ఆంధ్రప్రదేశ్: 100 రోజులు దాటినా పులి ఎందుకు దొరకట్లేదు? ఆడ తోడు కోసమే వెదుకుతోందా?

ఫొటో సోర్స్, P. RAMMOHAN RAO
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
అనకాపల్లి సమీపంలో చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి కుడి వైపున ఐదు వందల మీటర్ల దూరంలో ఉంటుంది గాలి భీమవరం గ్రామం. ఇక్కడ జులై 13న ఉదయం 7:30 గంటల సమయంలో 50 ఏళ్ల గౌరీ ఈశ్వరమ్మ అనే మహిళ తన ఆవు కనబడటం లేదంటూ వెదుకుతూ ఆందోళనగా కనిపించారు. ఆమెకున్న 8 ఆవుల్లో ఒకటి మినహా మిగతా ఏడు పశువులశాలకు చేరుకున్నాయి. కానీ ఎనిమిదో ఆవు, పశువుల శాలకు 40 మీటర్ల దూరంలో ఉన్న గోతిలో పడి ఉంది.
దగ్గరకు వెళ్లి చూస్తే దాని మెడపై నుంచి తీవ్రంగా కారుతోన్న రక్తం కనిపించింది. ఆవు చనిపోయి ఉంది. గట్టిగా కేకలు వేస్తే గౌరీ ఈశ్వరమ్మ భర్త, కూతురు ఆమె వద్దకు వచ్చారు. భర్త కాసేపు అటుఇటు గుబురుగా ఉన్న పొదల్లో వెదకడం ప్రారంభించారు. అయిదు నిముషాల తర్వాత పులి ఇక్కడే ఉంది అంటూ గట్టిగా కేకలు వేసి...తన భార్య, పిల్లలను పట్టుకుని తన ఇంటిలోకి పరుగు తీశారు. గౌరీ శంకరమ్మ వెంటనే లోకల్ యూత్ ద్వారా ఫారెస్ట్ అధికారులకు పులి సమాచారం చేరవేశారు.

అన్ని గ్రామాల్లో భయమే
పశువుల పాకలకు సమీపంలో ఆరు ఇళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఆరు ఇళ్ల వాళ్లు ఆవును పులి చంపేసిందనే వార్తను తెలుసుకుని ఇంటిలోకి వెళ్లి గడియలు పెట్టుకున్నారు. వెంటనే పోన్లు చేసి సమీప గ్రామాలైన నారపాడు, పల్లివానిపాలెం, నాయడు పేట, నాయుడు పాలెం వాసులకు విషయం తెలియ చేశారు. ఈ గ్రామాలన్నీ కూడా వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడినవే. దాంతో పులి తమ గ్రామాల్లోకి వస్తే పరిస్థితి ఏంటనే భయందోళనలతో గడుపుతున్నారు.
ఒక గంట సమయంలో అసిస్టెంట్ డివిజన్ ఫారెస్ట్ అధికారి రామారావు, కొందరు అటవీశాఖ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారితో పాటు 'టైగర్ ప్రొటెక్షన్ అండ్ సేప్టీ' అనే అంశంపై పని చేస్తున్న స్వచ్చంధ సంస్థ తరపున మరికొందరు అక్కడకు వచ్చారు. ఇరు బృందాలు కలిసి పగ్ మార్క్ కొలతలు తీసుకుని పరిశీలించారు. 14 అంగుళాల వరకు ఉన్న ఆ పగ్ మార్క్‌ని చూసిన రామారావు ఇది ఈ ఏడాది ఏప్రిల్ 11వ తేదీన విజయనగరం జిల్లాలో ప్రవేశించి అక్కడ నుంచి నర్సీపట్నం, తూర్పుగోదావరి, తుని, అనకాపల్లిలో తిరుగుతున్న మగ పులి అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

