బుల్డోజర్: భారతీయ ముస్లింలలో భయాన్ని పుట్టిస్తున్న మెషీన్

జావెద్ మొహమ్మద్ ఇల్లును అధికారులు బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జావెద్ మొహమ్మద్ ఇల్లును అధికారులు బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బుల్డోజర్‌‌ను సుమారు 100 ఏళ్ల కిందట కనిపెట్టారు. అప్పటినుంచి ఇళ్లు, కార్యాలయాలు, రహదారులు, మౌలిక సదుపాయాల నిర్మాణాల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు.

కానీ, ఇటీవలి సంవత్సరాల్లో బుల్డోజర్... భారత్‌లోని హిందూ జాతీయవాదపార్టీ బీజేపీ చేతిలో ఆయుధంలా మారిందని చాలామంది అంటున్నారు. మైనారిటీలైన ముస్లింల ఇళ్లు, దుకాణాలు, ఆస్తులను ధ్వంసం చేయడానికి బుల్డోజర్‌ను వాడుతున్నారని చెబుతున్నారు.

రాజకీయ ప్రాముఖ్యం ఉన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ బుల్డోజర్లు ఎక్కువగా కనిపిస్తాయి.

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో తాజాగా బుల్డోజర్లను వాడారు. ఆదివారం రాజకీయ కార్యకర్త జావెద్ మొహమ్మద్ ఇంటిని బుల్డోజర్లతో కూల్చేశారు.

ఆయన ఇంటిని అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. అయితే, ఈ ఆరోపణలను జావెద్ కుటుంబం ఖండించింది.

ఈ కూల్చివేత వెనుక అసలు కారణం వేరే ఉందని విమర్శకులు అంటున్నారు. ఇల్లు అక్రమ నిర్మాణం అయినందుకు కాదు... ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించినందుకు జావెద్ కుటుంబాన్ని ఈవిధంగా శిక్షించారని విమర్శకులు చెబుతున్నారు.

ఇంటిని కూల్చివేయడానికి ఒకరోజు ముందు పోలీసులు జావెద్‌ను అరెస్ట్ చేశారు. మొహమ్మద్ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలకు నిరసనగా ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన హింసాత్మక ప్రదర్శనలకు సూత్రధారిగా జావెద్‌ను పోలీసులు భావిస్తున్నారు.

ముస్లింలను భయపెట్టడానికి బుల్డోజర్లను వాడుతున్నారని విమర్శకులు అంటున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముస్లింలను భయపెట్టడానికి బుల్డోజర్లను వాడుతున్నారని విమర్శకులు అంటున్నారు

బుల్డోజర్‌తో చట్టం ప్రాథమిక స్ఫూర్తికి విఘాతం

మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై భారత్‌లోని ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

శుక్రవారం ప్రార్థనల అనంతరం దేశంలోని అనేక నగరాల్లో దీనికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. నూపుర్ శర్మ ప్రాథమిక సభ్యత్వాన్ని బీజేపీ రద్దు చేసింది. కానీ, ఆమెను అరెస్ట్ చేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.

జావెద్‌తో పాటు నిరసనల్లో పాల్గొన్న ఇతరులకు వ్యతిరేకంగా తీసుకున్న చర్యలను బీజేపీ నేతలు సమర్థించారు. వారి విషయంలో చట్టవిరుద్ధంగా ఏదీ జరగలేదని వెనకేసుకొచ్చారు.

అయితే, విమర్శకులు మాత్రం చట్టం ప్రాథమిక స్ఫూర్తిని అధికారులు బుల్డోజ్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

చాలామంది మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ అంశం గురించి సుప్రీం కోర్టుకు లేఖ రాస్తూ... చట్టబద్ధమైన పాలనకు ఆమోదయోగ్యం కాని అణచివేతగా బుల్డోజర్లను పేర్కొన్నారు. ముస్లింలపై హింసను, అణిచివేతను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.

ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా పత్రికకు రాసిన ఒక ఆర్టికల్‌లో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్... ''అక్రమ నిర్మాణాలతో బుల్డోజర్లకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎవర్నీ? నేను ఎవరి వైపు నిలబడతాను? అనే అంశాలే వాటికి ముఖ్యం. నా విశ్వాసాలు, నా మతం ఆధారంగా అది పనిచేస్తుంది. ఒక బుల్డోజర్ వచ్చి నేను కట్టుకున్న ఇల్లును కూల్చివేసిందంటే అర్థం... అది కేవలం ఆ భవనాన్ని మాత్రమే కాదు గొంతెత్తి మాట్లాడే నా ధైర్యాన్ని కూడా కూల్చేసినట్లు'' అని పేర్కొన్నారు.

యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీకి మద్దతుదారులు బుల్డోజర్ బొమ్మలతో వచ్చారు
ఫొటో క్యాప్షన్, యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీకి మద్దతుదారులు బుల్డోజర్ బొమ్మలతో వచ్చారు

కోర్టులు ఏం చెబుతున్నాయి?

బుల్డోజర్ల వినియోగాన్ని భారత అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశారు. 'చట్టపరిధిలో వాటిని ఉపయోగించాలి తప్పా ప్రతీకారం కోసం వాటిని ఉపయోగించకూడదని' కోర్టు పేర్కొంది.

బుల్డోజర్లతో పొంచి ఉన్న ముప్పు ఇంకా పూర్తిగా బహిర్గతం కాలేదు.

ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన కవరేజీ చేస్తున్నప్పుడు నాకు ఓ ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. యోగి ఆదిత్యనాథ్ నిర్వహించిన ఒక రోడ్ షోలో ఆయన మద్దతుదారులు చిన్న బుల్డోజర్ల బొమ్మలతో హాజరయ్యారు. ఆ ఎన్నికల్లో గెలిచి యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు.

చేతుల్లో ప్లాస్టిక్ బుల్డోజర్ బొమ్మలను పట్టుకున్న యోగి మద్దతుదారులు, టీవీ కెమెరాల ముందుకు వచ్చి డ్యాన్స్ చేస్తూ ''బుల్డోజర్ బాబా మళ్లీ అధికారంలోకి వచ్చారు'' అంటూ పాటలు పాడారు.

యోగి ఆదిత్యనాథ్‌కు స్థానిక మీడియా బుల్డోజర్ బాబా అని పేరు పెట్టింది. విపక్ష నేత అఖిలేశ్ యాదవ్ కూడా ఆ పేరును ఉపయోగించడంతో ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది.

అఖిలేశ్ యాదవ్ వెటకారంగా ఆ పేరుతో పిలిచారు.

కానీ, బుల్డోజర్ బాబా అనే పేరుతో బీజేపీ లబ్ధి పొందిందని, ఆ పేరుతో యోగి ఇమేజ్ మరింత బలోపేతమైందని సీనియర్ జర్నలిస్ట్ శరత్ ప్రధాన్ అన్నారు.

యోగి ఆదిత్యనాథ్ ర్యాలీల సందర్భంగా చాలా నగరాల్లో బుల్డోజర్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసెంబ్లీ ముందు బుల్డోజర్లతో పరేడ్ నిర్వహించారు.

నూపుర్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

విమర్శకులను అణిచివేసేందుకు...

యోగి ఆదిత్యనాత్ బుల్డోజర్‌ను మొదట క్రిమినల్ వికాస్ దూబే విషయంలో ఉపయోగించారని సీనియర్ జర్నలిస్ట్ ఆలోక్ జోషి చెప్పారు. వికాస్ దూబేపై ఎనిమిది మిం పోలీసులను హత్య చేశారనే ఆరోపణలు ఉన్నాయి.

తర్వాత గ్యాంగ్‌స్టర్, రాజకీయనేత అయిన ముఖ్తార్ అన్సారీ విషయంలో బుల్డోజర్‌ను వాడారని జోషి తెలిపారు.

వారి ఆస్తులను బుల్డోజర్‌తో ధ్వంసం చేస్తోన్న వీడియోలు జాతీయ టీవీ చానెళ్లలో ప్రసారం అయ్యాయి. నేరస్థులకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకున్నందుకు యోగి ప్రభుత్వానికి ప్రజల మద్దతు, ప్రశంసలు లభించాయి.

