Virat Kohli : ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని భారత జట్టులో ఉంచాలా? తీసేయాలా? - గొంతు విప్పుతున్న మాజీ క్రికెటర్లు

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, Getty Images

వరుసగా విఫలం అవుతున్న విరాట్ కోహ్లీని భారత క్రికెట్ జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్లు ఒకవైపు వస్తుండగా, గొప్ప బ్యాటర్లలో ఒకరైన కోహ్లీని టీ20 ప్రపంచకప్ ముందు జట్టు నుంచి తప్పించడం సరికాదనే వాదనలు మరొకవైపు వినిపిస్తున్నాయి.

తాజాగా టీమిండియా మాజీ సభ్యుడు వెంకటేశ్ ప్రసాద్ ఈ అంశంపై సెలెక్టర్ల తీరును తప్పుపట్టారు.

జూలై 22వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌ ఆడనున్న జట్టులో విరాట్ కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. కోహ్లీతో పాటు పలువురు ప్రముఖ ఆటగాళ్లు కూడా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

‘పేరు గొప్ప అంటూ జట్టులో కొనసాగడం సరికాదు’ - వెంకటేశ్ ప్రసాద్

''ఒకప్పుడు.. ఫామ్ కోల్పోతే ఆ ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతలతో సంబంధం లేకుండా.. వారిని జట్టు నుంచి తప్పించేవాళ్లు. సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్.. వీళ్లంతా ఫామ్ లేనప్పుడు జట్టులో స్థానం కోల్పోయిన వాళ్లే. వీళ్లు తిరిగి దేశీయ క్రికెట్‌కు వెళ్లి ప్రతిభ కనబర్చి, జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నారు.

కానీ, ఇప్పుడు ఈ ప్రమాణం పూర్తిగా మారిపోయినట్లుంది. ఫామ్ కోల్పోతే విశ్రాంతి ఇస్తున్నారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. దేశంలో ప్రతిభ ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారు. పేరు గొప్ప అంటూ జట్టులో కొనసాగడం సరికాదు. ఇండియా గొప్ప మ్యాచ్ విన్నర్లలో ఒకరైన అనిల్ కుంబ్లే సైతం చాలాసార్లు జట్టులో స్థానం కోల్పోయారు. అందరి మంచి కోసం చర్యలు తీసుకోవాలి'' అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్లు చేశారు.

కోహ్లీ అభిమానులు చాలామంది వెంకటేశ్ ప్రసాద్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

2022లో విరాట్ కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో 26.05 సగటుతో 443 పరుగులు చేశాడని, అందులో 4 అర్థ సెంచరీలు ఉన్నాయని.. రోహిత్ శర్మ 15 ఇన్నింగ్స్‌ల్లో 23.33 సగటుతో 350 పరుగులు మాత్రమే చేశాడని, ఇందులో ఒక అర్థ సెంచరీ మాత్రమే ఉందని ట్వీట్లు చేశారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఐసీసీ పోస్ట్

ఫొటో సోర్స్, Instagram/ICC

‘అశ్విన్‌ను తప్పించినప్పుడు కోహ్లీని కొనసాగించడం ఎందుకు?’ - కపిల్ దేవ్

కొద్దిరోజుల కిందట టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సైతం విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని మాట్లాడారు.

''మనవద్ద ఎంతో మంది ఉన్నప్పుడు ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లనే జట్టులో ఆడించాలి. పేరు ప్రఖ్యాతలను బట్టి వెళ్లకూడదు. ప్రస్తుత ఫామ్‌ను చూడాలి. గొప్ప ప్లేయర్ అయినంత మాత్రాన వరుసగా విఫలం అవుతున్నప్పటికీ అవకాశాలు ఇవ్వడం సరికాదు'' అని కపిల్‌దేవ్ అన్నారు.

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమ స్థానంలో కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టిన జట్టు యాజమాన్యం ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లీని కొనసాగించడం సరికాదని కపిల్ దేవ్ అన్నారు.

