ఇందిరాగాంధీ ఇద్దరు మహారాణులను జైలుకు ఎందుకు పంపారు, అప్పుడేం జరిగింది?

ఫొటో సోర్స్, RUPA
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఎమర్జెన్సీ విధించిన తర్వాత జైపూర్, గ్వాలియర్ మహారాణులను ఇందిరాగాంధీ లక్ష్యంగా చేసుకున్నారు.
పార్లమెంటులోని విపక్ష నాయకుల్లో ప్రముఖ నేతలుగా మాత్రమే కాకుండా, తమ ప్రాంతాల్లోని సామాన్య ప్రజల్లో కూడా ఈ రాణులిద్దరికీ మంచి ప్రజాదరణ ఉంది.
వారి రాజకీయ విశ్వసనీయతను తగ్గించడానికి రాజకీయంగా కాకుండా, ఆర్థిక నేరాల అభియోగాలతో రాణులను అరెస్ట్ చేశారు.
ఎమర్జెన్సీ ప్రకటించడానికి ముందే రాజమాత గాయత్రీ దేవిని వేధించే ప్రక్రియ మొదలైంది. జైపూర్ రాజకుటుంబానికి చెందిన ప్రతీ ఇల్లు, ప్యాలెస్, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయి.
ఎమర్జెన్సీని విధించినప్పుడు గాయత్రీ దేవి ముంబైలో చికిత్స పొందుతున్నారు. అప్పుడు ఆమె వయస్సు 56 ఏళ్లు.
1975 జూలై 30వ తేదీ రాత్రి గాయత్రీ దేవి, దిల్లీలోని తన ఇంటికి చేరుకున్నప్పుడు... పోలీసులు ఆమెను విదేశీ మారక నిరోధక చట్టం, స్మగ్లింగ్ చట్టం కింద అరెస్ట్ చేశారు.
గాయత్రీ దేవితో పాటు ఆమె కుమారుడు కల్నల్ భవానీ సింగ్‌ను కూడా కస్టడీలోకి తీసుకున్నారు.
విదేశీ యాత్ర అనంతరం మిగిలిపోయిన డాలర్లను తనవద్దే ఉంచుకున్నారని, వాటిని ప్రభుత్వానికి అప్పగించలేదని ఆరోపణలతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ దిల్లీలోని తీహార్ జైలుకు పంపించారు.

ఫొటో సోర్స్, Getty Images
గదిలో దుర్వాసన, ఫ్యాన్ కూడా లేదు
తీహార్ జైలుకు తరలించేముందు వారిద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
గాయత్రీ దేవి తన ఆత్మకథ ' ఎ ప్రిన్సెస్ రిమెంబర్స్'లో ఇలా రాశారు. ''పోలీస్ స్టేషన్‌లోని అందరూ భవానీ సింగ్‌ను గుర్తు పట్టారు. భవానీ సింగ్, రాష్ట్రపతికి బాడీగార్డ్‌గా పనిచేశారు. 1971 యుద్ధంలో చూపిన శౌర్య పరాక్రమాలకు గానూ ఆయనకు 'మహావీర్ చక్ర' పురస్కారం కూడా లభించింది.
విహారయాత్రల సీజన్‌లో హోటల్ గదులు నిండినట్లుగా ఆ సమయంలో దిల్లీలోని జైళ్లన్నీ నిండిపోయాయి. మేం అక్కడ ఉండేందుకు ఏర్పాట్లు చేయడం కోసం తీహార్ జైలు సూపరింటెండ్ కొంత సమయం ఇవ్వాలని పోలీసు అధికారిని అడిగారు.
మూడు గంటల తర్వాత మేం తీహార్ జైలుకు చేరుకున్నాం. మాకోసం ఆయన టీ తెప్పించారు. మా ఇంటికి ఫోన్ చేసి బెడ్‌లు పంపించమని చెప్పారు.''

