రష్యా: ఒకవైపు ఇంధన ధరలు ఆకాశాన్నంటుతుంటే.... రష్యా రోజుకు కోటి డాలర్ల గ్యాస్‌ను తగులబెడుతోంది ఎందుకు?

ఫొటో సోర్స్, COPERNICUS SENTINEL/SENTINEL HUB/PIERRE MARKUSE
- రచయిత, మాట్ మెక్‌గ్రాత్
- హోదా, బీబీసీ న్యూస్, ఎన్విరాన్‌మెంట్ కరెస్పాండెంట్
ఒకవైపు యూరప్‌లో ఇంధన ధరలు ఆకాశాన్నంటేలా పెరుగుతున్నాయి. కానీ మరోవైపు రష్యా భారీ మొత్తంలో సహజ వాయువును దగ్ధం చేస్తోందని బీబీసీ న్యూస్‌కు అందిన ఒక విశ్లేషణ చెప్తోంది.
ఫిన్లాండ్ సరిహద్దు వద్ద ఉన్న తమ గ్యాస్ ప్లాంటులో రోజుకు కోటి డాలర్ల విలువైన గ్యాస్‌ను రష్యా దగ్ధం చేస్తున్నట్లు వారు చెప్తున్నారు.
మామూలుగా అయితే ఈ గ్యాస్‌ను జర్మనీకి ఎగుమతి చేసి ఉండాల్సిందని నిపుణులు చెప్తున్నారు.
''ఆ గ్యాస్‌ను మరోచోట అమ్మలేకపోతుండటం వల్ల రష్యా దానిని దగ్ధం చేస్తోంద''ని బ్రిటన్‌లో జర్మనీ రాయబారి బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
ఇదిలావుంటే.. ఇంత భారీ స్థాయిలో గ్యాస్‌ను దగ్ధం చేయటం వల్ల వెలువడే భారీ స్థాయి కార్బన్‌డయాక్సైడ్, బూడిదల వల్ల ప్రతికూల ప్రభావాలు ఉంటాయని, ఆర్కిటిక్ మంచు కరిగిపోవటాన్ని ఇది వేగవంతం చేస్తుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రైస్టాడ్ ఎనర్జీ అనే సంస్థ రూపొందించిన విశ్లేషణ ప్రకారం.. రష్యా తన ప్లాంటులో రోజుకు 43.40 లక్షల ఘనపు మీటర్ల గ్యాస్‌ను మండించివేస్తోంది.
సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వాయువ్యంగా ఉన్న పోర్టోవాయా వద్ద గల లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) ప్లాంటు నుంచి ఈ మంటలు వస్తున్నాయి.
ఈ ప్లాంటుకు ఆవల సరిహద్దుకు సమీపంలో నివసించే ఫిన్లండ్ ప్రజలు తొలుత ఈ వేసవి ఆరంభంలో.. దూరంగా ఎగసిపడుతున్న భారీ మంటను గుర్తించారు. దీంతో ఏదో తేడా జరుగుతోందని అర్థమైంది.
రష్యా నుంచి జర్మనీకి సముద్ర గర్భం గుండా గ్యాస్ సరఫరా చేసే నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్.. పోర్టోవాయా పట్టణం సమీపంలో మొదలవుతంది. ఆ పైప్‌లైన్ మొదలయ్యే దగ్గర ఒక కంప్రెసర్ స్టేషన్ ఉంది.
ఈ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరాలను జూలై మధ్య నుంచి ఆపివేశారు. ఇందుకు సాంకేతిక సమస్యలు కారణమని రష్యా చెప్తోంది. కానీ యుక్రెయిన్ మీద సైనిక దాడి మొదలుపెట్టిన రష్యా.. కేవలం రాజకీయ కారణాలతోనే గ్యాస్ సరఫరా నిలిపివేసిందని జర్మనీ ఆరోపిస్తోంది.

ఫొటో సోర్స్, ARI LAINE
అయితే జూన్ నుంచి పోర్టోవాయా కంప్రెసర్ స్టేషన్ నుంచి వెలువడే వేడి గణనీయంగా పెరగటాన్ని పరిశోధకులు గుర్తించారు. సహజ వాయువు మండటం వల్ల వచ్చే వేడిగా భావించారు.
సహజ వాయువు శుద్ధి కర్మాగారాల్లో గ్యాస్ మండుతుండటం మామూలే. సాధారణంగా సాంకేతిక కారణాల వల్ల కానీ భద్రతా కారణాల వల్ల కానీ ఇలా గ్యాస్‌ను మండిస్తుంటారు. కానీ ఇంతటి స్థాయిలో గ్యాస్ మండుతుండటం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేసింది.
''ఇంత భారీ స్థాయి ఎల్ఎన్‌జీ ప్లాంట్ మంటను నేను ఎన్నడూ చూడలేదు'' అని.. ఒహాయాలోని మియామి యూనివర్సిటీలో సాటిలైట్ డాటా నిపుణురాలైన డాక్టర్ జెస్సికా మెక్‌కార్టీ చెప్పారు.
