Russia-Ukraine war: ప్రముఖ బ్రిటన్ జర్నలిస్టులపై రష్యా ఆంక్షలు

బ్రిటన్‌కు చెందిన 29 మంది ప్రముఖ జర్నలిస్టులపై రష్యా నిషేధం విధించింది. రష్యాకు చెందిన ప్రముఖులపై యూకే ఆంక్షలు విధించిన తర్వాత ప్రతిస్పందనగా రష్యా తాజా చర్యలు చేపట్టింది.
రష్యా ప్రకటించిన మీడియా ప్రముఖుల జాబితాలో యుక్రెయిన్ నుంచి రిపోర్టింగ్ చేసిన బీబీసీ ప్రతినిధులు క్లైవ్ మైరీ, ఓర్లా గ్వెరిన్, నిక్ రాబిన్సన్‌తో పాటు బీబీసీ డైరెక్టర్ జనరల్ టిమ్ డేవీ పేర్లు ఉన్నాయి.
స్కై టీవీ, ద టైమ్స్, గార్డియన్, ఛానల్ ఫోర్, ఐటీవీ జర్నలిస్టులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
గతంలోనే వందల మంది బ్రిటిష్ ఎంపీలపై రష్యా నిషేధం విధించింది.
నిషేధిత జాబితా ఇంకా పెరుగుతుందని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.
ఈ నిషేధిత జాబితాలో ఉన్న బ్రిటిష్ జర్నలిస్టులు ఉద్దేశపూర్వకంగా యుక్రెయిన్, దోన్బస్‌లలో జరిగిన కొన్ని ఘటనలకు సంబంధించి తప్పుడు, ఏకపక్ష సమాచారాన్ని ప్రచారం చేయడంలో పాలుపంచుకున్నారని రష్యా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
రష్యా నిషేధిత జాబితాలోని ఇతర ప్రముఖ జర్నలిస్టుల్లో ద టైమ్స్ ఎడిటర్ జాన్ విథెరో, టెలిగ్రాఫ్‌కు చెందిన క్రిస్ ఎవాన్స్, ది గార్డియన్‌కు చెందిన కేథరీన్ వైనెర్, డెయిలీ మెయిల్‌కు చెందిన టెడ్ వెరిటీ ఉన్నారు.
వీరితో పాటు మరికొందరు కరస్పాండెంట్ల పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
రష్యా విడుదల చేసిన తాజా జాబితాలో జర్నలిస్టులతో పాటు సైనిక బలగాలకు చెందిన ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. వారిలో రాయల్ నేవీ చీఫ్ ఆడమ్ సర్ బెన్ కీ, వైమానిక దళం చీఫ్ సర్ మైఖేల్ వింగ్‌స్టన్, మరికొందరు ప్రముఖులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













