అల్ జవహిరి: మెడిసిన్ చదివి, సర్జరీలో మాస్టర్ చేసిన ఈ డాక్టర్ జిహాదీ ఎలా అయ్యాడు, లాడెన్‌కు కుడి భుజంగా ఎలా మారాడు?

అయ్‌మాన్ అల్ జవహిరి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అయ్‌మాన్ అల్ జవహిరి

అల్ ఖైదా నాయకుడు అయ్‌మాన్ అల్ జవహిరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్‌లో జరిపిన డ్రోన్ దాడిలో జవహిరి హతమైనట్లు అమెరికా ప్రకటించింది.

జవహిరిని 'అల్ ఖైదా బ్రెయిన్'గా పిలుస్తుంటారు. ఆయన ఒకప్పుడు కళ్ల వైద్యుడు. ఈజిప్టు ఇస్లామిక్ జిహదీ గ్రూపు ఏర్పాటులో ఆయన సహకరించారు.

2011లో ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా హతం చేసింది. అప్పటి నుంచి జవహిరి నాయకత్వంలోనే అల్ ఖైదా పని చేస్తోంది.

జవహిరిని ఒసామా బిన్ లాడెన్ కుడి భుజంగా పరిగణించేవారు. అమెరికాలో 9/11 దాడుల వెనుక అసలు సూత్రదారి జవహిరి అని నమ్ముతారు.

ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్ ఖైదా గ్రూపులో రెండో అగ్రనేత జవహిరి. 2001లో 22 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రిస్టుల జాబితాలో అమెరికా, జవహిరి పేరును కూడా చేర్చింది. జవహిరి తలపై రూ. 196 కోట్లు (25 మిలియన్ డాలర్లు) రివార్డును ప్రకటించింది.

ఇటీవలి కొన్నేళ్లలో జవహిరి, అల్ ఖైదాకు కీలక ప్రతినిధిగా ఎదిగారు. 2007లో 16 వీడియోలు, ఆడియో టేపుల్లో ఆయన కనిపించారు. ఒసామా బిన్ లాడెన్ కనిపించిన దాని కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలలో మతోన్మాదం, తీవ్రవాదాన్ని ప్రేరేపించేందుకు అల్ ఖైదా ప్రయత్నించింది.

కాబుల్‌లోని జవహిరి రహస్య స్థావరంపై అమెరికా దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు. 2006 జనవరిలో పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో అమెరికా క్షిపణితో దాడి చేసింది. అప్పుడు నలుగురు అల్ ఖైదా సభ్యులు మరణించగా, జవహిరి తప్పించుకున్నారు.

ఇది జరిగిన రెండు వారాల తర్వాత జవహిరి ఒక వీడియోలో కనిపించి అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ను హెచ్చరించారు. ప్రపంచంలోని శక్తులన్నీ మీకే సొంతం కావు అని వ్యాఖ్యానించారు.

1997లో ఒసామా బిన్ లాడెన్ ‌ఉన్న అఫ్గాన్‌లోని జలాలాబాద్‌కు వెళ్లారు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 1997లో జవహిరి, ఒసామా బిన్ లాడెన్ ‌ఉన్న జలాలాబాద్‌కు వెళ్లారు

జవహిరిది మంచి పేరున్న కుటుంబం

ఈజిప్టు రాజధాని కైరోలో 1951 జూన్ 19న అల్ జవహిరి, ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు.

వారి కుటుంబంలో బాగా చదువుకున్న వాళ్లు, డాక్టర్లు ఉన్నారు. ఆయన తాత రబియా అల్ జవహిరి... సున్నీ ఇస్లామిక్ స్టడీస్ సెంటర్ 'అల్ అజహర్'కు గ్రాండ్ ఇమామ్‌గా పనిచేశారు. ఆయన మామయ్య, అరబ్ లీగ్‌కు తొలి ప్రధాన కార్యదర్శి.

పాఠశాలలో చదువుతున్న సమయంలోనే జవహరి, ఇస్లాం రాజకీయాల్లో అడుగుపెట్టారు. చట్ట విరుద్ధమైన ముస్లిం బ్రదర్‌హుడ్‌లో సభ్యునిగా ఉన్నందుకు ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పుడు తన వయస్సు 15 ఏళ్లు.

