Cost of Living: ధరలు పెరుగుతుంటే గృహిణులు ఇల్లు గడపడానికి ఎలాంటి అవస్థలు పడుతున్నారు?

ప్రతి నెలా ఇంటి ఖర్చులన్నీ మీరే నిర్ణయిస్తారు అనుకుందాం. అనుకోకుండా కొన్ని వస్తువుల ధరలు పెరిగి ఖర్చు అమాంతం పెరిగిపోయిందనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు?
సహజంగానే కొన్ని వస్తువులు కొనడం మానేసి లేదా తక్కువ కొనుక్కుని, ఖర్చు తగ్గించే ప్రయత్నాలు చేస్తారు కదా. ప్రస్తుతం భారతదేశంలో చాలామంది గృహిణులు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ధరలు పెరగడంతో జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) భారమైపోతున్న వేళ, ఇంటి బడ్జెట్‌తో కుస్తీ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో, వివిధ నగరాలలోని మహిళలతో బీబీసీ మాట్లాడింది. ఇంటి ఖర్చులుకు తగ్గించుకోవడానికి వాళ్లు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించింది.

ఫొటో సోర్స్, BBC/IMRAN QURESHI
పొదుపు కట్
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉండే సిల్వియా డానియన్ ఇద్దరు పిల్లలను ఒంటరిగా పెంచుతున్నారు. ఆమె ఒక బొటిక్ నడుతున్నారు. నెలకు 20 వేల రూపాయలతో పిల్లలిద్దరినీ చదివించడం, ఇంటి ఖర్చులు చూసుకోవడం చాలా కష్టమని సిల్వియా అన్నారు. పిల్లల చదువు కోసం లోన్ కూడా తీసుకున్నారు. ఓ పక్క ధరలు పెరుగుతుండడంతో లోన్ భారం కూడా అధికమవుతోంది.
సిల్వియా కుమార్తెకు ఇటీవలే ఉద్యోగం వచ్చింది. అదే కాస్త ఉపశమనం. లేకుంటే సిల్వియా బోటిక్ సంపాదనతో ఇల్లు నడపటం చాలా కష్టమయ్యేది.
"ఇంట్లో ఎదుగుతున్న పిల్లలు ఉన్నారు. వాళ్లకు తిండి తగ్గించుకోమని చెప్పలేం. చదువుల కోసం తీసుకున్న లోన్‌కు ఇన్‌స్టాల్మెంట్లు కట్టక తప్పదు. పొదుపు కోసం కూడబెట్టే డబ్బే తగ్గుతోంది తప్ప ఖర్చులు తగ్గట్లేదు" అంటున్నారు సిల్వియా.

ఫొటో సోర్స్, BBC/KULVEER SINGH
పెళ్లి నగలు కొనడం మానేశాం
పంజాబ్‌లోని సంగ్రూర్‌లో నివసిస్తున్న రేణు శర్మ కుటుంబం చిన్న వ్యాపారాన్ని నడుపుతోంది. వారి వార్షిక ఆదాయం మూడు లక్షల నుంచి నాలుగు లక్షలు ఉంటుంది.
రేణుకి 16 ఏళ్ల కూతురు ఉంది. ఆమెకు మరో రెండు, మూడేళ్లలో పెళ్లి చేయాలి. రేణు తన కూతురి పెళ్లి గురించి బెంగపడుతున్నారు.
ప్రతి నెలా కొంత డబ్బు ఆదా చేసి ఏడాదికొక నగ కొనాలని ఆమె ప్లాన్ చేసుకున్నారు. దీని వల్ల పెళ్లి సమయంలో ఒకే సారి అన్ని నగలు కొనాలనే ఒత్తిడి ఉండదని అనుకున్నారు. కానీ, ముందు కోవిడ్ వల్ల, తర్వాత ద్రవ్యోల్భణం వల్ల నగలు కొనడాన్ని వాయిదా వేస్తూ వచ్చారు.
మరో వైపు బంగారం ధరలు కూడా బాగా పెరుగుతున్నాయి. దాంతో, కూతురి పెళ్లి కోసం డబ్బులు ఆదా చేయలేకపోవడంతో పాటు నగలు కూడా కొనలేకపోతున్నారు. పండుగల సమయంలో పెట్టే ఖర్చును కూడా ఈ కుటుంబం తగ్గించుకుంది.

ఫొటో సోర్స్, BBC/MOHAR SINGH
పండుగల్లో కోరికలను చంపుకుంటున్నాం
కిస్మత్ కన్వర్ జైపూర్ లోని ప్రతాప్ నగర్‌లో ఉంటున్నారు. వీరి ఆదాయం నెలకు రూ. 30,000. కొన్నిసార్లు నెలవారీ ఖర్చు రూ. 28,000 అయితే, కొన్నిసార్లు ఒక్కొక్క నెలలో ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, సిలిండర్లు, ఇంటి ఖర్చును తారుమారు చేశాయి. వచ్చిన ఆదాయంతోనే ఇంటి ఖర్చును నిర్వహించేందుకు పిల్లల పుట్టినరోజులు, పండగ ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు కొనాలంటే ఆలోచించాల్సి వస్తోంది. రోజుకు ఒకసారే కూర వండుకుంటున్నారు.

