బుల్డోజర్: అల్లర్లు జరిగిన ఖార్గోన్ ఇప్పుడెలా ఉంది, ఒక మతం వారిపైకే అధికారులు బుల్డోజర్లు పంపించారా?-బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

ఫొటో సోర్స్, SALMAN RAVI/BBC
- రచయిత, సల్మాన్ రావి
- హోదా, బీబీసీ కోసం
మత ఘర్షణలు చెలరేగిన మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్‌లో బీబీసీ బృందం పర్యటించింది.
మేం సిటీలోకి వచ్చేటప్పటికి ఉదయం 8 గంటలైంది. ఖార్గోన్ పట్టణ వీధుల్లోకి జనం అప్పుడప్పుడే వస్తున్నారు. శ్రీరామ నవమి ఊరేగింపు తర్వాత చెలరేగిన హింస, మతపరమైన ఉద్రిక్తతలను నియంత్రించడానికి ఈ నెల 10 నుంచి నగరంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.
పరిస్థితి సద్దుమణగడంతో ప్రభుత్వం కర్ఫ్యూను 9 గంటల పాటు సడలించింది. అయినా విద్యా సంస్థలు ఏవీ ఇంకా తెరుచుకోలేదు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు చెబుతున్నారు.
కానీ, ఈ ప్రశాంత పరిస్థితుల్లోనే పట్టణ శివారు ప్రాంతాలలో బహిష్కరణ పిలుపులతో సభలు, సమావేశాలు, మైకులలో విజ్ఞప్తులు కలకలం సృష్టించాయి. సోషల్ మీడియాలో కూడా ఇవే విజ్ఞప్తులు కనిపించాయి.

ఫొటో సోర్స్, Getty Images
అధికారుల హెచ్చరికలు
సోషల్ మీడియా లేదా ఏదైనా ప్రసార మాధ్యమం ద్వారా ఎవరైనా ఇలాంటి విజ్ఞప్తులు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ ఖార్గోన్ ఏడీఎం ఎస్.ఎస్. ముజల్దా మంగళవారం ఉత్తర్వులు జారీ చేసే స్థాయికి పరిస్థితి చేరుకుంది.
మంగళవారం కూడా మైక్ ద్వారా ఇలాంటి ప్రచారాలు చేస్తున్న కొందరిపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.
''విద్వేషాన్ని ప్రచారం చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులోని వ్యక్తులు ఒక మైక్ ద్వారా కొందరు వ్యక్తులపై విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీన్ని మేం సుమోటోగా తీసుకుని విచారణ జరుపుతున్నాం'' అని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ కాస్వానీ మీడియా సమావేశంలో పేర్కొన్నారు.
ఇలాంటి వీడియోలు మరెక్కడైనా కనిపిస్తే వాటిని పోస్ట్ చేస్తున్న వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఏడీఎం ముజల్దా పోలీసులను ఆదేశించారు.
ఇంతకుముందు కూడా జిల్లాలోని ఇచ్ఛాపూర్, ఉద్దీ, పిప్రి వంటి ప్రాంతాల్లో సంకల్ప సభలు నిర్వహించి, ఒక మతానికి చెందిన వారి దగ్గర సరుకులు కొనరాదని, వారి షాపుల్లో షాపింగ్ చేయకూడదని ప్రజలను కోరినట్లు వార్తలు వచ్చాయి.
ఇలాంటి సమావేశాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు.
అయితే స్థానిక ఎంపీ గజేంద్ర సింగ్ పటేల్ ఇలాంటి సమావేశంలో పాల్గొన్నారని చర్చ జరుగుతోంది. ఈ సమావేశం కాస్రావాడ్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
"మత హింసతో ఖార్గోన్ రగిలిపోతుంటే, ఎంపీలు తమ రాజ్యాంగ బాధ్యతలను మరిచిపోయి అరాచకాలను వ్యాప్తి చేస్తుంటే మనం ఏం చేయగలం'' అని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.కె. మిశ్రా విమర్శించారు.

ఫొటో సోర్స్, SALMAN RAVI/BBC
చర్యలకు డిమాండ్
కాగా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'క్లెయిమ్ ట్రైబ్యునల్' సభ్యులిద్దరూ ఖార్గోన్‌కు చేరుకుని అల్లర్ల బాధిత ప్రాంతాలలోని ప్రజలతో మాట్లాడారు. రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శివకుమార్ మిశ్రా, రాష్ట్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ప్రభాత్ పరాశర్‌లు ఈ ట్రైబ్యునల్‌లో ఉన్నారు.
