Uttar Pradesh - Buldozer: ప్రభుత్వం బుల్డోజర్‌తో ఇళ్లను కూల్చేయవచ్చా? చట్ట ప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అనంత ప్రకాశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రయాగ్‌రాజ్ హింస కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతున్న జావెద్ మొహమ్మద్ ఇంటిని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం బుల్డోజర్‌తో కూల్చేసింది.
ఆ రెండంతస్తుల ఇంటిలో భార్య, ఇద్దరు కుమార్తెలతో జావెద్ కలిసి ఉండేవారు.
ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం చర్యలపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు ప్రశ్నలు సంధించారు. మరోవైపు ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు తీసుకోవాలని సుప్రీం కోర్టును వారు అభ్యర్థించారు.
అదే సమయంలో నేరస్థులు/మాఫియాపై బుల్డోజర్లతో చర్యలు కొనసాగుతాయని ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా వ్యాఖ్యానించారు.
దీంతో ఇంతకీ ఒక ఇల్లును బుల్డోజరుతో ప్రభుత్వం కూల్చేయవచ్చా? ఇది చట్టప్రకారం సరైన చర్యేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.

ఫొటో సోర్స్, Twitter/myogiadityanath
ప్రభుత్వం ఏం చెబుతోంది?
ప్రయాగ్‌రాజ్‌లో జావెద్ మొహమ్మద్ ఇల్లును కూల్చేసేందుకు ఒక రోజు ముందు ఈ అంశంపై యోగి ఆదిత్యనాథ్ ఒక ట్వీట్ చేశారు.
''నేరస్థులు, మాఫియాపై బుల్డోజర్‌తో చర్యలు తీసుకుంటాం. అమాయకుల ఇళ్లకు ఎలాంటి భయమూలేదు. మేం అన్నీ సరిచూసుకున్నాకే చర్యలు తీసుకుంటాం''అని ఆయన ట్వీట్ చేశారు.
మరోవైపు మే 26న ఉత్తర్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై స్పందించారు. ''పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపించం. అదే సమయంలో గూండాలను వదిలిపెట్టం''అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
నేరస్థులపై సత్వర చర్యల పేరుతో ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌లలో బుల్డోజర్లకు ప్రభుత్వాలు పని చెప్పాయి.
మధ్యప్రదేశ్‌కు నాలుగోసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ఈ అంశంపై మాట్లాడుతూ.. ''మేం గూండాలు, నేరస్థులు, దాదాల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తాం. మహిళలను తప్పుడు ఉద్దేశంతో చూసిన వారి ఇళ్లను కూడా వదిలిపెట్టం''అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఖార్గోన్‌లో హింస చోటుచేసుకున్నప్పుడు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ క్యాబినెట్‌లో హోం మత్రిగా పనిచేస్తున్న నరోత్తమ్ మిశ్ర ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
''ఎవరి ఇంటి నుంచి రాళ్లు విసిరారో.. వారి ఇళ్లు రాళ్ల కుప్పలుగా మారిపోతాయి''అని ఆయన వ్యాఖ్యానించారు.
ఆ వ్యాఖ్యల తర్వాత ఖార్గోన్ జిల్లాలోని చాలా ఇళ్లను జిల్లా పరిపాలనా విభాగం కూలగొట్టించింది.
ఉత్తర్ ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజ్యాంగ పదవిలో కొనసాగుతున్నారు. రాజ్యాంగ పదవుల్లో కొనసాగే అలాంటి నాయకులు చేసే వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉండకూడదని నిపుణులు అంటున్నారు.
సాధారణ భాషల్లో చెప్పాలంటే, ఎలాంటి నేరాలకు పాల్పడినా వారి ఇళ్లను బుల్డోజర్లతో కూలదోసేస్తామని ఆ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ అలా చర్యలు తీసుకోవడానికి భారత్‌లోని చట్టాలు అనుమతిస్తున్నాయా? అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతోంది.
న్యాయ నిపుణులు ఏం అంటున్నారు?