''జూన్‌లో ఈ భారీ పెరుగుదలను మేం చూశాం. అప్పటి నుంచీ అది అలాగే కొనసాగుతోంది. చాలా భారీ స్థాయిలో కొనసాగుతోంది'' అన్నారామె.
బ్రిటన్‌లో జర్మనీ రాయబారి మిగెల్ బెర్జర్ బీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ.. రష్యా గ్యాస్ మీద ఆధారపడటాన్ని తగ్గించటానికి యూరప్ దేశాలు చేస్తున్న కృషి.. ''రష్యా ఆర్థిక వ్యవస్థ మీద బలంగా ప్రభావం చూపుతున్నాయ''ని పేర్కొన్నారు.
''వాళ్లు తమ గ్యాస్‌ను అమ్ముకోవటానికి వేరే చోటు లేదు. అందుకే వాళ్లు ఆ గ్యాస్‌ను దగ్ధం చేస్తున్నారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ గ్యాస్ మంటలు ప్రమాదవశాత్తూ చెలరేగినవి కాదని, నిర్వహణ కారణాల రీత్యా ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుని మండిస్తున్న మంటలని.. గ్యాస్ మంటలకు పరిష్కారాలు కనుగొనే పని చేసే కాప్టీరియో అనే సంస్థ సీఈఓ మార్క్ డేవిస్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, ELMERI RASI
''ఇలాంటి ప్లాంట్లను మూసివేయటానికి నిర్వాహకులు తరచుగా చాలా సంశయిస్తుంటారు. ఎందుకంటే వీటిని తిరిగి ప్రారంభించటం సాంకేతికంగా కష్టమవుతుంది. చాలా ఖర్చు కూడా అవుతుంది. బహుశా అందుకే ఇలా చేస్తుండి ఉండవచ్చు'' అని ఆయన బీబీసీ న్యూస్‌తో చెప్పారు.
నార్డ్ స్ట్రీమ్ 1 పైప్‌లైన్‌కు సరఫరా చేస్తున్న భారీ మొత్తంలోని గ్యాస్ నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తి ఉండవచ్చునని ఇతరులు భావిస్తున్నారు.
ఆ గ్యాస్‌ను కొత్త ప్లాంటులో ఎల్ఎన్‌జీ తయారు చేయటానికి రష్యా ఇంధన కంపెనీ గజ్‌ప్రామ్ ఉద్దేశించి ఉండవచ్చునని.. కానీ దానిని నిర్వహించటంలో సమస్య తలెత్తి ఉండవచ్చునని.. ఆ పరిస్థితుల్లో ఆ గ్యాస్‌ను మండించివేయటమే సురక్షితమైన మార్గమని నిర్ణయించుకుని ఉండవచ్చునని చెప్తున్నారు.
అలాగే.. యుక్రెయిన్ మీద సైనిక దండయాత్రకు ప్రతిస్పందనగా.. రష్యాతో వాణిజ్యాన్ని యూరప్ నిలిపివేసిన ఫలితంగా కూడా ఈ పరిస్థితి తలెత్తి ఉండవచ్చు.
''ఈ తరహాలో సుదీర్ఘ కాలంగా గ్యాస్ మండటం అంటే.. వారి దగ్గర కొన్ని పరికరాలు లేకపోయి ఉండవచ్చు'' అని ఫిన్లండ్ ఎల్‌యూటీ యూనివర్సిటీలో ఎనర్జీ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఎసా వక్కిలైనెన్ వ్యాఖ్యానించారు.
''రష్యాతో వాణిజ్యం నిలిచిపోవటం వల్ల.. చమురు, గ్యాస్ శుద్ధికి అవసరమైన హై-క్వాలిటీ వాల్వులను వారు తయారు చేయలేకపోయారు. అక్కడ కొన్ని వాల్వులు పగిలిపోయి ఉంటాయేమో. వాటి స్థానంలో కొత్తవి అమర్చలేక పోతున్నారేమో'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ గ్యాస్ ప్లాంటును రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన దిగ్గజం గజ్‌ప్రామ్ నిర్వహిస్తోంది. ఈ గ్యాస్ మంటల మీద వ్యాఖ్యానించాల్సిందిగా చేసిన విజ్ఞప్తులకు ఆ సంస్థ స్పందించలేదు.
ఈ గ్యాస్ మంట కొనసాగే ఒక్కో రోజుకు.. ఆర్థిక, పర్యావరణ మూల్యాలు కూడా పెరుగుతూనే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
''ఈ మంటలకు కచ్చితమైన కారణమేమిటనేది తెలీదు. కానీ ఇంత భారీ పరిమాణం, అందులో వెలువడే ఉద్గారాలు, ఇది మండుతున్న ప్రాంతం.. ఇవన్నీ యూరప్ ఇంధన మార్కెట్‌లో రష్యా ఆధిపత్యాన్ని స్పష్టంగా చాటుతున్నాయి'' అని రిస్టాడ్ ఎనర్జీ సంస్థకు చెందిన సింద్రే నట్సన్ వ్యాఖ్యానించారు.
