పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు తీసుకోవాలి... శరీరంలో రకరకాల నొప్పులను ఎలా అర్థం చేసుకోవాలి?

నొప్పుల మాత్రలు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రతిభా లక్ష్మి
    • హోదా, బీబీసీ కోసం

నొప్పి అనేది శరీరంలో ఏదో అసహజమైనది జరుగుతోంది అని శరీరం మనకు తెలియచేసే ఒక హెచ్చరిక. దాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆ సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయానికి కూడా దారి తీసే అవకాశం ఉంది.

అలా అని నొప్పిని తగ్గిస్తూ ఉంటే సరిపోదు, దానికి వెనుక కారణాన్ని పరిష్కరించాలి. ఉదాహరణకు, చేతిలో ఒక ముల్లు గుచ్చుకుంటే నొప్పి కలుగుతుంది. నొప్పికి మాత్ర వేసుకుంటూ ఉంటే నొప్పి తెలియకుండా ఉంటుందేమో, కానీ ఆ ముల్లు వల్ల ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ముందుగా ముల్లు తీసేయడం అవసరం.

ఎక్కువగా వినిపించే ‘అపెండిసైటిస్’ సమస్యనే తీసుకోండి. కడుపులో నొప్పి, వాంతులు అవుతున్నప్పుడు ఎందుకు అవుతున్నాయి? అని ఆలోచించకపోతే, లోపల ఇన్ఫెక్షన్ అయిన అపెండిక్స్ పగిలి పోయి, ప్రాణాలకే ప్రమాదం సంభవించవచ్చు. ఆలస్యం చేయకుండా, ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని తగ్గించే ఇంజెక్షన్లు, అవసరం అయితే ఆపరేషన్ చేస్తేనే క్షేమంగా ఉంటాం.

నొప్పుల మాత్రలు

ఫొటో సోర్స్, Getty Images

నొప్పిని గుర్తించకపోతే ఏం అవుతుంది?

కొందరు, ముఖ్యంగా దీర్ఘకాలికంగా మధుమేహంతో బాధ పడుతున్న వారు, నిద్రలోనే గుండెపోటుతో మరణించారని వింటుంటాం. దానికి కారణం, వ్యాధి వల్ల, నొప్పి తెలియకపోవడం. అంటే గుండె పోటు వచ్చినట్టు తెలియక, చికిత్స తీసుకోలేక, ప్రాణాలు పోతాయి.

నొప్పిని గుర్తించ గలిగితే, వెంటనే వైద్యుల సలహా మీద చికిత్స తీసుకొని ఉంటే, ప్రాణాలు దక్కచ్చేమో.

మూడు రోజుల క్రితం నా దగ్గరకు పదేళ్ళ అమ్మాయిని తీసుకొని తన తల్లి తండ్రులు వచ్చారు. తను క్రికెట్ కోచింగ్ తీసుకుంటోంది. కొన్ని రోజుల క్రితం ఆటలో ఒక్క సారిగా చేతిలో నొప్పి మొదలయింది. రోజూ ఆమె నొప్పి అంటోంది. చూస్తే తను చెయ్యి పూర్తిగా చాపలేక పోతోంది. అక్కడ ఏదో డిస్‌లొకేషన్ అయిందేమో అని అనుమానం కలిగింది. వెంటనే వారిని ఆర్థోపెడీషియన్ దగ్గరికి వెళ్ళమని సూచించాను. ఇలాంటివి నిర్లక్ష్యం చేస్తే, జీవితాంతం ఒక లోపంతో జీవించాల్సిన పరిస్థితి కలగవచ్చు. ముఖ్యంగా ఎముకల్లో కలిగే నొప్పికి విశ్రాంతి, ఇమ్మొబిలైజేషన్, తరవాత ఫిజియోథెరపీ అవసరం అవుతాయి.

కొంతమంది ‘‘నొప్పి బాగా భరిస్తారు’’ అని వింటుంటాం. కానీ అది ఒక గొప్ప విషయంగా భావించకూడదు. శారీరక నొప్పి అయినా, మానసిక నొప్పి అయినా, సామాజికంగా కలిగేది అయినా., దానికి కారణాలు తెలుసుకొని, వీలయినంత తొందరగా వాటిని తొలిగించే ప్రయత్నం చేయాలి. లేదంటే ఆ సమస్య పర్యవసానాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అందుకే నొప్పి మంచిదే. దానికి కారణం తెలుసుకొని, తగిన రీతిలో పరిష్కరించుకోవాలి.

నొప్పుల మాత్రలు

ఫొటో సోర్స్, Getty Images

కాపడం ఎప్పుడు పెట్టాలి.. ఐస్ ఎప్పుడు పెట్టాలి..

వయసుతో పైబడటంతో వచ్చే ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు చలికాలంలో ఇంకా ఎక్కువగా ఉండటం సహజం. అయితే, ఈ నొప్పుల కారణంగా తమ రోజూవారీ పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటే, కొందరు ఆ నొప్పుల కోసం మందులు వాడీ వాడీ, మూత్ర పిండాల సమస్యలు, కడుపులో అల్సర్ లాంటి అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారు.

మందుల వాడకం అవసరమయ్యే అంత ఎక్కువ నొప్పి లేనప్పుడు, కీళ్ళ పైన ఏదైనా మందు పెట్టుకోవడం, లేదా కాపడం లేక ఐస్ పెట్టుకుంటూ కాలం గడుపుతుంటారు.

