రష్యా నుంచి భారత్‌కు రావల్సిన ఆయుధాలు తగ్గిపోతున్నాయా... యుక్రెయిన్ యుద్ధం, పశ్చిమ దేశాల ఆంక్షలే కారణమా?

రక్షణ ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సచిన్ గొగోయ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమైన తర్వాత, అమెరికాతో సహా అనేక పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధించాయి. రష్యా సైనిక పరికరాలు, ఆయుధాలపై ఆధారపడినందున ఇది భారత్‌కు కూడా సవాలుగా మారుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అయితే, ఈ విషయంలో ఇరుదేశాలు, కొంతమంది భారతీయ నిపుణుల వైఖరి సానుకూలంగా ఉంది. వీరి అభిప్రాయం ప్రకారం ఈ ఆంక్షలు మిలిటరీ ఒప్పందాలపై ప్రభావం చూపబోవు.

అమెరికన్ థింక్ ట్యాంక్ స్టిమ్సన్ సెంటర్ 2020లో సమర్పించిన అంచనా ప్రకారం, భారతదేశ రక్షణ పరికరాలలో రష్యా తయారీ ఆయుధాల వాటా 86 శాతం.

భారతదేశం గత దశాబ్దంలో సైనిక పరికరాల కొనుగోలును పెంచడానికి ప్రయత్నించింది. అప్పటికే రష్యన్ ఆయుధ వ్యవస్థలు భారత సైనిక మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా ఉన్నాయి.

స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రిపోర్టు 2017- 2021 మధ్య రష్యా నుంచి భారత్ ఎన్ని ఆయుధాలు కొనుగోలు చేసిందన్న వివరాలను అందిస్తుంది.

అమెరికా, దాని మిత్రదేశాలు విధించిన ఆంక్షలలో అంతర్జాతీయ చెల్లింపు గేట్‌వే వ్యవస్థ స్విఫ్ట్ నుండి రష్యాను వేరుచేయడం కూడా ఒకటి.

ఈ చర్య వల్ల భారత్‌కు కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఈ పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించింది.

యుక్రెయిన్ మీద యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్యదేశాలు ఆంక్షలు విధించాయి

ఫొటో సోర్స్, EPA/OLEG PETRASYUK

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ మీద యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్యదేశాలు ఆంక్షలు విధించాయి

భారత ప్రభుత్వ సానుకూల వైఖరి

రష్యాపై అమెరికా, దాని మిత్రపక్షాల ఆంక్షల కారణంగా ఆ దేశంతో వాణిజ్యంపై ప్రభావం పడుతుందని భారత ప్రభుత్వం భయపడింది.

''ఆంక్షలు మాపై కొంత ప్రభావం చూపవచ్చు. అయితే, అది ఎంత అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు'' అని అప్పట్లో భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాతో అన్నారు.

ఆ తర్వాత ఈ అంశంపై భారత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే రష్యా నుంచి భారత్ గతంలో కంటే ఎక్కువగా చమురు, బొగ్గు కొనుగోలు కొనసాగిస్తోంది.

కాకపోతే మిలటరీ కొనుగోళ్లపై ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన లేదు.

ఆంక్షలను ఎలా ఎదుర్కోవాలో, తమ రక్షణ వ్యవహారాలను ఎలా కొనసాగించాలో ఇరు దేశాలకు తెలుసునని రష్యా ప్రభుత్వం ఈ సమస్యపై గళం విప్పింది.

''పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలను కృత్రిమ అడ్డంకులు'' అని ఏప్రిల్ ప్రారంభంలో దిల్లీ పర్యటనకు వచ్చిన రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అభివర్ణించారు.

అంతర్జాతీయ ఆంక్షల వల్ల ఎదురయ్యే అడ్డంకులను రష్యా, భారత్‌లు అధిగమిస్తాయని, భారత్ కొనుగోలు చేసే ఎలాంటి వస్తువులనైనా అందించేందుకు రష్యా సిద్ధంగా ఉంటుందని ఆయన చెప్పారు.