సుప్రీం కోర్టు సీనియర్ అడ్వొకేట్ సంజయ్ హెగ్డే

బుల్డోజర్‌తో ఇళ్లను కూలదోయడాన్ని అక్రమ చర్యలుగా సంజయ్ హెగ్డే చెప్పారు.
''అనుమానితుడు లేదా నిందితుడి ఇళ్లపైకి బుల్డోజర్లను పంపేందుకు అనుమతించే చట్టాలేమీ లేవు. మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన చట్టాలను ఉల్లంఘించినందుకే బుల్డోజర్లను పంపిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఒకవేళ చట్టాలు ఉల్లంఘించినప్పటికీ, వారి వాదన చెప్పుకునేందుకు నోటీసుల రూపంలో ఒక అవకాశం ఇవ్వాలి''అని ఆయన అన్నారు.
దోషిగా నిర్ధారణ అయిన తర్వాత కూడా అలా బుల్డోజరుతో ఇళ్లను కూలదోయించవచ్చా? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
దీనిపై స్పందిస్తూ.. ''నేరం చేసినట్లు రుజువైతే అతడి ఇల్లును కూలదోయించాలని చెప్పే నిబంధనలేమీ భారత శిక్షా స్మృతిలో లేవు''అని హెగ్డే అన్నారు.
''చట్టాలను ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు. లేదా శిక్ష వేస్తారు. అంతేకానీ, ఇలా బుల్డోజర్లతో ఇళ్లను కూలదోయించేందుకు అనుమతించే చట్టాలేమీ లేవు''అని ఆయన వివరించారు.

ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గోవింద్ మాథుర్ విశ్లేషణ

ఇళ్లను ఇలా బుల్డోజర్లతో కూలదోయించడం రాజ్యాంగ వ్యతిరేక చర్యని ఉత్తర్ ప్రదేశ్ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గోవింద్ మాథుర్ కూడా అభిప్రాయపడ్డారు.
నేరాలను అడ్డుకుంటున్నామనే పేరుతో మనమే చట్టాలను ఉల్లంఘించకూడదు అని ఆయన అన్నారు.
''నేరాలను అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అవసరం. అయితే, దీన్ని సాకుగా చూపించి మనమే చట్టాలను ఉల్లంఘించకూడదు. నేరాలను అడ్డుకుంటున్నామని చెప్పి సీఆర్‌పీసీ, ఐపీసీలోని నిబంధనలను ఉల్లంఘించకూడదు''అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, MADHYA PRADESH POLICE VIA TWITTER
ఇది ఎందుకు అక్రమ చర్య?
నేరానికి శిక్షగా ఇళ్లను కూలదోయించడం అక్రమం అయినప్పుడు, ప్రభుత్వాలు ఎందుకు తమ చర్యలను సమర్థించుకుంటున్నాయి?
ఇలా ఇళ్లను బుల్డోజర్లతో కూలదోయించడంతో రాజకీయ పార్టీలు ఏం సాధిస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానాల కోసం తాజాగా ఇలాంటి ఘటనలను మేం పరిశీలించాం.
గ్యాంగ్‌స్టర్ వికాశ్ దుబే ఇంటిని కూలగొట్టడంతో ఉత్తర్ ప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. నేరాలను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతూ యూపీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
ఆ తర్వాత యూపీలోని మిగతా జిల్లాల్లోనూ బుల్డోజర్లతో ఇళ్లను కూలగొట్టించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వీటి వల్ల బీజేపీ రాజకీయంగా లబ్ధి కూడా పొందింది.
మరోవైపు మధ్యప్రదేశ్‌లో ఖార్గోన్ జిల్లాలో హింస తర్వాత చాలా మంది ఇళ్లను బుల్డోజర్లతో జిల్లా పరిపాలనా విభాగం కూలదోయించింది.

