సయఫ్ అల్ అదల్: జవహిరి తర్వాత అల్‌ఖైదా నాయకుడు ఇతడేనా, ఇరాన్ గృహ నిర్బంధంలో ఉంటూ నాయకత్వ బాధ్యతలు సాధ్యమేనా

సయఫ్ అల్ అదల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సయఫ్ అల్ అదల్
    • రచయిత, మీనా అల్ లామీ
    • హోదా, బీబీసీ మానిటరింగ్

అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని ఆయన సొంత ఇంటిలోనే అల్‌ ఖైదా నాయకుడు అయ్‌మాన్ అల్ జవహిరిని ఒక డ్రోన్ దాడితో అమెరికా మట్టుపెట్టింది. దీంతో ఇప్పుడు అల్ ఖైదా పగ్గాలను ఎవరు చేపడతారని చర్చ జరుగుతోంది.

ఈజిప్టులో జన్మించిన సయఫ్ అల్ అదల్ ప్రస్తుతం అల్ ఖైదాకు నాయకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అల్ జవహిరికి నమ్మిన బంట్లుగా మారిన ఐదుగురు సీనియర్ నేతల్లో ప్రస్తుతం సయఫ్ అల్ అదల్ మాత్రమే బతికి ఉన్నాడు. దీంతో అతడే తర్వాతి అల్ ఖైదా నాయకుడని చాలా విశ్లేషణలు వస్తున్నాయి.

అయితే, ఇక్కడ ఒక సమస్య కూడా ఉంది.

ప్రస్తుతం ఇరాన్‌లో ఆంక్షల నడుమ అల్ అదల్ జీవిస్తున్నాడు. ఇరాన్‌ను అల్ ఖైదా బద్ధ శత్రువుగా భావించే సంగతి తెలిసిందే.

2001లో బిన్ లాడెన్‌తో అల్ జవహిరి

ఫొటో సోర్స్, Getty Images

సీనియర్ జిహాదీ

అల్ ఖైదా వ్యవస్థాపకుల్లో అల్ అదల్ కూడా ఒకడు. ఒసామా బిన్ లాడెన్‌కూ ఇతడు నమ్మిన బంటుగా ఉండేవాడు. ప్రస్తుతం జిహాదీ ఉద్యమం కోసం పనిచేస్తున్న సీనియర్ నేతల్లో ఇతడూ ఒకడు.

అల్ అదల్ కదలికలను కూడా అమెరికా ఒక కంట కనిపెడుతుంటుంది. ‘‘ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ టెర్రర్ లిస్టు’’లోనూ ఇతడు ఉన్నాడు. అదల్ ఆచూకీని చెబితే పది మిలియన్ డాలర్లు (రూ.79.43 కోట్లు) నజరానాగా అందిస్తామని అమెరికా ప్రకటించింది.

ఆగస్టు 1998లో టాంజానియా, కెన్యాలలోని అమెరికా దౌత్య కార్యాలయాలపై బాంబు దాడుల్లో ఇతడి ప్రమేయం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడుల్లో 220 మందికిపైగా మరణించారు.

అయితే, న్యూయార్క్, వాషింగ్టన్‌లలో 9/11 దాడులను వ్యతిరేకించిన వారిలో ఇతడు కూడా ఒకడని వార్తలు వచ్చాయి.

దీనిపై ఫిబ్రవరి 2021లో అమెరికా మిలిటరీ అకాడమీ పరిశోధకులు ఒక డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ‘‘అల్ అదల్‌తోపాటు కొందరు సీనియర్ అల్ ఖైదా నాయకులు ఆ దాడులను వ్యతిరేకించారు. ఎందుకంటే అమెరికా గడ్డపై అంత పెద్ద దాడులతో గట్టి ప్రతిస్పందన కూడా ఉంటుందని వారు భయపడ్డారు. అల్ ఖైదాకు ఆశ్రయమిస్తున్న అఫ్గానిస్తాన్‌ను అన్ని వైపుల నుంచి అమెరికా ముట్టడించొచ్చని వారు ముందుగానే హెచ్చరించారు’’అని ఆ డాక్యుమెంట్‌లో పేర్కొన్నారు.

సెక్యూరిటీ, ఇంటెలిజెన్స్, విప్లవం, యుద్ధం.. లాంటి భిన్న అంశాలపై అల్ అదల్ వ్యాసాలు రాస్తుంటాడు.

అల్ ఖైదా

ఫొటో సోర్స్, Getty Images

అమెరికా హెలికాప్టర్లు కూల్చేసి..

అల్ ఖైదాకు మునుపటి అల్ అదల్ జీవితంపై పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం.. 11 ఏప్రిల్ 1963లో లేదా అంతకంటే మూడేళ్ల ముందు అతడు జన్మించి ఉండొచ్చు.

అల్ ఖైదా సీనియర్ జిహాదీల్లో ఒకడిగా కొనసాగుతున్నప్పటికీ, అతడు మీడియా ముందుకు వచ్చేందుకు ఇష్టపడడు. సంస్థ ప్రకటనల్లోనూ ఇతడి సమాచారం దొరకదు.

సయఫ్ అల్ అదల్‌ అనే ఆయన పేరుకు అరబిక్‌లో న్యాయం కోసం పనిచేసే కత్తి అనే అర్థముంది. జిహాదీలోకి వచ్చిన తర్వాత ఈ పేరును అతడు పెట్టుకొని ఉండొచ్చు.

ఈజిప్టు స్పెషల్ ఫోర్సెస్ కల్నల్ మహమ్మద్ ఇబ్రహీం మక్కావీ, అల్ అదల్ ఒకరేనని కొందరు భ్రమపడుతుంటారని అమెరికా పరిశోధకుల పత్రంలో పేర్కొన్నారు.

