'స్పేస్ ఎక్స్ క్యాప్సూల్' శకలం: అంతరిక్షం నుంచి జారింది.. పొలంలో పడింది.. రాకెట్ల శకలాలు భూమిపై పడటం ఇకపై సాధారణం అయిపోతుందా?

అంతరిక్ష శకలం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అంతరిక్ష శకలం Picture: Dr Brad Tucker
    • రచయిత, ఎల్సా మైష్‌మన్
    • హోదా, బీబీసీ న్యూస్

మిక్ మైనర్స్ అనే రైతు తన పొలంలో నిలువుగా పాతినట్లు ఉన్న ఒక పెద్ద నల్లటి వస్తువును మొదటగా చూసినప్పుడు అది ఒక చెట్టు అని, మాడిపోయి ఉంటుందని అనుకున్నారు.

కానీ, దగ్గరగా వెళ్లి నిశితంగా పరిశీలించగా అది ఒక వస్తువుగా తేలింది. మిక్ మైనర్స్ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్‌లో ఉంటారు. తర్వాత దీన్ని పరిశీలించిన నిపుణులు ఆ వస్తువు అంతరిక్షం నుంచి ఆయన పొలంలో పడినట్లుగా ధ్రువీకరించారు.

ఇది 'స్పేస్ ఎక్స్ క్యాప్సూల్' శిథిలం అని తర్వాత ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ (ఏఎస్ఏ) తెలిపింది.

నిపుణులు దీన్ని అరుదైన ఆవిష్కరణగా అభివర్ణించారు. కానీ, ఇకపై ఇలాంటి ఘటనలు మరింత సాధారణంగా జరుగుతుంటాయని అన్నారు.

జూలై 9వ తేదీనే మిక్ మైనర్స్ పొలంలో ఈ వస్తువు పడింది. కానీ, ఆయన దీన్ని కొన్ని వారాల తర్వాత చూశారు.

ఇదే కాకుండా మరో రెండు శిథిలాలు కూడా సమీప ప్రాంతాల్లో లభించాయి. ఇలాంటి వస్తువులను ఎవరైనా చూస్తే సమాచారం ఇవ్వాలని ఏఎస్‌ఏ ప్రజల్ని కోరింది.

మిక్ మైనర్స్ పొలంలో పడిన ఈ వస్తువును పరీక్షించడానికి ఆస్ట్రేలియా జాతీయ యూనివర్సిటీకి చెందిన ఖగోళ-భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ బ్రాడ్ టకర్‌ను పిలిపించారు.

వీడియో క్యాప్షన్, ఆకాశం నుంచి రాలిపడిన అగ్ని గోళాలు.. ఉల్కలా? ఉపగ్రహ శకలాలా?

ఇలాంటి శిథిలాలను పరిశీలించడానికి తరచుగా ఆయనను పిలుస్తుంటారు. వాటిని పరిశీలించి ఆయన వాటి వివరాలను చెబుతారు. ఇలాంటి శిథిలాల్లో అంతరిక్షానికి సంబంధించినవి ఎక్కువగా ఉండవు.

''ఈ వస్తువును ఇంత దగ్గరగా చూడటం చాలా ఉత్సాహంగా ఉంది. అంతరిక్షానికి చెందిన ఒక శిథిలం ఇలా పడిపోవడాన్ని నేనెప్పుడూ చూడలేదు'' అని ఆయన అన్నారు.

అంతరిక్ష శిథిలాలు, వ్యర్థాలు నేలపై పడిపోవడం చాలా అరుదుగా జరుగుతుందని యూకేకు చెందిన వావ్రిక్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాన్ పొలాకో కూడా చెప్పారు.

అంతరిక్ష శిథిలాలు ఎక్కువగా సముద్రాల్లోనే పడిపోతాయని ఆయన తెలిపారు.

ఒకసారి అంతరిక్షం నుంచి పడిన వస్తువు, భూమిపై ఉన్న ఓ వ్యక్తికి తగిలినట్లు రికార్డులు చెబుతున్నాయి. అమెరికాలోని ఓక్లహామాలో 1997లో ఈ ఘటన జరిగింది. అంతరిక్షం నుంచి వచ్చిన ఒక శకలం, లాటీ విలియమ్స్ అనే మహిళ భుజంపై పడింది. కానీ, ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.

2020లో చైనా రాకెట్ శకలాలు కింద పడటం వల్ల ఐవరీ కోస్ట్‌లోని భవనాలు దెబ్బతిన్నట్లు రికార్డుల్లో నమోదైంది.

వీడియో క్యాప్షన్, కల్పనా చావ్లా: చివరి రోజు ఏం జరిగింది?

ఇటీవలి సంవత్సరాల్లో అంతరిక్షంలోకి పంపే రాకెట్ల సంఖ్య భారీగా పెరిగిపోవడం వల్ల ఇకపై భూమిపై ఇలాంటి శకలాలను చూడటం సాధారణంగా మారుతుందని నిపుణులు అంటున్నారు.

సూర్యుడు మరో చక్రంలోకి కదులుతున్నాడని, దీనివల్ల కలిగే ''నాక్-ఆన్'' ఎఫెక్ట్ కారణంగా భూమిపై ఈ శిథిలాలు పడుతున్నాయని ప్రొఫెసర్ పొలాకో చెప్పారు.

శిథిలాలకు సంబంధించి ఆందోళన కలిగించే ఒక అధ్యయనాన్ని కెనడా యూనివర్సిటీ ఈ జూలైలో ప్రచురించింది. వచ్చే దశాబ్దంలో అంతరిక్ష వ్యర్థాల కారణంగా ఒకరు లేదా ఎక్కువ మంది మరణించే అవకాశం 10 శాతం ఉన్నట్లు అందులో పేర్కొంది.

అయితే, ప్రొఫెసర్ పొలాకో అభిప్రాయం ఈ అధ్యయనానికి విభిన్నంగా ఉంది. ''అంతరిక్ష వ్యర్థాలు, వ్యక్తులను గాయపరిచే అవకాశం దాదాపుగా లేదు. ప్రజలు దీనికి భయపడాల్సిన అవసరం లేదనుకుంటున్నా. స్పేస్ నుంచి వచ్చే వ్యర్థాలు, వ్యక్తులను ఢీకొట్టే అవకాశం చాలా తక్కువ'' అని ఆయన అన్నారు.

వీడియో క్యాప్షన్, ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి టూర్ వెళ్లే రోజులు రానున్నాయా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)