మణిపుర్: ‘ప్రాణాలు కాపాడుకోవాలంటే పరిగెత్తాల్సిందే... మరో దారి లేదు’

ఫొటో సోర్స్, MANISH JALUI/BBC
- రచయిత, రాఘవేంద్ర రావ్
- హోదా, బీబీసీ న్యూస్, మణిపుర్
‘‘అన్నీ ధ్వంసం చేశారు. మాకు ఏమీ మిగల్లేదు.’’ ఇంఫాల్‌లోని పాంగేయి ప్రాంతంలోని తాత్కాలిక శిబిరంలో ఒక మూలన కూర్చున్న బసంత సింగ్ మాతో మాట్లడారు. మాట్లాడేటప్పుడు ఆయన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు.
ఈశాన్య రాష్ట్రంలో తెగల మధ్య హింసతో అట్టుడికిన సైకుల్ ప్రాంతం నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని తన భార్య, ఇద్దరు పిల్లలతో సింగ్ ఇక్కడికి వచ్చారు.
మైతేయీ తెగకు చెందిన సింగ్.. కుకీ తెగలు ఎక్కువగా జీవించే సైకుల్ ప్రాంతంలో రెండు దశాబ్దాలుగా జీవిస్తున్నారు. అక్కడ ఆయన ఒక కిరాణా దుకాణం నడిపేవారు.
ఘర్షణలు మొదలైనప్పుడు, సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని తన కుకీ మిత్రులు సింగ్‌కు సూచించారు.
‘‘మేం ఏళ్ల నుంచీ అక్కడే జీవించే వాళ్లం. అక్కడుండే కుకీ ప్రజలతో మాకు మంచి సంబంధాలుండేవి’’అని ఆయన చెప్పారు.
‘‘బహుశా అందుకే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కొందరు మిత్రులు నాకు సూచించారు’’అని ఆయన అన్నారు.
అయితే, కుకీ ప్రజల్లో తనకు మంచి పేరు ఉందని, అందుకే తనకు ఏమీకాదని ఆయన భావించారు. కానీ, కొన్ని మూకలు ఆయన దుకాణాన్ని లూటీచేశాయి.
‘‘నాకు వేరే మార్గం కనిపించలేదు. ప్రాణాలు మిగలాలంటే పరిగెట్టాల్సిందే. ఇది అంతర్యుద్ధం లాంటిది’’అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, MANISH JALUI/BBC
గత వారం మణిపుర్‌లో హింస చెలరేగింది. మైతేయీలకు గిరిజన హోదా ఇవ్వాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి.
రాష్ట్ర జనాభాలో మైతేయీల వాటా 53 శాతం వరకూ ఉంటుంది. వీరిని గిరిజనుల జాబితాలో చేరిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు వీలు పడుతుంది.
మరోవైపు అటవీ భూములపైనా హక్కులనూ ఈ గిరిజన హోదా కల్పిస్తోంది. అయితే, మైతయీలకు గిరిజన హోదా కల్పించడంతో రిజర్వేషన్లలో తమ వాటా తగ్గిపోతుందని ఇప్పటికే గిరిజనులుగా గుర్తింపు పొందిన తెగలు చెబుతున్నాయి. శతాబ్దాల నుంచి తమ దగ్గరే ఉన్న అటవీ భూములకూ దీంతో ముప్పు పొంచివుందని భావిస్తున్నాయి.
మణిపుర్ లోయ ప్రాంతంలో ఎక్కువగా మైతేయీ ప్రజలు జీవిస్తున్నారు. చుట్టుపక్కల కొండ ప్రాంతాల్లో కుకీలదే ఆధిక్యం. అయితే, ఇటు మైతేయీలు ఆధిక్యంగా ఉండే ప్రాంతంలో కుకీలు, కుకీలు ఆధిక్యంగా ఉండే ప్రాంతంలో మైతేయీలు స్వల్ప మొత్తంలో జీవిస్తుంటారు. హింస మొదలైనప్పుడు, మొదట ఆ ప్రభావానికి గురైంది వీరే.
కుకీల ఆధిప్యతమున్న ప్రాంతాల్లో మైతేయీలను, మైతేయీలు ఆధిపత్యమున్న ప్రాంతాల్లో కుకీలను ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. కొన్నిచోట్ల మొత్తం గ్రామాలనే తగులబెట్టారు. ఇళ్లు, వాహనాలకు నిప్పు పెట్టారు.
కొన్ని గంటల సమయంలో సింగ్ లాంటి వేల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఫొటో సోర్స్, MANISH JALUI/BBC
పరిస్థితులు మరింత దిగజారడంతో, భారత సైన్యం, సాయుధ బలగాలను మణిపుర్‌లో మోహరించారు. ముఖ్యంగా కల్లోలిత ప్రాంతంలో మైనారిటీలుగా జీవిస్తున్న వారిని సైనికులు మొదటగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
పర్వత ప్రాంతమైన సైకుల్ నుంచి సింగ్, ఆయన కుటుంబాన్ని ఇంఫాల్‌లోని మైదాన ప్రాంతంలో ఏర్పాటుచేసిన శిబిరాలకు సైన్యం తీసుకొచ్చింది.
పరిణామాలన్నీ చాలా వేగంగా మారిపోయాయని, దీంతో కొన్ని బట్టలు, ఆభరణాలు తప్పా వేరే ఏమీ తమ వెంట తెచ్చుకోలేకపోయామని సింగ్ వివరించారు.