ఫొటో సోర్స్, BBC/ASIF
నూనెమానేసి ఉడికించిన కూరలు తింటున్నాం
మెహజబీన్ ఉత్తరప్రదేశ్‌లోని హర్‌దోయిలో నివాసముంటున్నారు.
ఆమె ఇంట్లో కుట్టు పనులు చేసి సంపాదిస్తారు. ఆమె భర్త రోజు కూలి. ఇద్దరూ కలిని నెలకు రూ. 12,000 సంపాదిస్తారు.
వీళ్లిద్దరికీ పనులు లేనప్పుడు, ఆదాయం ఉండదు. అలాంటి సమయంలో ఏమి తినగలరు? ఇంట్లో వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ల తిండి, మందులు మానేయలేరు. అందువల్ల, పిల్లలను ట్యూషన్‌కు పంపించడం మానేశారు. వంట నూనె ఖరీదు పెరిగిపోయింది. అందుకని ఎక్కువ ఉడికించిన కూరలే తింటున్నారు.

ఫొటో సోర్స్, BBC/DILIP SHARMA
అప్పులు
మినోతి దాస్ అస్సాంలోని జోర్హాట్ జిల్లాలో ఉంటారు. ఆమె ఒక ప్రైవేటు స్కూలులో ప్యూన్‌గా పని చేస్తున్నారు. ఆమె భర్త ఒక ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నారు. వారిద్దరూ కలిసి నెలకు రూ. 14,000 సంపాదిస్తారు. వచ్చినదంతా ఇంటి ఖర్చులకే సరిపోతుంది. గత కొన్ని నెలల్లో పెరిగిన ధరల వల్ల చాలా సార్లు అప్పు చేయాల్సి వస్తోంది.
ప్రతీ నెలా గ్యాస్ సిలిండర్ కోసం రూ. 1070 ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కొన్ని నెలల క్రితం వరకు లీటర్ రూ. 115 ఉండే ఆవ నూనె ధర ఇప్పుడు రూ. 210 అయింది. గతంలో ఒక నెలకు సరిపోయే రేషన్‌కు రూ. 4000 ఖర్చు పెడితే, ఇప్పుడు రూ. 6000 ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
కొడుకు చదువుకు పెట్టాల్సిన ఖర్చు పెరిగింది. కొన్ని నెలల క్రితం వరకు రూ. 600 ఉండే ట్యూషన్ ఫీ ఇప్పుడు వేలల్లో ఉంది.
గతంలో ఇంటికి కావల్సిన రేషన్ ఒకేసారి కొనేవారు. కానీ, ఇప్పుడు ఎంత కావాలంటే అంత, అప్పటికప్పుడు కొంటున్నారు. ఇంట్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే, వాళ్ల చికిత్సకు డబ్బెక్కడ నుంచి వస్తుంది?

ఫొటో సోర్స్, BBC/SHAHBAZ ANWAR
బ్రతకడం ఎలా ఆపేయాలి?
నజ్ముస్బా ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఉంటారు. వారి కుటుంబ ఆదాయం నెలకు రూ. 30,000. అందులోంచి ఆమె రూ. 5,000 - రూ. 7000 రూపాయిలు ఆదా చేసేవారు. కానీ, ఇప్పుడు నామమాత్రంగా మాత్రమే ఆదా చేయగలుగుతున్నారు.
పాల ధర పెరిగితే, రోజుకు రెండు సార్లు టీ తాగడం మానేస్తున్నారు. ఆయిల్ ధరలు పెరగడంతో పూరీలు, కచోరీల లాంటివి తినడం మానేశారు.
"ఆదా చేసే డబ్బులను మాత్రమే తగ్గించుకోగలం. మిగిలిన ఖర్చులను ఆపలేం కదా" అంటున్నారు నజ్ముస్బా.

ఫొటో సోర్స్, BBC/ALOK PUTUL
స్కూటీ నడపడం మానేశా
దీపికా సింగ్ రాయపూర్‌లోని ఛత్తీస్‌గఢ్‌లో మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ. వారి నెలవారీ ఆదాయం రూ. 40,000. అందులో రూ. 30,000 - 35,000 ఖర్చు అయిపోతూ ఉంటుంది. వారి కుటుంబంలో అయిదుగురు సభ్యులున్నారు.
ఇంటి అద్దె, రేషన్, కరెంటు బిల్, పిల్లల చదువు, కారు పెట్రోల్, మెడికల్ బిల్లులు, ఇతర చిన్న చిన్న ఖర్చులు తప్పవు.
ప్రస్తుతం వీళ్లు సొంత కారులో వెళ్లడం మానేసి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణం చేస్తున్నారు. చాలా అవసరమైతేనే స్కూటీ బయటకు తీస్తున్నారు.
ఎక్కడ వీలయితే అక్కడ ఖర్చు తగ్గించుకోవాలని చూస్తున్నారు.

