విరాట్ కోహ్లీ: ఫోర్బ్స్ టాప్ 100 ధనిక క్రీడాకారుల్లో చోటు

ఫోర్బ్స్ లిస్ట్

ఫొటో సోర్స్, Getty Images

2018లో ప్రపంచంలో అత్యంత సంపన్నులైన టాప్ 100 క్రీడాకారుల జాబితాలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి చోటు దక్కింది.

వంద మందిలో కోహ్లీ చివరి స్థానంలో నిలిచినప్పటికీ ఈ జాబితాలో ఉన్న ఏకైక క్రికెటర్ ఆయనే.

ఈ ఏడాది మొత్తం 2.5 కోట్ల డాలర్లు(173 కోట్లతో) సంపాదనతో ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెటరయ్యాడు.

ఈ 2.5 కోట్ల డాలర్ల సంపాదనను కోహ్లీ గత 12 నెలల్లో ఆర్జించాడని ఫోర్స్ తెలిపింది.

కోహ్లీ 2018లో ప్రకటనల ద్వారా 2.1 కోట్ల డాలర్లు, వేతనం, ప్రోత్సాహకాల ద్వారా 40 లక్షల డాలర్లు సంపాదించాడు.

కానీ 2017లో ఫోర్బ్స్ విడుదల చేసిన టాప్ 100 అథ్లెట్స్ లిస్టులో 83వ ర్యాంకులో ఉన్న విరాట్ కోహ్లీ ఈ ఏడాది 10 లక్షల డాలర్లు అధికంగా సంపాదించినా జాబితాలో చివరి స్థానానికి చేరాడు.

గత ఏడాది ఫోర్బ్స్ జాబితాలో పేర్కొన్న కోహ్లీ సంపాదన 2.4 కోట్ల డాలర్లు( 169 కోట్ల రూపాయలకు పైనే)

ఫోర్బ్స్ లిస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లయనల్ మెస్సీ

తొలిసారి టాప్‌లో ఫుట్‌బాల్ ఆటగాడు

ఈ జాబితాలో టాప్ త్రీ స్థానాల్లో ఫుట్‌బాల్ ఆటగాళ్లే ఉన్నారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయనల్ మెస్సీ 127 మిలియన్ డాలర్ల సంపాదనతో అగ్రస్థానంలో నిలిచాడు.

ఫోర్బ్స్ టాప్ అథ్లెట్స్ లిస్టులో ఒక ఫుట్‌బాల్ ప్లేయర్ టాప్‌లో నిలవడం ఇదే మొదటిసారి.

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో 109 మిలియన్ డాలర్ల సంపాదనతో రెండో స్థానంలో, 105 మిలియన్ డాలర్లతో నెయ్‌మార్ మూడో స్థానంలో ఉన్నారు.

టాప్ టెన్‌ సంపన్న క్రీడాకారుల్లో మెక్సికో బాక్సర్ కానెలో అల్వరెజ్ 94 మిలియన్ డాలర్ల సంపాదనతో నాలుగో స్థానంలో, స్విట్జర్లాండ్ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్‌ 93.4 మిలియన్ డాలర్ల సంపాదనతో ఐదో స్థానంలో ఉన్నారు.

తర్వాత స్థానంలో ఇద్దరు రగ్బీ ప్లేయర్లు, ముగ్గురు బాస్కెట్ బాల్ ఆటగాళ్లు నిలిచారు.

ఫోర్బ్స్ లిస్ట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జాబితాలో ఏకైక క్రీడాకారిణి

ఏకైక క్రీడాకారిణి సెరీనా విలియమ్స్

గత ఏడాది ఈ లిస్టులో టాప్‌లో నిలిచిన అమెరికన్ బాక్సర్ ఫ్లోయడ్ మేవెదర్‌కు ఈసారీ అసలు ఇందులో చోటు దక్కలేదు.

లిస్టులో గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ 63.9 మిలియన్ డాలర్ల సంపాదనతో 11వ స్థానంలో, టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ 35 మిలియన్ డాలర్ల సంపాదనతో 37వ స్థానంలో నిలిచారు.

ఈ టాప్ అథ్లెట్స్‌లో స్థానం దక్కిన ఒకే ఒక మహిళగా సెరీనా విలియమ్స్ చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఆమె 29.2 మిలియన్ల డాలర్లు సంపాదతో 63వ స్థానంలో నిలిచింది.

ఈ లిస్టులో ఎక్కువగా 35 మంది బాస్కెట్ బాల్ ఆటగాళ్లు ఉన్నారు.

అమెరికా బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఈసారీ జాబితాలో ఏడాదికి 25 మిలియన్ల డాలర్ల సంపాదన ఉన్న వారికే స్థానం కల్పించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)