లాహోర్‌లోని హిందువుల రాగి, ఇత్తడి వస్తువులతో తయారు చేసిన ఫిరంగులను అఫ్గాన్ పాలకులు ఎక్కడ ఉపయోగించారు?

ఫొటో సోర్స్, WAQAR MUSTAFA
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, జర్నలిస్ట్ & రీసెర్చర్, లాహోర్
అది 18వ శతాబ్ధం. సగానికి పైగా గడిచిపోయింది. అప్పటి అఫ్గాన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలి. తర్వాత ఆయను దురానీగా పిలిచేవారు. ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్‌లో క్షీణ దశలో ఉన్న మొఘల్ పాలనను వరస దాడులతో ఆయన అంతం చేశారు. అయితే, ఇంకా అక్కడ కొందరు శత్రువులు మిగిలే ఉన్నారు.
యుద్ధం కోసం కొత్తగా రెండు ఫిరంగులను తయారు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కానీ, అందుకు అవసరమైన లోహం అందుబాటులో లేదు.
లాహోర్‌లోని హిందువులు జజియా (ఒక విధమైన పన్ను) చెల్లించాలని ఆదేశాలు వచ్చాయి. సుబేదార్ షా వలీ ఖాన్, అతని సైనికులు ప్రతి హిందూ గృహం నుంచి రాగి లేదా ఇత్తడితో చేసిన పెద్ద పెద్ద పాత్రలను సేకరించేవారు.
అవసరమైనంత లోహం దొరికిన తర్వాత , లాహోర్ కు చెందిన షా నజీర్ అనే నిపుణుడు దానితో ఫిరంగులు తయారు చేశారు.
''తుపాకులు రెడీ అయ్యాక వాటికి జంజామా అని పేరు పెట్టారు. ఈ ఫిరంగులను మొదటిసారి 1761 జనవరి 14న జరిగిన మూడో పానిపట్ యుద్ధంలో మరాఠా సైన్యంపై ప్రయోగించారు'' అని పరిశోధకుడు మజీద్ షేక్ రాశారు.
ఈ యుద్ధంలో పది లక్షలమంది కంటే ఎక్కువ సైనికులు మరణించారని, దాదాపు 40 వేలమంది సైనికులు రెండు ఫిరంగుల కారణంగా చనిపోయారని జేజీ డఫ్ తన 'ఎ హిస్టరీ ఆఫ్ మరాఠాస్' అనే పుస్తకంలో వెల్లడించారు.
ఈ విజయం తర్వాత అహ్మద్ షా అబ్దాలీ లాహోర్ మీదుగా కాబూల్‌కు తిరిగి వచ్చారు. ఆ రెండు ఫిరంగులను వెనక్కి తీసుకురావాలనుకున్నారు. ఒకటి మాత్రమే తీసుకు రాగలిగారు. అది కూడా కాబూల్ వెళుతుండగా చీనాబ్ నదిలో పడిపోయింది.
రెండో ఫిరంగి లాహోర్ సుబేదార్ ఖ్వాజా ఉబైద్ పర్యవేక్షణలో ఉండి పోయింది.

ఫొటో సోర్స్, Getty Images
1707లో చక్రవర్తి ఔరంగజేబ్ మరణం తర్వాత బలహీనమైన మొఘల్ సామ్రాజ్యం ఒకవైపు అఫ్గాన్, మరోవైపు ఇరాన్ ఆక్రమణ దారుల నుంచి దాడులకు గురైంది.
మరోవైపు, పంజాబ్‌లోని గ్రామీణ ప్రాంతాలలోని సిక్కులు, మొఘలుల బలహీనతను గుర్తించి అనేక ముఠాలుగా ఏర్పడ్డారు.
1716 సంవత్సరంలో ఏర్పడిన ఒక ముఠా పేరు భంగీస్. ఈ ముఠా సభ్యులు గంజాయి తాగడం వల్ల సిక్కు ఆర్మీ దాల్ ఖల్సా ఈ బృందానికి భంగీస్ అని పేరు పెట్టింది.