వీడియో క్యాప్షన్, రష్యా విమానాలను అడ్డుకున్న తర్వాత బీబీసీతో మాట్లాడిన నేటో పైలట్లు

భారత్‌లోని రష్యా రాయబారి డెనిస్ ఎలిపోవ్ జూన్ 13న ఈ పరిస్థితిని ధృవీకరిస్తూ, ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ డెలివరీ సజావుగా సాగుతుందని మీడియాతో అన్నారు.

పాత అమెరికా ఆంక్షల కారణంగా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ఐదు యూనిట్లను కొనుగోలు చేయడం ఇప్పటికే వివాదాస్పదమైంది.

రష్యా రాయబారి వ్యాఖ్యలు భారత్-రష్యాల మధ్య క్షిపణి నిరోధక వ్యవస్థల కొనుగోళ్లను ఏ ఆంక్షలు ఆపలేవని సూచిస్తున్నాయి.

''(సైనిక పరికరాలు) ధర, వాటి ప్రయోజనం గురించి భారత ప్రభుత్వం నిర్ణయిస్తుంది. భారతదేశం పాశ్చాత్య దేశాల నుంచి కూడా సైనిక పరికరాలను కొనుగోలు చేస్తుంది. కానీ, రష్యా సైనిక పరికరాలు ఎక్కువగా ఉండటంతో అవి చౌకగా వస్తాయి. కాబట్టి రష్యా నుండి కొనుగోళ్లు కొనసాగుతాయి'' అని భారత వైమానిక దళ మాజీ ఫైటర్ పైలట్, సైనిక విశ్లేషకుడు విజేందర్ కె. ఠాకూర్ అన్నారు.

''ఈ ఆంక్షల కారణంగా, భారతదేశం కొనుగోలు చేసిన రష్యా ఆయుధాల నిర్వహణలో ఏదైనా సమస్య వస్తుందని నేను అనుకోను" అని ఆయన అన్నారు.

రక్షణ ఆయుధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఆంక్షలను నివారించడానికి మార్గాలు

భారతీయ మీడియా ఇటీవల కొన్ని వార్తలను ప్రచురించింది. ద్వైపాక్షిక వాణిజ్యంలో సాఫీగా ఆర్థిక లావాదేవీలు జరిగేలా రెండు దేశాలు కొత్త పరిష్కారాలను అన్వేషిస్తున్నాయి అన్నది ఆ వార్తల సారాంశం.

''కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యుకో బ్యాంక్ వంటి భారతీయ బ్యాంకులు పాశ్చాత్య దేశాల నుంచి నిషేధం ఎదుర్కొంటున్న రష్యన్ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు'' అని ఆంగ్ల వార్తాపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ రాసింది.

''జూన్ మూడో వారంలో భారత్-రష్యా దేశాల అధికారులు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించడానికి దిల్లీలో సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో, ఆర్బీఐ, బ్యాంక్ ఆఫ్ రష్యాతో పాటు, రెండు దేశాల బ్యాంకుల అధికారులు పలువురు పాల్గొన్నారు'' అని ఈ కథనం పేర్కొంది.

రష్యాపై విధించిన ఆంక్షలను ఉల్లంఘించకుండానే, వ్యాపారం సులువుగా సాగేందుకు వీలుగా లోరో, వోస్ట్రో, నోస్ట్రో అనే మూడు రకాల ఖాతాలను ఇరు దేశాల బ్యాంకులు పరస్పరం తెరవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

ఈ విస్తృతమైన బ్యాంకింగ్ ఏర్పాట్లతో పాటు, ఆర్థిక ఆంక్షల కారణంగా రష్యా కొన్ని ప్రధాన రక్షణ ఒప్పందాలలో నష్టపోకుండా చూసేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది.

ఇందుకు ఉదాహరణగా మల్టీ-రోల్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్ట్ గురించి ఠాకూర్ ప్రస్తావించారు. దీని కింద భారత్ 114 యుద్ధ విమానాలను కొనుగోలు చేయాల్సి ఉంది.