ఈ ట్రైబ్యునల్‌ను స్టేట్ గవర్నమెంట్ లా - పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ రికవరీ యాక్ట్, 2021లోని నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ చట్టం ప్రకారం అల్లర్లలో ఆస్తి నష్టం మొత్తాన్ని కూడా నిందితుల నుంచి వసూలు చేయవచ్చనే నిబంధన ఉంది.
శ్రీరామ నవమి ఊరేగింపు తర్వాత చెలరేగిన హింసకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 64 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. 175 మందిని అరెస్టు చేశామని, పలువురు పరారీలో ఉన్నారని పోలీసు సూపరింటెండెంట్ చెప్పారు.
పరారీలో ఉన్న వారిని పట్టుకున్న వారికి రివార్డులు కూడా ప్రకటించారు. అరెస్టయిన వారిలో రెండు వర్గాలకు చెందిన నిందితులు ఉన్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఖార్గోన్ పట్టణంలో హింసతో అనేక కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. వారిలో హిందువులతో పాటు ముస్లింలు కూడా ఉన్నారు. అయితే తమకే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఇరువర్గాల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ హింస తర్వాత అల్లర్లకు కారకులైన వారి ఇళ్లు, వ్యాపార సంస్థలపై అధికారులు చర్యలకు దిగారు. ఇళ్లు, వ్యాపార, ధార్మిక సంస్థలపైకి బుల్డోజర్లను పంపించారు. అయితే, ఆక్రమణలకు పాల్పడ్డ వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.
ముస్లిం వర్గాలు మాత్రం అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఒక వర్గాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపిస్తున్నాయి. అల్లర్లతో సంబంధం లేని వారిని, హింస సమయంలో ఆస్తులు కోల్పోయిన వారిని కూడా నిందితులుగా మార్చారని విమర్శించాయి.
మధ్యప్రదేశ్ మంత్రి విశ్వాస్ కైలాష్ సారంగ్ ఈ వ్యవహారంపై బీబీసీతో మాట్లాడారు. అల్లర్లకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా అవి పూర్తిగా రాజ్యాంగ పరిధిలోనే జరిగాయని స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం రెండు చట్టాలను రూపొందించిందని, దాని ప్రకారం అల్లర్ల వల్ల కలిగిన నష్టాన్ని రికవరీ చేసేందుకు నిబంధనలు రూపొందించామని చెప్పారు. మున్సిపల్ చట్టం1956 ప్రకారం ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా నిబంధనలు కూడా రూపొందించారు.

ఫొటో సోర్స్, SALMAN RAVI/BBC
పీస్ కమిటీ సభ్యుడి దుకాణం కూల్చివేత
అమ్జాద్ ఖాన్ వ్యాపారవేత్త. నగరంలో ఆయన ఒక బేకరీ నడుపుతున్నారు. పీస్ కమిటీలో ఆయన సభ్యుడు కూడా.
శ్రీరామ నవమి రోజున, తలాబ్ చౌక్ వద్ద పరిస్థితిని అదుపులో తీసుకురావడానికి, ప్రజలను బుజ్జగించడానికి సీనియర్ పోలీసు అధికారులు తమను ఉపయోగించుకున్నారని అమ్జాద్ ఖాన్ అన్నారు.
''ఇది చాలా సున్నితమైన ప్రాంతం. ఇక్కడ ఎవరైనా అల్లర్లకు పాల్పడితే సీసీటీవీలో అంతా రికార్డు అవుతుందని వారికి చెప్పాను. చివరకు అదే జరిగింది. రాళ్లదాడి మొదలై విషయం బయటకు రావడంతో నేను ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు సీసీటీవీలో నీ ముఖం కనిపిస్తోందని, అందుకే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. మున్సిపల్ అధికారులు హఠాత్తుగా వచ్చి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్‌తో నా బేకరీ మొత్తాన్ని పగలగొట్టారు. నాపై ఇంత వరకూ ఎలాంటి క్రిమినల్ కేసు కూడా లేదు'' అని అమ్జాద్ ఖాన్ అన్నారు.
అమాయకులపై పోలీసులు కేసులు పెడుతున్నారని, అధికారులు వేధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇదే తరహా ఆందోళన వ్యక్తం చేసిన వారిలో అక్బర్ ఖాన్ ఒకరు. ఆయన ఇల్లు, గడ్డివాములకు కొందరు నిప్పు పెట్టారు. ఇప్పుడు ఆయనపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.
''కూతురి పెళ్లి కోసం తాను పొదుపు చేసినవన్నీ బూడిదగా మారాయి. మా వస్తువులను దోచుకున్నారు, మమ్మల్ని కూడా నేరస్తులుగా చేశారు. మా మాట ఎవరూ వినడం లేదు'' అని అక్బర్ ఖాన్ అన్నారు.
