Stock market: బేర్ మార్కెట్ అంటే ఏంటి? ఇది ఆర్ధిక సంక్షోభానికి సంకేతమా?

బేర్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అటాహువాల్ప అమెరీజ్
    • హోదా, బీబీసీ న్యూస్ ముండో

ప్రపంచ మార్కెట్లలో ట్రెండ్స్‌కు బెంచ్ మార్క్‌ను సూచించే యూఎస్ డో జోన్స్, ఎస్&పి 500 సూచికలు 15 నుంచి 20 శాతం పడిపోయాయి. ఇవి డిసెంబరులో రికార్డు స్థాయిలో పెరిగాయి.

సాధారణంగా భారీగా పెరిగిన స్టాక్ మార్కెట్లు తర్వాత కొంత పడిపోతే, దానిని మార్కెట్‌లో చోటు చేసుకుంటున్న కరెక్షన్ (సర్దుబాటు) అని నిపుణులు చెబుతుంటారు.

కానీ, చాలా మంది ఆర్ధిక విశ్లేషకులు ప్రస్తుతం బేర్ మార్కెట్ తలెత్తిందని అంటున్నారు.

స్టాక్ మార్కెట్‌ ఇటీవలి గరిష్ఠ స్థాయి నుంచి 20% పడిపోతే ఆ పరిస్థితిని బేర్ మార్కెట్ అని అంటారు.

ఈ సమయంలో పెట్టుబడిదారులు స్టాక్‌లను కొనుగోలు చేయడం కంటే ఎక్కువగా అమ్మకాల వైపు మొగ్గుచూపుతారు. దీంతో, మార్కెట్‌లో ఉన్న సంస్థల్లో పెట్టుబడుల విలువ తగ్గిపోతుంది.

వీడియో క్యాప్షన్, రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా పట్టిందల్లా బంగారమేనా?

ఇది ఆర్థిక వ్యవస్థ గురించి ఏం సూచిస్తుంది?

బేర్ మార్కెట్‌‌ను పరిశీలిస్తే ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతుందన్నది అర్థమవుతుంది. మదుపరులు అవలంబించే సరళిని బట్టి భవిష్యత్తులో స్టాక్ మార్కెట్ పరిస్థితులను అంచనా వేస్తుంది.

ఆర్ధిక పరిస్థితిని అంచనా వేసే ఉద్యోగాలు, వేతనాల నుంచి ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల వరకు జాగ్రత్తగా పరిశీలిస్తారు.

సంస్థల లాభాలు తగ్గి ఆర్ధిక పరిస్థితి మందగమనం దిశగా వెళుతున్నట్లనిపిస్తే ఆ సంస్థ షేర్ల విలువ పడిపోయేలోపే అమ్మేస్తూ ఉంటారు.

ఉత్పత్తులు, వ్యాపారాలు, వాణిజ్యానికి డిమాండ్ తగ్గి ఉద్యోగాలు కూడా కోల్పోయే క్లిష్ట పరిస్థితి వచ్చే సూచనను బేర్ మార్కెట్ హెచ్చరిస్తుంది.

షేర్ల విలువలు అత్యధిక స్థాయికి చేరిన తర్వాత కూడా బేర్ మార్కెట్ తలెత్తే అవకాశం ఉంటుంది.

కోవిడ్ మహమ్మారి ముగిసిన వెంటనే చాలా సంస్థల షేర్ల ధరలు అమాంతం పెరిగాయి. ముఖ్యంగా టెక్నాలజీ రంగ సంస్థల షేర్లు 2019 స్థాయిని మించి పెరిగాయి.

కొంతకాలంగా కొన్ని స్టాక్‌ల విలువ బాగా తగ్గి, బేర్ మార్కెట్ తలెత్తే పరిస్థితికి దారి తీసింది.

డో జోన్స్, ఎస్&పి 500లో స్టాక్ విలువలు మహమ్మారి ముందు కంటే కూడా ఎక్కువగానే ఉన్నాయి.

