అడాల్ఫ్ హిట్లర్ వాచీ: రూ.30 కోట్లకు పైగా అమ్ముడవుతుందని అంచనా వేస్తే 9 కోట్లు కూడా రాలేదు.. వేలంపైనా వివాదం

హిట్లర్‌

ఫొటో సోర్స్, ALEXANDER HISTORICAL AUCTIONS

ఫొటో క్యాప్షన్, ఈ వాచీ 1933లో హిట్లర్‌కు అంది ఉండవచ్చని భావిస్తున్నారు

హిట్లర్‌కు చెందినదని చెబుతున్న ఒక వాచీ అమెరికాలో జరిగిన వేలంలో 1.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 8.7 కోట్లు) అమ్ముడుపోయింది.

ఈ హుబర్ వాచీపై స్వస్తిక గుర్తు, ఏహెచ్ (AH) అనే అక్షరాలు చెక్కి ఉన్నాయి.

ఈ వాచీని మేరీల్యాండ్‌లోని అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్‌ సంస్థ అమ్మకానికి పెట్టే ముందు యూదు నాయకులు ఈ వేలాన్ని ఖండించారు.

గతంలో కూడా ఈ సంస్థ నాజీ స్మారక చిహ్నాలను విక్రయించింది. తాజా విమర్శల నడుమ, చరిత్రను కాపాడడమే తమ లక్ష్యమని అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్‌ జర్మన్ మీడియాకు తెలిపింది.

అడాల్ఫ్ హిట్లర్ 1933-1945 మధ్య నాజీ జర్మనీకి నాయకత్వం వహించారు. దాదాపు 1.1 కోటి మందిని హత్య చేయించారు. వీరిలో 60 లక్షల మంచి యూదులే.

ప్రస్తుతం వేలంలో అమ్ముడైన వాచీ బహుసా 1933లో హిట్లర్‌కు పుట్టినరోజు కానుకగా అంది ఉండవచ్చని క్యాటలాగ్‌లో రాశారు. అదే ఏడాది హిట్లర్ జర్మనీ ఛాన్సలర్ అయ్యారు.

1945 మేలో హిట్లర్ తలదాచుకున్న బెర్‌గాఫ్‌పై సుమారు 30 మంది ఫ్రెంచ్ సైనికులు దాడి చేసినప్పుడు, ఈ గడియారాన్ని సంగ్రహించి ఉంటారని వేలం సంస్థ అంచనా వేసింది. అప్పటి నుంచి ఈ వాచీ అనేక చేతులు మారి ఉండవచ్చునని ఊహ.

హిట్లర్‌

ఫొటో సోర్స్, ALEXANDER HISTORICAL AUCTIONS

ఈ వేలంలో హిట్ల భార్య ఎవా బ్రాన్ దుస్తులు, నాజీ అధికారుల ఆటోగ్రాఫ్‌లతో ఉన్న చిత్రాలు, పసుపు గుడ్డతో చేసిన జూడాయిజం గుర్తు 'స్టార్ ఆఫ్ డేవిడ్' కూడా విక్రయించారు.

హోలోకాస్ట్ సమయంలో నాజీలు ఆ పసుపు గుర్తులు ధరించమని యూదులను బలవంతపెట్టేవారు. అవి ధరించిన వారిని యూదులుగా గుర్తించడం సులభమని వారి ఉద్దేశం.

ఈ వేలం "అసహ్యమని", నాజీల వస్తువులను విక్రయించకూడదని కోరుతూ 34 మంది యూదు నేతలు ఒక బహిరంగ లేఖ రాశారు.

"నాజీ పార్టీని ఆదర్శంగా తీసుకునే వారికి సహాయం అవసరం. చరిత్ర పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాజీల గుర్తులు మ్యూజియంలలో లేదా పాఠశాల గదుల్లో ఉండాలి. వేలంలో కాదు" అని యూరోపియన్ జ్యూయిష్ అసోసియేషన్ ఛైర్మన్ రబ్బీ మెనాచెమ్ మార్గోలిన్ అన్నారు.

అయితే, తాము విక్రయించే వస్తువులను కొన్నవారు వ్యక్తిగత వస్తు సేకరణలో భాగంగా తమ వద్దే ఉంచుకుంటారు లేదా హోలోకాస్ట్ మ్యూజియంకు డొనేట్ చేస్తారని అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్థ తెలిపింది.

"చరిత్ర మంచిదయినా, చెడ్డదయినా దాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. చరిత్రను నాశనం చేస్తే అది జరిగింది అని తెలుసుకునే రుజువులు మాయమైపోతాయి" అని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మిండీ గ్రీన్‌స్టెయిన్, మీడియా సంస్థ డోయిషే వెల్లేతో అన్నారు.

అయితే, ఈ వాచీని హిట్లర్ కచ్చితంగా ధరించారన్న దానికి ఆధారాలు తమ వద్ద లేవని వేలం పత్రాల్లో పేర్కొన్నారు.

ఎలా చూసినా ఈ వాచీ హిట్లర్‌దే అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక స్వతంత్ర నిపుణుడు ధృవీకరించారు.

ఈ వాచీ 2 నుంచి 4 మిలియన్ డాలర్ల వరకు అమ్ముడవుతుందని వేలం సంస్థ అంచనా వేసింది. కానీ అంతకన్నా తక్కువకు అమ్ముడైందని డోయిషే వెల్లే తెలిపింది.

వీడియో క్యాప్షన్, ఫిడెల్ క్యాస్ట్రో, చేగువేరా క్యూబా విప్లవాన్ని 81 మంది ఫైటర్లతో ఎలా ప్రారంభించారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)