రష్యా, యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ ఫెయిలయ్యారా... అసలు ఆయన టార్గెట్ ఏంటి?

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, పాల్ కిర్బీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

యుక్రెయిన్‌పై దాడి చేయడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2022 ఫిబ్రవరి 24న దాదాపు రెండు లక్షల మంది సైనికులను పంపారు.

కొద్దిరోజుల్లో రష్యా సైన్యం కీయెవ్‌లోకి ప్రవేశించి యుక్రెయిన్ ప్రభుత్వం నుంచి అధికారాన్ని స్వాధీనం చేసుకుంటుందని భావించారు.

వరుస పరాజయాలు, ఒకానొక సమయంలో వెనక్కి తగ్గిన తరువాత, యుక్రెయిన్‌పై దాడి చేయాలనే పుతిన్ ప్రణాళిక విఫలమైందని స్పష్టమైంది. కానీ, ఈ యుద్ధంలో రష్యా ఇంకా ఓడిపోలేదు.

పుతిన్ అసలు లక్ష్యం ఏమిటి?

రష్యా అధ్యక్షుడు పుతిన్ 'ప్రత్యేక సైనిక చర్య'ను రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత అతిపెద్ద యూరోపియన్ దాడిగా అభివర్ణిస్తున్నారు.

అయితే, వాళ్లు దీనిని పూర్తి స్థాయి యుద్ధం అని పిలవడం లేదు. దీనిలో యుక్రెయిన్ అంతటా పౌరులపై కూడా బాంబు దాడులు జరిగాయి.

దాదాపు 13 మిలియన్ల మంది యుక్రేనియన్లు వారి సొంత దేశంలో, విదేశాలలో శరణార్థులుగా మారవలసి వచ్చింది.

2022 ఫిబ్రవరి 24న పుతిన్ లక్ష్యం 'యుక్రెయిన్ సైనిక శక్తిని నిర్మూలించడం, నాజీల నుంచి విముక్తి చేయడం' అని, బలవంతంగా యుక్రెయిన్‌ను ఆక్రమించే ఉద్దేశం తనకు లేదని వెల్లడించారు.

పుతిన్ 2014 నుంచి రష్యా మద్దతుదారులు ఆక్రమించిన తూర్పు యుక్రెయిన్ ప్రాంతాల స్వాతంత్య్రానికి ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు మద్దతు తెలిపారు.

యుక్రెయిన్‌లో ఎనిమిదేళ్ల అణచివేత, మారణహోమం నుంచి తూర్పు యుక్రెయిన్ ప్రజలను కాపాడతానని పుతిన్ హామీ ఇచ్చారు. అయితే రష్యా వాదనకు వాస్తవానికి పొంతన లేదు.

యుక్రెయిన్‌లో నాటో స్థాపన చేయకుండా నిరోధించడం గురించి కూడా పుతిన్ మాట్లాడారు. యుక్రెయిన్ తటస్థ స్థితిని కొనసాగించడమే ఈ సైనిక ప్రచారం ఉద్దేశం అని కూడా అన్నారు.

అధ్యక్షుడు పుతిన్ ఈ విషయాన్ని ఎన్నడూ బహిరంగంగా చెప్పలేదు. అయితే యుక్రెయిన్‌లో ఎన్నికైన ప్రభుత్వాన్ని అధికారం నుంచి తొలగించాలని ఆయన ఎల్లప్పుడూ కోరుకునేవారు.

యుక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోదిమిర్ జెలియన్ స్కీ మాట్లాడుతూ 'శత్రువు నన్ను తమ టార్గెట్ నంబర్ వన్‌గా ప్రకటించింది, నా కుటుంబం వారి రెండో లక్ష్యం'' అన్నారు.

జెలియన్ స్కీ సలహాదారు వాదన ప్రకారం రష్యా సైన్యం అధ్యక్ష భవన సముదాయంలోకి ప్రవేశించడానికి కనీసం రెండుసార్లు ప్రయత్నించింది.

యుక్రెయిన్‌ను నాజీలు ఊచకోత కోశారనే రష్యా వాదనకు ఇంతవరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదు.