ఫొటో సోర్స్, RUPA
రాజమాత జీవిత చరిత్ర 'ద హౌస్ ఆఫ్ జైపూర్'లో జాన్ జుబ్ర్‌జికీ ఇలా రాశారు. ''భవానీ సింగ్‌ను జైలులోని బాత్రూమ్ గదిలో ఉంచారు. గాయత్రీదేవికి దుర్వాసన వచ్చే గదిని ఇచ్చారు. ఆ గదిలో ఒక కుళాయి ఉంది. కానీ, అందులో నీరు లేదు. గాయత్రీదేవి గదిలోనే కమ్యూనిస్ట్ కార్యకర్త శ్రీలతా స్వామినాథన్‌ను కూడా ఉంచారు.
గదిలో కేవలం ఒక మంచం మాత్రమే ఉంది. దాన్ని రాణికి ఇచ్చి శ్రీలత నేలపై రగ్గు వేసుకొని పడుకున్నారు. మహారాణికి ఉన్న ప్రాబల్యం కారణంగా ఆమెకు రోజూ ఒక వార్తాపత్రిక, ఉదయం టీ ఇచ్చేవారు. సాయంత్రం వేళ తన కుమారుడు భవానీ సింగ్‌తో కలిసి నడకకు వెళ్లేందుకు రాణికి అనుమతి ఇచ్చారు.

ఫొటో సోర్స్, RUPA
''రాణి గదిని శుభ్రం చేయడానికి లైలా బేగం అనే ఖైదీని నియమించారు'' అని ఆ పుస్తకంలో రాశారు.
1977 నవంబర్ 15న ''రాజమాత నరేట్స్ టేల్స్ ఆఫ్ వెండెట్టా'' అనే పేరుతో ఒక ఇంటర్వ్యూను టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ''మొదటి రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నా సెల్ బయట ఒక నాలా ఉంది. ఖైదీలు అక్కడే మలవిసర్జన చేసేవారు. గదిలో ఫ్యాన్ కూడా లేదు. అక్కడి దోమలు మా రక్తం తాగాయి.
జైలు వాతావరణమంతా చేపల మార్కెట్‌లా ఉంటుంది. అక్కడ దొంగలు, సెక్స్ వర్కర్లు ఒకరిపై ఒకరు అరుచుకుంటూనే ఉంటారు. మమ్మల్ని 'సి' క్లాస్‌గా వర్గీకరించారు'' అని గాయత్రీ దేవి చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
చదవడంతో కళ్లపై ఒత్తిడి
రాణి, తీహార్ జైలులో ఉన్న సమయంలో ఆమె మరో కుమారుడు జగత్... ఇంగ్లండ్ నుంచి వోగ్, టైట్లర్ పత్రికల్లోని తాజా వార్తలను ఆమెకు పంపించేవారు.
వారంలో రెండుసార్లు ఆమెను కలవడానికి జైలుకు వెళ్లేవారు ఒక ట్రాన్సిస్టర్ రేడియోను ఆమెకు ఇవ్వగలిగారు.
ట్రాన్సిస్టర్ రేడియో ద్వారా మహారాణి, బీబీసీ వార్తలను వినేవారు.
'ద ఎమర్జెన్సీ: ఎ పర్సనల్ హిస్టరీ' అనే పుస్తకంలో కూమీ కపూర్ జర్నలిస్ట్ వీరేంద్ర కపూర్‌తో ఇలా అంటారు. ''గాయత్రీ దేవి జైలులోని ఇతర మహిళలకు దూరం పాటించారు. కొన్నిసార్లు వారిని చూసి చిరునవ్వు నవ్వేవారు. కొన్నిసార్లు వారితో మాట్లాడేవారు కూడా. కానీ, వారితో ఆమె కలిసిపోలేదు.''