గంజాయి మత్తు వారిని చల్లబరుస్తుంది. యుద్ధంలో భయం లేకుండా చేస్తుంది. ఈ ముఠాను తయారు చేసిన వ్యక్తి జాట్ కులానికి చెందిన ఛజ్జాసింగ్ (ఛజ్జు సింగ్). అమృత్‌సర్‌కు 24 కి.మీ దూరంలోని పంజ్వార్ గ్రామంలో నివసించేవారు.
ఆయన సిక్కుల పదో గురు గోవింద్ సింగ్ ద్వారా సిక్కు మతాన్ని స్వీకరించారని 'హిస్టరీ ఆఫ్ పంజాబ్' అనే పుస్తకంలో కన్హయ్య లాల్ రాశారు.
తన గురువు బోధనలతోపాటు, తాను ఏదో ఒక రోజు పంజాబ్‌ను పరిపాలిస్తానని తన సహచరులకు చెబుతుండేవారు ఛజ్జాసింగ్. ఈ పట్టుదలతోనే పంజాబ్‌లో మొఘల్ పాలనకు వ్యతిరేకంగా అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఆయుధాలు తక్కువగా ఉండటంతో ఈ బృందం గెరిల్లా దాడులను నిర్వహించేది.
చాలా మంది సిక్కులు ఈ గ్రూపులో చేరారని సయ్యద్ మహమ్మద్ లతీఫ్ తన 'హిస్టరీ ఆఫ్ ది పంజాబ్' పుస్తకంలో రాశారు. కొందరు సాయుధులు, ఇన్‌ఫార్మర్లు ప్రభుత్వ అధికారులు ఉండే గ్రామాలపై రాత్రిపూట దాడి చేసేవారు. దొరికిన విలువైన వస్తువులను తీసుకుని పారిపోయేవారు.
ఛజ్జా సింగ్ మరణానంతరం, అతని సహచరులలో ఒకరైన భీమా సింగ్ (భూమా సింగ్) అతని స్థానాన్ని ఆక్రమించారని చెబుతారు. ఆయన మోగా సమీపంలో ఉన్న వెండి పరగణాలోని హంగ్ గ్రామానికి చెందిన ధిల్లాన్ జాట్ కులస్తుడు.
భంగి ముఠా సహా సిక్కు ముఠాలను 'మిసిల్' అని పిలిచేవారు.

ఫొటో సోర్స్, Getty Images
చరిత్రకారులు లేపాల్ గ్రిఫిన్, సయ్యద్ మొహమ్మద్ లతీఫ్ ప్రకారం భీమా సింగ్ కసూర్ ప్రాంతానికి చెందినవాడు. సిక్కుల పన్నెండు మిసిల్ లలో ఒకటి, శక్తివంతమైన ముఠా భంగి మిసిల్ కు నిజమైన వ్యవస్థాపకుడు ఆయనే.
1739 సంవత్సరంలో ఇరాన్ చక్రవర్తి నాదిర్ షా దళాలతో జరిగిన పోరాటంలో భీమా సింగ్ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. భీమా సింగ్ పరిపాలనా సామర్థ్యం మిసిల్ కు బలాన్ని ఇచ్చింది.
1746 సంవత్సరంలో భీమా మరణించారు. ఆయనకు పిల్లలు లేనందున మేనల్లుడు హరిసింగ్ వారసుడు అయ్యారు.
అంతకుముందు ఈ మిసిల్ సభ్యులు రాత్రి పూట మాత్రమే దోచుకునేవారు. హరిసింగ్ రాక తర్వాత పగటిపూట కూడా దోచుకోవడం మొదలు పెట్టారు.
హరిసింగ్ తన సహచరులతో కలిసి, వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి దోచుకుని, ఆ ప్రాంతాన్ని నాశనం చేసిన తర్వాత తిరిగి వచ్చేవారు.
హరిసింగ్ లాహోర్, జంజామాలను స్వాధీనం చేసుకున్నారు. దాని పేరును 'భంగియాన్ వలీ కానన్' లేదా 'భంగియాన్ డి కానన్'గా మార్చారు.
