1998 డీఎస్సీ - కేదారేశ్వరరావు: 24 ఏళ్ల కిందటి ఉద్యోగం ఇప్పుడొచ్చింది.. అప్పుడే వచ్చుంటే అమ్మ దూరమయ్యేది కాదు

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
పై రెండు ఫోటోల్లో ఉన్నది ఒకే వ్యక్తి. కాళ్లకు చెప్పులు లేకుండా పాత బట్టలను ఊరిలో అమ్ముకునే స్థితి నుంచి, మంచి బట్టలు ధరించి, ఊర్లో అందరితో గౌరవం పొందడానికి ఆయనకు 24 ఏళ్లు పట్టింది.
అల్లక కేదారేశ్వరరావుది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీది గ్రామం. ఈయన కథ డీఎస్సీ1998కి ముందు, ఆ తర్వాతగా చెప్పుకోవాలి.
పోస్టింగ్ లభించక దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల ఫైల్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇటీవల సంతకం చేయడంతో కేదారేశ్వరరావు కథ వెలుగులోకి వచ్చింది.
కేదారేశ్వరరావుని ‘బీబీసీ’ పెద్దసీది గ్రామంలో కలిసి, ఆయనతో మాట్లాడింది.

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas
'డీఎస్సీ-1998కి ముందే కేదారేశ్వరరావు, ఊర్లో మాస్టారు'
కేదారేశ్వరరావు 1965లో నేత కార్మికులు నీలకంఠ, అమ్మాయమ్మ దంపతులకు జన్మించారు. తల్లిదండ్రులకు నేత పనిలో సాయం చేస్తూనే చదువు కొనసాగించారు కేదారేశ్వరరావు.
ఇంటర్మీడియట్ తర్వాత గ్రామంలోనే ఉంటూ వివిధ పనులు చేస్తూండేవారు. ఉపాధ్యాయ వృత్తి అంటే ఇష్టం. టీచర్ పోస్టే లక్ష్యంగా 1992లో మద్రాసులోని అన్నామలై యూనివర్సీటి ద్వారా బీఈడీ పట్టా పొందారు. ఆ కోర్సులో భాగంగా గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో రెండు నెలల పాటు విద్యార్థులకు పాఠాలు చెప్పారు.
అప్పటి నుంచి గ్రామంలో తనను అంతా మాస్టారు, మాస్టారు అని పిలిచేవారని కేదారేశ్వరరావు చెప్పారు.
"టీచర్ ఉద్యోగం ఎలాగైనా పొందాలనే పట్టుదల ఉండేది. అయితే ఉపాధ్యాయ పరీక్ష కోసం కోచింగ్‌కు వెళ్లేందుకు ఆర్థికస్థితి సహకరించలేదు. సొంత ప్రిపరేషన్‌తో 1994, 1996లో డీఎస్సీలు రాశాను. ఈ రెండు డీఎస్సీలలో రాత పరీక్ష పాసై, ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యాను. పోస్టింగ్ రాలేదు" అని కేదారేశ్వరరావు చెప్పారు.
"తండ్రి ఆరోగ్యం క్షీణించడం, సోదరి వివాహం చేయాల్సి రావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో సైకిల్‌పై చుట్టుపక్కల ఊర్లు తిరుగుతూ బట్టలమ్మడం మొదలు పెట్టాను. టీచర్ అవ్వాలనే కోరిక మాత్రం అలాగే ఉంది. ఇంతలో డీఎస్సీ1998 నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మళ్లీ ప్రిపరేషన్ మొదలు పెట్టాను. శ్రీకాకుళం జిల్లా నుంచి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టు కోసం డీఎస్సీ-1998 పరీక్షకు హాజరయ్యాను. పరీక్షల్లో ప్రభుత్వం నిర్ణయించిన కటాఫ్ మార్క్ (45) సాధించడంలో విజయవంతమయ్యాను" అని కేదారేశ్వరరావు వివరించారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas
డీఎస్సీ-1998 తర్వాత....
