ఇంటర్నేషనల్ యోగా డే: మదరసాలలో యోగా చేయించిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్, విద్యార్థులు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, RAMESH VERMA/BBC
- రచయిత, అనంత్ ఝణాణే
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న సుమారు 16,000 మదరసాలలో యోగా నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ యోగా బోర్డు యోగా చేయాలని అంటూ మదరసాలకు ఆదేశాలు జారీ చేసింది.
మదరసాలలో యోగా చేయడం ఇది మొదటిసారి కాదని మదరసా బోర్డు రిజిస్ట్రార్ జగ్‌మోహన్ సింగ్ తెలిపారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో యోగా నిర్వహించినట్లు చెప్పారు. కానీ, ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా యోగా నిర్వహించాలని యూపీ యోగా బోర్డు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు.
"భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి యోగా. దీనిని సమాజంలో కొంత మందికి అందకుండా చేయడం సరైంది కాదు. మదరసాలలో కూడా యోగా చేస్తారు. మేమొక వారం రోజులుగా ఇక్కడ యోగా చేస్తున్నాం. ఇది అలవాటుగా మారిపోయింది. మేము దీనిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. దీని వల్ల వారి మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీంతో, వారు పూర్తి సామర్ధ్యంతో చదువుకుని, పనులు చేసేందుకు ఉపయోగపడుతుంది" అని ఆయన అన్నారు.
"విద్యార్థులు వారి పూర్తి సామర్ధ్యాలతో పని చేసినప్పుడు, సమాజంలో వారి పాత్రను మెరుగ్గా పోషించగలరు" అని ఆయన అన్నారు.
"దేశాభివృద్ధికి ఎక్కువ మంది జనాభా సహకరిస్తే, మనం భారత ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోగలం. ఒక్క యోగా దినం నాడు మాత్రమే కాకుండా, మిగిలిన రోజుల్లో కూడా యోగా చేయాలి. మదరసాలలో విద్యార్థుల కార్యకలాపాల్లో యోగా కూడా భాగం అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేస్తాం" అని జగ్‌మోహన్ సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, RAMESH VERMA/BBC
విద్యార్థులకు యోగా చేయడం నచ్చిందా?
లఖ్‌నవూ లోని అల్ ఫిర్దోస్ రహ్మాని మదరసాలో ఈ రోజు ఉదయం టీచర్లు, విద్యార్థులు యోగా చేశారు.
"మదరసాలలో కూడా యోగా టీచర్లు రోజూ రావాలి. మాకు యోగా చాలా ముఖ్యం. ఇది మాకు చదువులో చాలా ఉపయోగపడుతుంది. మా శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుంది. శరీరం చురుకుగా ఉంటుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. దీంతో బాగా చదవగలం. యోగా చేసిన తర్వాత సేద తీరినట్లుగా ఉంటుంది" అని 12వ తరగతి విద్యార్థి మొహమ్మద్ ఎహ్ తేషామ్ చెప్పారు.
"మా మత ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ కూడా దీనిని సమర్ధించారు. ఉదయాన్నే నిద్ర లేచి వ్యాయామం చేయాలని ఆయన చెప్పారు. అందుకే మేం కూడా దీనిని చేయాలని అనుకుంటున్నాం" అని అబుల్ ముయీద్ అనే విద్యార్థి చెప్పారు.
కొత్త రకమైన యోగా నేర్చుకుంటున్నానని మదరసా విద్యార్థి మొహమ్మద్ అఖ్తర్ చెప్పారు. "ప్రభుత్వం యోగా చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి మేము యోగా నేర్చుకుంటున్నాం. టీచర్లు మాకు యోగా నేర్పించటం బాగుంది" అని ఆయన అన్నారు.
యోగాలో చాలా సులభమైన ఆసనాలున్నాయి. కానీ, ఒక వారం రోజులుగా యోగా చేస్తున్న ఈ విద్యార్థులకు అన్ని ఆసనాల గురించి తెలియదు.
గతంలో కూడా మదరసాలలో యోగా చేయడం గురించి ప్రభుత్వ ఆదేశాలున్నాయి. కానీ, ఈ సారి ఒక వారం రోజుల పాటు వరసగా మదరసాలలో యోగా చేయాలని ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ ఇతర క్రీడలు కూడా విద్యార్థుల ఆసక్తులకనుగుణంగా ఉంటాయి. ఇందుకోసం ఒక టీచర్‌ను కూడా నియమిస్తారు. రేపటి నుంచి ఒక టీచర్ వచ్చి ఒక నెల రోజుల పాటు యోగా నేర్పిస్తారు.

