ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించే లీథియం లోహంతో ఆత్మహత్య ఆలోచనలు తగ్గుతాయా?

లిథియం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మతియాజ్ జీబెల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

1968లో యేల్ వర్సిటీలో సైకియాట్రీ ఫెలోషిప్‌లో డాక్టర్ వాల్టర్ బ్రౌన్ చేరారు. దేశ అధ్యక్షుడిని కలవాలనే ఆలోచన నుంచి ‘‘మిస్టర్ జీ’’ ని విరమించుకునేలా చేయడమే ఆయన మొదటి మిషన్.

‘‘జీ’’ 17ఏళ్లపాటు ఒక మానసిక ఆసుపత్రిలో గడిపారు. ఆత్మహత్య ఆలోచనలు, కుంగుబాటు ఆయన్ను బాధించాయి. అదే సమయంలో ఆయన ఒక్కోసారి హైపర్‌ స్థాయికి వెళ్లిపోయేవారు. అలాంటి సమయంలోనే దేశ అధ్యక్షుడిని కలవాలని ఆయన తీర్మానించుకున్నారు.

‘‘వారంలో రెండు, మూడు సార్లు ఆయన్ను బయటకు తీసుకెళ్లేవాళ్లం. ఆ తర్వాత ముగ్గురు నర్సులు, నేను కలిసి ఆయన్ను బలవంతంగా తన గదిలోకి తీసుకొచ్చేవాళ్లం. కొన్నిసార్లు రెజ్లింగ్ పోటీ లాంటిదే జరిగేది. మత్తుమందులతో ఆయన్ను శాంత పరిచేవాళ్లం’’అని తన పుస్తకం ‘‘లిథియం: ఎ డాక్టర్, ఎ డ్రగ్, ఎ బ్రేక్‌ త్రూ‘’లో బ్రౌన్ వివరించారు.

‘‘డిప్రెసివ్ సైకోసిస్’’ లేదా ‘‘బైపోలార్ డిజార్డర్’’తో మిస్టర్ జీ బాధపడేవారు.

అయితే, రేండేళ్ల తర్వాత మళ్లీ మిస్టర్ జీని బ్రౌన్ కలిశారు. అప్పుడు చాలా సాధరణంగా ఒక సూపర్ మార్కెట్‌లో పనిచేస్తూ కనిపించారు.

మిస్టర్ జీ మూడ్‌లను ఒక కొత్త ఔషధం సాధారణ స్థితికి తీసుకొచ్చింది. ఆ ఔషధమే లీథియం. ఈ లోహంపై అప్పట్లో లోతైన పరిశోధనలు జరిగేవి. దీన్ని మానసిక వ్యాధుల చికిత్సలో ఔషధంగా ఉపయోగించొచ్చని గుర్తించిన తొలి వ్యక్తి జాన్ సీడ్.

లిథియం

ఫొటో సోర్స్, Getty Images

బిగ్ బ్యాంగ్ నుంచి..

21వ శతాబ్దంలో ‘‘లిథియం’’ను భవిష్యత్ బంగారంగా అభివర్ణిస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లోని బ్యాటరీలు, ఆటోమోటివ్ పరిశ్రమలో విరివిగా ఉపయోగించడంతో ఈ లోహానికి డిమాండ్ పెరిగింది.

శిలాజేతర ఇంధనాల కోసం చేపడుతున్న అన్వేషణ కూడా ఈ లోహం డిమాండ్ పెరగడానికి కారణమైంది. బొలివియా, చిలీ, అర్జెంటీనాల్లో ఇది ఎక్కువగా దొరుకుతుంది.

అయితే, అత్యంత తేలికైన లోహాల్లో ఒకటైన లిథియం భూమి పుట్టకముందు నుంచీ ఉంది. బిగ్‌బ్యాంగ్ విస్ఫోటంలో పుట్టిన మూలకాల్లో హైడ్రోజన్, హీలియంతోపాటు లిథియం కూడా ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అయితే, ఔషధంగా లిథియాన్ని ఉపయోగించడం అనేది రెండో శతాబ్దంలోనే మనకు కనిపిస్తుందని జేమ్స్ రషెల్స్ తన పుస్తకంలో వివరించారు. మేనియా, మెలనోక్లియా లాంటి రుగ్మతలతో బాధపడేవారు ఆల్కలైన్ వాటర్‌ఫాల్స్‌లో స్నానం చేస్తే మేలని ప్రముఖ వైద్యుడు సొరేనస్ సూచించినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. ఇక్కడ ఆల్కలైన్ వాటర్‌ఫాల్స్ అంటే లిథియం లాంటి లోహాలు కలిసిన నీరని భావించాలి.