ఫొటో సోర్స్, SALMAN ALI/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
దీనిపై స్పందించాలని జిల్లా మేజిస్ట్రేట్ పీ అనురాగ్‌ను విలేఖరులు కోరినప్పుడు.. ''ఆ హింసకు బాధితులైన వారి ఇంటికి వెళ్లి మీరు మాట్లాడండి. నేరస్థుల విషయంలో మేం చేసినది సరైన చర్యేనని వారు చెబుతారు. జిల్లా పరిపాలనా విభాగం తమతో ఉందని వారు భావిస్తున్నారు''అని అన్నారు.
గుజరాత్‌లోనూ బుల్డోజర్‌తో ఇళ్లు కూలదోయించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత దిల్లీలోని జహాంగీర్‌పురీలోనూ హింస తర్వాత బుల్డోజర్లను ఉపయోగించారు.
అయితే, సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడంతో జహాంగీర్‌పురీలో బుల్డోజర్ చర్యలను నిలిపివేశారు.
కాన్పుర్ నుంచి ఖరగోన్ వరకు.. జహాంగీర్‌పురీ నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు అన్నింటా ఒకటి మాత్రం పక్కాగా కనిపిస్తుంది. అదే విపరీతంగా మీడియా దృష్టి ఆకర్షించడం.
ఇళ్లను కూలదోయించిన తర్వాత తమ నాయకులకు మద్దతుగా మీమ్‌లు, సోషల్ మీడియా పోస్టులతో రాజకీయ పార్టీలు ముందుకు వస్తాయి.
కొన్నేళ్ల ముందు వరకు నేరం జరిగిన వెంటనే నేరస్థుడిని పట్టుకోవడాన్ని సత్వర చర్యలుగా చెప్పుకునేవారు. వెంటనే అభియోగపత్రం దాఖలు చేసి, కోర్టులో విచారణ కూడా మొదలుపెట్టేవారు.
కానీ, ఉత్తర్ ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుల్డోజర్లు, ఎన్‌కౌంటర్లను సత్వర న్యాయంగా చెప్పడం మొదలుపెట్టింది. దీనిపై ప్రజా సంఘాలు మొదట్నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నాయి.
ఇవి కొనసాగుతాయా?
బుల్డోజర్లతో తీసుకునే చర్యలను బీజేపీ సమర్థించుకుంటోంది. నేరాలను తగ్గించేందుకు ఇది అవసరమని చెబుతోంది.
ఇలా బుల్డోజర్లతో ఇళ్లను కూలదోయించడం సాధారణం అయితే, దీర్ఘకాలంలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?
''భయాన్ని సృష్టించి నేరాలను అడ్డుకోవడమనేది ఇప్పుడు కనిపిస్తోంది. అంటే, మనం 17, 18వ శతాబ్దాలకు వెళ్లిపోయినట్లు అనిపిస్తోంది. అప్పుడు ఎవరికీ హక్కులు ఉండేవి కాదు. ఇప్పుడు ఎంతో కష్టపడి మనం చట్టాలు, న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మనకు 75ఏళ్లు పట్టింది. ఇది ఇంకా మెరుగుపడాలి కానీ, వెనక్కి వెళ్లిపోకూడదు''అని మాజీ చీఫ్ జస్టిస్ మాథుర్ అన్నారు.
''ఈ ఘటనలు ఇలానే కొనసాగితే.. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతాయి లేదా వారిలో భయాందోళన ఎక్కువవుతుంది. నిప్పును నిప్పుతోనే ఆర్పాలనే విధానం ఎప్పుడూ సరికాదు. వివేచనతో ఆలోచించే ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలు తీసుకోదు''అని సంజయ్ హెగ్డే చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ప్రయాగ్‌రాజ్ హింస: బుల్డోజర్లతో కూల్చేసిన ఈ ఇంటిలో ఉండే జావెద్ మొహమ్మద్ ఎవరు?
- పెట్రోల్, డీజిల్ ఆదా చేసే ట్రిక్స్‌లో అపోహలు, 5 వాస్తవాలు
- సెక్స్ కోసం మహిళను మగాడు బలవంతం చేస్తే అది రేప్... మరి అదే పని ఒక మహిళ చేస్తే
- ఇంటర్నెట్ ద్వారా ఆదాయం.. ఎంత సేపు బ్రౌజ్ చేస్తే అంత సంపాదించగలిగితే ఎలా ఉంటుంది?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- కసార్ దేవి: హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రపంచం నలుమూలల నుంచి మేధావులు ఎందుకు వస్తున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














