వన్యప్రాణి సంరక్షణ: జూ ఎన్‌క్లోజర్‌లో మొసళ్లకు బదులు అందమైన హ్యాండ్‌బ్యాగ్ పెట్టారు, సందర్శకులు దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు

లండన్ జూలో మొసలి చర్మపు బ్యాగ్

ఫొటో సోర్స్, ZSL

ఫొటో క్యాప్షన్, ఈ హ్యాండ్ బ్యాగ్‌ను బ్రిటన్ బోర్డర్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకుని లండన్ జూకు అప్పగించారు
    • రచయిత, జేమ్స్ గ్రెగరీ
    • హోదా, బీబీసీ న్యూస్

కోతులు, జింకలు, పులులు, సింహాలు, ఏనుగులు, జిరాఫీలు, మొసళ్లు.. జూకు వెళ్లినపుడు ఇలాంటి జంతువులన్నీ కనిపిస్తాయని మనం మామూలుగా అనుకుంటాం.

లండన్ జూకు వెళ్లిన వాళ్లు కూడా అలాగే అనుకున్నారు.

కానీ అంతరించిపోయే దశలో ఉన్న సియామీస్ మొసళ్లను చూద్దామని జూలోని రెప్టైల్ హౌస్ దగ్గరకు వెళితే సందర్శకులకు అక్కడ నిశ్చలంగా ఉన్న ఒక వస్తువు దర్శనమిస్తుంది. అది ఒక సియామీస్ మొసలి చర్మంతో చేసిన ఓ హ్యాండ్ బ్యాగ్.

ఆ బ్యాగును లండన్ విమానాశ్రయంలో 2018లో బ్రిటన్ సరిహద్దు అధికారులు జప్తు చేశారు. వన్యప్రాణుల అక్రమ వ్యాపారం ప్రపంచ వ్యాప్తంగా చూపుతున్న ప్రభావాన్ని చాటిచెప్పటానికి ఆ బ్యాగును లండన్ జూకు అప్పగించారు.

ఆ జూలో సజీవంగా ఉన్న సియామీస్ మొసళ్లేవీ లేవు. ఈ జాతి మొసళ్లు ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద 500 నుంచి 1,000 లోపే ఉన్నాయి. ఇలా తరిగిపోవటానికి ఒక కారణం.. వీటి ఆవాసాలు కరిగిపోతుండటం ఒకటైతే, వీటిని వేటాడుతుండటం మరో ప్రధాన కారణం.

ఈ జూలో ఆ హ్యాండ్ బ్యాగ్‌ను గత కొన్నేళ్లుగా ప్రదర్శిస్తున్నారు. అయితే ఒక సందర్శకుడు ఆ బ్యాగ్‌ను ఫొటో తీసి ట్వీట్ చేయటంతో అది వైరల్‌గా మారింది. వన్యప్రాణుల అక్రమ వ్యాపారం మీద మళ్లీ ఆసక్తి రగిల్చింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ప్రజల్లో అవగాహన వ్యాపిస్తుండటం పట్ల జూలో సరిసృపాలు, ఉభయచరాల విభాగం బాధ్యతలు చూస్తున్న డాక్టర్ బెన్ టాప్లే హర్షం వ్యక్తంచేశారు.

''ఈ అద్భుత జంతువులన్నీ ఇక్కడ ఉండటం చాలా గొప్ప విషయం. కానీ ఈ హ్యాండ్ బ్యాగ్ ప్రజల దృష్టిని ఆకర్షించింది'' అని డాక్టర్ టాప్లే పేర్కొన్నారు.

''జూ సందర్శకులకు అవగాహన కల్పించటం, దీనిని చర్చనీయాంశంగా చేయటం మా ఉద్దేశం. ఈ అక్రమ వ్యాపారం మీద వెలుగు ప్రసరించే ఏ విషయమైనా మంచిదే'' అని చెప్పారు.

సియామీస్ మొసళ్ల సహజ ఆవాసాలు ఆగ్నేయ ఆసియా, ఇండొనేసియాల్లో నెమ్మదిగా ప్రవహించే నదులు. ఆ నదీ జలాల్లో ఈ మొసళ్లు ఈదుతూ కనిపించేవి.

కానీ 20వ శతాబ్దం మధ్య నుంచి చివరి వరకూ ఈ జీవుల అక్రమ వ్యాపారం వీటిని చావుదెబ్బ తీసిందని, ఈ మొసళ్ల చర్మం కోసం వీటిని అధికంగా వేటాడుతున్నారని డాక్టర్ టాప్లే తెలిపారు.

''ఇప్పుడు ఈ మొసళ్ల జనాభా చెదురుమదురుగా ఉంది. అవి ఎంతవరకూ మనుగడ సాగించగలవనేది ప్రశ్నార్థకం'' అని టాప్లే అన్నారు.

వన్యప్రాణుల సంరక్షణ కోసం, వన్యప్రాణులను అక్రమ రవాణా చేసే వ్యవస్థల మీద పోరాడే చట్ట సంస్థలకు మద్దతు ఇవ్వటం కోసం, ప్రమాదంలో ఉన్న జీవజాతులకు డిమాండ్‌ను తగ్గించటం కోసం.. ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు, వివిధ కమ్యూనిటీలతో లండన్ జూ కలిసి పని చేస్తుందని డాక్టర్ టాప్లే పేర్కొన్నారు.

లండన్ జూలో ఉన్న అనేక జాతుల జీవులు తీవ్రంగా అంతరించిపోయే దశలో ఉన్నాయి. వాటిలో చాలా జాతులు అక్రమ వన్యప్రాణ వ్యాపారుల చేతుల్లో పడి ఈ పరిస్థితికి చేరుకున్నాయి.

రీజెంట్స్ పార్క్‌లోని లండన్ జూ వయసు 196 సంవత్సరాలు. బ్రిటన్ బోర్డర్ ఫోర్స్.. 2000 సంవత్సరం నుంచి తమ దేశ విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో స్వాధీనం చేసుకున్న 3,000కు పైగా జంతువులకు లండన్ జూ ఆశ్రయం కల్పిస్తోంది.

అలా ఇక్కడికి చేరుకున్న జీవుల్లో.. ఈజిప్షియన్ తాబేళ్లు, రెడ్ రెయిన్ కప్పలు, గ్రీన్ ట్రీ కొండచిలువలు, వందలాది సముద్ర పగడపు జీవులు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)