కానీ, రష్యా అధికారిక వార్తా సంస్థ ఆర్ఐఏ నోవోస్టి కథనం ప్రకారం నాజీల నుంచి విముక్తి చేయడం అంటే ఆధునిక యుక్రేనియన్ చెరిపేయడం.

రష్యా అధ్యక్షుడు పుతిన్ యుక్రెయిన్ ప్రత్యేక దేశం ఉనికిని కొన్నాళ్లుగా నిరాకరిస్తున్నారు.

2021లో రాసిన ఒక సుదీర్ఘ వ్యాసంలో 'తొమ్మిదో శతాబ్దం నుంచి యుక్రెయిన్, రష్యా ప్రజలు ఒక్కటే' అని పుతిన్ తెలిపారు.

రష్యా యుక్రెయిన్

ఫొటో సోర్స్, BBC/GOKTAY KORALTAN

పుతిన్ యుద్ధ వ్యూహాలను ఎలా మార్చుకున్నారు?

యుక్రెయిన్‌పై దాడి ప్రారంభించిన నెల రోజుల తర్వాత రష్యా దళాలు కీవ్, చెర్నిహివ్ నుంచి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది. పుతిన్ తన వ్యూహాలలో మార్పులు చేపట్టారు.

ఆ తర్వాత రష్యా ప్రధాన లక్ష్యం 'డాన్‌బాస్‌ను విముక్తి చేయడం'గా మార్చారు. తూర్పు యుక్రెయిన్‌లోని రెండు పారిశ్రామిక ప్రాంతాలైన లుహాన్స్క్, డోనోట్స్క్ లను డాన్‌బాస్ అని పిలుస్తారు.

ఈశాన్యంలోని ఖార్కివ్, దక్షిణాన ఖేరాసన్ నగరం నుంచి రష్యా వెనక్కి వెళ్లవలసి వచ్చినప్పటికీ ఈ లక్ష్యాలలో ఎటువంటి మార్పు లేదు. రష్యా విజయం సాధించేలా కనిపించడం లేదు.

యుద్దభూమిలో వైఫల్యాల తరువాత రష్యా నాయకుడు గత సంవత్సరం సెప్టెంబర్‌లో యుక్రెయిన్‌లోని నాలుగు ప్రావిన్సులను రష్యాలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు.

ఆ ప్రాంతాలపై రష్యా పూర్తి నియంత్రణ కూడా సాధించలేదు. తూర్పున ఉన్న లుహాన్స్క్, డొనెట్స్క్ లేదా దక్షిణాన ఖెర్సన్, జాపోరోజీలను రష్యన్ సైన్యం పూర్తిగా స్వాధీనం చేసుకోనేలేదు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారిగా అధ్యక్షుడు పుతిన్ రష్యాలో నిర్బంధ సైనిక నియామకాలను నిర్వహించవలసి వచ్చింది.

అయితే ఈ రిక్రూట్‌మెంట్ పాక్షికం మాత్రమే. దీని ద్వారా నియామకమయ్యేది మూడు లక్షల రిజర్వ్ సైనికులు మాత్రమే.

యుద్ధంలో భాగంగా రష్యా సుమారు 850 కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్లింది. వీటిలో చిన్న, అరుదైన విజయాలు మాత్రమే రష్యా సాధించింది.

చిన్న సైనిక చర్యగా మొదలై, నేడు సుదీర్ఘ యుద్ధంగా మారింది. యుక్రెయిన్‌ గెలవాలని పశ్చిమ దేశాలు అభిప్రాయానికొచ్చాయి.

యుక్రెయిన్ తటస్థంగా ఉండటానికి నిజమైన అవకాశాలు చాలా కాలం క్రితం ముగిశాయి.

గతేడాది డిసెంబరులో అధ్యక్షుడు పుతిన్ యుద్ధం 'సుదీర్ఘమైన ప్రక్రియ' అని హెచ్చరించారు.

ఈ యుద్ధం నుంచి పుతిన్ క్లెయిమ్ చేసుకోగల అతి పెద్ద విజయం ఏమిటంటే, క్రిమియా నుంచి రష్యా సరిహద్దు వరకు ల్యాండ్ కారిడార్‌ను నెలకొల్పడం.

