నీటిలో నానినప్పుడు వేళ్లు ఎందుకు ముడతలు పడతాయి, దాన్నివల్ల కూడా ప్రయోజనాలుంటాయా?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, రిచర్డ్ గ్రే
- హోదా, బీబీసీ ఫ్యూచర్
ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్ లేదా స్నానపు తొట్టెలో కొన్ని నిమిషాల పాటు గడిపితే, మీ చేతి వేళ్ల పై చర్మం నాటకీయంగా పరిణామం చెందుతుంది. చర్మం పూర్తిగా ముడతలు పడి చూసేందుకు అసహ్యంగా మారుతుంది.
ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ, ఈ పరిణామాన్ని అర్ధం చేసుకోవడం కాస్త కష్టం. అయితే, చేతి, కాలి వేళ్ల పై చర్మం మాత్రమే ఇలా మారుతుంది. మణికట్టు, నుదురు, కాళ్లు, ముఖం పై చర్మం మాత్రం నీళ్లలో మునిగిన తర్వాత కూడా సాధారణంగానే ఉంటాయి.
ఈ మార్పు కేవలం చేతి, కాలి వేళ్ల పై ఉన్న చర్మం పై మాత్రమే ఎందుకు జరుగుతుందనే అంశం గురించి కొన్ని దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. మొదట ఇలా ఎందుకు జరుగుతుందనే ప్రశ్న పుడుతుంది. కానీ, ఇలా జరగడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని చాలా మంది అధ్యయనవేత్తలు ఆలోచిస్తున్నారు. ఈ ముడతలు పడిన చర్మం మన ఆరోగ్యం గురించి ఎటువంటి సంకేతాలను ఇస్తుంది?
40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో మూడున్నర నిమిషాల సేపు చేతి వేళ్లను ఉంచినట్లైతే చేతి వేళ్ల పై చర్మం కుంచించడం మొదలవుతుంది. 20 డిగ్రీల శీతల ఉష్ణోగ్రతల్లో ఇలా కావడానికి 10 నిమిషాల సేపు పడుతుంది.
అయితే, వేళ్ల పై చర్మం పూర్తిగా ముడతలు పడేందుకు సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది.
ఆస్మాసిస్ అనే ప్రక్రియ ద్వారా చర్మం పై ఉన్న కణాల్లోకి నీరు చేరుతుంది. చర్మం పైన, నీటిలో ఉన్న రసాయనాలను సమానంగా చేసేందుకు నీటి అణువులు చర్మపు పొర ద్వారా లోపలకు చేరుతాయి. అయితే, ఈ ప్రక్రియకు ఇంతకు మించిన వివరణ ఉందని 1935లోనే శాస్త్రవేత్తలు అనుమానించారు.
వైద్యులు అరచేయి నుంచి చేతి వరకు ఉండే ముఖ్యమైన నరాలకు గాయమైన వారిని అధ్యయనం చేసినప్పుడు, వారి చేతి వేళ్లు ముడతలు పడలేదని గమనించారు. ఈ మీడియన్ నరం చెమట పట్టడం, రక్త నాళాలు ముడుచుకుపోవడాన్ని నియంత్రిస్తూ ఉంటుంది.
దీనిని బట్టి చూస్తే, నీటిలో నానినప్పుడు చేతి వేళ్ల పై చర్మం ముడుచుకుపోవడాన్ని నాడీ వ్యవస్థ నియంత్రిస్తుందని అర్ధమయింది.

ఫొటో సోర్స్, Alamy
1970లలో డాక్టర్లు నిర్వహించిన అధ్యయనాలు దీనికి సంబంధించి మరిన్ని ఆధారాలను అందచేశాయి. నరాలు దెబ్బ తినడం వల్ల శరీరంలో మన నియంత్రణ లేకుండా జరిగే రక్త సరఫరా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అంచనా వేసేందుకు చేతి వేళ్లను కొంత సేపు నీటిలో ముంచి ఉంచే పరీక్షను నిర్వహించారు.
2003లో సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో పని చేస్తున్న నరాల నిపుణులు ఈనార్ వైల్డర్ స్మిత్, ఏడ్‌లీన్ చౌ ఈ అధ్యయనంలో పాల్గొన్న వాలంటీర్ల చేతి వేళ్లను నీటిలో పెట్టినప్పుడు జరిగే రక్త సరఫరాను పరిశీలించారు. వాలంటీర్ల చేతి వేళ్ల పై చర్మం ముడతలు పడటం మొదలైనప్పుడు, వారి చేతి వేళ్లకు జరిగే రక్త సరఫరా గణనీయంగా పడిపోయినట్లు గమనించారు.