కేదారేశ్వరరావు డీఎస్సీ 1998 పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే తండ్రి చనిపోయారు. గ్రామంలో సొంతింటిలో తల్లితో కలిసి కేదారేశ్వరరావు ఉండేవారు. డీఎస్సీలో ఎంపికైనా ఆయనకు ఉద్యోగం రాలేదు. సెకండ్ లిస్టులో వస్తుందనే ఆశతో ఎదురు చూశారు. ఎంత కాలం చూసినా పోస్టింగ్ రాలేదు.
దాంతో సమీప గ్రామాల్లో ఆటో నడిపేవారు. ఇంటి వద్ద నేత పని చేసుకుంటూ జీవనం సాగించేవారు. కొంత కాలానికి గ్రామంలో ఒక బట్టల దుకాణం పెట్టారు. టీచర్ పోస్టు రేపో మాపో వచ్చేస్తుందనే ఆశతోనే ఉండేవారు.
"ఎదురు చూపులతోనే కాలం గడుస్తూ డీఎస్సీ 2000 పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది. పరీక్ష రాశాను. కానీ ఉద్యోగం రాలేదు. చేసేదేమి లేక గ్రామంలోనే ఒక చిన్న వస్త్ర దుకాణం ప్రారంభించాను. ఇది కలిసి రాలేదు. 2000 సంవత్సరంలోనే ఉపాధి కోసం మా అమ్మతో కలిసి హైదరాబాద్ వెళ్లిపోయాను. భవన నిర్మాణ పనుల్లో కూలీగా చేశాను. కొంత కాలం పాఠశాలలు, కోచింగ్ సెంటర్లలో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. జీతాలు పెద్దగా లేకపోవడంతో...మళ్లీ 2006లో గ్రామానికి చేరుకున్నాం. ఊరొచ్చిన కొద్ది రోజులకే నా తల్లి కనిపించలేదు. ఎంత వెతికినా ఫలితం లేదు. దాంతో నేను ఒంటరైపోయాను. ఇలా డీఎస్సీ-1998 తర్వాత జీవితంలో అనేక మార్పులు వేగంగా జరిగిపోయాయి. ఉద్యోగం రాకపోవడం, తల్లి దూరం కావడం, వివాహం జరగకపోవడం, కుటుంబంలో పట్టించుకునేవారు ఎవరు లేకపోవడంతో గ్రామస్థులు కూడా నన్ను దూరంగానే పెట్టారు" అని కేదారేశ్వరరావు చెప్పారు.
బట్టలు అమ్ముకుంటూ, ఎవరేది ఇస్తే అది తింటూ, రాత్రయితే ఎక్కడో చోట నిద్రపోతూ జీవితం గడిపేశానని ఆయన తెలిపారు. తనను తాను కూడా పట్టించుకోకపోవడంతో తన రూపం మతిస్థిమితం లేని వ్యక్తిగానే మారిపోయిందన్నారు.
"కొందరు నన్ను పిచ్చివాడిగానే చూసేవారు. నా ఇల్లు కూడా చెత్త కుప్పలా, పాడుబడిపోయింది. మొదట్లో ఆ చెత్తలోనే పడుకుండేవాడిని, అయితే పాములు రావడంతో ఊర్లో అరుగులపై పడుకుంటున్నాను" అని కేదారేశ్వరరావు చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas
"నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది, తెలుసా?"
1998లో డీఎస్సీ పరీక్ష రాసి, కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు.. తమ పోస్టింగు విషయాన్ని ప్రతి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేవారు.
1998 డీఎస్సీ పరీక్షలో కటాఫ్ సాధించిన అభ్యర్థులందరికి ఉద్యోగాలు ఇవ్వాలనే ఫైల్‌పై ముఖ్యమంత్రి జగన్ జూన్ 18న సంతకం చేశారు. అలాంటి అభ్యర్థుల్లో కేదారేశ్వరరావు కూడా ఒకరు. పెద్దసీది గ్రామంలో పాత సైకిల్‌పై చెప్పులు లేకుండా బట్టలు అమ్ముకుంటున్న కేదారేశ్వరరావుకు ఇవేమీ తెలియవు. ఆయనకు సెల్ ఫోన్ కూడా లేదు.