20వ శతాబ్దంలో మరోసారి రెండు మానసిక స్థితులపై చర్చలకు లిథియం కేంద్రబిందువైంది. ‘‘వెరీ హై’’, ‘‘వెరీ లో’’ లాంటి మానసిక స్థితులకు చికిత్సలో దీన్ని ఉపయోగించడమే దీనికి కారణం.

లిథియం

ఫొటో సోర్స్, Getty Images

అప్పటివరకు తూతూ మంత్రంగా..

అయితే, 1949లో లిథియంను ఔషధంగా ఉపయోగించొచ్చని జాన్స్ సీడ్ గుర్తించిన తర్వాత మానసిక వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని బ్రౌన్.. బీబీసీతో చెప్పారు.

‘‘అప్పటివరకు మానసిక వ్యాధులకు ఎలాంటి ఔషధాలూ ఇచ్చేవారు కాదు. కొంతమంది మాత్రం నొప్పులను తగ్గించే ఓపియోడ్స్‌ను తీసుకునేవారు. కొంతమందికి మత్తుమందులు కూడా ఇచ్చేవారు. మానసిక రుగ్మతలను కూడా నయం చేయొచ్చని నిరూపించిన తొలి ఔషధం లిథియం’’అని బ్రౌన్ వివరించారు.

అప్పట్లో కుంగుబాటు తీవ్రం కావడం, ఇతర మానసిక అనారోగ్యాలకు చికిత్సలో భాగంగా రోగులను ఆసుపత్రుల్లో బంధించేవారు. మరికొంత మందికి మత్తుమందులు కూడా ఇచ్చేవారు. 1940, 1950లలో విద్యుత్‌తో షాక్‌లు కూడా ఇచ్చేవారు.

లిథియం

ఫొటో సోర్స్, Getty Images

అలా వెలుగులోకి..

సీడ్ ఒక మానసిక వ్యాధుల నిపుణుడు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆయన సేవలందించారు. అయితే, ఆయనకు ఎలాంటి వైద్యపరమైన శిక్షణా లభించలేదు.

హాస్పిటల్‌ కిచెన్‌లో ఆయన ల్యాబ్ ఉండేది. లక్కీగా ఆయన ఈ ఔషధాన్ని కనుగొన్నారని చాలా మంది చెబుతుంటారు. కానీ, ఆ వాదనతో ఆయన ఏకీభవించరు.

‘‘గినియా పిగ్‌లకు లిథియం సాల్ట్ ఇవ్వడంతో అవి చాలా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నట్లు కనిపించాయి. దీంతో మనుషులపైనా ఇవి ఇలాంటి ప్రభావాన్నే చూపొచ్చనే విషయాన్ని ఆయన గ్రహించారు. ’’అని బ్రౌన్ అన్నారు.

‘‘ప్రస్తుతం మానసిక వ్యాధులను మందులతో నయం చేయొచ్చని చెబితే ఎవరూ ఆశ్చర్యంగా చూడరు. కానీ, 70ఏళ్ల క్రితం ఇదొక అద్భుత పరిణామం’’అని బార్సిలోనా యూనివర్సిటీ ఆసుపత్రిలో సైకియాట్రీ, సైకాలజీ సర్వీసెస్ విభాగం అధిపతి ఎడ్వర్డ్ వీటా చెప్పారు.

‘‘ఆయన గినియా పిగ్‌లకు లిథియం యూరేట్‌ను ఇచ్చారు. ఈ ఔషధం వాటిపై మత్తుమందులా పనిచేసింది’’అని వీటా చెప్పారు.

అయితే, గినియా పిగ్‌లలో మార్పులకు యూరిక్ యాసిడ్ కారణమని సీడ్ మొదట అనుకున్నారు.

‘‘అదే దిశగా మరికొన్ని సాల్ట్‌లను కూడా ఆయన పరీక్షించారు. లిథియం వల్లే ఆ మార్పులు వచ్చాయని ఆయన గుర్తించారు’’అని వీటా చెప్పారు.

లిథియం

ఫొటో సోర్స్, Getty Images

రక్తంలో ఎక్కువైతే..