అహ్మద్ షా అబ్దాలీకి చెందిన అఫ్గాన్ సైన్యంతో సుదీర్ఘ గెరిల్లా యుద్ధం తర్వాత 1765 ఏప్రిల్ 16న కహానియా మిసిల్ కు చెందిన లహ్నా సింగ్, గుజ్జర్ సింగ్, శోభా సింగ్ లు లాహోర్ ను స్వాధీనం చేసుకున్నారు.
లాహోర్ కోటను స్వాధీనం చేసుకోవడం ఒక సాహసోపేతమైన చర్య. ఆ రోజు రాత్రి గుజ్జర్ సింగ్ మనుషులు నల్లని దుస్తులు ధరించి, నాలుగు వైపులా బయటి గోడల గుండా ఎక్కి, కోట లోపలి వారందరినీ చంపారు.
దీని తరువాత ప్రధాన ద్వారం తెరిచారు. లహ్నా సింగ్ అతని సహచరులు కోటలోకి ప్రవేశించారు. ఆ తరువాత, గుజ్జర్ సింగ్ సైన్యం పంజాబ్‌లోని మరిన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి బయలుదేరింది.
నాల్గవ గురు రామ్ దాస్ లాహోర్‌లోని చునా మండిలో జన్మించినందున లాహోర్ ను 'గురు కా గహ్వారా' అని ప్రకటించాడు గుజ్జర్ సింగ్.
అప్పటి నుంచి సిక్కుల శకం ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Getty Images
వారి 30 ఏళ్ల పాలనలో, ఈ ముగ్గురు పాలకులు లాహోర్‌ను మూడు ప్రాంతాలుగా విభజించారు. లహ్నా సింగ్ లాహోర్ కోట, లోపలి నగరాన్ని పాలించారు. గుజ్జర్ సింగ్ షాలిమార్ బాగ్ వరకు తూర్పు భాగాన్ని, శోభా నియాజ్ బేగ్ వరకు సింగ్ పశ్చిమ భాగాన్ని పాలించారు.
గుజ్జర్ సింగ్ కొత్త కోటను నిర్మించారు. ఇప్పటికీ దానిని ఖిలా గుజ్జర్ సింగ్ అని పిలుస్తారు. శోభా సింగ్ బాగ్-ఎ-జైబున్నీసాలో తన కోటను నిర్మించారు.
అబ్దాలీ 1766వ సంవత్సరంలో తిరిగి వచ్చి డిసెంబర్ 22న లాహోర్‌లోకి ప్రవేశించినప్పుడు, సిక్కు పాలకులు తెలివిగా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అహ్మద్ షా లహ్నాసింగ్‌తో మాట్లాడటానికి ప్రయత్నించాడు. తమ స్నేహానికి చిహ్నంగా అతనికి అఫ్గాన్ డ్రై ఫ్రూట్స్ బుట్టను పంపారు. అయితే, లహ్నా సింగ్ ఆయనకు నిరసన తెలుపుతూ ఎండు పప్పు బుట్టను రిటర్న్ గిఫ్ట్ గా పంపించారు.
అఫ్గాన్ ల ఫిరంగి భంగీ పెద్దలైన లహ్నా సింగ్, గుజ్జర్ సింగ్‌ల ఆధీనంలో ఉంది. అయితే లాహోర్‌ను స్వాధీనం చేసుకోవడంలో భంగీలకు సహాయం చేసిన స్కార్చాకియా మిసిల్ చీఫ్ చదత్ సింగ్ అది తనదని చెప్పుకునేవారు.
రెండు వేల మంది సైనికుల సహాయంతో చదత్ సింగ్ దాన్ని గుజ్రాన్‌వాలాకు తీసుకెళ్లారు. కొంతకాలం తర్వాత అహ్మద్‌నగర్‌కు చెందిన చటోలు ఆ ఫిరంగిని చదత్ సింగ్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
దీనికోసం చతా సోదరులు అహ్మద్ ఖాన్, పీర్ మహ్మద్ ఖాన్ మధ్య గొడవ జరిగింది. ఈ యుద్ధంలో అహ్మద్ ఖాన్ ఇద్దరు కుమారులు, పీర్ మహమ్మద్ ఖాన్ ఒక కుమారుడు మరణించారు.