"నాకు ఉద్యోగం వచ్చిందం ఊర్లోని కొందరు కుర్రాళ్లు చెప్పారు. నాకు అర్థం కాలేదు. డీఎస్సీ 1998 ఫైల్ మీద సీఎం సంతకం చేశారని, మనందరికి ఉద్యోగాలు వచ్చినట్లేనని, నాతో పాటు పరీక్ష రాసిన వాళ్లు చెప్పడంతో నాకు అర్థమైంది. ఆ తర్వాత ఊర్లోని కుర్రోళ్లు, తెలిసిన వాళ్లు, బ్యాచ్‌మేట్స్ అభినందించారు. మండలంలోని యువకులు మా ఊరు వచ్చి నాతో కేట్ కట్ చేయించి, మంచి బట్టలు ఇచ్చారు. సెల్ ఫోన్ కూడా కొని పెట్టారు"అని కేదారేశ్వరరావు తెలిపారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas
అప్పుడే పోస్టింగ్ వచ్చుంటే...
అప్పుడే పోస్టింగ్ వచ్చుంటే తన జీవితం మరోలా ఉండేదని కేదారేశ్వరరావు చెప్పారు.
"ఇప్పుడు జీవో వచ్చి, ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి 15 రోజులు పడుతుందని కొందరు చెప్పారు. ప్రస్తుతం నా వయసు 57 సంవత్సరాలు. ఇప్పడు జాయిన్ అయితే ఐదేళ్లు సర్వీస్ చేసే అవకాశం ఉంది. ఇన్నేళ్లకైనా నాకు టీచర్ అవుతున్నాననే ఆనందం దక్కింది. కానీ అప్పుడే పోస్టింగు వచ్చుంటే నా జీవితం మరోలా ఉండేది. జీతం వస్తుంది కాబట్టి నా ఎడ్యుకేషన్ డెవలప్ చేసుకునేవాడిని, పుస్తకాలు చదువుకునే వాడిని. ముఖ్యంగా అమ్మ నాకు దూరమయ్యేది కాదు" అని కేదారేశ్వరరావు ఆవేదన నిండిన స్వరంతో చెప్పారు.

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas
'ఇల్లు, కుటుంబం ఉండేది'
కేదారేశ్వరరావుకు ఇప్పటికైనా ఉద్యోగం రావడంతో గ్రామస్థులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగం రాక ముందు, వచ్చినదని తెలిసిన తర్వాత అంటే కేవలం ఒక రోజులో ఆయన జీవితంలో చాలా మార్పు వచ్చిందని, 1998లోనే ఆయనకు ఉద్యోగం వచ్చి ఉంటే ఆయన జీవితం ఎంతో బాగుండేదని స్థానిక యువత అభిప్రాయపడ్డారు.
1998 డీఎస్సీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కేదారేశ్వరరావు లాంటి వారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 4,567 మంది ఉన్నారని, వీరికి ప్రస్తుతానికి కొంత న్యాయం జరిగినా, అది చాలా ఆలస్యమైందని ఉపాధ్యాయ సంఘాలు అభిప్రాయపడ్డాయి.
"ప్రభుత్వ ఉద్యోగం కోసం 25 ఏళ్లు ఎదురు చూడటమంటే అది ఒక జీవిత కాలం. డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థులందరికి అప్పుడే ఉద్యోగాలు వచ్చి ఉంటే వీరి జీవితాలు ఎంతో బాగుండేవి. ఆర్థికంగా నిలదోక్కుకోవడంతో పాటు ఇల్లు, కారు, కుటుంబం అన్నీ ఉండేవి. వాటితో పాటు సమాజంలో హోదా, గౌరవం దక్కేవి. ఇవే ప్రస్తుతం కేదారేశ్వరరావు లాంటి వారికి దూరమయ్యాయి. ఉద్యోగాలపై ఆధారపడిన వారికి వ్యవస్థలు న్యాయాన్ని ఆలస్యంగా అందిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనేదానికి కేదారేశ్వరరావు జీవితమే ఉదాహరణ." అని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ప్రతినిధి బుల్లబ్బాయి బీబీసీతో అన్నారు.