ముస్లిం బ్రదర్‌హుడ్ అనేది ఈజిప్టులో పురాతనమైన, అత్యంత పెద్దదైన ఇస్లామిక్ సంస్థ. ఇస్లాం రాజకీయాల్లో ఉంటూనే కైరో యూనివర్సిటీలో ఆయన వైద్య విద్యను చదివారు.

1974లో మెడిసిన్‌లో గ్రాడ్యుయేట్ అయ్యారు. ఆ తర్వాత సర్జరీలో మాస్టర్స్ చేశారు.

1995లో జవహిరి తండ్రి మహమ్మద్ చనిపోయారు. ఆయన కైరో యూనివర్సిటీ ఫార్మకాలజీ ప్రొఫెసర్‌.

మొదట్లో జవహిరి, తమ కుటుంబ సంప్రదాయాన్ని పాటిస్తూ కైరోలో మెడికల్ క్లినిక్‌ను ప్రారంభించారు. దీని తర్వాత కొంతకాలానికే ఆయనపై తీవ్రవాద ఇస్లామిక్ గ్రూపుల ప్రభావం పడింది. అప్పట్లో ఈజిప్టు ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ఈ గ్రూపులు ప్రయత్నించాయి.

1973లో ఈజిప్ట్, ఇస్లామిక్ జిహాద్‌గా మారింది. అందులో జవహిరి చేరారు. 1981లో అప్పటి ఈజిప్ట్ అధ్యక్షుడు అన్వర్ సాదత్‌ ఒక మిలిటరీ పరేడ్‌లో హత్యకు గురయ్యారు.

ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్ గ్రూపు సభ్యులే ఈ హత్యలో నిందితులు. వందల సంఖ్యలో ఉన్న వీరంతా మిలిటరీ దుస్తులు ధరించారు. అందులో జవహిరి కూడా ఉన్నారు.

ఇజ్రాయెల్‌తో ఒక శాంతి ఒప్పందంపై అన్వర్ సంతకం చేశారు. దీనిపై ఇస్లామిక్ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాలిబాన్ నాయకుడు అంఖుద్‌జాదాతో అల్ జవహిరి
ఫొటో క్యాప్షన్, తాలిబాన్ నాయకుడు అంఖుద్‌జాదాతో అల్ జవహిరి

జైలు తర్వాత మారిన జీవితం

అన్వర్ సాదత్ హత్య కేసు విచారణ సందర్భంగా జవహిరి కోర్టులో మాట్లాడుతూ... '' మేం ముస్లింలం. మా మతాన్ని మేం నమ్ముతాం. మేం ఒక ఇస్లామిక్ దేశాన్ని, సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని అన్నారు. దీంతో ఆ హత్య కేసులో నిందితులుగా ఉన్న వారందరికీ నాయకుడిగా మారిపోయారు.

అన్వర్ సాదత్ హత్య కేసులో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. కానీ, అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారనే కేసులో ఆయనను దోషిగా తేల్చారు.

దీంతో మూడేళ్లు జైలు జీవితం గడిపారు. జైళ్లో ఆయనతో ఉన్న ఖైదీలు చెప్పినదాని ప్రకారం... జైలులో ఆయనను హింసించారు. బాగా కొట్టారు. దీని తర్వాత ఆయన పూర్తిగా హింసాత్మక ఇస్లామిక్ తీవ్రవాదిగా మారిపోయారని అంటారు.

1985లో జైలు నుంచి విడుదలయ్యాక సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ నుంచి పాకిస్తాన్‌లోని పెషావర్‌కు, ఆ తర్వాత దాని పొరుగునే ఉన్న అఫ్గానిస్తాన్‌కు చేరుకున్నారు.

అఫ్గానిస్తాన్‌లోనే ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్‌లో ఒక వర్గాన్నిఏర్పాటు చేశారు. అఫ్గాన్, సోవియట్ యూనియన్ నియంత్రణలో ఉన్న సమయంలో కూడా ఆయన వైద్యునిగా పని చేశారు.

