పాకిస్తాన్: గుజరాత్‌లోని జునాగఢ్‌ను తన రాజకీయ మ్యాప్‌లో చూపడం వల్ల ప్రయోజనం ఏమిటి?

ఫొటో సోర్స్, ANADOLU AGENCY / GETTY IMAGES
- రచయిత, ఉమర్ దరాజ్ నంగియానా
- హోదా, బీబీసీ ప్రతినిధి, లాహోర్
పాక్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ కొత్త రాజకీయ మ్యాప్ జారీ చేసింది. దానిని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఆవిష్కరించారు.
ఈ రాజకీయ మ్యాప్‌లో భారత పాలిత కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో చూపించారు. దీనికి (సమస్య) ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సిఫారసుల ప్రకారం పరిష్కారం జరగాలి అని రాశారు.
ఈ మ్యాప్‌లో గిల్గిత్ బాల్టిస్తాన్‌ను కూడా పాకిస్తాన్‌లో భాగంగా స్పష్టంగా చూపించారు.
ఇక విభజన అనంతరం దశాబ్దాలపాటు వివాదాస్పద అంశంగా ఉన్న మరో ప్రాంతం సర్ క్రీక్. పాకిస్తాన్ సింధ్ ప్రాంతం, భారత్‌లోని గుజరాత్ రాష్ట్రం మధ్యలో ఉన్న ఈ ప్రాంతం అరేబియా సముద్రంలో ఉంటుంది.
సర్ క్రీక్ ప్రాంతంలో ఏ సరిహద్దులు ఏ దేశంలోకి వస్తాయి అనే దానిపై విభజన జరిగినప్పటి నుంచీ వివాదం కొనసాగుతూనే ఉంది.
సర్ క్రీక్ ప్రాంతం పూర్తిగా తమ సరిహద్దుల లోపల ఉందని పాకిస్తాన్ అంటోంది. అయితే ఆ వాదనను భారత్ కొట్టిపారేస్తోంది. అందుకే ఇక్కడ రెండు దేశాలు అవతలి దేశానికి చెందిన మత్స్యకారుల పడవలను పట్టుకుంటూ ఉంటాయి.
పాకిస్తాన్ కొత్త రాజకీయ మ్యాప్‌లో ఈ వివాదిత ప్రాంతాన్ని, అంటే సర్ క్రీక్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించారు.
అదే మ్యాప్‌లో పాకిస్తాన్ గతంలో రాచరిక రాష్ట్రాలుగా ఉన్న జునాగఢ్, మానావ్‌దర్‌లను కూడా తమ దేశంలో భాగంగా చూపించింది.
ఈ ప్రాంతాలు ఇప్పుడు భారత్‌లోని గుజరాత్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి. వాటి సరిహద్దులు కూడా పాకిస్తాన్‌తో కలవవు.

ఫొటో సోర్స్, FACEBOOK: JUNAGADH STATE MUSLIM FEDERATION
జునాగఢ్ పాకిస్తాన్‌లో కొత్త ప్రాంతమా?
1948 తర్వాత నుంచి ఈ ప్రాంతం భారత్ దగ్గరే ఉంది. ఇక్కడ హిందువులకు పవిత్రమైన జ్యోతిర్లింగ క్షేత్రం సోమనాథ్ ఆలయం కూడా ఉంది.
పాకిస్తాన్ మాత్రం జునాగఢ్, మానావ్‌దర్ ఎప్పటికీ తమ దేశంలో భాగమే అంటోంది. భారత విభజన సమయంలో జునాగఢ్ రాజు దానిని పాకిస్తాన్‌లో విలీనం చేశాడని, కానీ భారత్ బలప్రయోగంతో ఆ ప్రాంతాన్ని ఆక్రమించిందని ఆరోపిస్తోంది.
ఇదే అంశంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి జాతీయ భద్రతా సలహాదారు ముయీద్ యూసుఫ్ బీబీసీతో మాట్లాడారు.