ఆరోగ్యకరంగా ఉన్న వాలంటీర్ల చేతి వేళ్లను తాత్కాలికంగా ముడుచుకుపోయేలా చేసేందుకు మత్తు క్రీమును రాసినప్పుడు కూడా నీటిలో వేళ్లను ముంచిన మాదిరిగానే, చర్మం ముడతలు పడటాన్ని గమనించారు.
"చేతి వేళ్ల ఉపరితలానికి రక్త సరఫరా జరగకపోవడంతో చర్మం పేలవంగా మారుతుంది" అని మాంచెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్సిటీ మానసిక శాస్త్రవేత్త, న్యూరో సైంటిస్ట్ నిక్ డేవిస్ అన్నారు. ఆయన చేతి వేళ్లు ముడతలు పడటం పై అధ్యయనం చేస్తున్నారు.
చేతి వేళ్లు నీటిలో ముంచినప్పుడు వేళ్లపై ఉండే స్వేద గ్రంధులు నీటిని చర్మం లోపలికి పంపేందుకు తెరుచుకుంటాయి. దీంతో, చర్మంలో ఉండే లవణాల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఈ అసమతుల్యత వేళ్ల నరాలను ఉత్తేజితం చేస్తుంది. దీంతో, స్వేద గ్రంధుల చుట్టూ ఉండే రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీంతో చర్మం ముడుచుకుపోయి ముడతలు ఏర్పడతాయి. ఈ ముడతలు చర్మం ఉపరితలం ఎపిడెర్మిస్ పై ఆధారపడి ఉంటాయి.
ఈ ముడతలను పెంచేందుకు చర్మం బాహ్య పొరలు కూడా కొంత వరకు వాచినట్లుగా తయారవుతాయి. అయితే, చేతి వేళ్ల పై ముడతలు చూడాలంటే మన చర్మం 20% ఉబ్బాల్సి ఉంటుంది.
"కానీ, ఉపరితలం పై ఉండే చర్మం కాస్త ఉబ్బి, లోపలి పొరలు కూడా అదే సమయంలో కుంచించుకుపోతే త్వరగా ముడతలు కనిపిస్తాయి" అని కాటలోనియా టెక్నికల్ యూనివర్సిటీ బయో మెకానికల్ ఇంజనీర్ పాబ్లో సయీజ్ వినాస్ అన్నారు. ఈ ప్రక్రియను పరిశీలించేందుకు ఆయన కంప్యూటర్ మోడలింగ్‌ను ఉపయోగించారు.
"ఈ ముడతలను నరాలు నియంత్రిస్తే, శరీరం నీటిలో ఉండటం వల్ల స్పందిస్తుందని చెప్పవచ్చు. ఇలా జరగడానికొక కారణముంది. దీని వల్ల ఏదో ప్రయోజనం ఉండి ఉండవచ్చు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Alamy
ఈ ప్రయోజనం ఏమై ఉంటుందని డేవిస్ అధ్యయనం చేశారు. ఒక ప్లాస్టిక్ వస్తువును పట్టుకునేందుకు ఎంత శక్తి అవసరమో లండన్‌లో 2020లో సైన్స్ మ్యూజియంకు విచ్చేసిన 500 మంది వాలంటీర్ల సహాయంతో లెక్కించారు.
ఒక వస్తువును పట్టుకునేందుకు తడిచిన చర్మంతో ఉన్న వారి కంటే ముడతలు పడని చర్మంతో ఉన్నవారికి తక్కువ శక్తి సరిపోయింది. కానీ, వారి వేళ్లను కొంత సేపు నీటిలో ఉంచడం వల్ల చేతి వేళ్లు ముడుచుకుపోయాయి.
"ఫలితాలు స్పష్టంగా కనిపించాయి" అని డేవిస్ చెప్పారు. ఇలా ముడతలు పడటం వల్ల వేళ్లకు, వస్తువుకు మధ్యన జరిగే ఒత్తిడిని పెంచాయి. చర్మం పై జరిగే ఈ మార్పును చేతి వేళ్ల గ్రహించి, వస్తువును జాగ్రత్తగా పట్టుకునేందుకు ఈ సమాచారాన్ని వాడతాయి" అని అన్నారు.
