క్విట్ ఇండియా: ఈ నినాదం ఎలా పుట్టింది... ఈ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన యోధులెవ్వరు?

క్విట్ ఇండియా ఉద్యమం

ఫొటో సోర్స్, MAHARASHTRA RAJYA SAHITYA SANSKRUTI MANDAL

ఫొటో క్యాప్షన్, క్విట్ ఇండియా ఉద్యమం
    • రచయిత, నామ్‌దేవ్ కాట్కర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అది 1942 ఆగస్ట్ 8, ఆ రోజు సాయంత్రం ముంబయిలోని గోవాలియా టేంక్ మైదానంలో లక్షలాది మంది చేరారు. స్వతంత్ర కాంక్షతో ఉన్న భారతీయులతో ఆ మైదానం నిండిపోయింది.

వారి ముందు 73 ఏళ్ల వృద్ధుడు నిలబడి ఉన్నారు. ఆయన చెబుతున్న మాటలను ప్రజలంతా చెవులు రిక్కించి వింటున్నారు. ఆయన తన పిడికిలి బిగించి 'కరో యా మరో '( సాధించండి లేదా చనిపోండి- Do or Die) అంటూ బిగ్గరగా అరిచారు.

ఈ మాటే భారత్‌లో బ్రిటన్ సామ్రాజ్య పతనానికి నాంది పలికింది. ఆయన ఇచ్చిన నినాదం 'క్విట్ ఇండియా'. ఈ నినాదం ఇచ్చిన వృద్ధుడు మరెవరో కాదు. మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ.

గాంధీ నోటి నుంచి వెలువడిన ఆ నినాదం అక్కడున్న లక్షలాది మందిలో కరెంట్ పుట్టించింది. బ్రిటిష్ సామ్రాజ్య వ్యతిరేక నినాదాలతో ఆ రోజు బొంబాయి హోరెత్తిపోయింది. క్విట్ ఇండియా నినాదం నలుదిక్కులా ప్రతిధ్వనించింది. ఆనాటి సాయంత్రం సూర్యుడు అస్తమిస్తూ స్వాతంత్ర్యాన్ని స్వప్నించాడు.

భారత స్వతంత్రానికి కొద్ది సంవత్సరాలు ముందు ప్రారంభమైన అతి పెద్ద ఉద్యమం 'క్విట్ ఇండియా' ఉద్యమం. దేశవ్యాప్తంగా లక్షలమంది ఈ ఉద్యమంలో పాలుపంచుకున్నారు. ఉద్యమకారులను బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తుండడంతో దేశంలోని జైళ్లన్నీ నిండిపోయాయి.

బ్రిటిష్ ప్రభుత్వాన్ని హడలెత్తిస్తూ, భారత ప్రజల్లో స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించిన ఈ ఉద్యమం నాటి ఘటనలు, ఈ ఉద్యమంలో పాలుపంచుకున్న కీలక నేతల గురించి ఈ కథలో చెప్పుకుందాం. దానికన్నా ముందు అసలు 'క్విట్ ఇండియా' నినాదం ఎలా పుట్టిందో చూద్దాం..

nehru, gandhi

ఫొటో సోర్స్, Getty Images

క్విట్ ఇండియా కథ..

1942 జులై 14న వార్ధాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. బ్రిటిష్ పాలకులు ఇండియాను ప్రజలకు అప్పగించాలని ఆ సమావేశం తీర్మానించింది. అక్కడికి నెల రోజుల్లోనే ఆగస్ట్ 7న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ బొంబాయిలో మళ్లీ సమావేశమైంది. ఆగస్ట్ 8న క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆ సమావేశంలో ఆమోదించారు.

తీర్మాన ప్రతిపాదననే ఆ రోజు సాయంత్రం గోవాలియా మైదానంలో నిర్వహించిన సభలో గాంధీ ప్రకటించారు.