"రిటైర్మెంట్ వయసు దాటాక ఉద్యోగం వచ్చిన వారున్నారు"
డీఎస్సీ 1998 పరీక్ష రాసిన వారిలో 1958లో పుట్టిన వారు కూడా ఉన్నారు. అంటే 1960, ఆలోపు పుట్టిన తేదీ ఉన్నవారు డీఎస్సీ 1998 పరీక్ష రాసిన, ఇప్పుడు వారికి రిటైర్మెంట్ వయసు (62) దాటిపోయింది. కొందరైతే పోస్టింగులు వచ్చిన రెండు, మూడు నెలలకే రిటైర్ అవ్వాల్సిన వయసుసులో ఉన్నారు. ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం కంటే టీచర్ ఉద్యోగమే మంచిదని అనుకునే వారు చాలా మందే ఉన్నారు. వారిలో పార్వతీపురానికి చెందిన జి. భాస్కరరావు ఒకరు. ఈయనకు కూలీగా పని చేస్తూ ఇన్ఫెక్షన్ సోకడంతో రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఈయన మక్కువ గ్రామంలోని గ్రామీణ బ్యాంకుకు వచ్చే వారికి బ్యాంక్ స్లిప్పులు నింపడంలో సహాయం చేస్తూ.. వారిచ్చే కొద్దిపాటి సొమ్ముతో జీవితం గడుపుతున్నారు.
డీఎస్సీ 1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల జాబితాలో కర్నూలు జిల్లా వాసి అయిన 55 ఏళ్ల బి. నాగరాజు ఉన్నారు. ఆయన కూలి పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి.

ఫొటో సోర్స్, BBC/Lakkoju srinivas
1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల్లో అనకాపల్లి జిల్లా చోడవరం ప్రస్తుత ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ(వైసీపీ) కూడా ఉన్నారు.
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ధర్మశ్రీ 1998లో పరీక్ష రాసిన 24 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఆయన 2004, 2019లలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
"ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని అనుకునేవాడిని. డీఎస్సీ-1998 రాసే సమయానికే రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. కానీ, అప్పట్లో ఉద్యోగం వచ్చుంటే వస్తే ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగేవాడిని" అని ధర్మశ్రీ తెలిపారు.
డీఎస్సీ-1998 వివాదమేంటి?
1998లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డీఎస్సీ-1998 నోటిఫికేషన్ జారీచేసింది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి 1994లో విడుదల చేసిన జీవో 221 ప్రకారం రిజర్వేషన్ల వారీగా కటాఫ్ మార్కులను నిర్ణయించింది. ఓసీలకు 50 మార్కులను, బీసీలకు 45 మార్కులను, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు 40 మార్కులను కటాఫ్‌గా ప్రకటిస్తూ మార్గదర్శకాలు ఇచ్చింది.
అయితే కొన్ని విభాగాల్లో కటాఫ్ మార్కులు సాధించిన అభ్యర్థులు లేకపోవడంతో ఓసీలకు 45 మార్కులను, బీసీలకు 40 మార్కులను, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు 35 మార్కులను కటాఫ్‌గా నిర్ణయిస్తూ ప్రభుత్వం 1998లో జీవో 618 జారీ చేసింది.
అదే సమయంలో అప్పటి అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలు రావడంతో కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది.
మొదట 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులందరికీ ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత 618 జీవో ప్రకారం తక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తాయని అభ్యర్థులు భావించారు. అయితే ఎక్కువ కటాఫ్, తక్కువ కటాఫ్ ఉన్న రెండు రకాల అభ్యర్థులను ఒకేసారి ఇంటర్వ్యూలకు పిలిచారు.
సాంకేతిక కారణాల వల్ల 221 జీవో ప్రకారం ఎక్కువ కటాఫ్ మార్కులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు రాలేదు. దీంతో వీరంతా అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.
దాదాపు 11 ఏళ్ల పాటు విచారణ జరిగిన తర్వాత.. నష్టపోయిన అభ్యర్థులందరికీ ఉద్యోగాలివ్వాలని ట్రైబ్యునల్ ఆదేశించింది. ఆ తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పును సమర్థించాయి.
డీఎస్సీ-1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలిస్తామని ముఖ్యమంత్రి జగన్ 2019 ఎన్నికలకు ముందు తన పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారికి పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి:
- నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














