క్రైస్తవులు ఎక్కువగా ఉండే నాగాలాండ్‌లో బీజేపీ ఎలా ఎదుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దిల్‌నవాజ్ పాషా, సెరాజ్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధులు
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో క్రైస్తవ జనాభా ఎక్కువ. ఇక్కడ ప్రజల్లో సుమారు 90 శాతం మంది క్రైస్తవులే.
సుమారు 150 ఏళ్ల కిందట నాగాలాండ్‌లో తొలిసారి క్రైస్తవం అడుగు పెట్టింది. నేడు అక్కడి ప్రజల ఉనికి, సాంస్కృతిక చిహ్నాలకు క్రైస్తవమే ప్రతీకగా ఉంది. దిమాపుర్, కోహిమా వంటి పట్టణాలు కావొచ్చు చిన్నచిన్న ఊర్లలో కావొచ్చు తొలుత మనకు కనిపించేది చర్చిలే.
దిమాపుర్ సమీపంలోని తొలువి గ్రామంలో గల 1953 నాటి బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనల తరువాత, ఎన్నికల గురించి కూడా అక్కడి మతబోధకుడు డాక్టర్ హికొటే మాట్లాడారు. నిజాయతీ కలిగిన వ్యక్తికి మాత్రమే ఓటు వేయాలంటూ ఆయన అక్కడి వారికి పిలుపునిచ్చారు.
ఇలా ఎన్నికలకు సంబంధించిన ప్రసంగాలు నాగాలాండ్‌లోని చర్చిల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి.
2023 ఫిబ్రవరి 27న నాగాలాండ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. 2018 ఎన్నికల్లో నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ(ఎన్‌డీపీపీ)తో కలిసి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఎన్‌డీపీపీ 60 సీట్లలో బీజేపీ 20 సీట్లలో పోటీ చేస్తున్నాయి.
ఇక్కడ బలమైన ప్రతిపక్షం లేదు. కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, లోక్ జనశక్తి పార్టీతోపాటు అనేక స్థానిక పార్టీలు ఎన్నికల్లో పోటీపడుతున్నాయి.
2018 ఎన్నికల్లో నాగా పీపుల్స్ ఫంట్ర్(ఎన్‌పీఎఫ్)కు 60 సీట్లకు గాను 26 వచ్చాయి. కానీ 2021లో ఆ కూటమికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి ఎన్‌డీపీపీలో చేరారు.
ఈసారి 22 సీట్లలో మాత్రమే ఎన్‌పీఎఫ్ పోటీ చేస్తోంది. అందువల్ల అధికార పార్టీలకు బలమైన ప్రత్యర్థి ఎవరూ కనిపించడం లేదు.

ఫొటో సోర్స్, SIRAJ/BBC
అభివృద్ధి
నాగాలాండ్‌లో ఎక్కడ చూసినా బీజేపీ, నరేంద్ర మోదీ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి.
దిమాపుర్‌లో లాటరీ స్టాల్ నిర్వహిస్తున్న ఒక యువకునితో మాట్లాడాం. బీజేపీ చేస్తున్న అభివృద్ధి తనకు నచ్చిందని ఆ క్రైస్తవ యుకుడు మాతో అన్నాడు.
అభివృద్ధి విషయంలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే నాగాలాండ్ చాలా వెనుక పడి ఉంది. ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇక్కడ లేదు. రాజధాని కోహిమా వంటి పట్టణాలకు వెళ్లినప్పుడు గుంతలు పడిన రోడ్లు కనిపిస్తాయి.
‘బీజేపీ వచ్చాక అభివృద్ధి జరిగింది. వారు మా కోసం చాలా చేశారు. నేను క్రైస్తవున్ని. మా మతంలో వారు జోక్యం చేసుకోనంత వరకు నేను బీజేపీకి ఓటు వేస్తాను’ అని ఆ యువకుడు అన్నాడు.
హిందుత్వ ఇమేజ్ ఉన్న బీజేపీకి నాగాలాండ్‌లో ఉన్న నేతలంతా క్రైస్తవులే. వీరంతా పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు నిబద్ధతతో పని చేస్తున్నారు.
28ఏళ్లుగా రోజీ యంథన్ బీజేపీలో ఉన్నారు. నాగాలాండ్ బీజేపీ మహిళా మోర్చాను ఆమె నడిపిస్తున్నారు.
‘బీజేపీ, అభివృద్ధి రాజకీయాలు చేసే పార్టీ. ఇక్కడ అభివృద్ధితోపాటు ప్రజలకు మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు బీజేపీ వచ్చింది. మత పరమైన వివక్ష బీజేపీలో లేదు. మేం మా మతాన్ని అనుసరిస్తాం. ఏదో ఒక రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నా’ అని రోజీ అన్నారు.