ఫొటో సోర్స్, PENGUIN VIKING
విజయరాజె సింధియా కూడా...
ఒక నెల రోజుల తర్వాత గ్వాలియర్ జైలు అధికారులు గాయత్రీదేవితో మాట్లాడుతూ, గ్వాలియర్ రాజమాత విజయరాజె సింధియాను కూడా జైలుకు తీసుకువస్తున్నామని, ఆమెను కూడా మీ గదిలోనే ఉంచుతామని చెప్పారు.
అప్పుడు గాయత్రీదేవి.. తమ గదిలో మరో మంచం పెడితే నిలబడేందుకు కూడా స్థలం ఉండదని చెబుతూ వారిని వ్యతిరేకించారు.
''యోగా చేయడానికి నాకు గదిలో కొంచెం స్థలం కావాలి. రాత్రిపూట నాకు చదివే, సంగీతం వినే అలవాటు ఉంది. మా ఇద్దరి అలవాట్లు చాలా వేరుగా ఉంటాయి. ఆమె పూజ చేయడం, ఆరాధనలోనే చాలా సమయం గడిపేవారు'' అని తన ఆత్మకథలో గాయత్రీదేవి రాశారు.
''జైలు సూపరింటెండెంట్ నా అభ్యర్థనను అంగీకరించారు. రాజమాత కోసం మరొక గదిని కూడా ఏర్పాటు చేశారు. అయితే వేసవి కాలం కావడంతో... మీ గది పక్కన ఉన్న వరండాలో పడుకోవచ్చా అని రాజమాత నన్ను అడిగారు. దీంతో వరండాలో ఆమె కోసం మంచం వేయమని చెప్పాను'' అని గాయత్రీదేవి పుస్తకంలో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
1975 సెప్టెంబర్ 3న గ్వాలియర్ రాజమాత విజయరాజె సింధియాను తీహార్ జైలుకు తీసుకొచ్చారు.
ఆమెపై కూడా ఆర్థిక నేరం మోపి వారి బ్యాంకు ఖాతాలన్నింటినీ సీల్ చేశారు.
ఒకానొక సమయంలో ఖర్చుల కోసం ఆస్తిని అమ్మడం లేదా స్నేహితుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. స్నేహితుల నుంచి ఆ సమయంలో అప్పు పొందడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే ఎమర్జెన్సీ బాధితుడికి ఎవరు సహాయం చేసినా ప్రభుత్వం వారిని కూడా లక్ష్యంగా చేసుకునేది.

ఫొటో సోర్స్, THE CENTURY LIVES & LETTERS
గాయత్రీ దేవి, విజయరాజె సింధియా కలవడం
సింధియా తన ఆత్మకథ 'ప్రిన్సెస్'లో ఇలా వ్రాశారు. ''ఖైదీ నంబర్ 2265గా నేను తీహార్‌లో చేరాను. నేను జైలుకు చేరుకున్నప్పుడు జైపూర్ మహారాణి గాయత్రీ దేవి నన్ను స్వాగతించారు. మేమిద్దరం తలలు వంచి చేతులు జోడించి పరస్పరం గౌరవించుకున్నాం.
ఆమె కంగారు పడుతూ మీరిక్కడికి ఎలా వచ్చారు? అని అడిగారు. 'ఇది చాలా దరిద్రమైన ప్రదేశం. నా గదిలో ఉన్న బాత్రూమ్‌లో కుళాయి కూడా లేదు. టాయ్‌లెట్ పేరుతో ఒక గొయ్యి మాత్రమే ఉంది. రోజుకు రెండుసార్లు జైలు స్కావెంజర్స్ నీళ్ల బకెట్లు తీసుకొస్తారు. గొయ్యని శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తారు' అని గాయత్రీ దేవి తనతో చెప్పినట్లు విజయరాజె సింధియా రాశారు.

