ద్రవ్యోల్బణం: అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే మీ మీద పడే 5 ప్రభావాలు ఇవే...

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, నటాలీ షెర్మన్
- హోదా, బిజినెస్ రిపోర్టర్, న్యూయార్క్
ఆకాశాన్నంటుతూ పెరుగుతున్న నిత్యావసరాలు, వినియోగ వస్తువుల ధరలను నియంత్రించటానికి పోరాడుతున్న అమెరికా సెంట్రల్ బ్యాంక్.. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా అత్యధిక స్థాయి వడ్డీ రేటు పెంపును ప్రకటించింది.
బ్యాంకులు అరువు తీసుకునే నగదు మీద ఫెడరల్ రిజర్వ్ చార్జీలను ఒక పర్సంటేజీ పాయింట్‌లో మూడు వంతులు పెంచింది. ఈ పెంపుదల పరిణామాలు.. అమెరికాలోనూ ప్రపంచ వ్యాప్తంగానూ ఆర్థిక వ్యవస్థలో దాదాపు అన్ని రంగాల మీదా ప్రభావం చూపుతాయి.
అమెరికాలో ఈ వడ్డీ రేటు పెంపుదల మీ మీద చూపే ఐదు రకాల ప్రభావాలు ఇవీ.
1. గృహ రుణాలు, ఇతర రుణాలు మరింత ఖరీదు
తక్షణ ప్రభావం అమెరికాలో ఉంటుంది. దేశంలో గృహ రుణాలు, క్రెడిట్ కార్డులు, విద్యార్థి రుణాలు, ఇతర అప్పుల ఖరీదు మరింతగా పెరుగుతుంది. జనం ఎక్కువగా మొగ్గుచూపే 30 సంవత్సరాల కాలపరిమితితో కూడిన గృహ రుణాల మీద సగటు పన్ను రేటు ఇప్పటికే దాదాపు 6 శాతానికి పెరిగింది. 2008 తర్వాత ఇదే అత్యధిక స్థాయి.
అంటే.. అమెరికాలో ఒక మాదిరి ధర గల ఇంటిని కొనుగోలు చేసే వ్యక్తి నెల వారీగా చెల్లింపుల భారం ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 600 డాలర్ల (దాదాపు 47,000 రూపాయలు) మేర పెరిగిందని అర్థం. ''నేను ఇంకా ముందు నుంచే ఇంటిని వెదికి రుణం తీసుకున్నట్లయితే బాగుండేది'' అని ఒహాయోకు చెందిన ఒక రిటైర్డ్ టీచర్ డెలోరిస్ రాబిన్సన్ చెప్పారు. ఆమె ఈ నెలలోనే కొత్త అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు.
తాను ఇంటిని వెదకటం మొదలుపెట్టినప్పటితో పోలిస్తే తాను ఇల్లు కొనుగోలు చేసేటప్పటికి వడ్డీ రేటు పెరిగిపోయినా కూడా.. ఇప్పటితో పోలిస్తే కొంత తక్కువ వడ్డీ రేటుతో ఇల్లు కొనుగోలు చేయటం కాస్త ఊరటనిస్తోందని ఆమె చెప్తున్నారు. కానీ.. పెరుగుతున్న వడ్డీ రేట్ల వల్ల కొందరు కొనుగోలుదార్లకు ఇళ్ల కొనుగోళ్లు అందుబాటులో లేకుండా పోతాయి. ఈ ఏడాది అమెరికాలో ఇళ్ల విక్రయాలు 9 శాతం పడిపోతాయని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ రియల్టర్స్ అంచనా వేస్తోంది.
ఇలా విక్రయాలు పడిపోవటం.. ఇల్లు కొనుగోలు చేయలేకపోయిన వారిని కొంత బాధపెట్టవచ్చు. అయితే ఇటీవలి కాలంలో రెండంకెల శాతంలో ఉన్న ధరల పెరుగుదల 2022లో 5 శాతానికి తగ్గుతుందని కూడా అంచనా వేస్తున్నారు.
అలా జరిగితే ద్రవ్యోల్బణం తగ్గటానికి అది సాయపడుతుంది. ఫెడరల్ బ్యాంక్ చర్యలు పనిచేస్తున్నాయనే దానికి అది సంకేతమవుతుంది.

2.పెన్షన్లు తగ్గుదల, ఊబర్ ప్రయాణాల ఖర్చు పెరుగుదల
వడ్డీ రేట్లు పెరుగుతున్నపుడు.. దానివల్ల పెట్టుబడులు నాటకీయంగా పునర్వ్యవస్థీకృతమవుతాయి. సాధారణ ఆర్థిక ఆందోళనలు పెరుగుతున్నపుడు ఆ చర్యలు చాల ప్రస్ఫుటమవుతాయి. స్టాక్ మార్కెట్‌లో డబ్బులు పెట్టిన వారికి.. అంటే 401కె రిటైర్‌మెంట్ అకౌంట్లు ఉన్నవారికి.. దీనివల్ల తమ పెట్టుబడుల విలువ గణనీయంగా పడిపోతుందని అర్థం.