ఈ ప్రాజెక్టు కింద 18 జెట్‌లను దిగుమతి చేసుకోనుండగా, 96 యుద్ధ విమానాలను భారత్‌లో తయారు చేస్తారు.

''భారతదేశంలో తయారు చేసిన మొదటి 36 యుద్ధ విమానాలకు పాక్షికంగా భారతీయ కరెన్సీలో చెల్లించాలని భారతదేశం నిర్ణయించింది. మిగిలిన 60 యుద్ధ విమానాలకు పూర్తిగా భారతీయ కరెన్సీలో చెల్లిస్తారు. ఇది రష్యాను దృష్టిలో ఉంచుకుని చేసిన చేసిన ఏర్పాటు'' అని ఠాకూర్ అన్నారు.

రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధానమంత్రి మోదీ

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత ప్రధానమంత్రి మోదీ

కొన్ని సైనిక ఒప్పందాలలో అనిశ్చితి

అయితే, ఇటీవలి నెలల్లో ప్రధాన రక్షణ ఒప్పందాలపై భారత్, రష్యాల మధ్య జరుగుతున్న చర్చలలో కొన్ని అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, దీనికి రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలే కారణమని చెప్పడం కష్టం.

ఉదాహరణకు, రష్యాతో అదనంగా మిగ్-29, సుఖోయ్-30 యుద్ధ విమానాలు, ఇంకా కేఏ -226టి యుటిలిటీ హెలికాప్టర్ల కొనుగోలుపై అనిశ్చిత పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ ఒప్పందాలు రద్దు కాలేదు.

మేలో, విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌కు సంబంధించిన ఆయుధ ఒప్పందంలో అమెరికాకు చెందిన ఎఫ్-18, ఫ్రెంచ్ రఫేల్ -ఎంలు ముందంజలో ఉంటాయని తేలింది.

ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ తయారీని ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభిస్తారు.

రష్యాకు చెందిన మిగ్-29 యుద్ధ విమానాలను ఈ ప్రక్రియలో విస్మరించినట్లు తెలుస్తోంది.

అయితే, ఈ యుద్ధ విమానాన్ని భారతదేశానికి చెందిన ఏకైక యాక్టివ్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ఉపయోగిస్తున్నారు.

మిగ్-29కే లకు భారత్ ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి ఈ ఆంక్షలకు ఎలాంటి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు.

వీడియో క్యాప్షన్, తూర్పు యుక్రెయిన్‌లోని డోన్‌బాస్ ప్రాంతంపైన మరింత పట్టు బిగించిన రష్యా

''మిగ్-29కె కంటే పాశ్చాత్య దేశాల నుండి వచ్చే విమానాలు చౌకగా ఉన్నట్లు అనిపిస్తోంది. గతంలో యూఏసీ కింద స్వతంత్ర యూనిట్లుగా పనిచేస్తున్న సుఖోయ్, మికోయాన్ బ్యూరోలను రష్యా కొనుగోలు చేసిందని కూడా రిపోర్టులు ఉన్నాయి. విలీనం తర్వాత, మిగ్-29 సిరీస్ (మిగ్-35 కూడా) ఉత్పత్తిని నిలిపివేశారు'' అని ఠాకూర్ అన్నారు.

భారతదేశం కొంతకాలంగా తన ఆయుధ ఎగుమతిదారులను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. రష్యాకు బదులుగా కొన్ని పాశ్చాత్య దేశాలను కూడా పరిశీలిస్తోంది. అయితే ఇది అసాధారణం కాదు'' అని భౌగోళిక, రాజకీయ, భద్రతా విషయాల నిపుణులు అపరాజిత పాండే అన్నారు.

"అంటే భారత్-రష్యాల మధ్య ఆయుధ వ్యాపారం ముగిసిపోతుందని అర్ధం కాదు" అని ఆమె అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)