ఫొటో సోర్స్, THE CENTURY LIVES & LETTERS
జైలులో ఈగలు, దోమలు
''గాయత్రీ దేవి, నేను ఒకప్పుడు రాణులం కావచ్చు. కానీ, తీహార్ జైలుకు మాత్రం మేం 27 కేసులున్న ఖైదీలం. ఇందులో నాలుగు హత్యా సంబంధమైన కేసులు. ఆమె బ్లౌజ్‌లో బ్లేడ్ పెట్టుకొని తిరిగేది. ఎవరైనా తన దారికి అడ్డు వస్తే బ్లేడుతో ముఖాన్ని చెక్కుతానంటూ బెదిరించేది. ఆమె చెడ్డ తిట్లను ఎలాంటి సంకోచం లేకుండా అనేవారు'' అని విజయ్‌రాజె సింధియా తన పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, THE CENTURY LIVES & LETTERS
''గాయత్రీ దేవి అక్కడికి వచ్చి రెండు నెలలు గడిచిపోయాయి. కాబట్టి, ప్రతీ వారం ఆమెను కలవడానికి ప్రజలు వచ్చేవారు. వారితో ఒక బ్యాడ్మింటన్ రాకెట్, ఒక ఫుట్‌బాల్, రెండు క్రికెట్ బ్యాట్‌లు, కొన్ని బంతులను గాయత్రీదేవి జైలులోకి తెప్పించగలిగారు. ఆ తర్వాత జైలులో ఉన్న పిల్లలకు ఆటలు నేర్పడం ప్రారంభించారు. కానీ జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి.
గదిలో రోజంతా దుర్వాసన ఉండేది. ఒక చేత్తో ఈగలను తరిమికొడుతూ తినాలి. ఈగల బాధ తప్పితే రాత్రిపూట దోమలు, ఇతర క్రిమికీటకాలు వేధించేవి.
జైలులోకి వెళ్లిన మొదటి నెలలో నన్నెవరినీ కలవడానికి అనుమతించలేదు. నేను ఏ జైలులో ఉన్నానో కూడా నా కూతుళ్లకు తెలియదు'' అని విజయరాజె పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, Getty Images
క్షీణించిన గాయత్రీదేవి ఆరోగ్యం
గాయత్రీ దేవి పది కిలోలు బరువు తగ్గిపోయారు. ఆమెకు 'లో బీపీ' ప్రారంభమైంది.
గాయత్రీదేవి ఆరోగ్యం గురించి కుమీ కపూర్ తన పుస్తకం 'ది ఎమర్జెన్సీ ఎ పర్సనల్ హిస్టరీ'లో రాశారు.
''గాయత్రీ దేవి నోటిలో బొబ్బలు వచ్చాయి. ఆమె వ్యక్తిగత దంత వైద్యుడిని జైలు అధికారులు, జైలులోకి అనుమతించలేదు. చాలా వారాల తర్వాత, దిల్లీ కర్జన్ రోడ్‌లోని డాక్టర్ బెరీ క్లినిక్‌లో ఆపరేషన్ కోసం ఆమెను అనుమతించారు.
ఆపరేషన్ అనంతరం జైలు వైద్యుల సూచన మేరకు దిల్లీలోని జీబీ పంత్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ గాయత్రీ దేవి పిత్తాశయంలో కూడా రాళ్లు ఉన్నట్లు మొదటిసారిగా గుర్తించారు. అయితే కుటుంబ సభ్యులు లేకుండా ఆపరేషన్ చేయించుకోనని గాయత్రీ దేవి నిరాకరించారు'' అని కుమీకపూర్ పుస్తకంలో తెలిపారు.

