క్యాన్సర్ ఉన్నట్లు గోళ్ల మీద కనిపించే రంగులు, మచ్చలు కూడా చెప్పగలవా, నిపుణులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రిసిల్లా కర్వాలో
- హోదా, బీబీసీ న్యూస్
గోళ్ల ను అందంగా తీర్చిదిద్దుకునేందుకు కొందరు ‘‘బ్యూటీ పార్లర్’’ లేదా ‘‘నెయిల్ సెలూన్’’లకు వెళ్తుంటారు. అయితే, ఇలాంటి పార్లర్లకు వెళ్లడం కంటే గోళ్లపై మనమే ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఎందుకంటే మన శరీరంలో దాగివున్న చాలా అనారోగ్య సమస్యల గురించి ఇవి ముందుగానే మనకు సంకేతాలు ఇస్తాయి.
మనం గోళ్ల రంగును ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ఏదైనా రంగు మారినట్లు అనుమానం వస్తే వెంటనే అప్రమత్తం కావాలి. కొన్నిసార్లు మచ్చలు, గీతలు కూడా కనిపిస్తుంటాయి. మరికొన్నిసార్లు ఇతర గుర్తులు కూడా ఉంటాయి.
ఇలాంటి గుర్తులు కనిపించిన వెంటనే డెర్మటాలజిస్టును కలవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా వైద్యుల దగ్గరకు వెళ్లిన వెంటనే, గోళ్లు అలా ఎందుకు మారాయో తెలుసునేందుకు రక్త పరీక్షలు లేదా ఇతర వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచిస్తారు.
ఒకవేళ అప్పటికీ ఏమీ తెలియకపోతే, బయాప్సీ కూడా చేయించుకోవాలని సూచిస్తారు.
గోళ్ల పై వచ్చే సంకేతాలతో చాలా వ్యాధులకు సంబంధం ఉంటుంది. శరీరంలోని చాలా అవయవాలను పీడిస్తున్న అనారోగ్యాల సంకేతాలు మనకు గోర్లపై కనిపిస్తుంటాయి.
ముఖ్యంగా కిడ్నీలు, చర్మం, కాలేయం, ఎండోక్రైన్ గ్రంథులు, పోషకాహార లోపం, వ్యాధి నిరోధక శక్తి సమస్యల సంకేతాలు మనకు గోళ్ల మీద కనిపిస్తాయి.
అయితే, అన్నిసార్లూ ఏర్పడే మచ్చలు, లేదా గీతలు జబ్బులకే సంకేతం అని భావించకూడదు. ఒక్కోసారి ఎలాంటి అనారోగ్యం లేకపోయినప్పటికీ గోరు మీద ఇలాంటి తేడాలు కనిపిస్తుంటాయి.
‘‘కాలి గోళ్ల పై శ్రద్ధ పెట్టకపోతే కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ఉదాహరణకు అవి పసుపు రంగులోకి మారిపోవడం, లేదా పైపెచ్చులు ఊడిపోవడం లాంటివి జరుగుతుంటాయి’’అని డెర్మటాలజిస్టు వలేరియా జెనెల్లా చెప్పారు.
గోళ్లలో వచ్చే మార్పులు, వాటి వెనుక దాగివున్న కొన్ని వ్యాధుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఫొటో సోర్స్, Getty Images
తెల్లగా మారిపోవడం..
గోళ్ల లో ఏదో జరుగుతుందని మీకు అనిపిస్తుంటే ముందుగా వాటి రంగును గమనించాలి.
ఒకవేళ అవి తెల్లగా పాలిపోతే...మైకోసిస్, సొరియాసిస్, న్యుమోనియా లాంటి ఇన్ఫెక్షన్లు శరీరాన్ని పీడిస్తున్నాయని వెంటనే సందేహ పడాలి.
ఒక్కోసారి హృద్రోగాలు లాంటి తీవ్రమైన వ్యాధులకూ గోళ్లు తెల్లగా పాలిపోవడానికి సంబంధం ఉంటుంది.
శరీరంలో పోషకాలు తగ్గిపోవడం, ప్రోటీన్‌ను తక్కువగా తీసుకోవడమూ వల్ల కూడా ఇలా కావొచ్చు.
‘‘రక్త హీనత కూడా దీనికి కారణం కావొచ్చు. రక్తంలో ఐరన్ స్థాయిలు తగ్గినప్పుడు గోళ్లు తెల్లగా అయిపోతుంటాయి. ఒక్కోసారి స్పూన్ లాంటి తెల్లని ఆకారాలూ గోళ్ల పై కనిపిస్తుంటాయి’’అని డెర్మటాలజిస్టు జూలియానా పికెట్ చెప్పారు.
ఒక్కోసారి ‘‘ల్యూకోనికియా’’గా పిలిచే ఆరోగ్య స్థితి వల్ల కూడా గోళ్లు తెల్లగా అవుతుంటాయి. ఇది అనారోగ్యానికి సంకేతం కాదు. అయితే, ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించాలి.
గోళ్లు తెల్లగా అయినప్పుడు మొదటగా దీని వెనుక గల కారణాలపై వైద్యులు దృష్టి పెడతారు.
అందుకే గోళ్లు తెల్లగా కనిపించిన వెంటనే డెర్మటాలజిస్టును సంప్రదించాలి. అక్కడ వైద్యులు సూచించిన పరీక్షలు చేయించుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
పసుపు రంగు గోళ్లు..
ఒక్కోసారి గోళ్లు పసుపు రంగులోకి మారుతుంటాయి. దీనికి జన్యుపరమైన వ్యాధులు లేదా వయసు పైబడటం కారణం కావొచ్చు.