ఫొటో సోర్స్, SIRAJ/BBC
ఆందోళనలు
హిందుత్వ పార్టీ అయిన బీజేపీ ఎదుగుదల నాగాలాండ్‌లోని కొందరికి ఆందోళన కలిగిస్తోంది.
‘నాగాలాండ్‌లో క్రైస్తవులు ఎక్కువగా ఉంటారు. మాది క్రైస్తవ మెజారిటీ రాష్ట్రం కాబట్టి మాకు భయమేమీ లేదు. కానీ ఇతర రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో చర్చిల మీద దాడులు జరుగుతున్నట్లుగా వింటున్నాం. క్రైస్తవులు తమ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించలేక పోతున్నారు.
ఇక్కడ మతంలో నేరుగా బీజేపీ జోక్యం చేసుకోనంత వరకు బీజేపీతో ప్రజలకు సమస్య ఉండదు. కానీ కొందరిలో ఆందోళనలు కూడా ఉన్నాయి’ అని తొలువి గ్రామంలోని బాప్టిస్ట్ చర్చి నుంచి బయటకు వస్తున్న మహిళ అన్నారు.

ఫొటో సోర్స్, SIRAJ/BBC
ఆదివాసీలు
షాలోమ్ బైబిల్ సెమినరీ అకడమిక్ డీన్‌గా ఉన్నారు డాక్టర్ విలొ నలెవో. క్లీన్ ఎలక్షన్ మూవ్‌మెంట్ కొ-ఆర్డినేటర్‌గా కూడా ఆయన ఉన్నారు.
గతంలో నాగాలాండ్‌లో బీజేపీకీ పెద్దగా సీట్లు వచ్చేవి కావు. 2003లో 7సీట్లు గెలవగా 2008లో 2 సీట్లను మాత్రమే గెలిచింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లలో విజయం సాధించింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షం ఎన్‌డీపీపీ ఒక్క ఎంపీ స్థానాన్నే గెలుచుకుంది.
‘నాగాలాండ్‌లో బీజేపీ రాజకీయాల వల్ల మాత్రమే ఎదగడం లేదు. ఆ పార్టీ ఆదివాసీల మీద కూడా ప్రధాన దృష్టి పెడుతోంది. గ్రామాల్లో స్కూళ్లు కడుతున్నారు. ఇతర మతాల వారిని కూడా కలుపుకొని పోతున్నారు. వారి మతాన్ని వదులుకోవాలని బీజేపీ చెప్పడం లేదు.
బీజేపీ నేరుగా క్రైస్తవాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ఇక్కడి యువతను వారణాసి వంటి ప్రాంతాల్లో చదువుకోవడానికి పంపుతోంది. అలా వెళ్లిన వారు తిరిగి రావడం వల్ల ఇక్కడ హిందీ విస్తరిస్తుందని అది భావిస్తోంది. అలాంటి ఒక హిందీ స్కూలు మా ఊర్లో ఉంది’ అని డాక్టర్ విలొ నలెవో అన్నారు.
డాక్టర్ విలొ నలెవో చెప్పిన హిందీ స్కూలు చూడటానికి విస్వేమా గ్రామానికి వెళ్లాం. 2003లో దాన్ని స్థాపించారు. భవనం పెద్దగానే ఉన్నా అక్కడ 10-15 మంది మాత్రమే చదువుకుంటున్నారు. వారిలో క్రైస్తవులే అధికం.
‘మా అమ్మాయి ఆ హిందీ స్కూల్లో చదువుకుంటోంది. బీజేపీ వల్లే అభివృద్ధి జరుగుతుందని మా ఆయన నమ్ముతున్నారు. వెనుకబడిన వర్గాల కోసం బీజేపీ పని చేస్తోంది. ఇక్కడ గ్రామాలను అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది’ అని హిందీ పాఠశాలకు దగ్గర్లోనే నివసించే సుష్మా రాయ్ అన్నారు.
నేపాల్ నుంచి వచ్చిన సుష్మా రాయ్ బీజేపీ మద్దతుదారు.