కపిల్ వ్యాఖ్యలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

‘‘ఈ నిపుణులు ఎవరు? వీరిని నిపుణులు అని ఎలా అంటున్నారు?’’ - రోహిత్ శర్మ

కాగా, విరాట్ కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని నిపుణులు సూచిస్తున్నారు కదా.. ఒక కెప్టెన్‌గా మీరేమంటారు.. అని రోహిత్ శర్మను విలేకరులు ప్రశ్నించగా ఆయన స్పందించారు.

''ఈ నిపుణులు ఎవరు? వీరిని నిపుణులు అని ఎలా అంటున్నారు? వాళ్లు బయటి నుంచి ఆట చూస్తుంటారు. లోపల ఏం జరుగుతుందో వారికి తెలీదు. మా ఆలోచనలు మాకుంటాయి. మేం టీమ్‌ను తయారు చేసుకుంటాం. దాని వెనుక చాలా చర్చలు జరుగుతాయి. చాలా ఆలోచనలు ఉంటాయి. కుర్రాళ్లకు మద్దతుగా నిలబడతాం. వారికి అవకాశాలూ ఇస్తాం. ఇదంతా బయటివాళ్లకు తెలియదు.

కాబట్టి, బయట ఏం జరుగుతోంది అనేది నాకు ముఖ్యం కాదు. మా వరకు లోపల ఏం జరుగుతోంది అనేదే ముఖ్యం.

ఇక ఫామ్ అంటారా.. ఫామ్ ఉంటుంది. పోతుంది. కానీ, ఆటగాడి నాణ్యత మాత్రం ఎప్పటికీ చెడిపోదు. ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నప్పుడు. ఆటగాడి నాణ్యత ఎప్పటికీ చెడిపోదు. ఆ నాణ్యతకే మద్దతు ఇస్తాం. ఆ నాణ్యతను చూసే మద్దతు ఇస్తాం.

వీడియో క్యాప్షన్, కోహ్లీ మరో రికార్డు

ఈ పరిస్థితి నాకూ జరిగింది. మరికొందరు XYZలకూ జరిగింది. అందరికీ జరిగింది. ఇందులో కొత్త విషయం ఏమీ లేదు. ఎవరైనా ఆటగాడు ఇన్నేళ్లుగా స్థిరంగా బాగా ఆడుతూ వస్తుంటే.. ఏవో ఒకటి రెండు సిరీస్‌లు, ఒకటి రెండేళ్లు బాగా ఆడకపోతే విమర్శించడం సరికాదు.

ఇదంతా అర్థం చేసుకోవడానికి ప్రజలకు కొంత సమయం పడుతుంది. కానీ, జట్టులో ఉన్న మాకు, జట్టును నడిపించే మాకు మాత్రం వాళ్ల అవసరం ఏంటనేది తెలుసు. బయటివాళ్లు వ్యాఖ్యలు చేయొచ్చు. వాళ్లకు అన్ని హక్కులూ ఉన్నాయి. కానీ, మాకు మాత్రం అదొక విషయమే కాదు'' అని రోహిత్ శర్మ అన్నారు.

కాగా, అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లీ స్థానంపై ఐసీసీ పోస్టుకు ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా స్పందిస్తూ.. ''దాదాపు 140 (మ్యాచ్‌ల్లో) సగటు 50 (పరుగులు). మంచి నిర్ణయం. ఆస్ట్రేలియా అంగీకరిస్తుంది'' అంటూ వ్యంగ్యంగా సమాధానం ఇచ్చారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఈ అంశంపై ఒక ట్వీట్ చేశారు.

‘‘ఆస్ట్రేలియాలో జరిగే ప్రపంచకప్‌ టీ20 జట్టులో విరాట్ కోహ్లీ ఉండకూడదని మాజీ టెస్ట్ ప్లేయర్లు కోరుతున్నారు. కానీ, ఆస్ట్రేలియాలో అతడి ట్రాక్ రికార్డు చూడండి. ఔను, గత 18 నెలలుగా అతడి ప్రదర్శన బాగోలేదు. కానీ, పెద్ద టోర్నమెంట్లకు పెద్ద ప్లేయర్లు కావాలి. మిగతావాళ్లకు కూడా అవకాశాలు ఇవ్వండి. కానీ విరాట్ కోహ్లీ క్లాస్ మాత్రం ప్రశ్నలకు తావులేనిది’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)