‘‘మొదట నేను సీడ్ జీవిత చరిత్ర రాద్దామని అనుకున్నాను. దీనిపై చాలా పరిశోధన చేపట్టాను. అప్పుడే సీడ్ తన పరిశోధనలు కూడా నిలిపివేశారని, తన రోగుల్లో చాలా మంది అనారోగ్యానికి గురి కావడమే దీనికి కారణమని గుర్తించాను. ఆ తర్వాత మిగతా శాస్త్రవేత్తలు ఆ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లారు. దీంతో ఈ ఔషధంపై పుస్తకం రాయాలని అనుకున్నాను’’అని బ్రౌన్ బీబీసీతో చెప్పారు.

సీడ్ పరిశోధనల్లో పాలుపంచుకున్న పది మంది మానసిక ఆరోగ్యమూ మెరుగపడింది. అయితే, కొంతమంది మళ్లీ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో లిథియం చాలా ప్రమాదకరమైనదని, దీన్ని ఔషధంగా ఇవ్వకూడదని ఆయన భావించారు.

రక్తంలో లిథియం స్థాయిలను గుర్తించొచ్చని, ఫలితంగా రక్తంలో ఈ సాల్ట్ స్థాయిలు ఎక్కువ కాకుండా చూసుకోవచ్చని ఆస్ట్రేలియాకు చెందిన ఎడ్వర్డ్ ట్రాట్నెర్ లాంటి వైద్యులు ఆ తర్వాత గుర్తించారు.

లిథియం ఏ స్థాయిలో ఇవ్వాలో చెప్పేందుకు ఒక ‘‘థెరాప్టిక్ విండో’’ ఉందని ఆర్జెంటీనా సొసైటీ ఆఫ్ సైకియాట్రీకి చెందిన రిచర్డో కోరల్ చెప్పారు. ‘‘మరీ తక్కువ ఇస్తే ఇది పనిచేయదు. మరీ ఎక్కువ ఇస్తే విషపూరితం అవుతుంది’’అని ఆయన చెప్పారు.

‘‘ముఖ్యంగా రక్తంలో దీని స్థాయిలను గుర్తించేందుకు రక్త పరీక్షలు నిర్వహించాలి’’అని ఆయన వివరించారు.

సైకియాట్రీలో ట్రాట్నెర్ పరిశోధనతో ఔషధంగా లిథియం వినియోగం మరో మెట్టు ముందుకు వెళ్లిందని సైకియార్టిస్టు వీటా చెప్పారు.

ఆస్ట్రేలియాలో లిథియం దుష్ప్రభావాలను కట్టడి చేయడంపై పరిశోధన మొదలుపెడితే, అమెరికాలో.. లిథియంతో తయారుచేసిన మందులు, పానీయాలను అన్ని ఫార్మసీల నుంచి వెనక్కి తీసుకున్నారు.

లిథియం

ఫొటో సోర్స్, Getty Images

భయం నడుమ..

ప్రస్తుతం మనం శిలాజ ఇంధనాల స్థానంలో లిథియం బ్యాటరీలను ఎలా ఉపయోగించాలని అనుకుంటున్నామో.. 70ఏళ్ల క్రితం సోడియం స్థానంలో లిథియంను ఉపయోగించాలని కొంతమంది శాస్త్రవేత్తలు భావించారు.

సోడియంను ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు, హృద్రోగాలు, కిడ్నీల వైఫల్యం లాంటి సమస్యలు చుట్టుముట్టే సంగతి తెలిసిందే.

‘‘1940ల్లో అమెరికాలో కొంతమంది లిథియం క్లోరైడ్‌ను సోడియంకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే, వీరిలో చాలా మంది రక్తంలో లిథియం స్థాయిలు విపరీతంగా పెరిగాయి. వీరిలో కొందరు మరణించారు కూడా’’అని బ్రౌన్ చెప్పారు.

ఈ పరిణామాల నడుమ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్టేషన్ (ఎఫ్‌డీఏ) లిథియంను పూర్తిగా నిషేధించింది. అప్పట్లో 7అప్ సోడాలో కూడా దీన్ని ఉపయోగించేవారు.

వీడియో క్యాప్షన్, మీరు ఎన్నిరోజులకు ఒకసారి బెడ్‌షీట్లను మారుస్తారు/ఉతుకుతారు?

కారణాలు చాలానే ఉన్నాయి..

అయితే, బైపోలార్ డిజార్డర్ ఔషధంగా అమెరికాలో లిథియంను సూచించకపోవడానికి చాలా ఇతర కారణాలు కూడా ఉన్నాయని బ్రౌన్ చెప్పారు.

