Dragon of Death: రాకాసి డ్రాగన్, బస్ అంత భారీగా ఉంటూ ఆకాశంలో ఎగురుతూ వేట - అర్జెంటీనాలో దొరికిన అవశేషాలు

ఫొటో సోర్స్, Leonardo Ortiz
బస్సు పరిమాణంలో ఉండే ఎగిరే డ్రాగన్‌కు చెందిన అవశేషాలు అర్జెంటీనాలో బయటపడ్డాయి. దీన్ని ‘‘ద డ్రాగన్ ఆఫ్ డెత్’’గా పిలుస్తున్నారు.
ఇది ఒక భిన్నమైన డ్రాగన్ జాతికి చెందిన శిలాజమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 8.6 కోట్ల ఏళ్ల క్రితం ఎగురుతూ ఇది జంతువులను వేటాడేదని అంచనా వేస్తున్నారు.
రెండు రెక్కలను పూర్తిగా చాచినప్పుడు ఇది తొమ్మిది మీటర్ల (దాదాపు 30 అడుగులు) వెడల్పు ఉంటుంది. భారీ పరిమాణం వల్ల దీని దృష్టి కూడా చాలా నిశితంగా ఉంటుందని దీనిపై పరిశోధన చేపడుతున్న శాస్త్రవేత్తలు బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, Leonardo Ortiz
‘‘ఈ డ్రాగన్‌లు జిరాఫీ అంత పొడవు ఉండేవి’’అని ఈ ప్రాజెక్ట్‌కు నేతృత్వం వహించిన లియోనార్డో ఆర్టిజ్ చెప్పారు. ఆ రెక్కల వెడల్పు చూస్తుంటే.. ‘‘ఇప్పటివరకు అలాంటి జీవుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువని అనిపిస్తోంది’’అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆండిస్ పర్వతాల్లోని రాళ్ల మధ్య 8.6 కోట్ల ఏళ్ల క్రితం ఈ డ్రాగన్ శరీరం చిక్కుకుంది. అంటే ఈ జీవులు డైనోసర్లతోపాటు కలిసి జీవించేవి.

ఫొటో సోర్స్, Reuters
2012లో అర్జెంటీనాలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఈ శిలాజాలను ప్రొఫెసర్ ఆర్టిజ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
దీనికి మొదట ‘‘థానాటోడ్రాకోన్ అమరు’’గా నామకరణం చేశారు. ఇది గ్రీక్ పేరు. మరణం, డ్రాగన్ అనే పదాలను కలిపి ఇలా పిలుస్తారు.

ఫొటో సోర్స్, Reuters
ఇదే దానికి సరైన పేరని ప్రొఫెసర్ ఆర్టిజ్ చెప్పారు. ఇంగ్లిష్‌లో దీన్ని ‘‘ద డ్రాగన్ ఆఫ్ డెత్’’గా ఆయన వివరించారు.
జంతువులను వేటాడేందుకు రెక్కలను ఉపయోగించిన తొలినాటి భారీ సరీసృపాల్లో ఇది కూడా ఒకటని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పక్షుల జాతి అవతరించకముందే ఈ పాకే జంతువులు ఆకాశాల్లో ఎగిరేవి.
ఎగిరే వీలున్నప్పటికీ ఈ జంతువులు ఎక్కువ సమయం నేలపైనే గడిపేవని ప్రొఫెసర్ ఆర్టిజ్ బీబీసీకి వివరించారు.
ఒకచోట లభించిన భిన్న జంతువుల శిలాజాలను పరిశీలిస్తుంటే ఇవి బృందాలుగా జీవించేవని తెలుస్తోందని ఆయన అన్నారు.
భారీ గ్రహశకలం భూమిని తాకేందుకు 2 కోట్ల ఏళ్లకుముందే ఈ సరీసృపాలు భూమిపై జీవించేవి. ఆ గ్రహశకల దాడిలో భూమిపై నాలుగింట మూడొంతుల జంతువులు, వృక్ష జాతులు అంతరించిపోయాయి.
2017లో 17 కోట్ల ఏళ్లకుముందు జురాసిక్ కాలంనాటి ఒక శిలాజం కూడా వెలుగులోకి వచ్చింది. స్కాట్లాండ్ దీవి స్కైలో ఇది బయటపడింది. దీని రెక్కల వెడల్పు 2.5 మీటర్లు.
ఇవి కూడా చదవండి:
- టెక్సస్ కాల్పులు: ప్రైమరీ స్కూల్‌పై జరిగిన దాడిలో 19 మంది పిల్లలు, ఒక టీచరు మృతి
- జ్ఞాన్వాపి మసీదును శివాలయంగా మార్చవచ్చా... చట్టం ఏం చెబుతోంది?
- మంకీపాక్స్ ఎలా సోకుతుంది, లక్షణాలేమిటి? స్వలింగ సంపర్కులకు ఎక్కువగా సోకుతుందా
- పెళ్లి గిఫ్ట్‌గా టెడ్డీబేర్ పంపిన పెళ్లికూతురి అక్క మాజీ ప్రియుడు.. అందులోని బాంబ్ పేలి కళ్లు, చేతులు కోల్పోయిన పెళ్లి కొడుకు
- సెక్స్, అధికారం, భయం... ఇవే మన పురాణాలకు మూలాధారమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













