యశ్వంత్ ఘాడ్గే: రెండో ప్రపంచ యుద్ధంలో జర్మన్ శిబిరాన్ని పేల్చేసిన భారత జవాన్

యశ్వంత్ ఘాడ్గే
    • రచయిత, గణేష్ పోల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఇటలీలోని మోంటోన్‌లో ఇటీవలే యశ్వంత్ ఘాడ్గే అనే ఒక భారత సైనికుడి జ్ఞాపకార్థం స్మారక చిహ్నాన్ని నిర్మించారు.

ఇటలీ ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం సంయుక్తంగా ఈ స్మారకాన్ని ఏర్పాటు చేశాయి.

రెండో ప్రపంచ యుద్ధంలో భారత సైనికులు కనబరిచిన ధైర్యసాహసాలకు, త్యాగానికి ప్రతీకగా దీన్ని ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.

ఇది భారత్, ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది.

యశ్వంత్ ఘాడ్గే

ఫొటో సోర్స్, EMBASSY OF INDIA ROME (ITALY)

2023 జులై 22న జరిగిన సంస్మరణ వేడుకల్లో భారతీయ రాయబార కార్యాలయ అధికారులు, మోంటోన్ మేయర్, సైనిక అధికారులు, సైనిక చరిత్రకారులు, ఇటలీ పౌరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రత్యేక పోస్ట్ కార్డ్‌ను కూడా జారీ చేశారు.

రాయ్‌గఢ్‌లోని ఒక గ్రామంలో జన్మించిన మరాఠీ సైనికుడు యశ్వంత్ ఘాడ్గే ధైర్యసాహసాలకు గుర్తుగా ఇటలీలో స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేయడం మహారాష్ట్రకు, భారతదేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.

యశ్ంత్ ఘాడ్గే

ఫొటో సోర్స్, Getty Images

యశ్వంత్ ఘాడ్గే సైన్యంలో ఎలా చేరారు?

రాయ్‌గఢ్‌ మాంగావ్ తాలూకాలోని పలాస్‌గావ్-అంబ్రేచి వాడీ గ్రామంలో యశ్వంత్ బాలాజీ ఘాడ్గే జన్మించారు. ఆయన తల్లి పేరు వితాబాయి. తండ్రి పేరు బాలాజీరావు.

యశ్వంత్ ఘాడ్గేది పేద వ్యవసాయ కుటుంబం. యశ్వంత్‌కు ఒక సోదరుడు, నలుగురు అక్కాచెల్లెళ్లు.

యశ్వంత్‌కు మూడు నెలల వయస్సు ఉన్నప్పుడే ఆయన తండ్రి చనిపోయారు. ఆ సమయంలో యశ్వంత్ అన్నయ్య వామన్ సైన్యంలో చేరారు.

భర్త చనిపోవడంతో వితాబాయి ఇంటి బాధ్యతలను స్వీకరించారు. పేదరికం కారణంగా పొలం పనులకు వెళ్లారు.

పలాస్‌గావ్‌లోని మరాఠీ పాఠశాలలో యశ్వంత్‌ను చేర్పించారు. పదకొండేళ్ల వయసులో మరాఠీ 4వ పరీక్షలో యశ్వంత్ ఉత్తీర్ణుడయ్యారు.

ఇంట్లో పేదరికం కారణంగా ఉన్నత చదువుల కోసం నగరానికి వెళ్లలేని పరిస్థితి ఎదురైంది. దీంతో యశ్వంత్ పొలం పనులు చేయడం మొదలుపెట్టారు.

ఆరేళ్ల తర్వాత యశ్వంత్ అన్నయ్య వామన్, ఆర్మీ నుంచి రిటైర్మెంట్ తీసుకొని గ్రామానికి తిరిగొచ్చారు. అప్పుడు తన అన్నయ్య తరహాలోనే సైన్యంలో చేరాలని యశ్వంత్ నిర్ణయించుకున్నారు.

యశ్వంత్ శరీరాకృతి సన్నగా ఉండేది. కానీ, ఆయన బలంగా ఉండేవారు. ఆయనకు కర్రలతో నడవడం, లాఠీ తిప్పడం, వ్యాయామం చేయడం అంటే చాలా ఇష్టం.