‘‘అమెరికాలో బైపోలార్ డిజార్డర్‌కు మరికొన్ని ఔషధాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాటిపై విపరీతంగా ప్రకటనలు ఇచ్చేవారు. దీంతో లిథియం వాడకంపై ప్రభావం పడింది. నిజానికి అమెరికాలో కేవలం పది శాతం మంది రోగులే లిథియంతో ప్రయోజనం పొందారు. యూరప్‌లో ఈ వాటా 50 శాతం వరకు ఉంటుంది’’అని బ్రౌన్ చెప్పారు.

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోకపోవడమూ ఈ ఔషధం ప్రాచుర్యంలోకి రాకపోవడానికి ఒక కారణమని వీటా కూడా చెప్పారు.

వీడియో క్యాప్షన్, భర్తను చంటి పిల్లాడిలా కాపాడుకుంటున్న మహిళ కథ..

‘‘మార్కెటింగ్ కోణంలో లిథియం ఎప్పుడూ గొప్ప ఔషధం కాదు. అదే సమయంలో కేసులు వేస్తారనే భయం కూడా ఉండేది. పొరపాటున రోగి రక్తంలో లిథియం స్థాయిలు పెరిగిపోతే ఆయన కేసు వేసే అవకాశముంది’’అని వీటా వివరించారు.

‘‘అయితే, లిథియంతో మెదడులో ఆలోచనలు కుదుటపడతాయి. బైపోలార్ డిజార్డర్‌తో బాధపడేవారికి దీనితో చాలా ఉపయోగం ఉంటుంది’’అని రిచార్డో అన్నారు.

‘‘మూడ్‌లను మెరుగుపరచడంతోపాటు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలనూ ఇది తగ్గిస్తుంది’’అని ఆయన చెప్పారు.

బైపోలార్ డిజార్డర్‌తో రెండు రకాల మానసిక స్థితులు ఉంటాయి. వీటిలో మొదటిది హైపర్.. అంటే తమకు గొప్ప శక్తులు ఉన్నాయని భావిస్తుంటారు. రెండోది ‘‘లో’’.. ఇది కుంగుబాటు లాంటి పరిస్థితి.

మిస్టర్ జీ కూడా ఇలానే తను తేలిగ్గానే అమెరికా అధ్యక్షుడిని కలవొచ్చని భావించేవారు.

‘‘అయితే, అన్నిసార్లూ ఆత్మహత్యలు, కుంగుబాటులకు బైపోలార్ కారణమని భావించకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇది సృజనాత్మకతకూ ఇది కారణం అవుతుంది. కొంతమంది కళాకారులకు ఈ రుగ్మత ఉన్నట్లు చాలా వార్తలు వస్తుంటాయి’’అని వీటా చెప్పారు.

వీడియో క్యాప్షన్, కళ్ళు ఎందుకు అదురుతాయి? కళ్ళు చెప్పే ఆరోగ్య రహస్యాలివే..

అలా కనుమరుగు..

20వ శతాబ్దపు అద్భుత ఔషధ ఆవిష్కరణల్లో లిథియం కూడా ఒకటని బ్రౌన్ అభివర్ణించారు.

‘‘తర్వాత కాలంలో ఇతర మానసిక ఔషధాలు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. షింజోఫెర్నియాపై ఇవి మెరుగ్గా పనిచేయడం మొదలుపెట్టాయి’’అని ఆయన చెప్పారు.

‘‘లిథియం తర్వాత వచ్చిన క్లోరోప్రోమాజైన్ రాకతో మానసిక వ్యాధుల చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. దీన్ని లక్షల మంది తీసుకోవడం మొదలుపెట్టారు. వీరు ఆసుపత్రుల నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జి కావడం కూడా మొదలైంది’’అని వీటా వివరించారు.

అయితే, లిథియం చాలా మంది రోగుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

‘‘నా మెదడులో ఒక సాల్ట్ తక్కువగా ఉండటం వల్ల నేను ఎంతో వేదన అనుభవించానని తలచుకుంటే చాలా బాధనిపిస్తోంది. ఆ సాల్ట్‌ను నాకు ఇచ్చి ఉంటే పీడకలల నుంచి విముక్తి లభించేది’’అని లిథియం గురించి అమెరికన్ రచయిత రాబర్ట్ లోవెల్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)