పీర్ మహ్మద్ ఖాన్‌కు సహాయం చేసిన గుజ్జర్ సింగ్ ఈ ఫిరంగిని గుజరాత్‌కు తీసుకెళ్లారు. 1772వ సంవత్సరంలో ఈ ఫిరంగిని రసూల్ నగర్‌కు మార్చారు.
మరోవైపు, హరి సింగ్ మరణం తర్వాత, మహాన్ సింగ్ సర్దార్‌గా ఎన్నికయ్యారు. మహాన్ సింగ్ తర్వాత హరి సింగ్ కుమారులు ఝండా సింగ్, గండా సింగ్ లు సిక్కు ప్రజల మద్దతుతో మిసిల్ అధిపతులు అయ్యారు.
1773లో ఫిరంగిని అమృత్‌సర్‌కు తీసుకెళ్లిన ఝండా సింగ్..జమ్మూ దాడిలో మరణించాడు. అతనికి పిల్లలు లేరు.

ఫొటో సోర్స్, WAQAR MUSTAFA
పఠాన్‌కోట్‌పై దాడి చేసిన గండా సింగ్, హకీకత్ సింగ్ చేతిలో హతమయ్యాడు. అతని కుమారుడు గులాబ్ సింగ్ చిన్నవాడు కావడంతో మిసిల్ కు అధిపతి కాలేకపోయాడు. దీంతో గండా సింగ్ తమ్ముడు దేశో సింగ్‌ను చీఫ్‌గా చేశారు.
అతని తర్వాత గండా సింగ్ కుమారుడు గులాబ్ సింగ్ చీఫ్ అయ్యారు. ఆయన కాలంలో మహారాజా రంజిత్ సింగ్ లాహోర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
రంజిత్ సింగ్ నగర వెలుపల ఉన్న సమయానికి, లహ్నా సింగ్, గుజ్జర్ సింగ్, శోభా సింగ్ మరణించారు. వారి స్థానంలో వారి ముగ్గురు కుమారులు చైత్ సింగ్, మెహర్ సింగ్, సాహబ్ సింగ్ వచ్చారు. వారి బలహీన నాయకత్వంతో పతనం మొదలైంది.
గులాబ్ సింగ్, రంజిత్ సింగ్ సైన్యాల మధ్య బేసిన్ వద్ద యుద్ధం జరిగింది. మరుసటి రోజు కూడా భీకర యుద్ధం జరుగుతుందని ఊహించారు.
కానీ, గులాబ్ సింగ్ రాత్రి పూట బాగా మద్యం తాగారు. మరుసటి రోజు నిద్రలేవ లేదు. దీంతో అతని సైన్యం చెల్లాచెదురైపోయింది.
గులాబ్ సింగ్ మరణం తర్వాత అతని కుమారుడు గురుదత్ సింగ్ భంగీ మిసిల్ కు అధిపతి అయ్యారు. వారు రంజిత్ సింగ్‌పై దాడి చేయాలని ప్లాన్ చేశారు.
కానీ రంజిత్ సింగ్ ఈ విషయం తెలుసుకుని అమృత్‌సర్ పై దాడి చేసి ఆయన్ను నగరం నుంచి వెళ్లగొట్టి, అమృత్‌సర్‌ను స్వాధీనం చేసుకున్నారు.
బతకడానికి వారికి కొన్ని గ్రామాలను ఇచ్చినా, కొన్నాళ్ల తర్వాత వాటిని తిరిగి తీసుకున్నారు. గులాబ్ సింగ్ మరణానంతరం, ఈ కుటుంబంలో ఎవరూ అంత సమర్థులు కాలేకపోయారు. దీంతో మిసిల్ పాలన ముగిసింది.