సాయంత్రం 6 గంటలకు మొదలైన ఆనాటి సభ రాత్రి 10 గంటల వరకు సాగింది. ప్రధానంగా నలుగురు వ్యక్తులు మాట్లాడారు. తొలుత అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు మౌలానా అబుల్ కలామ్ అజాద్ ప్రసంగించారు. ఆయన తరువాత నెహ్రూ మాట్లాడుతూ తీర్మానం కాపీని చదివి వినిపించారు. తరువాత సర్దార్ పటేల్ ప్రసంగించి నెహ్రూ వినిపించిన తీర్మానాన్ని సమర్థించారు.

ఈ ముగ్గురి తరువాత గాంధీ ఉపన్యసించారు. మహాత్మా గాంధీ ఉపన్యాసం ఇంగ్లిష్‌లో సాగింది. ఆ ఉపన్యాసంలోనే ఆయన 'క్విట్ ఇండియా' నినాదమిచ్చారు.

వీడియో క్యాప్షన్, జలియన్‌వాలా బాగ్ వీడియో

ఆంగ్లేయులకు ఇచ్చిన ఈ చివరి హెచ్చరిక చాలా తీవ్రంగా ఉండాలని భావించారు. ఇందుకోసం మహాత్మా గాంధీ చాలామందిని సంప్రదించారు. అలా ఎంతోమంది నుంచి స్వీకరించిన ఆలోచనల్లో ఒకటే ఈ 'క్విట్ ఇండియా' నినాదం.

తొలుత ఎక్కువమంది నుంచి 'గెట్ అవుట్' అనే సూచన వచ్చింది. కానీ, ఇందులో కాస్త అహంకారం ధ్వనిస్తోందన్న ఉద్దేశంతో గాంధీ దాన్ని అంగీకరించలేదు. సర్దార్ పటేల్ కూడా 'రిట్రీట్ ఇండియా', 'విత్‌డ్రా ఇండియా' అనే నినాదాలు సూచించారు. కానీ, వాటికీ ఆమోదం లభించలేదు.

కాంగ్రెస్ సభ్యుడు యూసఫ్ మహర్ అలీ నుంచి ఈ 'క్విట్ ఇండియా' అనే సూచన రాగా గాంధీ వెంటనే తన అంగీకారం తెలిపారు. అంతకుముందు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు పాపులర్ అయిన 'సైమన్ గో బ్యాక్' నినాదం కూడా యూసఫ్ మహర్ అలీ ఇచ్చిందే. కాంగ్రెస్ పార్టీలోని సోషలిస్ట్ భావజాల నేతల్లో యూసఫ్ ఒకరు. క్విట్ ఇండియా నినాదం ఇచ్చేనాటికి యూసఫ్ బొంబాయి నగర మేయర్‌గా పని చేస్తున్నారు.

క్విట్ ఇండియా ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, క్విట్ ఇండియా ఉద్యమం

అరెస్టుల పర్వం..

ఈ 'క్విట్ ఇండియా' నినాదం ప్రజలకు నచ్చింది. దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఈ ఉద్యమంలోకి దిగారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తలపెట్టిన ఈ చివరి స్వాతంత్ర్య పోరాటం కోసం గాంధీ పూర్తిగా సిద్ధమయ్యారు. ప్రజల నుంచి మునుపెన్నడూ లేనంత స్పందన వచ్చింది. అంతకుముందెన్నడూ లేనంత సంఖ్యలో ప్రజలు ఉద్యమంలో పాలుపంచుకున్నారు.

ఉద్యమ తీవ్రత చూసిన బ్రిటిష్ ప్రభుత్వం నాయకులు, ఉద్యమకారులను అరెస్ట్ చేయడం మొదలుపెట్టింది. అందరికంటే ముందుగా గోవాలియా మైదానంలో ప్రసంగించిన నలుగురు నేతలు మౌలానా అబుల్ కలామ్ అజాద్, నెహ్రూ, పటేల్, గాంధీలను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన మరునాడే వారిని జైలులో పెట్టారు.