''కానీ, ఇప్పుడు ప్రతిపక్షాలు, సర్కారును విమర్శించేవారిని అణిచివేసే వ్యూహంలో భాగంగా బుల్డోజర్లను వాడుతున్నారు. ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు'' అని జోషి అన్నారు.

సహారన్‌పుర్, ప్రయాగ్‌రాజ్‌లలో బుల్డోజర్లను ఉపయోగించడానికి ముందు జరిగిన ఒక సమావేశానికి నాయకత్వం వహించిన యోగి ఆదిత్యనాథ్... మాఫియా, నేరస్థులకు వ్యతిరేకంగా బుల్డోజర్లు పనిచేయడం కొనసాగిస్తాయని అన్నారు.

వీడియో క్యాప్షన్, దిల్లీలోని జహంగీర్‌పురిలో బుల్డోజర్ల హల్ చల్..

''బలమైన పాలనకు చిహ్నంగా ఉన్న బుల్డోజర్‌ను ఒక ఆయుధంగా ప్రభుత్వం మార్చేసింది. దీనితో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేష రాజకీయాలను పటిష్టం చేసేందుకు వాడుతున్నారు. ఇది ఎలా ఉందంటే నువ్వు నాపైకి ఒక రాయిని విసిరితే... నేను నీ ఇంటిని కూల్చేస్తా, నీ కుటుంబం మొత్తానికి గుణపాఠం నేర్పిస్తా అని స్థానిక గూండాలు ప్రవర్తించినట్లు ఉంది'' అని శరత్ ప్రధాన్ అభిప్రాయపడ్డారు.

''కానీ, బుల్డోజర్‌తో వ్యక్తుల ఆస్తులను ధ్వంసం చేయడానికి దేశ చట్టాలు అనుమతించవు. ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి, హత్య చేస్తే... ఆయన కుటుంబం మొత్తానికీ ఉరిశిక్ష విధిస్తారా? ప్రాసిక్యూషన్, జడ్జి, జ్యూరీ, తలారి ఇలా అన్ని పాత్రలను ఈ ప్రభుత్వమే పోషిస్తోంది'' అని ఆయన వ్యాఖ్యానించారు.

బుల్డోజర్ చర్యను ప్రపంచమంతా విమర్శిస్తోంది. కానీ, దీనితో యోగికి విపరీతమైన రాజకీయ మైలేజీ లభిస్తోందని జోషి అన్నారు.

వీడియో క్యాప్షన్, ప్రజాస్వామ్యంలో ‘బుల్డోజర్ న్యాయం’ దేనికి సంకేతం?

గత ఏడాది డిసెంబర్‌లో యూపీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ.. ''బుల్డోజర్‌ను మాఫియాను తరిమేయడానికి, అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయడానికి ఉపయోగించినప్పుడు, దాన్ని వాడిన వారికి కూడా బాధ కలుగుతుంది'' అని అన్నారు.

ప్రధాని వ్యాఖ్యల తర్వాత నుంచి మత హింసకు పాల్పడిన వారిపై కూడా బుల్డోజర్లను ప్రయోగిస్తున్నారు. ఇటీవల మధ్యప్రదేశ్, దిల్లీలో బుల్డోజర్‌ను వాడారు. ముస్లింలే లక్ష్యంగా ఇలాంటి చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. వారి ఇళ్ళు, దుకాణాలు, పరిశ్రమలకు నష్టం కలుగుతోంది.

''ఒక వ్యక్తి నేరం చేసినప్పటికీ, అతన్ని దోషిగా నిర్దారించినప్పటికీ.. శిక్షగా అతని ఇంటిని కూల్చివేయమని కోర్టు ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి తాజా పరిణామాలను చూస్తుంటే, మాకు వ్యతిరేకంగా నిలబడేవారిని మేం అణగదొక్కుతాం అనే సందేశాలు పంపుతున్నట్లు అర్థం అవుతోంది'' అని జోషి అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)