“జునాగఢ్ ఎప్పుడూ పాకిస్తాన్‌లో భాగంగానే ఉంది. కొత్త మ్యాప్‌లో పాకిస్తాన్ దానిని మా భాగం అని చూపించింది. మా పొజిషన్ స్పష్టంగా ఉందని చెప్పడమే దాని ఉద్దేశం” అన్నారు.
“మేం కొత్త ప్రాంతాలను మా మ్యాప్‌లో చూపించలేదు. ఈ ప్రాంతాన్ని భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమించింది. దానిపై ఎలాంటి వివాదం ఉండకూడదు. ఎందుకంటే అది ఎప్పటికీ పాకిస్తాన్‌లో భాగమే” అని యూసుఫ్ తెలిపారు.
“పాకిస్తాన్ ఇంతకు ముందు కూడా జునాగఢ్‌ను మ్యాప్‌లో చూపిస్తూ వస్తోంది. అయితే తర్వాత ఎందుకో పాక్ మ్యాప్ నుంచి దాన్ని తీసేశారు. మేం దానిని మళ్లీ మ్యాప్‌లో పెట్టాం. అంటే దాని లక్ష్యం మా ప్రాంతం గురించి పాకిస్తాన్ పొజిషన్ స్పష్టం చేయడమే” అన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో వాదనకు మ్యాప్ సరిపోతుందా?
కొత్త రాజకీయ మ్యాప్ చాలా మందిలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది.
ఒక మ్యాప్‌లో జునాగఢ్‌ను తమ దేశంలో భాగంగా చూపించినంత మాత్రాన అంతర్జాతీయ స్థాయిలో అది పాకిస్తాన్‌లో భాగం అయిపోతుందా? పాకిస్తాన్ లోపలి ప్రాంతాలను పాకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ నిర్ధరిస్తుంది.
ఇది రాజ్యాంగ అంశమే అయితే, పాకిస్తాన్ అధికారిక వాదనను వినిపించే విధంగా మ్యాప్ మీద ప్రస్తుత ప్రాంతాలను, సరిహద్దుల మార్పులను పార్లమెంటు ద్వారా చేయాల్సి ఉంటుంది.
కానీ, అంతర్జాతీయ చట్ట నిపుణులు అహ్మర్ బిలాల్ సూఫీ అలా చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు.
“రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ పాకిస్తాన్ స్థానిక చట్టాల్లో భాగం. కానీ, ఏదైనా దేశం, ఏదైనా ఒక ప్రాంతంపై అధికారం చెలాయించినా, లేదా మాదని వాదించినా అది అంతర్జాతీయ చట్టాల కిందికి వస్తుంది.
“ఆ వాదనను పార్లమెంటులో చట్టం చేయచ్చు. లేదంటే చట్టసవరణ ద్వారా కూడా చేయచ్చు. ఒక కోర్టు నిర్ణయం ద్వారా, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ ద్వారా కూడా చేయచ్చు. చట్టం లేదా చట్ట సవరణ చేశాక ఒక ప్రాంతంపై మనకు అధికారం ఉందని నిరూపించవచ్చు. గత ఏడాది కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ దానిని దేశంలో కలిపేసుకున్న భారత్‌ను దీనికి ఉదాహణగా తీసుకోవచ్చు” అన్నారు.

ఫొటో సోర్స్, GOV OF PAKISTAN
అధీనంలో లేనపుడు, మ్యాప్ వల్ల ఏం లాభం?
మ్యాప్ జారీ చేయడం అనేది ఎగ్జిక్యూటివ్ యాక్షన్ లేదా పాలనాపరమైన చర్య కింద వస్తుంది. చట్టపరంగా దానికి ప్రాధాన్యం ఉంటుంది అని బిలాల్ చెప్పారు.
దేశం తన పాలనాపరమైన చర్య ద్వారా ఏ ప్రాంతం మీదైనా తన అధికారం చెలాయించవచ్చని ఇది చెబుతుంది అని ఆయన చెప్పారు.