ఫొటో సోర్స్, RAMESH VERMA/BBC
ముస్లిం మత గురువులు ఏమంటున్నారు?
"మదరసాలలో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యం కోసం చేసే పనుల పట్ల అభ్యంతరం ఉండకూడదు" అని లఖ్‌నవూలోని దారుల్ - ఉలూమ్ ఫిరంగి మెహ్లీ మదరసా ప్రతినిధి మౌలానా సూఫియాన్ నిజామి అన్నారు.
"యోగాను కేవలం శారీరక సాధనగా చూస్తూ, మతపరమైన ఉచ్చారణలు, మంత్రాలు పఠించకుండా ఉన్నట్లయితే... యోగా చేసేందుకు ఎటువంటి అభ్యంతరం తెలపకూడదు" అని ఆయన అన్నారు.
"ఇలాంటి ఆదేశాలు మదరసాలలోని విద్యార్థులతో పాటు ఇతర సంస్థల్లో విద్యార్థులకు కూడా ఇస్తే బాగుంటుందని అన్నారు.
మదరసాలలో యోగాను ప్రవేశపెట్టడంలో ఎటువంటి రాజకీయ కోణం లేదని షియా మత గురువు యాషూబ్ అబ్బాస్ చెప్పారు.
"యోగా చేయడంలో తప్పు లేదు. యోగాకు మతానికి ఎటువంటి సంబంధం లేదు. యోగా పూర్తిగా ఆరోగ్యానికి సంబంధించింది. భారతదేశంలో యోగాను ఎప్పటి నుంచో చేస్తున్నారు. ప్రతీ అంశాన్ని రాజకీయంగా చూడటం మంచిది కాదు" అని అన్నారు.

ఫొటో సోర్స్, RAMESH VERMA/BBC
మదరసాల కోసం యోగి ప్రభుత్వ ప్రణాళికలు ఏంటి?
ఉత్తరప్రదేశ్‌లో16,000కు పైగా మదరసాలు ఉన్నాయి. అందులో 558 మదరసాలు ప్రభుత్వ సహకారంతో నడుస్తున్నాయి. వీటికి జీతాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. 7,000 మదరసాలలో ఒక్కో దానిలో ముగ్గురు టీచర్లకు గౌరవ వేతనాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెల్లిస్తున్నాయి.
మిగిలిన మదరసాలు కేవలం గుర్తింపు పొందాయి. వీటికి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్ధిక సహాయం లభించదు. కానీ అక్కడ చదువుకునే విద్యార్థుల సర్టిఫికేట్‌లకు విలువ ఉంటుంది. వాళ్ళు స్కాలర్‌షిప్ ద్వారా ప్రయోజనం పొందాలని అనుకుంటారు.
మదరసాలలో విద్యను ఆధునికం చేసేందుకు 2018 నుంచి ఇక్కడ కూడా ఎన్‌సిఈఆర్‌టి సిలబస్‌ను ప్రవేశపెట్టినట్లు జగ్‌మోహన్ సింగ్ చెప్పారు. వీరి సిలబస్‌లో ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్‌ను కూడా చేర్చారు. ఇస్లాం నేర్పించేందుకు దినియత్ అనే ఒక సబ్జెక్టుకు మాత్రమే పరిమితం చేశారు.

ఫొటో సోర్స్, RAMESH VERMA/BBC
యూపీ ప్రభుత్వం కూడా మదరసాల్లో టీచర్లను నియమించాలని చూస్తోంది.
"మదరసాల్లో 80 శాతం శిక్షణ పొందిన టీచర్లను నియమించనున్నట్లు చెప్పారు. ఇద్దరు టీచర్లు ఆర్ట్స్, మరొక టీచర్ అరబిక్-పర్షియన్ నేర్పిస్తారు.
8వ తరగతిలో ముగ్గురు టీచర్లు ఉంటారు. ఒకరు అరబిక్ నేర్పిస్తారు. మరో ఇద్దరు సాధారణ సబ్జెక్టులు నేర్పిస్తారు.
హై స్కూలులో నలుగురు టీచర్లు ఉన్నారు. ఇందులో ఒక టీచర్ అరబిక్ నేర్పిస్తే, మిగిలిన ముగ్గురు సాధారణ సబ్జెక్టులు నేర్పిస్తారు.
బి. ఎస్‌సి, బీ.ఎడ్ , ఎం.ఏ, బీ.ఎడ్ చేసిన వారిని, టీచర్ ట్రైనింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని ఉద్యోగాల్లోకి తీసుకుంటామని మదరసా బోర్డు చెప్పింది. అయితే మదరసాల్లో ఈ నియమాలు అమలయ్యేలా చూసేందుకు ఆరు నెలలు పడుతుందని మదరసా బోర్డు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ముంబయిలోని కమాఠీపురా రెడ్ లైట్ ఏరియాలో ఒకప్పటి జీవితం ఇలా ఉండేది...
- యోగా ఎవరెవరు చేయొచ్చు.. ఎవరు చేయకూడదు.. అసలు దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటి
- అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