ఈ ప్రయోగంలో వాలంటీర్లు పట్టుకున్న వస్తువు బరువు కొన్ని కాయిన్ల బరువు కంటే తక్కువగానే ఉంది. దాంతో, వారికి అందుకోసం ఎక్కువ శక్తి వాడాల్సిన అవసరం రాలేదు. కానీ, తేమతో కూడిన వాతావరణంలో మరింత క్లిష్టమైన పనులు చేయాలంటే ఈ ఒత్తిడిలో కలిగే వ్యత్యాసం భిన్నంగా ఉంటుంది.
"ఏదైనా వస్తువును పట్టుకునేందుకు మీ చేతి పై ఎక్కువ ఒత్తిడి పెట్టకపోతే, మీ చేతులకు శ్రమ తక్కువగా ఉంటుంది. దీంతో, ఎక్కువ సేపు వస్తువును పట్టుకోగలరు" అని అన్నారు.
ఈయన చెప్పిన ఫలితాలు ఇతర శాస్త్రవేత్తల ఫలితాలతో సరితూగాయి.
2013లో యూకేలోని న్యూ కాసిల్ యూనివర్సిటీలో న్యూరో సైంటిస్టులు బృందం వాలంటీర్లను వివిధ సైజుల్లో ఉన్న గాజు రాళ్లను, బరువులను ఒక పాత్ర నుంచి మరొక పాత్రలోకి బదిలీ చేయమని అడిగారు.
కొన్ని వస్తువులను పొడిగా ఉంచారు. మరి కొన్నిటిని అడుగున నీటితో ఉన్న పాత్రలో ముంచారు. వాలంటీర్ల చేతి వేళ్లు పొడిగా ఉన్నప్పుడు నీటిలో ముంచిన రాళ్లను బదిలీ చేసేందుకు సాధారణ పాత్రలో చేసిన బదిలీ కంటే 17% ఎక్కువ సమయం పట్టింది. కానీ, చర్మం ముడతలు పడినప్పుడు నీటిలో మునిగిన రాళ్లు, బరువులను మరో పాత్రలోకి మార్చేందుకు నీటిలో మునిగినప్పుడు కంటే 12% తక్కువ సమయంలో బదిలీ చేయగలిగారు.
అయితే, పొడి, తడి వేళ్లతో పొడి వస్తువులను మార్చినప్పుడు పెద్దగా వ్యత్యాసం కనిపించలేదు.
చేతి, కాలి వేళ్ల పై ఏర్పడే ముడతలు వర్షంలో వాడే టైర్లలా లేదా షూ సోల్ మాదిరిగా పని చేస్తాయని కొంత మంది శాస్త్రవేత్తలు అంటారు.
ఈ ముడతల వల్ల చర్మం పై ఏర్పడిన ఖాళీలు చేతి వేళ్లు, వస్తువు మధ్యలో నీటిని నిల్వ ఉండనీయకుండా చేస్తాయి.
దీనిని బట్టీ చూస్తే తడిగా ఉండే వస్తువులను, ఉపరితలాలను పట్టుకునేందుకు అనుగుణంగా ఈ చేతి, కాలి వేళ్లు ముడుచుకుపోయే పరిణామం మనుషుల్లో జరిగి ఉంటుందని అర్ధమవుతుంది.
నీటిలో వస్తువును పట్టుకునేందుకు చేతికి ఎక్కువ పట్టు అవసరం ఉండటంతో, తేమ పరిస్థితుల్లో లోకోమోషన్ లేదా నీటి లోపల వస్తువులను తారుమారు చేసేందుకు పనికొస్తుందని అంచనా వేస్తున్నట్లు న్యూ కాసిల్ యూనివర్సిటీలో ఇవల్యూషనరీ న్యూరో సైంటిస్ట్ టామ్ స్మల్డర్స్ చెప్పారు.
ఈయన 2013లో జరిగిన అధ్యయనానికి నేతృత్వం వహించారు.
"ఈ పరిణామం మన పూర్వీకులు తేమతో కూడిన రాళ్లు, ఉపరితలాల పై నడిచినప్పుడు పట్టు సాధించేందుకు పనికొచ్చి ఉంటుంది" అని అన్నారు. షెల్ ఫిష్ వేటలో కూడా ఇది ఉపయోగపడి ఉంటుంది.
అయితే, ఈ చేతి వేళ్లు ముడుచుకుపోవడాన్ని చింపాంజీల్లో కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని అన్నారు.