అక్కడ నుంచి కొండ పైకి
ఆవుని పులి చంపేసిందని నిర్దారణకు వచ్చిన ప్రదేశం నుంచి కొండవైపు పాద ముద్రల సహాయంతో పులిని వెదికే ప్రయత్నం చేశారు. అయితే తుప్పలు, పొదలు ఎక్కువ ఉన్న ప్రాంతం కావడంతో ఆవు చనిపోయిన ప్రదేశంలో తప్ప మరెక్కడా పాదముద్రల జాడలు కనిపించలేదు. దాంతో గాలి భీమవరం కొండపైకి వెళ్లిపోయి ఉండొచ్చునని అటవీ శాఖాధికారులు అంచనాకు వచ్చారు. కొద్ది సేపటికే డీఎఫ్ఓ అనంత శంకర్ అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి అంచనా వేసేందుకు నాలుగు వైపులా కలియ తిరిగారు. తన సిబ్బందికి కొన్ని సూచనలు చేశారు. పులి దాడిలో ఆవుని కోల్పోయిన గౌరీ శంకరమ్మతో మాట్లాడారు.
"ఎప్పటిలాగే (13.7.2022) పొద్దున పాలు తీద్దామని పశువులశాలకి వెళ్లాను. అక్కడ ఒక్క పశువు కనిపించలేదు. పశువులను కట్టిన తాళ్లన్నీ తెగిపోయి కనిపించాయి. వెతికితే కొద్ది సేపటికి ఏడు ఆవులు కనిపించాయి. ఒక్కటి మాత్రం గోతిలో పడిపోయి ఉంది. వెళ్లే చూస్తే పీక కొరికేసి ఉంది. పులి ఉందనే వార్తలు రోజు వింటున్నాం కదా...అనుమానమొచ్చి వెదికితే, పులి పాద ముద్రలు కనిపించాయి. వెంటనే వెన్నులో నుంచి వణుకు వచ్చింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించాం" అని డీఎఫ్ఓ అనంత శంకర్‌తో గౌరీ ఈశ్వరమ్మ చెప్పారు. పశువులశాలలో ఎనిమిది ఆవులుండగా, పులి దాడిలో రోజుకు 12 లీటర్ల పాలిచ్చే ఆవు చనిపోయిందని ఆమె తెలిపారు.

గంధవరం నుంచి గాలి భీమవరానికి
గాలి భీమవరం ప్రాంతంలో పులి సంచారాన్ని ధ్రవీకరించడంతో, మూడు గంటల్లో గంధవరంలో ఉన్న టైగర్ ట్రాప్, డ్రోన్ కెమెరా టీం, వెటర్నరీ డాక్టర్ ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ పశువుల శాలల్లో పని చేస్తున్న వారిని, నివాసం ఉంటున్న అందర్నీ ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు.
"ఏప్రిల్, మే నెలల్లో పులి, అటవీ ప్రాంతంలోనే సంచరించింది. అప్పుడు మనుషులకు కనిపించడం, క్యాటిల్ కిల్లింగ్ అంతగా ఉండేది కాదు. ఆ తర్వాత మెల్లగా పులి అక్కడ నుంచి కొండవాలు ప్రాంతాలకు వచ్చింది. అక్కడ బోనులు పెట్టి ట్రాప్ చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు జాతీయ రహదారుల సమీపంలోని గ్రామాల్లోకి, పశుశుల శాలలవైపు వస్తుంది. కాబట్టి దానిని ఇప్పుడు ఎలాగైనా పట్టుకోవాలి. అందుకు ఉన్న చివరి అవకాశం ట్రాంక్వలైజ్ (మత్తు ఇంజక్షన్లు) చేయడమే. దానికి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి అనుమతి వచ్చింది" అని బీబీసీతో డీఎఫ్ఓ ఆనంత శంకర్ చెప్పారు.