గోళ్లు పసుపుగా మారినప్పుడు కాస్త ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. గోళ్లలో తేడాను మనం కంటితో చూసి గుర్తుపట్టొచ్చు.
ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా జరగొచ్చు. కొన్నిసార్లు సొరియాసిస్, హెచ్‌ఐవీ, కిడ్నీ వ్యాధులు లాంటి తీవ్రమైన అనారోగ్యాలకూ ఇది సంకేతం కావొచ్చు.
పొగ తాగే వారిలో కూడా గోళ్లు ఇలా పసుపు రంగులోకి మారుతుంటాయి. సిగరెట్ పొగ వల్ల ఇలా జరుగుతుంటుంది. ముఖ్యంగా బొటనవేలు, చూపుడు వేలులో ఈ తేడా కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
తెల్లని మచ్చలు
గోళ్ల పై తెల్లని మచ్చలు కనిపించడాన్ని ‘‘పిటింగ్’’అని కూడా పిలుస్తారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గోళ్ల పై ఈ మచ్చలు కనిపిస్తాయి.
సొరియాసిస్, డెర్మటైటిస్ లేదా ఇతర చర్మ లేదా జుట్టు సమస్యల వల్ల గోళ్ల పై ఇలా మచ్చలు వస్తుంటాయి.
‘‘గోరుపై తెల్లని ప్రాంతం క్రమంగా పెరుగుతుందంటే అది అలొపెసియా ఎరియాటాగా పిలిచే ఇన్ఫెక్షన్ వల్ల కూడా కావొచ్చు.. దీనికి వెంటనే చికిత్స చేయాలి’’అని సవ్‌పాలో ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన డెర్మటాలజిస్టు జూలియానా టోమా చెప్పారు.
కొన్నిసార్లు సిఫిలిస్ లాంటి సుఖ వ్యాధి వల్ల కూడా ఇలా జరిగే అవకాశముంది.
నీలం రంగులోకి మారితే..
చాలా మందిలో ఇలా గోళ్లు లేత నీలం రంగులోకి అప్పుడప్పుడు మారుతుంటాయి. కొన్ని రకాల ఔషధాలను వేసుకున్నప్పుడు ఇలా జరుగుతుంటుంది.
ముఖ్యంగా మలేరియా మందులు వేసుకున్నప్పుడు గోళ్లు ఇలా నీలం రంగులోకి మారుతుంటాయి.
ఇలా రంగు మారినప్పుడు వైద్యుల దగ్గరకు వెళ్లాలి. అప్పుడు మందులను మార్చడం లేదా కొత్త చికిత్సా విధానాలకు మారాలని సూచించడం లాంటివి చేస్తారు.

ఫొటో సోర్స్, Getty Images
ఫంగల్ ఇన్ఫెక్షన్లు
మైకోసిస్‌గా పిలిచే ఫంగల్ ఇన్ఫెక్షన్ గోళ్లకు వస్తుంటుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే ఇది మళ్లీమళ్లీ వస్తుంది. అందుకే దీని విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి.
ముఖ్యంగా కాలి గోళ్ల పై ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకసారి దీనికి చికిత్స మొదలుపెడితే, ఆరు నెలల వరకు కొనసాగించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఒకవేళ చేతి గోళ్లకు ఈ ఇన్ఫెక్షన్ వస్తే మూడు నుంచి నాలుగు నెలలపాటు చికిత్స ఉంటుంది.
మందులను సకాలంలో వేసుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చు.
మరోవైపు ఇలాంటి ఇన్ఫెక్షన్ సోకిన రోగులు ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తుంటారు. రోగులు ఉపయోగించే బూట్లు, స్విమ్మింగ్ పూల్ మనం వాడకపోవడమే మంచిది.
గోళ్ల పై గీతలు ఉంటే..
కొన్నిసార్లు గోళ్లపై సన్నంగా, నీలువుగా గీతలు కనిపిస్తుంటాయి.
హై ఫీవర్ లేదా కీమోథెరపీ లాంటి చికిత్సల తర్వాత ఇలాంటి గీతలు కనిపిస్తుంటాయి.
ఇవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గోళ్లపై కూడా కనిపించొచ్చు. అయితే, ఒక్కోసారి మెలనోమాకు కూడా ఈ గీతలు సంకేతం కావొచ్చు.
మెలనోమా ఒక చర్మ క్యాన్సర్.

ఫొటో సోర్స్, Getty Images
పెళుసుగా అయితే..
కొన్నిసార్లు గోళ్లు చాలా పెళుసుగా అయిపోతుంటాయి. ఏవైనా కెమికల్స్‌తో పనిచేసినప్పుడు ఇలా జరుగుతుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో గోళ్లపై క్రీమ్‌లు లాంటివి పూయాలి. అప్పుడు గోళ్లు తేమ కోల్పోకుండా ఉంటాయి.
శరీరానికి తగిన మోతాదులో ప్రోటీన్‌తోపాటు, బయోటిన్ లాంటి విటమిన్లు అందకపోవడం వల్ల కూడా గోళ్లు పెళుసుగా మారిపోతుంటాయి.
శాకాహారులు విటమిన్ బీ12 సప్లిమెంట్లు, ఇతర పోషకాహార పదార్థాలను తీసుకోవడంతో గోళ్లు పెళుసు బారకుండా అడ్డుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
- ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు
- పండర్‌పుర్ వారీ: ‘పీరియడ్స్ అనేవి పాండురంగడు ఇచ్చినవే. అవన్నీ ఆయనకే చెందుతాయి’
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- సీఐ నాగేశ్వర రావు అరెస్ట్, వివాహితను బెదిరించి, అత్యాచారం చేసిన ఆరోపణల కేసులో విచారిస్తున్న పోలీసులు
- వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














