మణిపుర్: వేర్పాటువాదం, తీవ్రవాదం, హింస ఇక్కడెలా పుట్టుకొచ్చాయంటే....

ఫొటో సోర్స్, ANI
- రచయిత, సల్మాన్ రావీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మణిపుర్‌లో శాంతిని పునరుద్ధరించేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వివిధ రాజకీయ పార్టీలు, తెగల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే ఉన్నారు.
అయినప్పటికీ, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు.
మణిపుర్‌లోని మైతేయీ కమ్యూనిటీ వారికి ట్రైబల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
ఈ అంశంపై మైతేయీ కమ్యూనిటీకి, కూకీ తెగ ప్రజలకు మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. అక్కడ పరిస్థితి అదుపు తప్పింది.
రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడానికి ఆర్మీని మోహరించే స్థాయికి అక్కడి పరిస్థితులు దిగజారాయి.
రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, హింసాత్మక ప్రాంతాల నుంచి సురక్షిత శిబిరాలకు దాదాపు 20 వేల మందిని తరలించినట్లు మణిపుర్ ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ చెప్పారు.
మణిపుర్‌లో శాంతిని నెలకొల్పడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని వివిధ రంగాల ప్రతినిధులు, రాజకీయ పార్టీలతో చర్చ సందర్భంగా హోం మంత్రి అమిత్ షా అన్నట్లు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.
ఆర్మీ, పోలీస్, పాలక యంత్రాంగం ప్రతినిధులతో సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు.
పీటీఐ వార్తా సంస్థ ప్రకారం, మే 3వ తేదీన మణిపుర్‌లో చెలరేగిన ఆకస్మిక హింస కారణంగా మొత్తం 80 మంది చనిపోయారు.
భారత్‌లో మణిపుర్ విలీనం కాకముందు రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ బలగాలు వరుసగా రెండేళ్ల పాటు ఇక్కడ బాంబు దాడి చేశాయి.

ఫొటో సోర్స్, ANI
మణిపుర్‌గా పేరు పెట్టిన గరీబ్ నవాజ్ మహరాజు
‘‘హిస్టరీ ఆఫ్ మణిపుర్’’ అనే పుస్తకాన్ని ప్రముఖ చరిత్రకారులు జ్యోతిర్మయి రాయ్ రాశారు.
మైతేయీ మహరాజు ‘‘పామహేయీబా’’ను గరీబ్ నవాజ్ అనే పేరుతో పిలిచేవారు. ఆయనే ఈ ప్రాంతంలో హిందూ మతాన్ని స్థాపించారని ఆ పుస్తకంలో జ్యోతిర్మయి పేర్కొన్నారు.
మణిపుర్‌లో తొలి హిందూ మహరాజు ఆయనే. 1709 నుంచి 1751 వరకు ఆయన మణిపుర్‌ను పాలించారు.
ఆయన మైతేయీ ధర్మాన్ని విడిచిపెట్టి హిందూ మతాన్ని స్వీకరించారు. తన రాజ్యంలో హిందూ మతాన్ని అమలు చేశారు.
మైతేయీ ప్రజలందరినీ హిందూ మతంలో చేర్చిన వ్యక్తిగా ఆయనను చరిత్రకారులు పరిగణిస్తారు.
గరీబ్ నవాజ్ నిజానికి వైష్ణవ శాఖను అనుసరించేవారు.
తన సామ్రాజ్యం పేరును కాంగ్లీపాక్ నుంచి మణిపుర్‌గా మహారాజా పామహేయిబా మార్చినట్లు అనేక మంది చరిత్రకారులు తమ పుస్తకాల్లో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
బర్మా, మణిపుర్ యుద్ధం
ఇది 1819 నాటి సంగతి. అప్పుడు రాజు మర్జీత్ పాలనలో మణిపుర్ ఉండేది. అదే ఏడాది మణిపుర్‌పై బర్మా దండెత్తింది. మణిపుర్ పాలన చాహీ ఖారెట్ తుంగపా చేతిలోకి వెళ్లింది. చాహీ ఖారెట్ తుంగపా మణిపుర్ రాజు అయ్యారు.
కొన్నేళ్ల తర్వాత, అంటే 1825లో గంబీర్ సింగ్ నేతృత్వంలో మణిపుర్ ప్రజలు రాజుపై యుద్ధానికి దిగి ఆయనను ఓడించారు. మణిపుర్‌లో తమ పాలనను పునరుద్ధరించుకున్నారు.