గాంధీని పుణెలోని అగాఖాన్ మహల్‌లో ఉంచగా మిగతా ముగ్గురినీ దేశంలోని వేర్వేరు జైళ్లలో ఉంచారు. కొందరు జైలుకు వెళ్లగా, మరికొందరు అండర్ గ్రౌండ్‌కు వెళ్లి పోరాటం కొనసాగించారు.

స్వాతంత్య్ర పోరాటంలో ఇలా అనేకమంది కార్యకర్తలు, ఉద్యమకారులు జైలుకు వెళ్లడం, అండర్‌గ్రౌండ్‌లో గడపడం వంటి ఘటనలు ప్రజల హృదయాన్ని కలచివేసేవి.

వాటిలో కొన్ని ఘటనలు ఆసక్తికరంగా కూడా ఉంటాయి.

quit india

ఫొటో సోర్స్, Getty Images

సేఠ్‌ జీ వేషం వేసిన సానె గురూజీ

మహాత్మా గాంధీ క్విట్ ఇండియా నినాదం ఇచ్చిన తర్వాత పాండురంగ సదాశివ్ సానే (సానే గురూజీ) ఖాందేష్‌లోని అమ్మల్నేర్‌లో ఉన్నారు. దేశంలోని చాలామంది సోషలిస్టులు అండర్ గ్రౌండ్‌లో ఉంటూ ఉద్యమంలో పాల్గొంటున్నారని ఆయన తెలుసుకున్నారు.

ఈ సమయంలో, సానే గురూజీ సతారా, ఖాందేష్ ప్రాంతాలకు వెళ్లి కార్యకర్తలతో రహస్య సమావేశాలు నిర్వహించి వారికి మార్గనిర్దేశం చేశారు. ముంబైలో, సానే గురూజీ అండర్ గ్రౌండ్‌కు వెళ్లి వంట పని వాళ్లతో కలిసి ఉన్నారు.

అండర్‌గ్రౌండ్‌కు వెళ్లిన ఉద్యమకారులు తాము ఉండే ప్రాంతాలకు కోడ్‌ భాషలో పేర్లు పెట్టుకున్నారు. సంత్వాడీ, హదాల్ హౌస్, మూషిక్ మహల్ వంటివి ఇలాంటి వాటిలో కొన్ని. అండర్ గ్రౌండ్‌లో ఉన్న వారిని కలవడానికి వెళ్లేటప్పుడు సానే గురూజీ రహస్య వేషం వేసేవారు.

ఒక్కోసారి వర్తకం చేసే సేఠ్‌‌లాగా దుస్తులు ధరించేవారు. కొన్నిసార్లు రైతు వేషంలో తిరిగే వారు. ఒకసారి జయప్రకాశ్ నారాయణ్‌కు భోజనం తీసుకెళ్లేందుకు ఆయన వైద్యుడి వేషం ధరించారు.

1943 ఏప్రిల్ 18 నాటికి సానే గురూజీ అండర్ గ్రౌండ్ కార్యకలాపాలు ముగిశాయి. ఆ రోజున పోలీసులు ఆయన్ను మూషిక్ మహల్ లో అరెస్టు చేశారు. ఆయనతో పాటు శ్రీ భావు లిమాయే, ఎన్‌జీ గోరే సహా మరో 14 మంది కార్యకర్తలను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుని ఎరవాడ జైలుకు తరలించింది.

ఇక్కడ కూడా సానే గురూజీ అప్పటికే జైలులో ఉన్న కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేశారు. తర్వాత ఆయన్ను ఎరవాడ నుంచి నాసిక్‌కు పంపించారు.

క్విట్ ఇండియా ఉద్యమం విజయవంతం అయిన తర్వాత, సానే గురూజీని ఆయన అభిమానులు, కార్యకర్తలు 46 ఎద్దుల బండ్లలో ఊరేగింపుతో జల్‌గావ్ పట్టణానికి తీసుకెళ్లారు.