ఫొటో సోర్స్, SIRAJ/BBC
‘ప్రజలకు అర్థం కావడం లేదు’
బీజేపీ హిందుత్వ సిద్ధాంతాన్ని ఇక్కడి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోలేదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.
‘నాగాలాండ్‌లో ఎక్కువ జనాభా గ్రామాల్లో నివసిస్తోంది. హిందుత్వ అంటే ఏంటి? దాని సిద్ధాంతాలు ఏంటి? అనేవి వారికి చాలా వరకు తెలియదు. అయితే ఇక్కడ అధిక మంది బీజేపీ నేతలు క్రైస్తవులే. నాగాలాండ్‌లో క్రైస్తవానికి ప్రమాదం ఉన్నట్లుగా ఇప్పటికైతే మేం అనుకోవడం లేదు’ అని ఒరియెంటల్ థియాలజీ సెమినరీ ప్రిన్సిపాల్ డాక్టర్ జోషువా లొరిన్ అన్నారు.

ఫొటో సోర్స్, DAVID
‘అందరూ భద్రమే’
‘నాగాలాండ్ క్రైస్తవ మెజారిటీ రాష్ట్రమని, బీజేపీ పార్టీకి కేంద్రానికి తెలుసు. అందువల్ల వారు ఇక్కడ ప్రజల సెంటిమెంట్ దెబ్బతినేలా నడుచుకోరు. అందువల్ల అన్ని మతాల ప్రజలు ఇక్కడ భద్రంగా ఉంటారని చెప్పగలను’ అని బీబీసీతో నాగాలాండ్ ముఖ్యమంత్రి నెఫియూ రియో అన్నారు.
‘నాగాలాండ్ ప్రజలకు మేం స్పష్టమైన సందేశం ఇస్తున్నాం. అభివృద్ధి ఎజెండాతో బీజేపీ ఎదుగుతోంది’ అని నాగాలాండ్ బీజేపీ మీడియా కొ-ఆర్డినేటర్ సపరాలు నాయేఖా అన్నారు.
అయితే దేశం మొత్తం మతం గురించి మాట్లాడే బీజేపీ నాగాలాండ్‌లో మాత్రం సెక్యులర్ పార్టీగా మారిందని కాంగ్రెస్ నేత శశిథరూర్ విమర్శించారు.
‘హిందీ రాష్ట్రాల్లో చేసినట్లుగా ఇక్కడ రాజకీయాలు చేయలేమని బీజేపీ తెలుసుకుంది. అన్ని చోట్లా హిందుత్వ గురించి మాట్లాడే వాళ్లు ఇక్కడ మాత్రం నాగాలాండ్ సంస్కృతిని రక్షిస్తామని చెబుతున్నారు. కానీ దేశంలోని చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి.
అన్ని చోట్లా మతం పేరుతో రాజకీయాలు చేసే ఆ పార్టీ నాగాలాండ్‌కు రాగానే సెక్యులర్‌గా మారింది’ అని శశిథరూర్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ముక్కుతో కాకుండా నోటితో శ్వాస తీసుకుంటే ఏమవుతుంది?
- ఆమె ఫొటోలు వాడుకుని ఆన్లైన్ మోసగాళ్లు కోట్లు వసూలు చేశారు
- భారత్-చైనా: గల్వాన్ ఘర్షణల తర్వాత తొలిసారిగా భారత దౌత్యవేత్తలు బీజింగ్ ఎందుకు వెళ్లారు?
- వరంగల్: ఎంజీఎంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మెడికో ప్రీతి పరిస్థితి విషమం... ఇది ర్యాగింగ్ దారుణమేనా?
- ఆంధ్రప్రదేశ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటి వరకూ ఏం జరిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