1802లో, మహారాజా రంజిత్ సింగ్ అమృత్‌సర్‌ను స్వాధీనం చేసుకుంటున్న సమయంలో ఆయనకు ఫిరంగి తగిలింది. అయితే, దీనానగర్ యుద్ధంలో భంగిలు ఈ ఫిరంగిని ఉపయోగించారని రంజిత్ సింగ్ పాలనా కాలం నాటి చరిత్రకారులు సోహన్ లాల్ సూరి, బుటే షా, కాన్హీలు రాశారు.

ఫొటో సోర్స్, WAQAR MUSTAFA
దస్కా, కసూర్, సుజన్‌పూర్, వజీరాబాద్ , ముల్తాన్ యుద్ధాలలో రంజిత్ సింగ్ దీనిని ఉపయోగించారు.
ఈ యుద్ధాల సమయంలో ఫిరంగి తీవ్రంగా దెబ్బతింది. ఉపయోగించడానికి వీలు లేకుండా తయారు కావడంతో లాహోర్‌కు తిరిగి తీసుకురావలసి వచ్చింది. 1860 వరకు లాహోర్ లోని దిల్లీ గేట్ ముందు ఉంచారు.
లాహోర్ మ్యూజియం వెనుక ఉన్న వజీర్ ఖాన్ తోటలో దీనిని నిలబెట్టి ఉంచారని మౌల్వీ నూర్ అహ్మద్ చిస్తీ 1864లో రాసిన 'తహ్కిక్-ఎ-చిస్తీ'ని సంకలనంలో పేర్కొన్నారు. 1870 సంవత్సరంలో లాహోర్ మ్యూజియం గేట్ వద్ద కొత్త స్థలానికి మార్చారు.
బ్రిటిష్ పాలనలో ఈ ఫిరంగిని మొదట దిల్లీ గేట్ ముందు, తరువాత లాహోర్ మ్యూజియంలో ఉంచారు. అనార్కలీ బజార్ వైపు పాలరాతి వేదికపై నిర్మించిన ఈ 265 ఏళ్ల ఫిరంగిని 'కిమాజ్ గన్' అని కూడా పిలుస్తారు. బ్రిటిష్ రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ నవల 'కిమ్'లో దీని ప్రస్తావన ఉంటుంది.
ఆ నవలలో "కిమ్ ఒక పాత మ్యూజియం ముందు ఫిరంగిపై కూర్చుని, మున్సిపల్ ఆదేశాలను ధిక్కరిస్తూ ఉన్నాడు" అని రాశారు.
తొమ్మిదిన్నర అంగుళాల వెడల్పుగల మూతి, 14 అడుగుల పొడవు ఉన్న ఈ ఫిరంగిని స్థానిక ప్రజలు 'భంగీస్ ఫిరంగి' అని పిలుస్తారు. ఫిరంగి నోరు పానిపట్ వైపు మళ్లి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ పావురాలు గింజలను మేస్తూ ఎగురుతూ కనిపిస్తాయి.
ఇవి కూడా చదవండి:
- 1959లో నెహ్రూను ఎదిరించిన దక్షిణాది నేతల నుంచి ఇప్పుడు మోదీని ఢీకొడతానంటున్న కేసీఆర్ ఏం నేర్చుకోవాలి
- 'అగ్నిపథ్' పథకంతో ప్రయోజనం ఎవరికి? ఇండియన్ ఆర్మీకి మేలు ఎంత? అగ్నివీర్లకు మేలు ఎంత?
- సాద్ అన్సారీ ఎవరు? నూపుర్ శర్మ వ్యాఖ్యల వివాదంలో ఈ ముస్లిం యువకుడిని ఎందుకు అరెస్టు చేశారు?
- బిట్ కాయిన్ ఎందుకు ఇంత వేగంగా కుప్పకూలుతోంది?
- అచ్చం మీలాగే ఉండే, మీలాగే ఆలోచించే డిజిటల్ ట్విన్ రూపొందిస్తే.. ఆ తర్వాత ఏం జరుగుతుంది?
- 68 అడుగుల లోతులో 5 రోజులు నరకయాతన.. పదేళ్ల మూగ బాలుడిని ఎలా రక్షించారంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











