వాళ్లతో మనము గెలవలేము అని మా కొడుక్కు చెప్పాను. ఆమెను ఇష్టపడ్డాడు, మోసం చేయకూడదు అని ఆమెతో వెళ్లాడు. సంవత్సరం అయింది పెళ్లి చేసుకుని.. బాగున్నారు. మా కొడుకు చాలా మంచోడు. మేము అమాయకులం. నా భర్త ఏ పనీ చేయలేడు. ఆయనకు మతి స్థిమితం లేదు. నేను కూలికి పోయి కడుపుకి అన్నం కూడా సరిగా తినకుండా వాడిని ఎంబీఏ వరకు చదివించాను. నా కొడుకు కోసమే నేను బతికాను. సాయంత్రం అయితే ఫోన్ చేసి బువ్వ తిన్నావా.. ఆరోగ్యం బాగుందా అని అడిగేవాడు. ఇక నన్ను ఎవరు అడుగుతారు. ఇక నాకు దిక్కెవరు. ఇక నేను ఎవరికోసం బతకాలి. కమ్మవాళ్ల పాపను ప్రేమించి ఇట్లా అయిపోయారు. వాళ్ల అమ్మ ‘చంపేయాలి, చంపేయాలి’ అని చంపేసింది. బిడ్డ సంసారం ఎవరైనా తీసుకుంటారా… బిడ్డకు మొగుడు లేకుండా చేసే వాళ్లు ఉంటారా. అందరికీ దేవుడు తలరాత రాస్తే.. ఆమె బిడ్డకు తల రాత ఆమే రాసింది. నాకూ ఒక్కడే కొడుకు. ఆమెకూ ఒక్కతే కూతురు’’ అని ముత్యాలమ్మ చెప్పారు.

మురళి తల్లి ముత్యాలమ్మ

ఫొటో సోర్స్, Tulasi Prasad Reddy

పెళ్లికి ముందు తన మనవడు మురళికి ఎన్నో విధాలుగా నచ్చజెప్పానని ఆయన తాత బంగారు నారాయణప్ప (తల్లి తండ్రి) బీబీసీతో చెప్పారు.

‘‘వాడికి ఎన్నో విధాలుగా చెప్పాను. వద్దు, వాళ్లు రాక్షసులు నిన్ను చంపేస్తారు అని. వాళ్ల తాతల కాలం నుంచి వాళ్లు ఎలాంటి వారో నాకు తెలుసు. నిన్ను బతకనీయరు అన్నాను. వీణ మా ఇంటికి వచ్చి, మురళితో మాట్లాడుతూ- నువ్వొస్తావా, నేను ఆత్మహత్య చేసుకోవాలా అనింది. నమ్మిన ఆడపిల్లకు అన్యాయం చేయకూడదని ఆమెతో వెళ్లమన్నాను” అంటూ నారాయణప్ప వాపోయారు.

వీడియో క్యాప్షన్, పరువు హత్యలు కాదు, అహంకార హత్యలు

ఇలాంటి హత్యలు పునరావృతం కాకూడదు: ఎంపీ గోరంట్ల మాధవ్

మురళి హత్యపై కురబ సంఘం నేతలు రాప్తాడు దగ్గర ఆందోళనలకు దిగారు. జూన్ 20న మృతుడి కుటుంబాన్ని హిందూపురం ఎంపి గోరంట్ల మాధవ్ పరామర్శించారు.

ఇది కుల అహంకార హత్యేనని మాధవ్ జూన్ 21న బీబీసీతో అన్నారు.

మురళి కుటుంబం

ఫొటో సోర్స్, Tulasi prasad reddy

ఫొటో క్యాప్షన్, మురళి కుటుంబం

‘‘కులాంతర వివాహాలు చేసుకున్న సందర్భాలలో అమ్మాయిని చంపుతున్నారు. అబ్బాయిని చంపుతున్నారు. ఇద్దరిని కలిపి కూడా చంపుతున్నారు. ఇలాంటి ఘటనలు ఆధునిక సమాజంలో జరగడం చాలా అనాగకరికం. సభ్య సమాజం తలదించుకునే చర్య, ఇది దురదృష్టకరం. దీని వెనుక ఎంతటి పెద్దవారైనా రాజకీయంగా, ఆర్థికంగా ఎలాంటి హోదాల్లో ఉన్న కూడా వారిని కచ్చితంగా దర్యాప్తు చేసి బయటికి తీసుకురావాలి. పోలీస్ దర్యప్తులో ఎలా తేలితే ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇది కేవలం కుల వివక్షతతో, కుల అహంకారం పరాకాష్టకు చేరి జరిగిన హత్యగా నేను భావిస్తున్నాను. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు’’ అని మాధవ్ చెప్పారు.

ఈ హత్య వెనక రాజకీయ పెద్దలు ఉన్నట్టు తమ దర్యాప్తులో తేలలేదని పోలీసులు చెప్పారు.

‘‘వీణ తల్లి అభ్యర్థన మేరకు వీణ కమ్యూనిటీలో ఉన్న లోకల్ పెద్దలు ఆ అమ్మాయిని బెదిరించారు. అయినా ఆ అమ్మాయి వినలేదు. గుడిలో పెళ్లి చేసుకుంది. తర్వాత వారందరికీ భయపడి రాప్తాడు మండలం ఎస్సీ కాలనీలో ఉంటోంది. రాజకీయ కారణాలు లేవు. కులానికి సంబంధించిన కొందరు ప్రమేయం ఉంది తప్ప, దీనికి పొలిటికల్ కలర్ ఏమీ లేదు. బాధితురాలు కూడా మాకు ఫిర్యాదులో అలాంటిదేమీ చెప్పలేదు. కేవలం ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మాత్రమే ఈ హత్య జరిగింది’’ అని సీఐ మురళిధర్ రెడ్డి బీబీసీకి వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)