సానే గురూజి

ఫొటో సోర్స్, SADHANA SAPTAHIK

ఫొటో క్యాప్షన్, సానే గురూజి

గాంధీని కలవడానికి ప్రాణాలు లెక్క చేయని అరుణా అసఫ్ అలీ

అరుణా అసఫ్ అలీ 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నారు. ఆమె అండర్ గ్రౌండ్‌లో ఉంటూ ఉద్యమం సాగించడాన్ని గాంధీ కూడా ఆపలేకపోయారు. గాంధీని కలిసేందుకు అరుణా అసఫ్ అలీ చూపిన సాహసం చరిత్రాత్మకం.

అరుణా అసఫ్ అలీ సోషలిస్టు భావజాలానికి చెందినవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సోషలిస్టు నాయకులందరినీ ఒక్కొక్కరుగా జైలుకు పంపుతున్నారు. ఈ పరిస్థితిలో బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పాలంటూ జయప్రకాశ్ నారాయణ్‌‌ను ఐస్ బ్లాక్‌పై పడుకోబెట్టారని వార్తలు వచ్చాయి.

ఈ వార్తతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అరుణా అసఫ్ అలీ..ప్రభుత్వంపై యుద్ధానికి ఏం చేయడానికైనా సిద్ధపడ్డారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ యువతను ఉద్యమంలో పాల్గొనేలా చైతన్యపరిచారు. ఆరోగ్యం క్షీణిస్తూన్న దశలోనూ అండర్‌గ్రౌండ్‌లో ఉంటూ ఉద్యమించారామె.

అరుణ ఆరోగ్యంపై ఆందోళన చెందిన గాంధీ, తనను కలవాల్సిందిగా ఆమెను కోరారు. ఆయనతో సమావేశం బాధ్యతను పీజీ ప్రధాన్‌కు అప్పగించారు.

గాంధీ పూణేలోని పార్సీ ఆసుపత్రి వెనుక ఒక గుడిసెలో నివసించేవారు. ఆ గుడిసె క్షయ ఆసుపత్రిలో భాగం కావడంతో ఇక్కడ పెద్దగా పోలీసులు ఉండేవారు కాదు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని అరుణ ఇక్కడకి చేరుకున్నారు.

వీడియో క్యాప్షన్, భారత స్వాతంత్ర్యోద్యమానికి.. జపాన్‌లోని ఈ పసందైన వంటకానికి సంబంధం ఏంటో తెలుసా?

ఒక పార్సీ స్త్రీ వేషంలో ఆమె అక్కడికి వచ్చారు. కపాడియా అనే కోడ్‌వర్డ్ చెబితే గాంధీ ఆమెను గుర్తించేలా ఏర్పాటు చేశారు.

అరుణను చూసిన గాంధీ, దూకుడును ఆపి పోలీసులకు లొంగిపోవాలని అభ్యర్థించారు. అయితే, అరుణ, "నేను మిమ్మల్ని చాలా గౌరవిస్తాను. కానీ మా అభిప్రాయాలు, మీ అభిప్రాయాలు ఒకేలా లేవు. నేను విప్లవకారిణిని. విప్లవకారిణిలాగే వ్యవహరిస్తాను. మీకు ఇష్టమైతే నన్ను ఆశీర్వదించండి" అని అన్నారు.

మీ సిద్ధాంతాలు, మా సిద్ధాంతాలు వేరువేరంటూ గాంధీకి ధైర్యంగా చెప్పేశారు అరుణ. తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా గాంధీతో సమావేశానికి వెళ్లారామె. బ్రిటీష్ వారికి ఎంతకీ చిక్కకపోవడంతో చివరకు ఆమెను పట్టించిన వారికి రూ.5వేలు బహుమతిగా ప్రకటించారు.

ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తర్వాత స్వాతంత్య్ర ఉద్యమంలో ఆ స్థాయి ఉద్యమకారిణి అరుణా అసఫ్ అలీ అని యూసుఫ్ మహర్ అలీ చెప్పారు.

గాంధీతో అరుణా అసఫ్ అలీ

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST

ఫొటో క్యాప్షన్, గాంధీతో అరుణా అసఫ్ అలీ

పెళ్లయిన రెండు నెలలకే జైలుకు యశ్వంత్‌రావు

మహారాష్ట్ర తొలి ముఖ్యమంత్రి యశ్వంత్ రావ్ చవాన్ 1942లో స్వాతంత్య్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. క్విట్ ఇండియా నినాదం వచ్చిన వెంటనే ఉద్యమంలోకి దూకారు. ఉద్యమంలో చురుగ్గా పని చేసినందుకు పెళ్లయిన రెండు నెలలకే జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

యశ్వంతరావును పెళ్లాడిన వేణుతాయ్, తాను విప్లవకారుడిని మాత్రమే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. ఆమె 1942 జూన్ 2న యశ్వంత్ రావుని వివాహం చేసుకున్నారు. పెళ్లయిన తొలినాళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చినా ఆమె భయపడలేదు.

ఉద్యమంలో యశ్వంత్ రావు యాక్టివ్‌గా ఉండటంతో భార్య వేణుతాయ్‌ని కూడా అరెస్టు చేశారు. అవి సంక్రాంతి పండుగ రోజులు. పెళ్లయ్యాక తొలి సంక్రాంతికి తన వల్లే తన భార్య జైలుకు వెళ్లాల్సి వచ్చిందని యశ్వంత్‌రావు తరచూ బాధపడేవారు. అయితే వేణుతాయ్ ఈ పరిస్థితులన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు.

అరుణా అసఫ్ అలీ (ఎడమ)

ఫొటో సోర్స్, NATIONAL BOOK TRUST

ఫొటో క్యాప్షన్, అరుణా అసఫ్ అలీ (ఎడమ)

గాంధీ సహచరుడు మహదేవ్ దేశాయ్ మృతి

మహదేవ్ దేశాయ్ 1917 నుంచి మహాత్మా గాంధీతో కలిసి పనిచేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి చనిపోయే వరకు అంటే 25 ఏళ్ల పాటు గాంధీకి తోడుగా, నీడగా నిలిచారు. గాంధీ కోసం ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. కార్యదర్శి, రచయిత, అనువాదకుడు, సలహాదారు, సంభాషణకర్త...ఇలా ఎన్నో. గాంధీకి భోజనం కూడా ఆయనే వండిపెట్టేవారు.

మహదేవ్ దేశాయ్ వండిన కిచిడీ అంటే గాంధీకి ఎంతో ఇష్టమని మహాత్మాగాంధీపై పుస్తకం రాసిన రామచంద్ర గుహ అన్నారు.

క్విట్ ఇండియా నినాదాన్ని ప్రారంభించినందుకు గాంధీని అరెస్టు చేసి పూణేలోని ఆగాఖాన్ ప్యాలెస్‌లో ఉంచారు. కస్తూర్బా గాంధీ, మహదేవ్ దేశాయ్‌లను కూడా నిర్బంధంలో ఉంచారు. అదే సమయంలో మహాదేవ్ దేశాయ్ 1942 ఆగస్టు 15న గుండెపోటుతో మరణించారు. అప్పుడాయనకు 50 ఏళ్లు.

మహదేవ్ దేశాయ్ మరణంతో మహాత్మా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్వాతంత్య్రానికి ముందు జరుగుతున్న అతి పెద్ద ఉద్యమంలో గాంధీకి మహదేవ్ దేశాయ్ తోడు లేదు. మహాదేవ్ దేశాయ్ మరణానంతరం గాంధీజీ ఆయన్ను పదే పదే స్మరించుకునేవారని రామచంద్ర గుహ రాశారు.