గంబీర్ సింగ్ మరణం తర్వాత ఆయన కుమారుడు చంద్రకీర్త్ తదుపరి రాజు అయ్యారు. 1886లో చంద్రకీర్త్ కూడా చనిపోయారు. అప్పుడు ఆయన పెద్ద కుమారుడు సూరజ్ చంద్, మణిపుర్ రాజ్యానికి రాజు అయ్యారు.
రాజా సూరజ్ చంద్ పాలన కేవలం 1890 వరకే సాగింది. ఎందుకంటే ఆయన సోదరులు సూరజ్‌పై తిరుగుబాటు చేశారు.
తర్వాత కుల్లాచంద్ రాజు అయ్యారు. అయితే, ఈలోగా 1891 ఏప్రిల్‌లో బ్రిటిష్ సైన్యం, మణిపుర్‌పై దాడి చేసింది.
1891 నుంచి 1941 వరకు మహారాజా చురాచాంద్ సింగ్ మణిపుర్‌ను పాలించారు. మణిపుర్‌ను పాలించిన చివరి రాజు బుధాచంద్ర్ సింగ్. ఆయన పాలన 1949 వరకు సాగింది.
అనేక మంది చరిత్రకారులు మణిపుర్ రాజకీయ చరిత్ర గురించి తమ పుస్తకాల్లో పేర్కొన్నారు.
ఈ చరిత్ర గురించి ముఖ్యంగా ప్రొఫెసర్ లాల్ దెనా రాసిన ‘‘హిస్టరీ ఆఫ్ మోడ్రన్ మణిపుర్’’ అనే పుస్తకంలో ప్రస్తావించారు.
‘‘నింగ్‌థౌజా’’ వంశానికి చెందిన 10 తెగలు కలవడంతో మణిపుర్ రాజ్యం ఏర్పడిందని పలువురు చరిత్రకారులు తమ పుస్తకాల్లో పేర్కొన్నారు.
ఈ ప్రాంతం బర్మా, చైనాకు ప్రముఖ వాణిజ్య కేంద్రంగా ఉండేదని కూడా చరిత్రకారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రెండో ప్రపంచ యుద్ధంలో మణిపుర్ విధ్వంసం
రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ సైన్యానికి, మిత్రదేశాల సైన్యానికి మధ్య జరుగుతున్న యుద్ధానికి మణిపుర్ ప్రధాన కేంద్రంగా మారింది.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ సారథ్యంలోని ‘ఆజాద్ హింద్ ఫౌజ్’’కి జపాన్ సైన్యం మద్దతు ఇచ్చింది. జపాన్ సైన్యం సహకారంతో బ్రిటిష్ పాలనను అంతం చేయాలని బోస్ కోరుకున్నారు.
కానీ, ఇక్కడ జపాన్ సైన్యంతో పాటు ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యం ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది.
మణిపుర్ రెండేళ్ల పాటు బాంబు దాడులను ఎదుర్కొంది. దీని ఫలితంగా అక్కడ పెను విధ్వంసం జరిగింది. ఈ సమయంలో ఇంఫాల్‌లోని కింగ్ ప్యాలెస్ కూడా దెబ్బతింది.
ఈ విధ్వంసం తర్వాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మణిపుర్ ప్రజలు ఉద్యమించడం మొదలుపెట్టారు.
చివరకు 1947లో ప్రావిన్స్ పగ్గాలను బ్రిటిష్ ప్రభుత్వం మహారాజా బుధాచంద్ర్‌కు అప్పగించింది.
1947 ఆగస్టు 28వ తేదీన మహారాజా బుధాచంద్ర్ అప్పటి జాతీయ జెండాను పట్టుకొని ఇంఫాల్‌లోని కాంగ్లాకు వెళ్లారు. ఆయన వెంట వేలాది మణిపుర్ ప్రజలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా 18 ఫిరంగులను పేల్చి సంబరాలు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో విలీనం
భారత్‌లో మణిపుర్ విలీనానికి సంబంధించిన పత్రాలపై 1949 సెప్టెంబర్ 21న షిల్లాంగ్‌లో మణిపుర్ మహారాజు సంతకాలు చేశారు. అదే ఏడాది అక్టోబర్ 15న భారత్‌లో మణిపుర్ అంతర్భాగంగా మారింది.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను భారత సైన్యానికి చెందిన మేజర్ జనరల్ అమర్ రావల్ చేశారు. మహారాజా బుధాచంద్ర్ 1955లో మరణించారు.