ఎస్ అండ్ పి 500 ఈ ఏడాది జనవరి నుంచి 20 శాతం పైగా దిగజారింది. ఈ మైలురాయిని బేర్ మార్కెట్ అని పిలుస్తారు. ఇక నాస్డాక్ విలువ ఇదే కాలంలో మూడింట ఒక వంతు కరిగిపోయింది. క్రిప్టోకరెన్సీల వంటి రిస్కీ అసెట్స్ ధరలు కూడా పడిపోయాయి. ఇది అమెరికా వెలుపలి స్టాక్ మార్కెట్లను కూడా దెబ్బతీసింది.
పెట్టుబడి సంస్థలు సైతం ఎక్కువ రిస్కు ఉండే వెంచర్ల నుంచి వైదొలగుతున్నాయి. ఏళ్ల తరబడి నష్టాల్లో నడుస్తున్న ఊబర్ వంటి కంపెనీల నుంచి లాభదాయకతను ఆశిస్తున్నాయి. అంటే.. ట్యాక్సీ ప్రయాణాలు, డెలివరీల వంటి సేవల ధరలు పెరగనున్నాయి. లేదంటే.. అటువంటి సంస్థలు మూతపడవచ్చు. పదిహేను నిమిషాల్లో సరకులు డెలివరీ చేస్తామంటూ న్యూయార్క్‌లో మొదలైన కొన్ని స్టార్టప్‌ల తరహాలో బోర్డు తిప్పేయవచ్చు.
''అనిశ్చిత పరిస్థితుల కాలంలో మదుపుదారులు భద్రత కోసం చూస్తారు'' అని ఊబర్ బాస్ దారా ఖోస్రోషాహి గత నెలలో తమ సంస్థ సిబ్బందికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కంపెనీ వ్యయాన్ని తగ్గించటానికి, లాభాలను పెంచుకోవటానికి.. కొత్త ఉద్యోగుల నియామకాలను తగ్గించటం సహా చేపట్టనున్న పలు చర్యలను వివరిస్తూ ఆయన ఆ లేఖ రాశారు.
''మార్కెట్ పెను మార్పులకు లోనవుతోందనేది స్పష్టం. మనం దానికి అనుగుణంగా ప్రతిస్పందించాల్సిన అవసరముంది'' అని ఆ లేఖలో చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
3. ఉద్యోగాల మార్కెట్‌లో మాంద్యం.. ఆర్థిక మాంద్యం ముప్పు
కోవిడ్ మహమ్మారి ఆంక్షల అనంతరం కంపెనీలు ఉద్యోగుల నియామకం కోసం పోటీలు పడటంతో కొత్త ఉద్యోగులకు అధిక వేతనాలు, ఇతర తాయిలాలు ఇచ్చాయి. దీనివల్ల చాలా మంది ఉద్యోగులు మెరుగైన వేతనాల కోసం కంపెనీలు మారారు. ఇప్పుడు డిమాండ్ తగ్గుతుండటంతో.. మహమ్మారి అనంతరం లేబర్ మార్కెట్‌లో విపరీతంగా వచ్చిన పెరుగుదల ముగిసిపోతోంది.
రియల్ ఎస్టేట్ దిగ్గజాలైన రెడ్‌ఫిన్, కంపాస్ సంస్థలు.. ఈ వారంలో వందల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించాయి. వ్యాపార వృద్ధి తిరోగమనం, అధిక ధరలను ఇందుకు కారణాలుగా చూపాయి. ఊబర్, అమెజాన్, వాల్‌మార్ట్, టెస్లా, స్పాటిఫై వంటి పెద్ద కంపెనీలు సైతం.. కొత్త ఉద్యోగుల నియామకాన్ని నెమ్మదింపజేయటమో, నిలిపివేయటమో చేయనున్నట్లు ప్రకటించాయి.
అయితే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇంకా బలంగానే కొనసాగుతోందని, ఉద్యోగాలు అన్వేషిస్తున్న వారికి దాదాపు రెట్టింపు ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని అమెరికా సెంట్రల్ బ్యాంక్ అధిపతి జెరోమి పావెల్ చెప్పారు. కాబట్టి ఆర్థిక వ్యవస్థలో సామూహిక ఉద్యోగాల నష్టం జరగకుండా ఉంటుందని తాను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
కానీ ద్రవ్యోల్బణం వల్ల కంపెనీల ఖర్చులు పెరుగుతుండటంతో పాటు ప్రజల కొనుగోలుశక్తిని తగ్గిస్తుండటంతో.. ఆర్థికవ్యవస్థ ఇప్పటికే సవాళ్లు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఈ ఏడాది తొలి మూడు నెలల్లో వృద్ధి కుచించుకుపోయింది. దీనికి కారణం అంతర్జాతీయ వాణిజ్య గణాంకాల్లో అనూహ్య పరిణామాలని చెప్తున్నప్పటికీ.. రిటైల్ అమ్మకాల వంటి ఇతర సూచీలు కూడా మసకబారటం మొదలైంది.