రష్యా 2014లో క్రిమియాను స్వాధీనం చేసుకుంది. ఈ ల్యాండ్ కారిడార్ తర్వాత రష్యా క్రిమియా చేరుకోవడానికి కెర్చ్ జలసంధిపై ఉన్న వంతెనపై ఆధారపడాల్సిన పరిస్థితి తప్పింది.

పుతిన్ కూడా ఈ ప్రాంతం ఆక్రమణ గురించి ఒక ప్రకటన చేశారు. మారియుపోల్, మెలిటోపోల్ వంటి నగరాల స్వాధీనం 'రష్యాకు ముఖ్యమైన పరిణామాలు' అని అభిప్రాయపడ్డారు.

కెర్చ్ జలసంధిలోని అజోవ్ సముద్రం ఇప్పుడు రష్యా 'అంతర్గత సముద్రం'గా మారింది. దీనిపై పుతిన్ ప్రకటన జారీ చేస్తూ రష్యాకు చెందిన జార్ పీటర్ కూడా విజయం సాధించలేకపోయారని అన్నారు.

రష్యా

ఫొటో సోర్స్, Getty Images

పుతిన్ విఫలమయ్యారా?

క్రిమియాకు ప్రాదేశిక కారిడార్‌ను స్వాధీనం చేసుకోవడం కంటే రష్యా యుద్ధం తనకు, బాధిత యుక్రెయిన్‌కు విపత్తుగా మారింది.

ఇప్పటివరకు ఇది రష్యా సైన్యం క్రూరత్వం, అసమర్థత చూపించుకోవడం తప్ప ఎక్కువగా సాధించిందేమీ లేదు.

మారియుపోల్ వంటి నగరాలు నేలమట్టం కాగా, కీవ్ సమీపంలోని బుచాలో పౌరులపై యుద్ధ నేరాల కథనాలు వెలువడ్డాయి.

రష్యా తన ప్రభుత్వ ఆదేశాల మేరకు మారణహోమానికి పాల్పడిందని పలు నివేదికలు ఆరోపించాయి.

కానీ, వాస్తవానికి, రష్యా సైనిక వైఫల్యం, బలహీనతలను ఇది బహిర్గతం చేసింది.

నవంబర్‌లో ఖేరాసన్ నగరానికి సమీపంలో ఉన్న డ్నీపర్ నది మీదుగా 30,000 మంది రష్యన్ సైనికులు తిరోగమనం చేయడం వ్యూహాత్మక వైఫల్యం.

యుద్ధం ప్రారంభంలోనే అవసరమైన సామగ్రిని సమకూర్చుకోలేదు. దీంతో రష్యా సైన్యం కీవ్ సమీపంలో చిక్కుకుంది.

న్యూ ఇయర్ సందర్భంగా యుక్రెయిన్ చేసిన క్షిపణి దాడిలో మకీవ్కాలో పెద్ద సంఖ్యలో కొత్త రష్యన్ రిక్రూట్‌లు మరణించారు. ఇది రష్యా నిఘా వ్యవస్థ వైఫల్యం.

రష్యా అతిపెద్ద యుద్ధనౌక మోస్క్వా నల్ల సముద్రంలో మునిగిపోవడం రక్షణాత్మక వైఫల్యం.

అదేవిధంగా అక్టోబర్ 2022లో కెర్చ్‌లోని వంతెనపై దాడి జరిగిన తరువాత చాలా వారాల పాటు దాన్ని మూసివేశారు.

రష్యా యుద్ధం

ఫొటో సోర్స్, Getty Images

యుక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాల మద్దతు

యుక్రెయిన్‌కు ఆయుధాలు ఇవ్వొదంటూ రష్యా చేసిన హెచ్చరికలను పట్టించుకోని పాశ్చాత్య దేశాలు యుద్ధం ఎంత కాలం సాగినా యుక్రెయిన్‌కు తమ మద్దతు లభిస్తుందన్నాయి.

మెరుగైన హిమార్స్ క్షిపణులు, జర్మనీకి చెందిన చిరుతపులి 2 ట్యాంకులు లభిస్తాయనే వాగ్దానం అందడంతో యుక్రెయిన్ ఫిరంగిల బలం అధికమైంది.