"నీటిలో ఎక్కువ సేపు ఉండే జపాన్ మాకాక్ కోతుల్లో కూడా నీటిలో ఎక్కువ సేపు చేతి వేళ్లను ఉంచినప్పుడు ముడతలు పడినట్లు గమనించారు. కానీ, ఇతర జంతువుల్లో వీటి గురించి ఆధారాలు లేనంత మాత్రాన ఇలా జరగటం లేదని చెప్పేందుకు లేదు" అని స్మల్డర్స్ అన్నారు.
మానవ జాతిలో ఈ పరిణామం జరిగినప్పుడు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. చేతి వేళ్లు మంచి నీటిలో ముంచినప్పుడు కంటే ఉప్పు నీటిలో ముంచినప్పుడు త్వరగా ముడుచుకుపోతాయి. దీని వల్లే మన పూర్వీకులు తీర ప్రాంతాల్లో కంటే మంచి నీటి సరస్సుల దగ్గర నివాసాలు ఏర్పరుచుకునేందుకు దారి తీసిందని అంటారు.
కానీ, వీటికి కచ్చితమైన సమాధానాలు లేవు. ఇది కేవలం శారీరక స్పందన అని అంటారు.

ఫొటో సోర్స్, Getty Images
విచిత్రంగా కొన్ని అర్ధం కాని రహస్యాలున్నాయి. పురుషుల కంటే మహిళల వేళ్ల ముడుచుకునేందుకు ఎక్కువ సమయం పడుతుంది.
ముడతలు పడిన చర్మంతో పొడి వస్తువులను పట్టుకునేందుకు పెద్ద తేడా లేనప్పుడు 10 - 20 నిమిషాల లోపు మన చర్మం తిరిగి సాధారణ స్థితికి ఎందుకు చేరుకుంటుంది? ముడతలు పడిన చర్మం వల్ల మాత్రమే తడి వస్తువులను పట్టుకునేందుకు బలం వస్తే, మన చేతి వేళ్లు శాశ్వతంగా ముడతలతో ఎందుకు లేవు.
ముడతలు పడటం వల్ల శరీర స్పందనలో జరిగే మార్పులు దీనికి కారణం కావచ్చు.
మన చేతి వేళ్ల కొనల్లో నరాలు ఉంటాయి. చర్మం కోతకు గురి కావడం వల్ల వస్తువును పట్టుకున్నప్పుడు కలిగే అనుభూతిలో మార్పు కలుగుతుంది.
"కొంత మందికి తడి చేతులతో వస్తువులను పట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది" అని డేవిస్ అన్నారు. ఈ అంశాన్ని అధ్యయనం చేయవచ్చు అని అన్నారు.
కానీ, మన చేతి, కాలి వేళ్లు ముడతలు పడటం మన ఆరోగ్యం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తాయి. సోరియాసిస్, విటిలిగో లాంటి చర్మ సమస్యలున్న వారిలో ముడతలు ఏర్పడేందుకు ఎక్కువ సమయం పడుతుంది. ఉదాహరణకు సిస్టిక్ ఫైబ్రియాసిస్ ఉన్న వారిలో చేతి వేళ్లపై చర్మం ఎక్కువగా ముడుచుకుపోతుంది.
టైప్2 మధుమేహంతో బాధపడేవారు నీటిలో చేతి వేళ్లను ముంచినప్పుడు కూడా చర్మం ముడతలు పడటం తక్కువగా ఉంటుంది. హృద్రోగ సమస్యలతో బాధపడేవారిలో కూడా చర్మం ముడతలు పడటం ఆలస్యమవుతుంది.
ఒక చేతి కంటే మరో చేతి వేళ్లు ఎక్కువగా లేదా తక్కువగా ముడతలు పడటం పార్కిన్‌సన్ డిసీజ్‌కు సంకేతం. శరీరంలో ఒక వైపు నాడీ వ్యవస్థ సక్రమంగా పని చేయడం లేదని అర్ధం అని చెప్పవచ్చు.
నీటిలో ముంచినప్పుడు చేతి, కాలి వేళ్లు ఎందుకు ముడతలు పడతాయనేది ఒక సందేహం అయితే, ముడతలు పడిన చర్మం గురించిన వివరాలు మాత్రం ఆశ్చర్యకర రీతిలో వైద్యులకు ఉపయోగకరంగా మారుతున్నాయి.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