ట్రాప్‌కి చిక్కినట్లే చిక్కి చేజారింది..
పులి సంచారం మొదలైనప్పటి నుంచి అనేక స్థావరాల్లో పులి అడుగు జాడలు కనిపించాయి. వాటి ఆధారంగానే పులి సంచారాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. అనకాపల్లి జిల్లా కొండవాలు గ్రామాల్లో తిరుగుతూ, అక్కడ పశువుల శాలల్లో ఉండే పశువులను చంపేసింది. ఏప్రిల్ 11న విజయనగరంలోని మెంటాడ అటవీ ప్రాంతంలో తొలి సారి కనిపించిన పులి... మే 1న నర్సీపట్నంలోని నాతవరం, మే 29న తూర్పు గోదావరి పత్తిపాడులో కనిపించింది. అక్కడ ట్రాప్‌కి చిక్కినట్లే చిక్కి చేజారింది. ఆ తర్వాత జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా తుని, జూన్ 29న అనకాపల్లి జిల్లా కోటవురట్ల, గంధవరం, గాలి భీమవరం గ్రామాల్లో పులి పగ్ మార్క్ కనిపించాయి.
"ప్రస్తుతానికి పులి వారానికి ఒకసారి ఆహారం కోసం పశువులను వేటాడి చంపుతుంది. రెండు, మూడు రోజులకు ఒకసారి క్యాటిల్ కిల్లింగ్ ఉన్నా, అది ఆహారం కోసం కాదు. తన మార్గంలో అలికిడి అనిపిస్తే బెదిరిపోయి వాటిని చంపేస్తుంది. ఆహారంగా వాటిని తీసుకోవడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో చాలా చోట్ల పశువులు కట్టేసి ఉండటంతో మరింత సులభంగా వాటిపై దాడి చేస్తోంది. పగ్ మార్క్ కనిపించిన ప్రతి చోటా కూడా దాని సైజు, అది నేలపై వేసిన అడుగుల ఒత్తిడి, రెండు అడుగుల మధ్య దూరం అన్నీ ఒకేలా ఉన్నాయి. అంటే ఇంత కాలంగా ఒక చోట నుంచి మరొక చోటుకు తిరుగుతున్నది ఒకే పులి. దాని వయసు కూడా నాలుగైదు ఏళ్లు ఉంటుంది. జువాలజీ నిపుణులు చెప్పిన దాని ప్రకారం పులి సంచరిస్తున్న ప్రాంతంలోని వాసన కూడా పులిదేనని స్పష్టం అవుతోంది" అని డీఎఫ్ఓ అనంత శంకర్ చెప్పారు.

ఫొటో సోర్స్, P. RAMMOHAN RAO
ఆడ తోడు కోసమే వచ్చిందా?
పులిని పట్టుకునేందుకు అటవీశాఖ, పులుల సంరక్షణ కోసం పని చేసే కొన్ని స్వచ్చంధ సంస్థల సహాయం కూడా తీసుకుంటోంది. హైదరాబాద్, విశాఖపట్నం నుంచి వన్యప్రాణులపై పరిశోధనలు చేస్తున్న స్వచ్చంధ సంస్థల నిర్వహకులు కూడా పులి సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్నారు. దాన్ని పట్టుకోవడంలో అటవీశాఖకు సహకరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పులి కలకలం మొదలైనప్పటి నుంచి ఎప్పటికప్పడు సమాచారం సేకరిస్తూ, గత ఎనిమిదేళ్లుగా పులుల సంరక్షణ అంశంపై పరిశోధనలు చేస్తున్న దంతులూరి సబ్బరాజుతో బీబీసీ మాట్లాడింది.
"ఇది మగపులి అనేది నిజం. ఆడ తోడుని వెదుక్కుంటూ వెళుతోంది. పులి సంచారం మొదలై మూడు నెలలు అవుతున్నా దాని అడుగు జాడలే తప్ప, అచూకీ మాత్రం దొరకడం లేదు. కొన్ని సార్లు కెమెరాలకు కనిపించినా, బోనుకు మాత్రం చిక్కలేదు. ఆ పులి ఆడతోడుని వెతుక్కునే సమయంలో దానికి ఒక రోజులో ఇరవై నుంచి 30 కేజీల ఆహారం కావాలి. అందుకే ఆహారం కోసం జంతువులనే వేటాడుతోంది. మనుషులపై అటాక్ చేసింది లేదు" అని దంతులూరి సుబ్బరాజు చెప్పారు.