హిందువులు, ముస్లింల మధ్య సంఘీభావం కోసం గాంధీ దేశంలో పర్యటిస్తున్నప్పుడు, తన పెద్ద మేనకోడలు మనుతో "మహాదేవ్‌ను నేను ఇప్పుడు చాలా మిస్ అవుతున్నాను, అతను అక్కడ ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదు" అని గాంధీ అన్నారు. 1942 ఉద్యమంలో మహదేవ్ మరణం గాంధీకి పూడ్చలేని లోటుగా మారింది.

యశ్వంత్ రావ్ చవాన్

ఫొటో సోర్స్, TED WEST / GETTY

ఫొటో క్యాప్షన్, యశ్వంత్ రావ్ చవాన్

ఉద్యమంలో కనకలత, కాశీబాయి హన్వార్

సాధన పత్రిక 1997 సంచికలో భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళల పాత్ర గురించి రోహిణి గవాంకర్ వివరంగా రాశారు. క్విట్ ఇండియా ఉద్యమంలో మహిళల పాత్రను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అస్సాంకు చెందిన 16 ఏళ్ల బాలిక కనక్‌లతా బారువా ధైర్యసాహసాలు అజరామరంగా నిలిచాయి. ఆమె 1942 క్విట్ ఇండియా ఉద్యమంలోకి దూకారు. జెండా వందనం చేసేందుకు పోలీసు స్టేషన్ వెలుపల యువకులను గుమిగూడారు. కనక్‌లతా బారువా పోలీస్ స్టేషన్ బయట ప్రసంగించారు.

జెండా ఎగురవేయడానికి కొద్దిసేపటి ముందు పోలీసులు అక్కడ చేరిన యువకులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కనక్‌లతా బారువా మరణించారు. ‘‘స్వాతంత్ర్యం కోసం మరణించిన తొలి యువతి కనక్‌లతా బారువా’’ అని గవాంకర్ రాశారు

గాంధీతో మహదేవ్ దేశాయ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాంధీతో మహదేవ్ దేశాయ్

ఉద్యమ సమయంలో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు ఉషా మెహతా అండర్ గ్రౌండ్‌లో ఉంటూ రేడియో స్టేషన్ నడిపారు. 1942 నాటికి ఉషా మెహతా కాలేజీలో చదువుతున్నారు. అలాగే ఆమె బొంబాయిలో రేడియో స్టేషన్‌ను నడిపేవారు. ఈ రేడియోలో ఆమె రెండో ప్రపంచయుద్ధానికి సంబంధించిన విశేషాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాల గురించిన సమాచారం అందించేవారు.

పోలీసుల నుంచి తప్పించుకోవడాికి రేడియో స్టేషన్‌ను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మార్చాల్సి వచ్చేది. ఎలాగైనా ఈ స్టేషన్‌ని స్వాధీనం చేసుకోవాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారం ఆధారంగా, ఆమె రేడియోలో వార్తలు చదువుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.

గవాంకర్ ప్రస్తావించిన మరో మహిళ కాశీబాయి హన్వార్. నానా పాటిల్ ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ ప్రభుత్వంలో పని చేసిన మహిళలు సతారా జిల్లాలో బ్రిటీష్ వారి నుంచి తీవ్ర హింసను ఎదుర్కోవాల్సి వచ్చింది.

కాశీబాయి హన్వార్ అనే మహిళ జననేంద్రియాలలో పోలీసులు కారంపొడి వేశారు. పోలీసుల నుంచి హింసను, అవమానాలను ఎదుర్కొన్నా, ఒక్క కార్యకర్త పేరును కూడా పోలీసులకు చెప్పలేదామె.

వీడియో క్యాప్షన్, చరిత్రలో చోటు దక్కని స్వాతంత్ర్య సమరయోధులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)