ఫొటో సోర్స్, RUPA
గాయత్రీ దేవి తన ఆత్మకథలో ఇలా రాశారు. ''పంత్ ఆసుపత్రిలో గడిపిన మొదటి రాత్రి చాలా భయంకరమైనది. నా గదిలో పెద్ద ఎలుకలు తిరిగాయి. వాటిని తరిమికొట్టడానికి సిబ్బంది ప్రయత్నించారు. వారి బూట్ల శబ్ధంలో నిద్ర పట్టలేదు. ఆ తర్వాతి రోజు డాక్టర్ పద్మావతి నన్ను బాత్‌రూమ్‌కి అనుబంధంగా ఉన్న శుభ్రమైన గదికి మార్చారు'' అని చెప్పారు.
గాయత్రీ దేవి, ఆమె కుమారుడు భవానీ సింగ్ ఆరోగ్య కారణాల రీత్యా జైలు నుంచి తమను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అప్పటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి ప్రణబ్ ముఖర్జీ, వారిని విడుదల చేయాలంటూ ఇందిరా గాంధీకి లేఖ రాశారు. కానీ, ప్రధాన మంత్రి వారి అభ్యర్థనను అంగీకరించలేదు.
మరోవైపు లండన్‌లో లార్డ్ మౌంట్ బాటన్, గాయత్రీ దేవి విడుదల కోసం ఇందిరా గాంధీకి లేఖ రాయాలని బ్రిటన్ రాణిపై ఒత్తిడి పెంచడం ప్రారంభించారు.
గాయత్రీ దేవి జీవిత చరిత్రలో జాన్ జుబ్ర్‌జికీ ఇలా రాశారు. ''ఈ విషయంలో బ్రిటిష్ రాజకుటుంబం జోక్యం చేసుకోకూడదని దిల్లీలోని బ్రిటిష్ హైకమిషన్ అభిప్రాయపడింది. ఎందుకంటే వారి దృష్టిలో ఇది భారతదేశ అంతర్గత విషయం. పైగా ఇందిరాగాంధీ ఈ అభ్యర్థనను అంగీకరించే అవకాశం కూడా తక్కువే అనేది కూడా వారి అభిప్రాయం.''

ఫొటో సోర్స్, RUPA
ఇందిరా గాంధీకి గాయత్రీ దేవి లేఖ
ఇక సహనం నశించిన గాయత్రీ దేవి, స్వయంగా తన విడుదల చేయాలని కోరుతూ ఇందిరా గాంధీకి లేఖ రాశారు.
''అంతర్జాతీయ మహిళా సంవత్సరం ముగింపు సందర్భంగా మన దేశం కోసం మీరు చేపడుతోన్న కార్యక్రమాలకు మద్దతు ఇస్తానని హామీ ఇస్తున్నా'' అని ఆమె లేఖలో రాశారు.
తాను రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు కూడా లేఖలో ప్రస్తావించారు. ''స్వతంత్ర పార్టీ శకం ఎలాగో ముగిసిపోయింది. వేరే పార్టీలో చేరే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి నన్ను విడుదల చేయండి. మీరు ఇంకేవైనా షరతులు విధిస్తే వాటిని అంగీకరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా'' అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
''తమ అరెస్టులను సవాలు చేస్తూ గాయత్రీదేవి, భవానీ సింగ్ దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకోవాలనేది ప్రభుత్వం విధించిన మొదటి షరతు. ఈ షరతును వారిద్దరూ వెంటనే అంగీకరించారు. వారి విడుదలకు సంబంధించి ఆదేశాలపై 1976 జనవరి 11న అధికారులు సంతకాలు చేశారు. ఆమె సోదరి మేనక, ఆమెను ఆసుపత్రి నుంచి తీహార్ జైలుకు తీసుకెళ్లారు. అక్కడ తన సామగ్రిని తీసుకొని బయల్దేరారు. మొత్తం 156 రాత్రులు ఆమె అక్కడ గడిపారు.
అక్కడి ఖైదీలు, గ్వాలియర్ రాజమాత ఆమెకు వీడ్కోలు పలికారు. దిల్లీ ఔరంగాబాద్ రోడ్‌లోని తన నివాసానికి గాయత్రీదేవి చేరుకున్నారు. రెండు రోజుల తర్వాత కారులో జైపూర్ వెళ్లారు. సుమారు 600 మంది ఆమెకు స్వాగతం పలికారు. తర్వాత బాంబే వెళ్లారు. అక్కడ గాల్‌బ్లాడర్‌లో రాళ్లను తొలిగించే శస్త్రచికిత్స చేయించుకున్నారు'' అని జాన్ జుబ్ర్‌జికి రాశారు.