'సాధారణంగా మనుషులపై దాడి చేయదు'
అనకాపల్లి జిల్లాలో పశువులను చంపేస్తున్న పులిని పట్టుకోవడంలో విఫలమవుతున్నారంటూ అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ప్రజలు అటవీ శాఖ అధికారులను నిలదీస్తున్నారు. గంధవరం గ్రామస్థులు, అటవీశాఖ సిబ్బందిని చుట్టుముట్టి వారిని అక్కడ నుంచి కదలనివ్వలేదు. సాధారణంగానే పులి తెలివైన జంతువు. ఇప్పుడు ట్రాప్‌లను కూడా పసిగడుతున్నట్లు ఉంది. అందుకే దానిని పట్టుకోవడంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని విశాఖ సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రామ్మెహనరావు బీబీసీతో చెప్పారు.
"ఏదైనా పగ్ మార్క్ (పాద ముద్ర) 10 సెంమీ ఎక్కువ ఉంటే అది దాదాపుగా పులిదేనని చెప్పవచ్చు. చతురస్రాకారంలో ఉండే అది మగ పులి అని, దీర్ఘ చతురస్రాకారంలో ఉంటే ఆడ పులి అని అర్థం . 14 సెం.మీ. ఉంటే అది పెద్ద పులే. అయితే, ఈ ముద్రలు ఎండు నేలలో అయితే రెండు రోజులు, తడి నేలలో అయితే దాదాపు నెల రోజుల వరకు ఉంటాయి. ఏ పులైనా సాధారణంగా మనుషులపై దాడి చేయదు. కేవలం పశువులు, జింకలనే వేటాడుతుంది" అని రామ్మెహన్ రావు తెలిపారు.
'పులి వేటలో డ్రోన్ కెమెరాలు'
ఒక రోజులో పులి 30 కిలోమీటర్ల రేడియస్‌లో సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అయితే, గత రెండు వారాల్లో పులికి సమీపంలోనే ఆహారం దొరుకుతుండటంతో ఎక్కువ దూరం ప్రయాణించడం లేదని చెప్పారు. మరో వైపు ఈ పులి ప్రవర్తన కూడా అర్థం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయిని తెలిపారు.
"పులికి సాధారణంగా ఆహారం దొరికిన చోట మూడు రోజులైనా ఉంటుంది. కానీ ఇది ఒక్క రోజులోనే మరో ప్రాంతానికి వెళ్తోంది. ఆహారం కోసం కాకపోయినా, దానికి అనుకూలంగా ఉండే స్థావరం కోసం వెదుకుతూ వెళ్లిపోతున్నట్లుంది. ఏ రోజుకారోజూ కొత్త ప్రాంతానికి పులి పయనిస్తోంది. ట్రాప్, ట్రాంక్వలైజ్ ప్రయత్నాలు చేస్తూనే డ్రోన్ కెమెరాల సహాయంతో దాని అచూకీని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం" అని డీఎఫ్ఓ అనంత శంకర్ చెప్పారు.
"ఫొటోలతో పులి పోలిక చిక్కలేదు"
పులికి సంబంధించి అనేక అవాస్తవ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. కొందరు ఎక్కడెక్కడివో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలను అందోళనకు గురి చేస్తున్నారు వీటిని చూసిన ప్రజలు అటవీశాఖ సిబ్బందికి ఫోన్లు చేస్తున్నారు. పగ్ మార్క్, వాసన ఆధారంగా పులి గమనాన్ని అంచనా వేస్తూ దానిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని డీఎఫ్ఓ అనంతశంకర్ చెప్పారు.
"దాదాపు 100 రోజులు పూర్తయినా పులి చిక్కకపోవడం... మరో వైపు అడవులు, కొండవాలు ప్రాంతాలు వదలి జనవాసాల మధ్య పులి సంచారం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో దాన్ని ట్రాప్ ద్వారా కాకుండా మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకునేందుకు అనుమతి పొందాం. మన పరిధిలో సంచరిస్తున్న పులి ఫోటోలు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ ఆథారిటీకి పంపించాం. అక్కడ దేశంలో ఉన్న అన్ని పులులకు సంబంధించిన ఫోటో, వీడియో డేటా ఉంటుంది. అయితే, వాటితో ఇక్కడి పులి ఫోటోలు సరిపోవడం లేదు" అని అనంత శంకర్ చెప్పారు.
"పులి విషయంలో ఎటువంటి అందోళనకు గురి కావద్దని ప్రజలకు అటవీశాఖ సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. పులిని చంపడం లేదా ఏదైనా హాని చేస్తే ...వన్యప్రాణుల సంరక్షణ చట్టం-1972 ప్రకారం కఠినమైన శిక్షలు పడతాయి. ఆ విషయాన్ని ప్రజలు అందరూ గుర్తించాలి" అని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- లఖ్‌నవూ లులు మాల్లో నమాజ్, వీడియో వైరల్.. అసలు ఏం జరిగింది?
- లలిత్ మోదీ: ఈయన కొందరికి విలన్, మరి కొందరికి మాత్రం హీరో
- ‘‘ఇప్పుడు మేం, మా పిల్లలు మాత్రం బతికున్నాం. ఇంకేమీ మిగల్లేదు''
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- శ్రీలంక కు భారత్ చేయాల్సింది సైనిక సాయమా, ఆర్ధిక సాయమా, 1987 అనుభవాలు ఏం చెబుతున్నాయి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