‘‘సైకుల్‌లో మాకు అన్నీ ఉండేవి. మా పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు, ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఉండేవి’’ అని కన్నీటితో ఆయన చెప్పారు. ‘‘ఇక్కడకు వచ్చిన తర్వాత తమ బూట్లు ఏమయ్యాయని పిల్లలు అడుగుతున్నారు. ఫుట్‌బాల్ ఆడాలంటే బూట్లు కావాలి కదా అంటున్నారు. ఆ మాటలు వింటుంటే గుండె బద్దలు అవుతోంది’’అని ఆయన చెప్పారు.
కొన్ని రోజుల నుంచి తనకు నిద్ర కూడా పట్టడంలేదని సింగ్ అన్నారు. ‘‘నేను పిల్లలను ఇప్పుడెలా చదివించుకోవాలి. నాకు ఉద్యోగం లేదు. డబ్బులు లేవు, ఇల్లు కూడా లేదు’’ అని ఆయన అన్నారు.
‘‘ఎన్ని రోజులు మేం ఇక్కడే ఉండాలి? ఇక్కడి నుంచి మేం ఎక్కడికి వెళ్లాలి. ఇవే ఆలోచనలు నిత్యం నన్ను వెంటాడుతున్నాయి’’అని ఆయన చెప్పారు.
ఇక్కడ సింగ్ లాంటి చాలా మంది ఉన్నారు. ఇంఫాల్ నుంచి 40 కి.మీ. దూరంలో సైఖో గ్రామంలోని ఓ చర్చి పరిసరాల్లో ఏర్పాటుచేసిన మరో తాత్కాలిక శిబిరంలో పీ గిన్‌లాల్ కనిపించారు.
తమ గ్రామాన్ని కొన్ని మూకలు తగులబెట్టే సమయంలో కుకీ తెగకు చెందిన గిన్‌లాల్ అక్కడి నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.
‘‘మా ఇళ్లకు వారు నిప్పు పెట్టారు’’అని ఏడుస్తూ ఆయన చెప్పారు. ‘‘తృటిలో మేం ప్రాణాలతో తప్పించుకున్నాం. లేదంటే మా ప్రాణాలు కూడా పోయేవి’’అని ఆయన అన్నారు.
మొదట గిన్‌లాల్ కుటుంబం అటవీ ప్రాంతంలోకి పరుగులు తీసింది. అక్కడి నుంచి సైనికులే వీరిని సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చారు.
ప్రభుత్వం సమయానికి చర్యలు తీసుకొని ఉండుంటే ఇంత హింస చెలరేగి ఉండేదికాదని గిన్‌లాల్ చెప్పారు. ‘‘అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది. మేమేమైనా విదేశీయులమా?’’అని ఆయన ప్రశ్నించారు.
కొన్ని ఏళ్ల క్రితమే గిన్‌లాల్ సైన్యం నుంచి పదవీ విరమణ పొందారు. ప్రభుత్వం నుంచి వచ్చే పింఛనుపైనే ఈ కుటుంబం ఆధారపడి జీవిస్తోంది.
‘‘మేం పొలాల్లో కూడా పనిచేసేవాళ్లం. కానీ, ఇప్పుడు ఏమీ మిగల్లేదు. మళ్లీ మా గ్రామానికి వెళ్లగలమో లేదో కూడా తెలియదు’’అని ఆయన చెప్పారు.
ఈ ఇబ్బందుల నుంచి వయసు పైబడిన తన తల్లి బతికి బట్టకట్టడం చాలా కష్టమని ఆయన అన్నారు. ‘‘మేం వచ్చేటప్పుడు ఆమె మందులను కూడా తీసుకురాలేదు’’అని ఆయన చెప్పారు.
ఈ హింసకు కారణమైన వారు ఎవరో ప్రభుత్వం గుర్తించాలి. వారిపై చర్యలు తీసుకోవాలి’’అని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ప్రజలు ఇలా చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోతే ఇక ఇక్కడ శాంతి అనేదే ఉండదు. ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతాయి. ప్రతీకారంలో ప్రజలు మరింత హింసకు పాల్పడతారు’’అని ఆయన అన్నారు.
వేరే ప్రాంతాలకు కట్టుబట్టలతో వచ్చిన చాలామంది కుకీ, మైతేయీ ప్రజల్లో నేడు ఆగ్రహం కనిపిస్తోంది. భవిష్యత్‌లో ఇంకా ఏమవుందోనని వారు ఆందోళనతో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్లో ‘డర్టీ హ్యారీ’ ఎవరు, ఇమ్రాన్ ఖాన్ పదే పదే ఆ పేరెందుకు చెబుతున్నారు?
- ఐపీఎల్ 2023లో ధోనీ మహేంద్రజాలం కొనసాగుతోంది... 27 పరుగులతో దిల్లీ జట్టును ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్
- కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: ఎగ్జిట్ పోల్స్ ఎలా నిర్వహిస్తారు? కచ్చితత్వం ఎంత?
- మహిళా రెజ్లర్లు: ప్రభుత్వ అధికారాన్ని, రాజకీయ పలుకుబడిని సవాల్ చేస్తున్న ఈ నిరసన ఏం చెబుతోంది?
- డోనల్డ్ ట్రంప్: అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ బరిలోకి దిగాలనే ఆయన ఆశలకు లైంగిక వేధింపుల కేసు తీర్పు గండి కొడుతుందా?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
