ఫొటో సోర్స్, PENGUIN VIKING
తీహార్‌లో భజనలు
మరోవైపు, విజయరాజే సింధియా కుమార్తె ఉష చాలా కష్టపడి ఇందిరా గాంధీని కలిశారు.
తన తల్లిని విడుదల చేయాలని ఇందిరాగాంధీని ఆమె అభ్యర్థించగా... ఆమెను రాజకీయ కారణాలతో కాదు ఆర్థిక నేరాల అంశంలో అరెస్టు చేశారని ఇందిరాగాంధీ సమాధానం చెప్పారు.
జైలులో పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవి. అయితే, ఆమె వినోదం కోసం జైలులో ఒక ఏర్పాటు ఉండేది.
''ఒకరోజు మహిళా ఖైదీల బృందం, నాకోసం పాటలు పాడటం మొదలు పెట్టారు. తాజా చిత్రాల్లోని పాటలను కోరస్‌లో పాడి దాన్ని'క్యాబరే' అని పిలిచేవారు. పాటలకు బదులుగా భజనలు చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుందని వారికి చెప్పాను. నా కోరిక మేరకు వారు భజనలు ఆలపించడం మొదలుపెట్టారు. క్యాబరే స్థానంలో భజనలను ఎందుకు నేను ఇష్టపడుతున్నానో వారికి అర్థం కాలేదు. సరే ముందు భజనలు చేద్దాం, ఆతర్వాత క్యాబరే కొనసాగిద్దాం అని వారు అన్నారు'' అని విజయరాజే సింధియా పుస్తకంలో రాశారు.

ఫొటో సోర్స్, ROLI BOOKS
జైలు నుంచి విడుదల
కొన్ని రోజుల తర్వాత, విజయరాజే సింధియా అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.
సింధియా ఇలా వ్రాశారు. ''నన్ను ఒక ప్రైవేట్ గదిలో ఉంచారు. బయట ఒక సెంట్రీని కూర్చోబెట్టారు. నన్ను కలవడానికి ఎవర్నీ అనుమతించలేదు. ఒక రోజు ఒక వ్యక్తి నా గదిలోకి రావడం నేను చూశాను.
ఆయన కశ్మీర్ ముఖ్యమంత్రి షేక్ అబ్దుల్లా. ఆయన కూడా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. మేం అలా కలవడం చాలా విచిత్రంగా అనిపించింది. 12 ఏళ్ల క్రితం ఆయన ఖైదీగా ఉన్నప్పుడు, ఆయనను చూడటానికి నేను వెళ్లాను. నా అనారోగ్యం కారణంగా పెరోల్‌పై విడుదల చేస్తున్నట్లు ఒకరోజు ఉదయాన్నే నాకు చెప్పారు.''

ఫొటో సోర్స్, Getty Images
సింధియా బయటకు వెళ్లే సమయం వచ్చేసరికి మహిళా ఖైదీలు ఆమెపై పూల వర్షం కురిపించారు. విజయరాజె సింధియా జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమె ముగ్గురు కుమార్తెలు ఆమె కోసం వేచి ఉన్నారు. వారిని చూసి ఆమె నవ్వారు. కానీ, అదే సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఇవి కూడా చదవండి:
- అనంతపురం: 'మా అమ్మే కిరాయి హంతకులతో నా భర్తను చంపించింది' - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- అమెరికా: అబార్షన్ హక్కును రద్దు చేసిన రోజున ఓ క్లినిక్‌లో వాతావరణం ఎలా ఉందంటే...
- అగ్నిపథ్: సైన్యంలో ఉద్యోగాల కోసం పుట్టుకొచ్చిన కోచింగ్ సెంటర్లు, విద్యార్థుల కలలు కల్లలేనా
- ఎమర్జెన్సీ: ‘అక్రమ నిర్బంధానికి బలైన’ స్నేహలతారెడ్డి జైలు డైరీ
- రెండు డోసుల వ్యాక్సీన్ తీసుకున్నవారికి, తీసుకోని వారికి కరోనావైరస్ లక్షణాలలో ప్రధాన తేడా అదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