“ఈ మ్యాప్‌ను పాకిస్తాన్ సర్వేయర్ జనరల్ ధ్రువీకరణ, ముద్రతోపాటూ జారీ చేశారు. అందుకే దీనికి చట్టపరమైన గుర్తింపు ఉంటుంది” అని అహ్మర్ బిలాల్ సూఫీ అన్నారు.
జునాగఢ్‌పై వాదనలకు చట్టపరమైన ఆధారాలు ఉన్నాయా?
పాకిస్తాన్ దగ్గర విలీనానికి సంబంధించిన చట్టపరమైన పత్రాలు ఉన్నాయని అహ్మర్ బిలాల్ సూఫీ చెబుతున్నారు. వాటిపై జునాగఢ్ నవాబ్, పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా సంతకాలు చేశారని అంటున్నారు.
భారతదేశం జునాగఢ్‌ను చట్టవిరుద్ధంగా ఆక్రమించిన తరువాత, జునాగఢ్ నవాబు తన కుటుంబంతోపాటు కరాచీ వెళ్లిపోయారు. ఇప్పటికీ ఆయన జునాగఢ్ నవాబ్ అనే పదవిలో కొనసాగుతున్నారు.
జునాగఢ్‌కు ఒక ప్రధానమంత్రి లేదా సీనియర్ మంత్రి పదవిని ఒకదాన్ని ఏర్పాటు చేశారని అహ్మర్ బిలాల్ సూఫీ వెల్లడించారు.
"నవాబ్ కుటుంబం ఇప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వం నుండి రాజభరణం పొందుతోంది. అతని హోదా పాకిస్తాన్‌లోని జునాగఢ్ జిల్లాకు పాలకుడులాంటిది" అని సూఫీ అన్నారు.
బిలాల్ సూఫీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు జునాగఢ్‌ను పాకిస్థాన్ మ్యాప్‌లో చూపించడంలో ఉద్దేశం ఆ ప్రాంతంపై తన వాదనకు క్లియర్ చేసుకోవడమే.

ఫొటో సోర్స్, FACEBOOK: JUNAGADH STATE MUSLIM FEDERATION
అంతర్జాతీయ చట్టంలో జునాగఢ్ ఇప్పటికీ వివాదాస్పదమేనా?
జునాగఢ్ ఇప్పటికీ వివాదాస్పద ప్రాంతమేనని అహ్మర్ బిలాల్ సూఫీ అన్నారు. కొంతకాలం క్రితం ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో లేవనెత్తినప్పటికీ అది పరిష్కారం కాలేదు.
"జునాగఢ్‌ను భారతదేశం స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. పాకిస్తాన్‌లో చేరికకు సంబంధించిన పత్రాలను జునాగఢ్ నవాబ్ సవరించారు"
"జునాగఢ్ పాకిస్థాన్‌లో విలీనాన్ని తిరస్కరిస్తుంది. జునాగఢ్ తన ప్రాంతంగా భారతదేశం ప్రకటించుకోవడం అంతర్గత లేదా స్థానిక చట్టం'' అన్నారు అహ్మర్ బిలాల్.
భారతదేశానికి అనుకూలతలు ఏంటి?
పాకిస్థాన్ కొత్త పొలిటికల్ మ్యాప్ తయారు చేసినట్లు ప్రకటించాక, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
"భారత రాష్ట్రాలైన గుజరాత్, దాని కేంద్ర భూభాగం, కాశ్మీర్ లద్ధాఖ్‌లు తమవంటూ పాకిస్థాన్ ప్రకటించుకోవడం రాజకీయంగా పనికిమాలిన చర్య" అని పేర్కొంది.
"ఇటువంటి హాస్యాస్పదమైన వాదనలకు చట్టపరమైన హోదా లేదా అంతర్జాతీయ విశ్వసనీయత ఉండదు" అని విదేశాంగ శాఖ ప్రకటన పేర్కొంది.

కొత్త మ్యాప్‌తో పాకిస్తాన్‌కు ప్రయోజనాలేంటి?