కానీ, ఈ యుద్ధం ముగియలేదు. డాన్‌బాస్‌లో పోరాటం కొనసాగుతోంది.

రష్యా ఈ ఏడాది ప్రారంభంలో సోలెడార్ పట్టణాన్ని స్వాధీనం చేసుకుంది. పశ్చిమ మార్గంలో ఉన్న బఖ్‌ముట్ పట్టణాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తోంది.

రష్యా కూడా గతేడాది దక్కించుకోలేక పోయిన ప్రాంతాలను గెలుచుకోవాలని భావిస్తోంది.

రష్యాలో పలు ప్రాంతాలను విలీనం చేస్తానని ప్రకటించిన పుతిన్ వాటిపై తన పట్టును పటిష్టం చేసుకునేందుకు ప్రయత్నిస్తారని పుతిన్ గురించి తెలిసినవారు భావిస్తున్నారు.

ఇవి డాన్‌బాస్‌కు మాత్రమే కాకుండా మరో ముఖ్య నగరమైన జాపోరోజీకి కూడా వ్యాపించాయి.

అవసరమైతే పుతిన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ క్యాంపెయిన్ మరింత పెంచవచ్చు, యుద్ధాన్ని పొడిగించవచ్చు.

రష్యా అణుశక్తి అని, అవసరమైతే రష్యా రక్షణ కోసం అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉన్నామని, యుక్రెయిన్ ఆక్రమిత భూభాగాల్లో నిలబడతామని పుతిన్ హెచ్చరించారు.

తమ వద్ద ఉన్న అన్ని ఆయుధాలను ఖచ్చితంగా ఉపయోగిస్తామని పుతిన్ హెచ్చరించారు. ఇది ఆషామాషీ హెచ్చరికైతే కాదు.

మోల్డోవాలోని యూరోపియన్ అనుకూల ప్రభుత్వాన్ని కూలదోయడానికి రష్యా కూడా ప్రయత్నిస్తోందని యుక్రెయిన్ అభిప్రాయపడింది.

యుక్రెయిన్ సరిహద్దు ప్రాంతమైన మోల్డోవాలోని ట్రాన్స్‌నిస్ట్రియా రీజియన్ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉంది. ఆ ప్రాంతంలోనూ రష్యన్ దళాలు ఉన్నాయి.

పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

పుతిన్ ఇమేజ్ డ్యామేజ్ అయిందా?

అధ్యక్షుడు పుతిన్ (70) తన సైనిక వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారు.

రష్యా వెలుపల ఆయన ఇమేజ్ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పుడు పుతిన్ తన దేశం నుంచి చాలా అరుదుగా బయటికి వెళుతున్నారు.

అయితే పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షలను రష్యా ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలిగినట్లు కనిపిస్తోంది.

అయినప్పటికీ రష్యా బడ్జెట్ లోటు పెరుగుతూనే ఉంది. చమురు, గ్యాస్ ఆదాయాలు తగ్గిపోయాయి.

రష్యాలో నిరసనలు చేయడం చాలా ప్రమాదకరం. రష్యా సైన్యానికి వ్యతిరేకంగా వార్తలు వ్యాప్తి చేస్తే జైలు శిక్ష విధిస్తున్నారు.

రష్యా నాయకత్వాన్ని వ్యతిరేకించే వారు దేశం విడిచి పారిపోయారు లేదా పుతిన్‌ను వ్యతిరేకించే నాయకుడైన అలెక్సీ నవల్నీ‌లా జైలు పాలయ్యారు.

యూరోపియన్ యూనియన్‌తో ప్రతిపాదిత ఒప్పందాన్ని రద్దు చేయమని యుక్రెయిన్‌కు అనుకూలమైన తమ దేశ నాయకుడిని రష్యా బలవంతం చేయడంతో 2013లో ఈ యుద్ధానికి బీజాలు పడ్డాయి.

అనంతరం యుక్రెయిన్ అంతటా నిరసనలు ప్రారంభమయ్యాయి. దీని కారణంగా రష్యా అనుకూల నాయకుడు అధికారాన్ని కోల్పోవల్సి వచ్చింది.