స్వతంత్ర భారతంలో మణిపుర్ కూడా భాగమైంది. ఎన్నికైన శాసనసభ ద్వారా అక్కడ ప్రభుత్వం ఏర్పడింది.
తర్వాత 1956 నుంచి 1972 వరకు మణిపుర్ ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. మణిపుర్ ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ రాజకీయ, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళనలను కొనసాగించాయి.
చివరకు 1972 జనవరి 21న మణిపుర్‌కు ప్రత్యేక రాష్ట్రం హోదా లభించింది.
విలీనం తర్వాత మొదలైన సంఘర్షణ
మణిపుర్‌లో అనేక కులాలు, తెగలు ఉన్నాయి. వాటిలో పరస్పర వివాదాల కారణంగా సంఘర్షణ మొదలైంది.
ప్రభుత్వ పత్రాల ప్రకారం, మణిపుర్‌లో దాదాపు 30 కులాలు, తెగలు ఉన్నాయి. వీటిలో అత్యంత ముఖ్యమైనది మైతేయీ కమ్యూనిటీ. మణిపుర్ మొత్తం జనాభాలో వీరు 50 శాతం ఉంటారు.
మైతేయీ తెగతో పాటు నాగా, కుకీ, పెతెస్, థాదౌస్, సిమ్తెస్, రాల్తెస్, గంగ్తెస్ తెగలు కూడా మణిపుర్‌లో నివసిస్తున్నాయి.
1956లో కేంద్ర పాలిత ప్రాంతంగా మణిపుర్‌ను ప్రకటించిన తర్వాతే అక్కడ సంఘర్షణలు మొదలయ్యాయని నిపుణులు నమ్ముతారు. ఆ తర్వాత ఈ సంఘర్షణలు కాస్తా హింసాత్మక పోరాటాలుగా మారిపోయాయని వారు చెబుతారు.
‘‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్’’ ప్రకారం ఈ వివాదాలే వేర్పాటువాదం పుట్టుకకు కారణమయ్యాయి.
ఈ సమయంలోనే అనేక వేర్పాటువాద సంస్థలు పుట్టుకొచ్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
గెరిల్లా యుద్ధం
‘‘యునైటెడ్ లిబరైజేషన్ ఫ్రంట్’’ అనే సంస్థను సమరేంద్ర సింగ్ స్థాపించారని, ఈ సంస్థ స్వాతంత్ర్యంతో పాటు సోషలిస్టు భావజాలాన్ని సమర్థించడం మొదలుపెట్టిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ మేనేజ్‌మెంట్ తన రిపోర్టుల్లో ఒకదానిలో పేర్కొంది.
ఈ సంస్థ నాయకుల్లో ఒకరైన ఓయినమ్ సుధీర్ కుమార్ ప్రత్యేక వర్గంగా ఏర్పడి ప్రభుత్వానికి సమాంతరంగా మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 1968 డిసెంబర్ నెలలో ఇది జరిగింది.
ఓయినమ్ సుధీర్ కుమార్‌కు చెందిన తిరుగుబాటు ప్రభుత్వం పాకిస్తాన్‌లోని సిల్హెట్‌లో ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం సిల్హెట్ ప్రాంతం బంగ్లాదేశ్‌లో ఉంది.
అయితే 1971 తర్వాత అప్పటి మణిపుర్ ముఖ్యమంత్రి దోరెంద్రో సింగ్ పలువురు వేర్పాటువాద నాయకులను లొంగిపోయేలా చేశారు. మరికొందరు మైతేయీ వేర్పాటువాద నాయకులను అరెస్ట్ చేశారు.
‘‘ఇలా అరెస్ట్ అయిన వారిలో వేర్పాటువాద నేత ఎన్. బిశ్వేశ్వర్ సింగ్ కూడా ఉన్నారు. ఆయనను త్రిపుర జైలులో ఉంచారు. ఆ జైలులోనే ఉన్న ఇతర మావోయిస్టు నేతలను ఆయన కలిశారు’’ అని నివేదిక పేర్కొంది.
1975 జూన్‌లో విడుదలైన తర్వాత 16 మంది మైతేయీ వేర్పాటువాద నేతలతో కలిసి బిశ్వేశ్వర్ సింగ్, టిబెట్‌లోని లాసాలో ఆశ్రయం పొందారు.