''రష్యా తలచుకుంటే తెల్లవారేసరికి ఇంధన ధరలను నేలకు దించగలదని చాటే స్పష్టమైన సంకేతం ఇంతకన్నా వేరొకటి ఉండదు. నార్డ్ స్ట్రీమ్ 1 ద్వారా కానీ, ప్రత్యామ్నాయ మార్గాల్లో కానీ యూరప్‌కు ఎగుమతి చేసి ఉండాల్సిన గ్యాస్‌ను వాళ్లు దగ్ధం చేస్తున్నారు'' అని పేర్కొన్నారు.
ప్రపంచమంతటా కోవిడ్ లాక్‌డౌన్లు తొలగించి, ఆర్థిక వ్యవస్థలు తిరిగి సాధారణ స్థితికి వస్తున్న క్రమంలో ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. చాలా ప్రాంతాల్లో ఏక కాలంలో ఎక్కువ అవసరాలు తలెత్తాయి. దీంతో ఇంధన సరఫరాల మీద అనూహ్యమైన ఒత్తిడి నెలకొంది.
ఇంతలో ఈ ఏడాది ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద రష్యా సైనికదాడికి దిగటంతో ఇంధన ధరలు మరోసారి పెరిగిపోయాయి. అప్పటివరకూ యూరప్ వినియోగించే గ్యాస్‌లో దాదాపు 40 శాతం రష్యా నుంచే సరఫరా అయ్యేది. కానీ యుక్రెయిన్ మీద రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి ఇంధన దిగుమతులను తగ్గించుకునే మార్గాల కోసం యూరప్ దేశాలు వెదుకులాట మొదలుపెట్టాయి.
ఫలితంగా.. ప్రత్యామ్నాయ గ్యాస్ వనరుల ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు జర్మనీ, స్పెయిన్ వంటి దేశాలు ఇంధనాన్ని ఆదా చేసే చర్యలు కూడా చేపడుతున్నాయి.

ఫొటో సోర్స్, AFP
ఇక రష్యా దగ్ధం చేస్తున్న గ్యాస్ మంటల వల్ల పర్యావరణం మీద పడే ప్రభావాల పట్ల శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.
అయితే.. ఈ గ్యాస్‌ను, అందులో కీలకమైన మూలకమైన మీథేన్‌ను అలాగే వాతావరణంలోకి వదిలివేయటం కన్నా.. దానిని మండించి వేయటమే చాలా ఉత్తమమని పరిశోధకులు చెప్తున్నారు. మీథేన్ వాయువు వాతావరణాన్ని వేడెక్కించటంలో చాలా బలంగా పనిచేస్తుంది.
గ్యాస్‌ను దగ్ధం చేయటంలో రష్యాకు గత చరిత్ర కూడా ఉందని ప్రపంచ బ్యాంక్ సమాచారం చెప్తోంది. గ్యాస్ మంటల పరిమాణం విషయంలో ప్రపంచంలో రష్యాదే ప్రప్రధమ స్థానం.
కానీ.. ఈ గ్యాస్ మంట వల్ల రోజుకు 9,000 టన్నులకు సమానమైన కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతోంది. దీనివల్ల ఇతర సమస్యలు కూడా తలెత్తుతాయి.
సహజ వాయువు వంటి ఇంధనాలను అసంపూర్ణంగా మండించటం వల్ల ఉత్పత్తి అయ్యే బూడిదను 'బ్లాక్ కార్బన్' అంటారు.
ఆర్కిటిక్ అక్షాంశాల దగ్గ గ్యాస్ మండించటం వల్ల ప్రధానంగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ మంటల నుంచి విడుదలయ్యే బ్లాక్ కార్మన్ ఉత్తర దిశగా పయనించి అక్కడ మంచు మీద, ఐస్ మీద పేరుకుపోతుంది. ఆ మంచు కరిగిపోయే వేగాన్ని గణనీయంగా పెంచుతుంది'' అని కెనడాలోని కార్లెటన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాథ్యూ జాన్సన్ చెప్పారు.
''ఆర్కిటిక్‌లో బ్లాక్ కార్బన్ పేరుకుపోవటానికి ప్రధాన కారణం గ్యాస్ మంటలేనని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు లెక్కగట్టాయి. ఈ పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో అలాంటి గ్యాస్ మంటలు పెరగటం మరింత చేటు చేస్తుంది'' అని ఆయన పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్ - బూరుగు: ఆ గిరిజన గ్రామాల్లో రోజంటే 12 గంటలే
- వీర్యం లేదు, అండం లేదు, కృత్రిమ పిండం తయారైంది.. పైగా గుండె కొట్టుకుంటోంది
- మనుస్మృతి ఏం చెబుతోంది... 2,000 ఏళ్ల నాటి ఈ హిందూ నియమావళిని నేటి భారత మహిళలు పాటించాలా?
- కాళీమాతను మాంసాహారం, మద్యం తీసుకునే దేవతగా ఊహించుకునే హక్కు నాకుంది - తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా
- హిందుత్వ జెండాను మోస్తున్నవారు ఎవరు, హిందూ దేశ నిర్మాణానికి సైనికులు సిద్ధమవుతున్నారా
- ఇండియా హిందూ దేశంగా మారుతోందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













