ఆపరేషన్ టైగర్: అసిఫాబాద్ నుంచి పెద్దపులి ఎలా తప్పించుకుంది? ఇప్పుడు అది ఎక్కడికి వెళ్లింది? - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, AP FOREST DEPARTMENT
తెలంగాణలో ఓ పెద్ద పులిని బంధించేందుకు వారం రోజులుగా చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడంలేదని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
రెండు నెలలుగా అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్న ఏ2(మగ) పులి ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని తాడోబా అభయారణ్యానికి జారుకున్నట్లుగా పాదముద్రల ఆధారంగా గుర్తించారు. ఈ క్రమంలో ‘ఆపరేషన్ ఏ2’ కు తాత్కాలిక విరామం ఇచ్చారు. బెబ్బులిని బంధించేందుకు మహారాష్ట్ర నుంచి వచ్చిన అటవీ అధికారులు తిరిగి వెళ్లిపోయారు.
ఆసిఫాబాద్ బెజ్జూర్ మండలంలోని కందిభీమన్న అటవీ ప్రాంతంలో అధికారులు ఉంచిన ఎరను 11న తిన్న పులిని బంధించేందుకు సమీపంలోనే మంచెను ఏర్పాటుచేశారు. రాత్రి సమయంలో పులి ఇక్కడికి రెండుసార్లు వచ్చి మిగిలిన మాంసాన్ని తిన్నప్పటికీ ఈ వేళల్లో మత్తుమందు ప్రయోగించడానికి వీలుకాకపోవడం పులికి కలిసొచ్చింది.
ప్రశాంతంగా ఉండే అడవిలో మంచెలు కనిపించడం, సిబ్బంది సంచారంతో ఏర్పడిన శబ్దాలతో ప్రమాదం పసిగట్టిన పులి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14 నుంచి పులి కదలికల ఆచూకీ లభించలేదు. కందిభీమన్న అటవీ ప్రాంతానికి అయిదు కిలోమీటర్ల దూరంలో, నందిగాం పక్కనే ప్రాణహిత నదిని దాటి తాడోబా అభయారణ్యానికి పులి వెళ్లినట్లుగా సిబ్బంది గుర్తించారు. బెజ్జూరు మండలంలో రెండు ఆడపులులు తిరుగుతున్నందున వాటికోసం అది మళ్లీ వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫోన్ కొనివ్వలేదని.. విద్యార్థిని ఆత్మహత్య
ఆన్‌లైన్ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్ కావాలని అడగగా, తల్లిదండ్రులు కొనివ్వలేదనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
శీల వెంకన్న, మంజుల దంపతుల కుమార్తె సింధూజ 9వ తరగతి చదువుతోంది. స్మార్ట్‌ఫోన్ లేకపోవడంతో పాఠాలకు దూరమైంది.
ఈ క్రమంలో సెల్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతూ వస్తోంది. అయితే వారు ఫోన్ కొనివ్వకపోవడంతో మనస్తాపం చెంది ఆదివారం ఇంటి పరిసరాల్లోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఫొటో సోర్స్, Facebook/Mustafakhan
పద్మవిభూషణ్ గులాం ముస్తఫా ఖాన్ కన్నుమూత
ప్రముఖ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్ గులాం ముస్తఫా ఖాన్ (89) మరణించాని వెలుగు ఓ కథనం ప్రచురించింది.
ముంబయిలోని తన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన అస్వస్థతకు గురయ్యారు. నర్సు వచ్చి సపర్యలు చేస్తుండగా ఒక్కసారిగా వాంతులు చేసుకుని కుప్పకూలిపోయారు.
కుటుంబ సభ్యులు హుటాహుటిన వైద్యులను పిలిపించేలోపు ఆయన తుదిశ్వాస విడిచారు. వయోభారంతో ఉన్న ఆయనకు వైద్యులు నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. వైద్యుల పర్యవేక్షణలో నర్సులు ముస్తఫాఖాన్ ఇంట్లోనే 24 గంటలు ఉంటూ నిరంతరం చూసుకుంటున్నారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని బదౌన్‌లో 1931 మార్చి 3వ తేదీన ఆయన జన్మించారు. 2019లో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.