అయితే, నొప్పి ఉన్నప్పుడు, కొన్ని సార్లు వేడి నీళ్లతో కాపడం పెట్టమంటారు. కొన్ని సార్లు ఐస్ పెడితే (లేదా తడి గుడ్డతో) తగ్గుతుంది అంటారు. అయితే ఏ సందర్భంలో ఏది మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం.

వేడి కాపడం అయినా, ఐస్ అయినా, మన శరీరంలో హీలింగ్ (healing) ప్రక్రియని వేగవంతం చేస్తాయి. రెండింటితో కొంత వరకు మేలు జరుగుతుంది.

అయితే, వేడి వల్ల, ఆ భాగంలో రక్త ప్రసరణ ఎక్కువ అవుతుంది, కండరాలు (spasms) పట్టేసినట్లు ఉంటే అది తొలిగి పోతుంది, నొప్పి మారిపోయి తెలియకుండా అవుతుంది. అదే ఐస్ వల్ల, రక్త ప్రసరణ తగ్గి పోతుంది, దానితో వాపు తగ్గుతుంది, ఆ భాగం మొద్దు బారినట్టు అయ్యి, నొప్పి తెలియకుండా పోతుంది.

నొప్పుల మాత్రలు

ఫొటో సోర్స్, Getty Images

ఎప్పుడైతే కీళ్లు (inflammation వల్ల) వాపుతో, ఎర్రబడి, వేడిగా అయి ఉంటాయో, అలాంటి సందర్భంలో ఐస్ పెట్టడం మంచిది. ఐస్ వల్ల వాపు తగ్గి, ఇబ్బంది పెరగకుండా ఉంటుంది. కీళ్ళవాతం మొదలయిన తొలి రోజుల్లో లేదా, (flare) సమస్య తీవ్రతరంగా ఉన్న రోజుల్లో ఐస్ పెట్టడం ఉత్తమం.

మిగతా సందర్భాల్లో వేడి కాపడం పెట్టడం మంచిది. అంటే, కండరాలు పట్టేసినప్పుడు, ఉదయం అధికంగా ఉండే నొప్పులకు, దీర్ఘకాలికంగా ఉండే నొప్పులకు అంటే, వాపు లేకుండా ఉన్న నొప్పులకు కాపడం పెట్టాలి.

ఆ వేడి మన శరీరానికి హాని కలిగించే అంత ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. కాపడం పెట్టడానికి ఈ మధ్య కాలంలో అనేక రకాల పరికరాలు వస్తున్నాయి. వేడి నీరు వేసే బాగ్, కరెంట్‌తో పెట్టేవి, టవల్‌ని వేసి నీటిలో ముంచి పెట్టడం, వంటివి ఎన్నో ఉన్నాయి. వేడితో పెట్టే కాపడం వల్ల, నొప్పి తగ్గి, కీళ్లు కదిలించడం సులువు అవుతుంది. పాదాలలో నొప్పి ఎక్కువగా ఉండేటప్పుడు, రోజూ కొద్ది సేపు, వేడి నీళ్ళల్లో కాళ్ళు పెట్టడం వల్ల ఉపశమనం పొందగలరు.

పాదాలలో నొప్పి, అది కూడా ఉదయం లేవగానే, లేక చాలా సేపు కూర్చొని లేవగానే అధికంగా ఉండడం అనేది మనం సాధారణంగా వినే సమస్య. దానికి కారణం ప్లాంటార్ ఫేసైటిస్ (Plantar fascitis) అయి ఉండవచ్చు. ఉపశమనానికి రోజు పాదాలను వేడి నీళ్ళల్లో పెట్టుకోవచ్చు. అది తగ్గడానికి, మెత్తటి చెప్పులు వేసుకోవడం మంచిది. బయటకు వెళ్ళినప్పుడే కాక, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మెత్తటి చెప్పులు వేసుకోవాలి. అధిక బరువు ఉంటే, తగ్గే ప్రయత్నం చేయాలి. పాదాలకు కొన్ని రకాల వ్యాయామాలు చేయడం వల్ల కూడా, చుట్టూ ఉన్న కండరాలు బలపడి, నొప్పి కొంత వరకు తగ్గుతుంది.

నొప్పుల మాత్రలు

నొప్పులకు చికిత్సా విధానాలు ఇవీ...

  • తాత్కాలిక ఉపశమనానికి కొన్ని రోజులు నొప్పి మాత్రలు వాడడం, విశ్రాంతి తీసుకోవడం చేయాలి.
  • దీర్ఘ కాలిక ఉపశమనం కోసం/ అవి బలపడటం కోసం ఫిజియోథెరపీ, వ్యాయామాలు చేయాలి. అలాగే వేడి కాపడం లేక ఐస్‌తో ఉపశమనం పొందేందుకు ప్రయత్నించాలి.
  • సమస్య ఇంకా పెరిగితే, అవకాశం/ అవసరం ఉంటే ఆపరేషన్ చేయించుకోవడం మంచిది.

నిర్లక్ష్యం చేయకుండా, దీర్ఘ కాలిక సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. రోజూ వ్యాయామం చేయాలి, విటమిన్ డీ సరిపడేలా తీసుకోవాలి. సమస్య తీవ్రమవుతున్నట్లు అనిపిస్తే, వెంటనే వైద్యులను సంప్రదించాలి.

(రచయిత వైద్యురాలు)

వీడియో క్యాప్షన్, ఫార్మా కంపెనీ నుంచి ఫార్మసీకి చేరే వరకూ ఔషధాలపై నియంత్రణ ఎలా ఉంటుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)