ఫొటో సోర్స్, BBC/ANAND DUTTA
ఇంటికి ఎవరినీ పిలవడం లేదు
మౌమిత బెనర్జీ ఝార్ఖండ్‌లోని రాంచీలో ఉంటారు. వీళ్ల ఆదాయం నెలకు రూ. 36,000. ఇందులో రూ. 32,000 ఖర్చు అవుతాయి. గ్యాస్ సిలిండర్, నూనె, కూరగాయలు, పనీర్ ధరలు పెరుగుతుండటంతో వంటింటి బడ్జెట్ పూర్తిగా దెబ్బ తింది.
వచ్చిన ఆదాయంతో ఇంటిని నిర్వహించేందుకు సగం వంట ఇండక్షన్ స్టవ్‌పై వండుతున్నారు. దీంతో, కరెంటు బిల్ పెరుగుతోంది. కానీ, ఇది పెరిగిన గ్యాస్ ధరలో సగమే ఉంది. ఆహారంలో కాయగూరలు ఉండటం లేదు. రోజూ మార్కెట్‌కు వెళ్లే బదులు వారానికి రెండు లేదా మూడు సార్లు వెళుతున్నారు. మిగిలిన రోజుల్లో వేరుశనగ, రాజ్మా, బఠానీలతో వంటలు చేసుకుంటున్నారు.
ఇంటికి స్నేహితులను పిలిచి ఆతిధ్యం ఇవ్వడం కూడా తగ్గిపోయిందని మౌమిత అన్నారు.

ఫొటో సోర్స్, BBC/SARTAZ
చౌకగా దొరికే బియ్యం, పప్పులు
మహారాష్ట్రలోని సంగ్లీలో నివసించే షిరీన్ చౌకగా దొరికే వస్తువుల కోసం చూస్తున్నారు. బియ్యంలో చౌకగా దొరికే బియ్యం, పప్పుల్లో చౌకగా దొరికేవి, కూరగాయల్లో చౌకగా దొరికే వాటి కోసం చూస్తున్నారు. ధరల పెరుగుదల వల్లే ఈ పాట్లు పడాల్సి వస్తోందని షిరీన్ అంటున్నారు.
రూ. 800కు దొరికే గ్యాస్ సిలిండర్ రూ. 1100 అవుతోంది. షిరీన్ గోధుమల కోసం పెట్టే ఖర్చును తగ్గించుకోవలసి వస్తోంది.
గతంలో షిరీన్ నెలకు కావలసిన గోధుమలు, నూనె ఒకేసారి కొనేవారు. ఒకేసారి 5 లీటర్ల నూనె కొనేవారు. ప్రస్తుతం ఆమె 4 లీటర్లే కొంటున్నారు.
"ఇంట్లో వాళ్ల ఆకలినీ తగ్గించలేను, ఇంట్లో సభ్యులనూ తగ్గించలేను" అని చెప్పారు.
నిజానికి, మరోలా ఆలోచించేందుకు, ప్లాన్ చేసేందుకు వీరికున్న అవకాశాలు చాలా తక్కువ.
ఈ కథనం కోసం రాంచీ నుంచి ఆనంద్ దత్, జైపూర్ నుంచి మొహర్ సింగ్ మీణా, ఉత్తరప్రదేశ్ నుంచి మొహమ్మద్ ఆసిఫ్, అస్సాం నుంచి దిలీప్ శర్మ, బిజ్నోర్ నుంచి షా బాజ్ ఆన్వర్, బెంగళూరు నుంచి ఇమ్రాన్ ఖురేషీ, పంజాబ్ నుంచి కుల్ వీర్ సింగ్, రాయిపూర్ నుంచి అలోక్ పుతుల్, సంగ్లీ నుంచి సర్ఫరాజ్ వివరాలు అందించారు.
ఇవి కూడా చదవండి:
- ఆఫ్రికా చీతాలను తెచ్చి భారత్‌లో సింహాల మనుగడను ప్రమాదంలో పడేస్తున్నారా
- 'పండిట్ జీ, మేం ఇప్పటివరకూ ఐదుగురిని చంపాం’ - రాజస్థాన్ మాజీ బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్... కేసు నమోదు
- ఆండ్రాయిడ్ ఫోన్లపై డేటా ఖర్చులను తగ్గించుకోవడమెలా?
- కాఫీ, రెడ్ వైన్: ఇవి ఎంత తాగితే ఆరోగ్యానికి హానికరం
- 5 నెలల గర్భంతో ఉండగా అత్యాచారం చేశారు, మూడేళ్ల కూతురినీ చంపేశారు, 20 ఏళ్లకైనా ఆమెకు న్యాయం దొరికిందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