రామ్ పూర్ ఘరానాకు చెందిన ఆయన్ను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

ఫొటో సోర్స్, Getty Images
కల్తీ మద్యం తాగి ఐదు ఆవులు మృతి
మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి పాతికమందికిపైగా మృతి చెందిన అనంతరం ఇప్పుడు అదే కల్తీ మద్యం తాగి ఐదు ఆవులు మృతి చెందాయని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
ఈ ఉదంతం భోపాల్‌కు 405 కిలోమీటర్ల దూరంలోని దాతియా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా అధికారి ఒకరు ఈ విషయాన్ని తెలియజేస్తూ, ఈ ఉదంతంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారన్నారు.
ఈ ఉదంతంపై పశువైద్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ జీ దాస్ మాట్లాడుతూ జిల్లాలోని ఇంద్రగడ్ పరిధిలోని కంజర్ బస్తీలో పోలీసులు, కస్టమ్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు.
ఈ నేపధ్యంలోనే కల్తీ మద్యం తాగి 20 ఆవులు అనారోగ్యం బారిన పడ్డాయని గుర్తించారు. వాటిలో ఐదు ఆవులు మృతి చెందాయి. 15 ఆవులకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారన్నారు.
అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్తీ మద్యం తాగి 9 ఆవులు మృతి చెందాయి. దాతియాలోని గో సంవర్థన్ బోర్డు ఉపాధ్యక్షులు శిశుపాల్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ స్థానికంగా 9 ఆవులు మృతి చెందినప్పటికీ, ప్రభుత్వ అధికారులు ఈ వ్యవహారాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆవులు మృతి చెందాయన్నారు. కల్తీ మద్యాన్ని కాలువల్లో పోయడంతో ఆ నీటిని తాగిన ఆవులు ప్రాణాలు కోల్పోయాయన్నారు.
ఇవి కూడా చదవండి:
- బాల్య వివాహాలు నేరం అయినప్పుడు, బాల్యంలో జరిగిన పెళ్లిళ్లు అక్రమం ఎందుకు కాదు
- రజిని చాండీ: 'సెక్సీ ఫొటోలు' షేర్ చేస్తారా అంటూ 69 ఏళ్ల సినీ నటిని ట్రోల్ చేస్తున్నారు
- సెక్స్ అపోహలు: లైంగిక భాగస్వాములు ఎవరికి ఎక్కువగా ఉంటారు... పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- వీకే విస్మయ: ఇంజినీర్ కావాలనుకున్న ఈమె, ఇప్పుడు టోక్యో ఒలింపిక్ పతకంపై గురిపెట్టారు
- బ్రాహ్మణాబాద్: పాకిస్తాన్‌లోని ఈ నగరాన్ని ఒకప్పుడు హిందూ రాజులు పాలించారా
- K2: చలికాలంలో కే2 పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించిన నేపాలీలు
- జంతువులతో సెక్స్: తప్పు ఎక్కడుంది?
- మాట వినకపోతే గాడిదలతో రేప్ చేయించేవారు!
- కరోనావైరస్ వ్యాక్సీన్: భారత్‌లో మొదటి రోజు 1.91 లక్షల మందికి కోవిడ్ టీకాలు
- అమెరికా: జో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎలా జరుగుతుంది?
- 'నో' అని చెబుతూనే నొప్పించకుండా మెప్పించడం ఎలా?
- కోవిన్ (Co-Win) యాప్: దీన్ని ఎవరెవరు ఉపయోగించుకోవచ్చు? వ్యాక్సీన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
- ట్రంప్ అభిశంసన: బైడెన్ మీద, అమెరికా మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది?
- సూర్యుడ్ని కోల్పోయిన బీచ్.. ఇక్కడ పట్టపగలైనా చలి, చీకటే...
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