యశ్వంత్ సైన్యంలో చేరడం వితాబాయికి ఇష్టం లేదు. కానీ వామన్, యశ్వంత్ పట్టుబట్టడంతో ఆమె దీనికి ఒప్పుకోవాల్సి వచ్చింది.

యశ్వంత్ ఘాడ్గే

కానీ, ఆమె ఒక షరతు పెట్టారు. ఆర్మీలో చేరకముందే పెళ్లి చేసుకుంటేనే ఆర్మీలో చేరడానికి అనుమతిస్తానని వితాబాయి మొండిపట్టు పట్టడంతో చివరకు యశ్వంత్ తల్లి షరతుకు అంగీకరించారు.

18 ఏళ్ల వయస్సులో పట్నూస్‌కు చెందిన పాండురంగ మహాముంకర్ కుమార్తె లక్ష్మీ బాయిని ఆయన పెళ్లి చేసుకున్నారు. 1937లో వారి వివాహం అయింది.

1938లో 5వ మరాఠా లైట్ పదాతిదళంలో యశ్వంత్ సైనికుడిగా చేరారు.

ఆర్మీలో ఆయన మెరుగైన పనితీరు కనబర్చడంతో, చాలా తక్కువ కాలంలోనే ఆయనకు పదోన్నతులు లభించాయి. ఆయన నాయక్ స్థాయికి ఎదిగారు.

అదే సమయంలో రెండో ప్రపంచ యుద్ధం తాలూకూ అలజడి మొదలైంది.

రెండో ప్రపంచ యుద్ధంలో ఘాడ్గే ప్రదర్శన

రెండో ప్రపంచ యుద్ధం 1939-1945 మధ్య జరిగింది. సైనిక చరిత్రకారుడు మన్‌దీప్ సింగ్ బజ్వా ప్రకారం, బ్రిటిష్ వారి తరఫున పోరాడటానికి 5వ మరాఠా లైట్ పదాతిదళాన్ని ఇటలీకి పంపారు.

ఆ సమయంలో మరాఠా లైట్ పదాతి దళంలో నాయక్ యశ్వంత్ ఘాడ్గే ముఖ్యమైన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

యశ్వంత్ ఘాడ్గే సారథ్యంలోని మరాఠా యూనిట్ ఇటలీ, జర్మనీపై పోరాడుతోంది. రెండో ప్రపంచ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది.

ఆ రోజు 1944 జులై 10వ తేదీ. జర్మన్ దళాల ఆధీనంలో ఉన్న శిబిరాన్ని స్వాధీనం చేసుకోవడానికి తన బృందంతో కలిసి యశ్వంత్ ఘాడ్గే ఇటలీలోని టైబర్ నది లోయలోకి ప్రవేశించారు.

"అప్పుడు అక్కడే అడవిలో దాక్కున్న జర్మన్ సేనలు అకస్మాత్తుగా వారిపై దాడి చేశాయి. తుపాకులు, టామీ గన్లతో రెండు వైపుల నుంచి కాల్పులు ప్రారంభించాయి. శత్రువులు భారీ మెషిన్ గన్‌లతో ఘాడ్గే బృందంపై కాల్పులు జరిపారు. దీంతో ఘాడ్గే దళంలోని చాలా మంది సైనికులు చనిపోయారు. తనతో పాటు తోటి సైనికులు ఎవరూ లేరని తెలిసినప్పటికీ ఆయన పారిపోయేందుకు ప్రయత్నించలేదు. పైగా పోరాడుతూనే ఉన్నారు’’ అని బీబీసీతో బజ్వా చెప్పారు.

ఘాడ్గే మొదటగా ఒక గ్రెనెడ్‌ను మెషీన్ గన్ వైపు విసిరేశారు. దీంతో శత్రువు మెషీన్ గన్ ధ్వంసమైంది. ఆ వెంటనే టామీ గన్‌లతో అక్కడ ఉన్న శత్రు సేనలపై కాల్పులు జరిపారు.

ఘాడ్గే దాడిలో శత్రు పోస్ట్‌కు కాపలాగా ఉన్న నలుగురు ఇటాలియన్ సైనికులు మరణించారు.