తదనంతరం రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. తూర్పు ఉక్రెయిన్‌లో భూసేకరణ క్యాంపెయిన్ ప్రారంభించింది.

2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన 4 నెలల తర్వాత, యుక్రెయిన్ అభ్యర్థి హోదాను యూరోపియన్ యూనియన్ ఆమోదించింది.

వీలైనంత త్వరగా ఈయూ సభ్యత్వం ఇవ్వాలని యుక్రెయిన్‌ కోరుతోంది. రష్యాను సుదీర్ఘకాలంగా పాలిస్తున్న పుతిన్.. యుక్రెయిన్ నాటో పరిధిలోకి రాకుండా ఎలాగైనా అడ్డుకోవాలనుకున్నారు.

అయితే, ఈ యుద్ధంపై పాశ్చాత్య దేశాల సైనిక కూటమిని పుతిన్ నిందిస్తున్నారు.

యుద్ధానికి ముందు యుక్రెయిన్ నాటో నుంచి దూరంగా ఉండటానికి రష్యాతో తాత్కాలిక ఒప్పందానికి అంగీకరించడమే కాకుండా, మార్చిలో అధ్యక్షుడు జెలియన్ స్కీ కూడా యుక్రెయిన్‌ను నాన్-అలైన్డ్, అణు రహిత దేశంగా ఉంచాలని ప్రతిపాదించారు.

బిడెన్ జెలియన్ స్కీ

ఫొటో సోర్స్, Reuters

ఈ యుద్ధానికి నాటో బాధ్యత వహించాలా?

యుక్రెయిన్‌ తన నగరాలను రక్షించడానికి నాటో సభ్య దేశాలు వాయు రక్షణ వ్యవస్థలను అందజేస్తున్నాయి.

అంతే కాకుండా రష్యా సైన్యంతో యుద్ధంలో పోటీ పడేందుకు క్షిపణులు, ఫిరంగులు, డ్రోన్లు కూడా యుక్రెయిన్‌కు అందించాయి.

కానీ, ఈ యుద్ధం నిందను నాటోపై మోపడమూ సరికాదు. రష్యా ముప్పునకు ప్రతిస్పందనగా నాటో చర్యలు ఉంటున్నాయి.

రష్యా దాడి కారణంగా స్వీడన్, ఫిన్లాండ్ నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

రష్యా యుద్ధానికి తూర్పున నాటో బాధ్యత వహిస్తోంది. ఐరోపాలోని చాలా మంది ప్రజలు రష్యా వాదనను విశ్వసిస్తున్నారు.

యుద్ధానికి ముందు అధ్యక్షుడు పుతిన్ నాటో దాని 1997 పూర్వ స్థితికి తిరిగి రావాలని, బాల్టిక్ దేశాలతో పాటు సెంట్రల్, తూర్పు ఐరోపా నుంచి దాని దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

పుతిన్ వాదన ప్రకారం నాటో తూర్పు వైపు ఒక్క అంగుళం కూడా కదలదని పశ్చిమ దేశాలు 1990లో వాగ్దానం చేశాయి. అయినప్పటికీ అది తూర్పున విస్తరిస్తూ వచ్చింది.

అయితే ఇది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి ముందు కథ.

అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచెవ్‌కు చేసిన వాగ్దానం ప్రకారం జర్మనీ పునరేకీకరణ తర్వాత తూర్పు జర్మనీకి మాత్రమే విస్తరించాల్సి ఉంది.

అనంతరం మిఖాయిల్ గోర్బచేవ్ కూడా ఆ సమయంలో 'నాటో విస్తరణపై చర్చ జరగలేదు' అని చెప్పారు.

2014లో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకునే ముందు, తూర్పు ఫ్రంట్‌లో బలగాలను మోహరించాలని నాటో ఎప్పుడూ భావించలేదని మిఖాయిల్ స్పష్టంచేశారు.

వీడియో క్యాప్షన్, దక్షిణాఫ్రికా సముద్ర తీరంలో ఆ దేశంతో పాటు చైనా,రష్యా సైనిక విన్యాసాలు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)