1992లో ఈజిప్షియన్ ఇస్లామిక్ జిహాద్‌కు నాయకత్వం వహించారు. ఈజిప్టు ప్రధానమంత్రి అతీప్ సిద్ధిఖీ, ఇతర మంత్రులపై జరిగిన దాడుల్లో ఈ సంస్థ ముఖ్య పాత్రను పోషించింది. వీటన్నింటికి జవహిరిని 'మాస్టర్‌మైండ్'గా భావించారు.

ఈ గ్రూపు కార్యకాలపాల కారణంగా ఈజిప్టు ప్రభుత్వం కూలిపోయి, 1990ల మధ్యలో ఈజిప్టు, ఇస్లామిక్ స్టేట్‌గా మారిపోయింది. ఈ సమయంలో 1200 మందికి పైగా ఈజిప్షియన్లు మరణించారు.

1997లో ఈజిప్ట్ నగరమైన లక్సర్‌లో విదేశీ పర్యటకులపై జరిగిన దాడికి జవహిరి కారణమంటూ అమెరికా ప్రభుత్వం ఆరోపించింది.

ఒసామా బిన్ లాడెన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒసామా బిన్ లాడెన్

టార్గెట్ వెస్ట్

జవహిరి, 1990లలో తమ సంస్థకు నిధుల కోసం చాలా దేశాలు తిరిగినట్లు చెబుతారు.

బల్గేరియా, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాల్లో నివసించినట్లు... నకిలీ పాస్‌పోర్టులతో బాల్కన్స్, ఆస్ట్రియా, యెమెన్, ఇరాక్, ఫిలిప్పీన్స్ దేశాలకు చాలా సార్లు తిరిగినట్లు చెబుతుంటారు.

1996లో ఆరు నెలల పాటు జవహిరి, రష్యా కస్టడీలో ఉన్నారు. సరైన వీసా లేకపోవడంతో చెచన్యాలో ఆయనను పట్టుకున్నారు.

అయినప్పటికీ ఆయన గుర్తింపును బయటకు రాకుండా చూసుకున్నారు. 1997లో ఒసామా బిన్ లాడెన్ ‌ఉన్న అఫ్గాన్‌లోని జలాలాబాద్‌కు వెళ్లారు.

ఒక సంవత్సరం తర్వాత ఈజిప్టు ఇస్లామిక్ జిహాద్ సంస్థ, మరో ఐదు తీవ్రవాద ఇస్లామిక్ గ్రూపులతో కలిసిపోయింది. ఇందులో ఒసామా బిన్ లాడెన్‌కు చెందిన అల్ ఖైదా కూడా ఉంది.

ఇవన్నీ కలిసి వరల్డ్ ఇస్లామిక్ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. యూదులు, క్రైస్తవులకు వ్యతిరేకంగా పనిచేయడమే ఉద్దేశంగా ఇది ఏర్పడింది. ఈ ఫ్రంట్ మొదటగా అమెరికా పౌరులను చంపాలనే ఫత్వాను విడుదల చేసింది.

ఆరు నెలల తర్వాత అమెరికాలో ఒకే సమయంలో పలు దాడులు జరిగాయి. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలపై కూడా దాడులు జరిగాయి. 223 మంది మరణించారు.

జవహిరి శాటిలైట్ ఫోన్ సంభాషణల ద్వారా ఈ దాడుల వెనుక బిన్ లాడెన్, అల్ ఖైదా హస్తమున్నట్లు తెలిసింది.

దాడులు జరిగిన రెండు వారాల తర్వాత అఫ్గాన్‌లోని ఈ గ్రూపుకు చెందిన శిక్షణా కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేసింది.

ఆ తర్వాతి రోజు పాకిస్తాన్ జర్నలిస్ట్‌కు ఫోన్ చేసిన జవహిరి... ''అమెరికా బాంబుదాడులకు, బెదిరింపులకు, దూకుడుకు మేం భయపడబోమని వారికి చెప్పండి. యుద్ధం ఇప్పుడే మొదలైంది'' అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)