అన్ని దళాలు చుట్టుముడుతున్నప్పటికీ, ఆయన జర్మన్ దళాలపై దాడిని కొనసాగిస్తూనే ఉన్నారు.

శత్రువుపై ముఖాముఖి దాడి చేస్తున్నప్పుడు, తమ వద్ద ఉన్న కాట్రిడ్జ్‌లు, హ్యాండ్ గ్రెనేడ్‌ల నిల్వలు అయిపోయినట్లు ఘాడ్గే గ్రహించారు.

అయినప్పటికీ ఘాడ్గే వెనక్కి తిరిగి చూడకుండా తన తుపాకీని పట్టుకొని శత్రు సైనికులపైకి దూసుకెళ్లారు.

తుపాకులతో కాలుస్తూ శత్రు సైనికులను అణిచివేయడం ప్రారంభించారు. చివరకు ‘గోతిక్ రేఖ’ను ఘాడ్గే బృందం స్వాధీనం చేసుకుంది.

అయితే, పక్కనే ఉన్న ట్రెంచ్‌లో దాక్కున్న ఒక జర్మన్ సైనికుడు అదను చూసి తుపాకీతో కాల్చాడు.

ఆ బుల్లెట్ ఘాడ్గేను తాకడంతో ఆయన అదే రోజు మరణించారు. 1944 జులై 10న అంటే 22 ఏళ్ల వయస్సులో ఆయన చనిపోయారు. ఈ యుద్ధంలో ఆయన ధైర్యంగా పోరాడారు. కానీ, ఆయన మృతదేహం లభించలేదు.

లెఫ్టినెంట్ జనరల్ డీబీ షేకట్కర్ కూడా ఘాడ్గే ధైర్యసాహసాలను ధ్రువీకరించారు.

‘‘నాయక్ యశ్వంత్ ఘాడ్గే ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గానూ ఆయనకు మరణానంతరం దిల్లీలోని ఎర్రకోట ముందు విక్టోరియా క్రాస్‌ను ప్రదానం చేశారు. 'విక్టోరియా క్రాస్'ను బ్రిటిష్ సైన్యంలో అత్యున్నత గౌరవంగా పరిగణిస్తారు’’ అని బీబీసీతో షేకట్కర్ చెప్పారు.

వైస్రాయ్, గవర్నర్ జనరల్ ఫీల్డ్ మార్షల్ లార్డ్ వేవెల్ ఈ గౌరవ పతకాన్ని లక్ష్మీబాయికి అందజేశారు.

ఆయన జ్ఞాపకార్థం మంగావ్‌లోని మావేలేదార్ కచేరి సమీపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

మంగావ్‌లో ప్రతీ ఏడాది జనవరి 9న 'ఘాడ్గే మహోత్సవ్'ను జరుపుకుంటారు.

లండన్ గెజిట్ , నేషనల్ ఆర్మీ మ్యూజియం , లండన్, మహారాష్ట్ర నాయక్, ఇండియన్ ఆర్మీ డాక్యుమెంట్‌లలో ఘాడ్గే ఘనతలను వివరంగా రాశారు.

రెండో ప్రపంచ యుద్ధంలో మరాఠా లైట్ పదాతిదళం పాత్ర

1768 ఆగస్టు 4వ తేదీన బొంబాయిలో మరాఠా రెజిమెంట్ ఏర్పడింది. అప్పట్లో దీన్ని '1 మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీ' అని పిలిచేవారు.

ఈ మరాఠా రెజిమెంట్, మొదటి ప్రపంచ యుద్ధంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో కీలక పాత్ర పోషించిందని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీబీ షెకట్కర్ చెప్పారు.

"ఇటలీలోని ‘సిటా డి కాస్టెలో’, సెనియో నది ఒడ్డున మరాఠా రెజిమెంట్ ప్రదర్శించిన పనితీరును ఇప్పటికీ అందరూ గుర్తు చేస్తుంటారు. షోలాపూర్‌కు చెందిన నామ్‌దేవ్ జాదవ్ కూడా విక్టోరియా క్రాస్ అవార్డును అందుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌పై మరాఠా సైన్యం పోరాడింది. ఈ రెజిమెంట్‌కు ‘‘బ్యాటిల్ హానర్’’ అవార్డు లభించింది’’ అని ఆయన వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)