1980ల్లో అఫ్గాన్‌లో సోవియట్ యూనియన్‌పై బిన్ లాడెన్‌తో కలిసి అల్ అదల్ కూడా పోరాడాడు. ఆ తర్వాత కాలంలో సోమాలియాకు వెళ్లిపోయాడు. అక్కడి అంతర్యుద్ధంలో అమెరికా జోక్యాన్ని వ్యతిరేకించే మిలిటెంట్లకు ఇతడు సాయం చేసేవాడు.

అప్పట్లో సోమాలియా రాజధాని మొగదిషులోని అమెరికాకు చెందిన రెండు ఎంహెచ్-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేతలోనూ ఇతడి ప్రమేయముందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై 2001లో హాలీవుడ్‌లో బ్లాక్ హాక్ డౌన్ పేరుతో బ్లాక్‌బస్టర్ సినిమా వచ్చింది.

అల్ అదల్ బృందంలోని ఒక ట్యునీషియా సభ్యుడు ఒక రాకెట్‌ను ఆ హెలికాప్టర్ల మీదకు ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి.

వీడియో క్యాప్షన్, సెప్టెంబర్ 11 దాడులు: నాలుగు విమానాలు, 102 నిమిషాలతో చరిత్ర గతినే మార్చిన ఉగ్రదాడి

1990లలో తాలిబాన్లు పట్టుకోసం ప్రయత్నిస్తున్నప్పుడు, మళ్లీ అల్ అదల్ అఫ్గానిస్తాన్‌కు తిరిగివచ్చాడు. అయితే, 2001లో దేశాన్ని అమెరికా ముట్టడించడంతో ఇక్కడి నుంచి మళ్లీ పరారయ్యాడు. అయితే, అమెరికా దాడుల నడుమ ఇరాన్ గుండా అల్ ఖైదా జిహాదీలను సురక్షిత స్థావరాలకు తరలించే ఆపరేషన్‌కు ఇతడు నేతృత్వం వహించాడు.

2003లో ఇతడిని ఇరాన్ అధికారులు అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే, 12ఏళ్ల తర్వాత ఖైదీల మార్పిడి ప్రక్రియలో భాగంగా కొందరు అల్ ఖైదా జిహాదీలను జైళ్ల నుంచి విడిచిపెట్టారు. అలా బయటకు వచ్చిన వారిలో అల్ అదల్ కూడా ఒకడని వార్తలు వచ్చాయి.

సుదీర్ఘ కాలం జైలులో గడిపినప్పటికీ, అల్ ఖైదాలో శక్తిమంతమైన నాయకుల్లో ఒకడిగా అల్ అదల్‌కు పేరుండేది. బిన్ లాడెన్‌ను అమెరికా మట్టుపెట్టిన తర్వాత సంస్థపై జవహిరికి పట్టు రావడంలో ఇతడు సాయం చేశాడు.

అయితే, ఇప్పుడు అల్ ఖైదా నాయకుడిగా అతడు పగ్గాలు చెపట్టడం కాస్త క్లిష్టమైన వ్యవహారమని అమెరికాకు చెందిన ఉగ్రవాద అంశాల నిపుణుడు కొలిన్ పీ క్లార్క్ అన్నారు. ‘‘ప్రస్తుతం అతడు ఇరాన్‌లో గృహ నిర్బంధంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఎలా నాయకత్వం వహించగలడు?’’అని ఆయన అన్నారు.

అల్ ఖైదాకు చెందిన మరో సీనియర్ జిహాదీ అబూ ముహమ్మద్ అల్ మసరీని 2020లో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోనే ఇజ్రాయెల్ కమాండోలు ఒక సీక్రెట్ ఆపరేషన్‌లో మట్టుపెట్టిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.

వీడియో క్యాప్షన్, సెప్టెంబరు 11 దాడులకు నేటితో 20 ఏళ్లు.. వీటి నుంచి అమెరికా ఏం నేర్చుకుంది?

అల్ అదల్ కాకపోతే?

అల్ ఖైదా సీనియర్ జిహాదీలను వరుసగా జవహిరిని మట్టుపెట్టినట్లే అమెరికా హతమారుస్తూ వస్తోంది.

ప్రస్తుతం అల్ ఖైదాతో సోమాలియాలోని అల్ షెబాబ్, యెమెన్‌లో ఏక్యూఏపీ, మాలీలోని ఎన్‌జీఐఎంలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ సంస్థల నాయకులు కూడా అల్ ఖైదా పగ్గాలు చేపట్టే అవకాశాన్ని కొట్టి పారేయలేం.

జవహిరి హయాంలో అల్ ఖైదా బాగా వికేంద్రీకృతమైంది. దీంతో ప్రాంతీయ అనుబంధ సంస్థలు నేతలకు కూడా ఇప్పుడు నాయకత్వం దక్కొచ్చు.

2013లో ఏక్యూఐఎం నాయకుడు నజీర్ అల్ వుహాయషిని జవహిరికి నమ్మినబంటుగా మీడియాలో వార్తలు వచ్చాయి. నజీర్ కూడా 2015లో అమెరికా డ్రోన్ దాడిలో మరణించాడు. అయితే, ఇలాంటి ప్రాంతీయ సంస్థల నేతలు ఎవరైనా ఇప్పుడు అల్ ఖైదా పగ్గాలు చేపట్టొచ్చు.

జవహిరి స్థానాన్ని ఎవరు భర్తీ చేసినా... అమెరికా దాడుల భయం నీడలోనే వారు బతకాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)