ఆయుధ శిక్షణ, గెరిల్లా యుద్ధంలో శిక్షణ పొందిన తర్వాత సహచరులతో కలిసి ఆయన మణిపుర్‌కు తిరిగొచ్చారు.
మణిపుర్‌కు రాగానే ‘‘జన్ముక్తి గెరిల్లా సైన్యం’’ పేరుతో ఆర్మీని ఏర్పాటు చేసి వేర్పాటువాద పోరాటాన్ని మళ్లీ మొదలుపెట్టారు.
1970ల చివర్లో, 1980ల ప్రారంభంలో అనేక వేర్పాటువాద సంస్థలు ఆవిర్భవించాయి. అప్పుడే ఆర్కే తులాచంద్రకు చెందిన ‘‘పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ ఆఫ్ కాంగ్లీపాక్’’, కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (కేసీపీ), పొయిరే లిబరేషన్ ఫ్రంట్, మైతేయీ స్టేట్ కమిటీ, యునైటెడ్ పీపుల్స్ రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీలు కూడా అప్పడే ఏర్పడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
1980ల చివరి నాటికి మణిపుర్ పూర్తిగా తీవ్రవాదం పట్టులో చిక్కుకుపోయింది.
1989 ఏప్రిల్ 8న మణిపుర్ రాజధాని ఇంఫాల్‌కు సమీపంలో ఐపీఎస్ అధికారి వందన మల్లిక్‌ను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) హత్య చేసింది.
పీఎల్‌ఏ రాజకీయ విభాగం అయిన రివల్యూషనరీ పీపుల్స్ ఫ్రంట్ (ఆర్‌పీఎఫ్) సంస్థ బంగ్లాదేశ్ నుంచి ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి భోరోత్ సింగ్ అధ్యక్షత వహించారు.
మయన్మార్, బంగ్లాదేశ్‌లలో ఈ సంస్థకు సంబంధించిన అనేక శాఖలు చురకుగా మారాయి.
మరోవైపు నాగా తీవ్రవాదులు కూడా చురుగ్గా మారడం మొదలైంది. నాగా తెగ వారి ఆధిపత్యం ఉండే చందేల్, ఉఖ్రుల్, తామెంగ్‌లంగ్, సెనాపతి జిల్లాల్లో ఐజాక్ ముయివా నేతృత్వంలోని ‘‘నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్’’ సంస్థ వరుస హింసాత్మక ఘటనలకు పాల్పడింది.
1993 మే నుంచి సెప్టెంబర్ వరకు ఈ సంస్థకు చెందిన తీవ్రవాద దాడుల్లో దాదాపు 120 మంది సైనికులు చనిపోయారు.
ఆ తర్వాత నాగా, కుకీ తెగల తీవ్రవాద సంస్థల మధ్య వివాదం మొదలైంది.

ఫొటో సోర్స్, ANI
1958 సాయుధ దళాల చట్టం అమలు
ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద కార్యకలాపాలను, హింసను నివారించడానికి 1958లో సాయుధ దళాల చట్టాన్ని రూపొందించారు.
తొలుత ఈ చట్టం నాగాలు అధికంగా ఉండే ఉఖ్రుల్ జిల్లాలో మాత్రమే అమల్లో ఉండేది. కానీ, 1981 సెప్టెంబర్ 18న ఈ చట్టాన్ని మణిపుర్ మొత్తానికి వర్తింపచేశారు.
2004లో ఇంఫాల్‌లోని కొన్ని మున్సిపాలిటీల్లో దీన్ని తొలగించారు.
మణిపుర్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, అస్సాం, మేఘాలయలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు 50 ఏళ్లుగా ఈ చట్టం అమల్లో ఉంది.
ఇవి కూడా చదవండి:
- పదిహేనేళ్ల కిందట షేన్ వార్న్, ఇప్పుడు ధోనీ.. 41 ఏళ్ల ‘మిస్టర్ కూల్’ టీ20 కెప్టెన్సీని ఎలా మార్చేశాడు
- మిల్క్ డే: పచ్చిపాలా, మరగబెట్టినవా? ఆరోగ్యానికి ఏవి మంచివి?
- భారీగా రూ.500 దొంగ నోట్లు.. నకిలీ నోటును ఇలా గుర్తించవచ్చు
- మీరు సూర్యుడిని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు
- రెజ్లర్ల నిరసన: బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణలు రుజువైతే ఎన్నేళ్ల శిక్ష పడుతుంది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