ఈ మ్యాప్ ద్వారా పాకిస్థాన్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసినట్లవుతుంది. అంతర్జాతీయంగా దాని విలువ ఏంటన్నది తరవాత మాట. "మా కొత్త రాజకీయ ప్రణాళికను అమలు చేయడానికి ఇది తొలి మెట్టు. అంతర్జాతీయ స్థాయిలో దీనికి మద్దతు సంపాదించడం మా రెండో మెట్టు అవుతుంది" అని పాకిస్థాన్ ప్రధానమంత్రి జాతీయ భద్రతా సలహాదారు ముయీద్ యూసుఫ్ అన్నారు.
అయితే అంతర్జాతీయే స్థాయిలో వారు చేస్తున్న ప్రయత్నాలు ఏంటో ఇప్పుడే చెప్పలేమన్నారు బిలాల్ సూఫీ. పాకిస్తాన్ సర్వేయర్ జనరల్ అంతర్జాతీయంగా జారీ చేసిన మ్యాప్‌కే చట్టపరమైన ప్రాముఖ్యత ఉందన్నారాయన.
"ఎవరు అంగీకరించినా, అంగీకరించక పోయినా, వారి వాదనను వారు వినిపిస్తారు. దేశాల మధ్య ప్రాంతీయ వివాదాలపై చర్చలో పటాలు కీలక పాత్ర వహిస్తాయని సూఫీ అన్నారు.
భారత దేశానికి ఇప్పటికీ ఆ శక్తి ఉంది
''ఒక డాక్యుమెంటరీ కోణం నుండి చూస్తే జునాగఢ్‌ను భారతదేశం ఆక్రమించిందన్నది నిజం. ఇది చట్టవిరుద్ధం. జునాగఢ్‌వంటి రాచరిక రాష్ట్రాల సమస్యను పరిష్కరించడం వలస పాలకుల కర్తవ్యం'' అని రచయిత, చరిత్రకారుడు డాక్టర్ ముబారక్ అలీ అన్నారు.
"నవాబ్ ఎక్కడికి వెళ్ళినా, రాచరికం అక్కడికి వెళ్తుందనే సూత్రం కూడా ఉంది. కాని జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ రాచరిక రాష్ట్రాలను స్వాధీనం చేసుకుని భారతదేశం దానిని ఉల్లంఘించింది" అని ముబారక్ వ్యాఖ్యానించారు.
ఆచరణాత్మకంగా చూస్తే "భారతదేశానికి ఇంకా అధికారం ఉంది. ఇప్పటికీ శక్తి ఉంది. అధికారం ఉన్నవాడు విజేత. వారి మాటే నెగ్గుతుంది'' అని ముబారక్ అన్నారు. "జునాగఢ్‌ను పాకిస్థాన్ తన మ్యాప్‌లో చేర్చుకోవడం వల్ల దాని మనసు హాయిగా ఉంటుంది అంతే'' అన్నారు.
ఇవి కూడా చదవండి:
- చైనాలోని వీగర్ ముస్లింల సమస్యలపై ప్రపంచ దేశాలన్నీ ఎందుకు మౌనంగా ఉన్నాయి?
- హిందీ రాదంటే 'మీరు భారతీయులేనా' అని అడిగారు: కనిమొళి ట్వీట్‌తో కలకలం
- 'విమానం ల్యాండయ్యాక మళ్లీ గాల్లోకి లేచినట్లనిపించింది... అందరూ వణికిపోయారు'
- హిరోషిమా, నాగాసాకి: అణుబాంబు నేలను తాకినప్పుడు ఏం జరిగింది?
- అణ్వస్త్ర పరీక్ష ప్రపంచంలో తొలిసారి జరిగింది ఈ రోజే.. 75 ఏళ్ల నాటి ఆ ఘటన వివరాలివే...
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- కశ్మీర్: 'ప్రజాస్వామ్యం కొనఊపిరితో ఉంది. రాజకీయ ప్రక్రియ పూర్తిగా స్తంభించింది'
- అణుబాంబు వేయగల క్షిపణిని సబ్ మెరైన్ మీంచి ప్రయోగించిన ఉత్తర కొరియా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








