జీఎస్‌టీ లో మార్పులు: పిల్లల స్టేషనరీ నుంచి పాలు, పెరుగు ప్యాకెట్ల వరకు ధరలు పెరిగేవి ఇవే

ఫొటో సోర్స్, Science Photo Library
సవరించిన వస్తువులు, సేవల పన్ను (జీఎస్‌టీ) సోమవారం నుంచి అమలులోకి వచ్చింది. దీంతో.. బ్రాండ్ పేరుతో ప్యాకెట్లలో అమ్మే బియ్యం, గోదుమలు, గోదుమ పిండి వంటి వివిధ సరకులు కొనుగోలు చేయాలంటే వినియోగదారులు ఇప్పుడిక మరిన్ని డబ్బులు వెచ్చించాల్సి ఉంటుందని ఏఎన్ఐ వార్తా సంస్థ ఒక కథనంలో వెల్లడించింది.
దీని ప్రకారం, ముందుగా ప్యాకేజ్ చేసి, లేబుల్ వేసిన బియ్యం, గోధుమలు, గోధుమ పిండి వంటి పప్పులు, ధాన్యాలపై ఇక నుంచి 5 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తారు.
ఈ సరకుల మీద జీఎస్‌టీ పెంచాలని చండీగఢ్‌లో జరిగిన 47వ జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
పెరుగు, లస్సీ, మరమరాలు వంటి ఇతర సరకులను కూడా ప్యాకేజ్ చేసి, లేబుల్ వేస్తే.. వాటికి సైతం 5 శాతం జీఎస్‌టీ వర్తిస్తుంది.

ఫొటో సోర్స్, ANI
అయితే.. ఇవే వస్తువులు (పప్పులు, ధాన్యాలు, పిండి మొదలైనవి) 25 కిలోలు లేదా 25 లీటర్లకు మించి ఒకే ప్యాకేజీగా ఉన్నట్లయితే అవి ప్రీ-ప్యాకేజ్డ్ అండ్ లేబుల్డ్ కేటగిరీ కిందకు రావని ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రచురించిన తరచుగా అడిగే ప్రశ్నలు (ఎఫ్ఏక్యూ) పత్రంలో వివరించింది.
అలాగే.. ముద్రణ, రాత, డ్రాయింగ్ ఇంకు, కత్తులు, పేపర్ కత్తులు, పెన్సిల్ షార్పెనర్లు, బ్లేడ్లు, స్పూన్లు, ఫోర్కులు, స్కిమ్మర్లు, కేక్ సర్వర్లు వంటి ఇతర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. ఈ వస్తువుల మీద ఇప్పుడు జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు.
ఇక ఎల్ఈడీ బల్బులు, సోలార్ వాటర్ హీటర్ల మీద ఇంతకు ముందు 12 శాతం జీఎస్‌టీ ఉండగా, ఇక నుంచి 18 శాతం వసూలు చేస్తారు.
ద్రవ పానీయాలు లేదా డెయిరీ ఉత్పత్తులను ప్యాక్ చేయటానికి ఉపయోగించే టెట్రా ప్యాక్ (అసెప్టిక్ ప్యాకేజింగ్ పేపర్) మీద జీఎస్‌టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచారు.
అంటే టెట్రా ప్యాకుల్లో కొనే పాలు, పెరుగుల్లాంటివి ఇక ముందు ధర పెరుగుతాయి.

ఫొటో సోర్స్, Getty Images
కట్ చేసిన, పాలిష్ చేసిన వజ్రాల మీద ఇంతకుముందు 0.25 శాతంగా ఉన్న జీఎస్‌టీని ఇప్పుడు 1.5 శాతానికి పెంచారు.
అలాగే.. రూ. 1,000 వరకూ ఉన్న హోటల్ గదుల అద్దెల మీద ఇప్పుడు 12 శాతం జీఎస్‌టీ విధించారు.
బ్యాంకులు చెక్కులు ఇష్యూ చేసేందుకు ఇకపై 18 శాతం జీఎస్‌టీని వసూలు చేస్తాయి.
తగ్గింపు కొన్నింటికే
రోప్‌వేల ద్వారా సరకులు, ప్రయాణికుల రవాణా మీద విధించే జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.
ఇంధన ఖర్చు కూడా కలిసివుండే.. ట్రక్కులు, గూడ్స్ క్యారేజీల అద్దె తగ్గనుంది. దీని మీద 18 శాతంగా ఉన్న జీఎస్‌టీని 12 శాతానికి తగ్గించారు.
ఇవి కూడా చదవండి:
- పాములు పగబడతాయా, నాగస్వరం విని నాట్యం చేస్తాయా...పాముల గురించి తెలుసుకోవాల్సిన తొమ్మిది విషయాలు
- ద్వారక: సముద్ర గర్భంలో శ్రీకృష్ణుడి నగరం కోసం అన్వేషణ. దొరికిన ఆనవాళ్లు ఏం చెబుతున్నాయి
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల బరువైన అతిపెద్ద బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- రాణి రుద్రమ దేవి వారసుడు ఈయనేనా, ఇన్నాళ్లూ ఎక్కడున్నారు
- ‘భార్య తాళిబొట్టును విసిరికొట్టడం వల్ల కలిగిన మనోవేదన’ అనే కారణం చెప్పి భర్త విడాకులు పొందవచ్చా
- క్యాన్సర్ ఉన్నట్లు గోళ్ల మీద కనిపించే రంగులు, మచ్చలు కూడా చెప్పగలవా, నిపుణులు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