అధికారుల తీరును ఇరువర్గాలు తప్పుబడుతున్నాయి. ఆనంద్ నగర్, రహీంపురాల్లో నివసిస్తున్న హిందూ కుటుంబాలు కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. హింసాకాండలో ఇబెరెజ్ ఖాన్ అనే వ్యక్తి హత్యకు సంబంధించి ఐదుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన దిలీప్ గాంగ్లే తండ్రి రమేశ్, తల్లి సునీల పరిస్థితి దీనంగా ఉంది. కస్టడీలో పోలీసులు దిలీప్‌ను తీవ్రంగా కొట్టారని వారు ఆరోపించారు. మరోవైపు తన భర్త సచిన్‌ను పోలీసులు దారుణంగా కొట్టారని ఉషా అనే మహిళ అన్నారు.
"పోలీసులు రిమాండ్‌లో పెట్టి చిత్రహింసలకు గురి చేశారు. దీంతో నేరాన్ని బలవంతంగా ఒప్పుకున్నారు. ఆయన మీదనే కుటుంబం ఆధారపడింది. మా ఇల్లు కాలిపోయింది. ఇప్పుడు ముగ్గురు చిన్న పిల్లలతో ఎలా బతకాలి'' అని ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, SALMAN RAVI/BBC
బుల్డోజర్ వివాదం
బుల్డోజర్ చర్య ఏకపక్షంగా ఉందని, ఇందులో ఒక మతానికి చెందిన వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రి విశ్వాస్ కైలాష్ సారంగ్ దీనిని ఖండించారు. రామ నవమికి ముందు నుంచి ఈ చర్యలు జరుగుతున్నాయని ఆయన బీబీసీకి తెలిపారు.
ఖార్గోన్ లోని ఖస్ఖాస్‌వాడిలోని తన ఇంటిని కూల్చేశారని చెబుతున్న హసీనా ఫఖ్రూకు ఏప్రిల్ 4న నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 10న అల్లర్లు జరిగాయి. మసీదు ముందున్న ఆక్రమణలను కూడా బుల్డోజర్లు తొలగించాయి. ఈ అల్లర్లకు ముందే వీరికి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఖార్గోన్ లో బుల్డోజర్ వ్యవహారం ఇటు ముస్లింలతోపాటు హిందువులకు కూడా కోపం తెప్పించింది. బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీరామ్ ధర్మశాలను కూడా బుల్డోజర్లు వదిలి పెట్టలేదు.
మనోజ్ రఘువంశీ రామనవమి ఊరేగింపు బాధ్యతలు నిర్వహించారు. ఆయన శ్రీరామ్ ధర్మశాల ట్రస్టీ కూడా. అధికారుల తీరు చాలా దారుణంగా ఉందని ఆయన బీబీసీతో అన్నారు.
''ధర్మశాల భూమిని మునిసిపల్ కార్పొరేషన్ 99 సంవత్సరాల లీజుకు ట్రస్టుకు ఇచ్చింది. కానీ నోటీసు లేకుండా, బయటి భాగాన్ని, మెయిన్ గేట్‌ను బుల్డోజర్‌తో కూల్చివేశారు. ఎంత చెప్పినా అధికారులు వినలేదు. ఇక్కడ చట్టం లేదు. స్థానిక అధికారులు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారు. వీరిపై ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి నియంత్రణ లేదు'' అని ఆయన విమర్శించారు.
ఖార్గోన్ లో నివసించే ఇరు వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాలని, దుష్టశక్తులను, అల్లర్లను వ్యాప్తి చేసేవారిని సమాజం కూడా కట్టడి చేసి వారిని శిక్షించడానికి ముందుకు రావాలని రఘువంశీ అన్నారు.
''రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే శాంతికి మార్గం ఏర్పడుతుంది'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- పెళ్లి మండపానికి ఆలస్యంగా వచ్చిన వరుడు.. మరొకర్ని పెళ్లి చేసుకున్న వధువు
- రష్యా 'సీక్రెట్ ఫస్ట్ లేడీ'గా పిలిచే పుతిన్ ‘గర్ల్ ఫ్రెండ్’ ఎవరు... ఆమెపై ఆంక్షలు విధించడానికి అమెరికా ఎందుకు భయపడుతోంది?
- బందరు పోర్టు కల ఎప్పటికైనా నిజమవుతుందా?
- ఆంధ్రప్రదేశ్: ముఖ్యమంత్రి పర్యటన కోసం సామాన్యుల కార్లు ఎందుకు? సీఎంకు ప్రత్యేక కార్లు ఉండవా?
- కూమా జైలు: స్వలింగ సంపర్కులకు మాత్రమే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