అధిక ధరలు, బలహీనపడుతున్న ఆర్థిక వ్యవస్థతో కలిసి.. మాంద్యం తీసుకొచ్చే ముప్పు ఉందని విశ్లేషకులు అంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
4.మరింత బలమైన డాలర్
అమెరికా డాలర్ ఈ ఏడాది 10 శాతం పెరిగింది. ఫెడరల్ బ్యాంక్ చర్యల వల్ల పెట్టుబడిదారులు తమ డబ్బును అధిక లాభాల కోసం అమెరికాకు తరలిస్తుండటంతో అమెరికా కరెన్సీకి డిమాండ్ పెరుగుతోంది.
బ్రిటన్ వంటి దేశాల్లో పర్యటించాలని ప్లాన్ చేసుకునే అమెరికన్లకు.. ఇది కారుచీకట్లో కాంతిరేఖ వంటిది. బ్రిటన్ కరెన్సీ అయిన పౌండ్ విలువ ఈ వారం 1.20 డాలర్లకన్నా తక్కువగా ఉంది. మహమ్మారి తర్వాత పౌండ్ విలువ (డాలర్‌తో పోల్చినపుడు) ఇప్పుడు అతి తక్కువగా ఉంది.
కానీ మిగతా ప్రాంతాల్లో అమెరికా కరెన్సీ విలువ పెరగటం అంటే.. ఇంధనం, ఆహారం వంటి నిత్యావసరాలను దిగుమతి చేసుకోవటం మరింత ఖరీదైన వ్యవహారమవుతుంది. ఈ వ్యాపారం ఎక్కువగా డాలర్లలోనే జరుగుతుంది. దీనివల్ల, ముఖ్యంగా ప్రభుత్వాలు డాలర్లలో ఎక్కువగా అప్పులను పేర్చుకున్నపుడు ఆర్థిక ఇక్కట్లు పెరుగుతాయి.
''ఈ పరిస్థితుల్లో.. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లే ఎక్కువగా దెబ్బతింటుంటాయి'' అని సిటీ ఇండెక్స్‌లో మార్కెట్ ఎనలిస్ట్‌గా పనిచేస్తున్న ఫియోనా సిన్సొటా చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
5. విదేశాల్లో అధిక వడ్డీ రేట్లు
ఈ పరిణామాలకు అర్థం.. అమెరికా ఒక్కటే వడ్డీ రేట్లను పెంచుతోందని కాదు.
బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, స్విట్జర్లండ్, ఆస్ట్రేలియా, కెనడా, ఇండియా సహా పదుల సంఖ్యలో ఇతర దేశాలు సైతం ఇటీవలి నెలల్లో వడ్డీ రేట్ల పెంపుదలను ప్రకటించాయి. చాలా దేశాలు తమ అంతర్గత ద్రవ్యోల్బణంతో స్వీయ పోరాటం చేస్తున్నాయి. అయితే ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ఏం జరుగుతోందనే దాని నుంచి ఆ దేశాలు మార్గదర్శనం తీసుకుంటున్నాయి.
డాలర్‌తో ముడిపడి ఉన్న కరెన్సీలు గల కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అయితే.. అమెరికాలో వడ్డీ రేట్ల పెంపుదల ప్రభావం దాదాపు తక్షణమే ఉంటుంది. నిధులు బయటికి అమెరికాకు తరలిపోకుండా నిలువరించే ప్రయత్నాల్లో భాగంగా ఆయా దేశాల బ్యాంకులు లాక్‌స్టెప్‌ను పెంచుతున్నాయి.
ఆ చర్యల ప్రభావం క్షేత్రస్థాయిలో కనిపించటం మొదలయింది. అమెరికా ఆర్థిక పరిస్థితి ఏ మలుపు తిరుగుతుందన్నదానిని ఆర్థిక నిపుణులతో పాటు ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- మనుషులు సెక్స్ ఎందుకు కోరుకుంటారు... లైంగిక సంబంధాల్లో విప్లవం రాబోతోందా?
- ఈ కుక్కలను కొనొద్దని పశు వైద్యులు ఎందుకు చెబుతున్నారు
- అగ్నిపథ్: ఇలాంటి సైనిక నియామకాల పథకం ఏఏ దేశాల్లో ఉంది? అక్కడి నియమ నిబంధనలు ఏమిటి
- విజయవాడలో బిల్డర్లకు అక్రమంగా లైసెన్సులు ఇస్తున్నారా... ఫ్లాట్స్ కొనుక్కున్న వారి పరిస్థితి ఏంటి?
- బ్లడ్ గ్రూప్స్ గురించి మీకేం తెలుసు... వాటిలో చాలా అరుదుగా దొరికే రక్తం రకాలు ఏంటి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