బేర్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

ఈ పరిస్థితి ఎన్ని రోజులుంటుంది?

ఎస్&పి 500 .. 1929 నుంచి ఇప్పటి వరకు 26 సార్లు "బేర్ మార్కెట్" స్థాయికి పడిపోయింది. అయితే, అందులో 14 సార్లు 1950 కంటే ముందు జరిగింది. 1929లో అమెరికాలో చోటు చేసుకున్న అత్యంత భారీ స్టాక్ మార్కెట్ క్రాష్‌లో ఏర్పడిన అనిశ్చితి వల్ల ఈ పరిస్థితి తలెత్తింది.

ఇటీవలి కాలంలో బేర్ మార్కెట్ తలెత్తడం అరుదుగా జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఆర్ధిక మాంద్యం లేదా సంక్షోభం తలెత్తడానికి ముందు జరుగుతోంది.

నవంబరు 1973 - మార్చి 1974 మధ్యలో చమురు సంక్షోభం ఏర్పడిన కాలంలో నమోదైన సమయంలో ఇది 48.2 శాతానికి పడిపోయింది.

అక్టోబరు 2007 - నవంబరు 2008 మధ్యలో ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం సమయంలో కూడా ఇది 51.93 శాతానికి పడిపోయింది.

ఫిబ్రవరి - మార్చి 2020 మధ్య కాలంలో అసాధారణమైన బేర్ మార్కెట్ పరిస్థితి కొంతకాలం పాటు ఉంది. నెల రోజుల్లోనే 33% పడిపోయింది. మహమ్మారి వల్ల ఆర్ధిక పరిస్థితి క్షీణిస్తుందేమోననే భయంతో చాలా మంది మదుపరులు ఒక్కసారిగా షేర్లను అమ్మేశారు.

సాధారణంగా బేర్ మార్కెట్‌లు సగటున 36% తగ్గుతూ 289 రోజులు ఉంటాయని నెడ్ డేవిస్ రీసెర్చ్ అనే కన్సల్టింగ్ సంస్థ చెప్పింది.

బేర్ మార్కెట్, బుల్ మార్కెట్

ఫొటో సోర్స్, Getty Images

బుల్ మార్కెట్ అంటే ఏంటి?

బేర్ మార్కెట్‌కు వ్యతిరేక పరిస్థితి ఏర్పడితే దానిని బుల్ మార్కెట్ అని అంటారు.

సాధారణంగా ఎస్&పి 500 లలో బుల్ మార్కెట్ సగటున 114% లాభాలతో 991 రోజులు ఉంటుంది.

బేర్ మార్కెట్‌లో వాటిల్లే నష్టాలతో పోలిస్తే బుల్ మార్కెట్‌లు తరచుగా ఏర్పడుతూ, ఎక్కువ కాలం కొనసాగుతూ, అధిక శాతంలో లాభాలను ఇస్తాయి.

దీర్ఘకాలంలో ఆర్ధిక వ్యవస్థ విస్తరిస్తున్నప్పుడు, కరెన్సీ విలువ తగ్గుతూ ఉంటుంది. దీంతో బుల్ మార్కెట్‌లు ఏర్పడి షేర్ల విలువ పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో తాత్కాలిక మార్పులు జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో తలెత్తే బేర్ మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉంటారు.

చరిత్రలో 2009-2020 వరకు కొనసాగిన మార్కెట్‌ను అత్యంత దీర్ఘ కాలం కొనసాగిన బుల్ మార్కెట్‌గా చెప్పవచ్చు. ఇందులో మార్కెట్లు 300 శాతానికి పైగా లాభాలు ఇచ్చాయి.

చేతిలో డబ్బులు ఉన్నవారు బేర్ మార్కెట్ వల్ల మార్కెట్లు భారీగా పతనమయ్యాక షేర్లను కొంటారు. ఆ తర్వాత బుల్ మార్కెట్ అత్యధిక స్థాయికి చేరినప్పుడు వాటిని అమ్మడమే ఉత్తమ స్టాక్ మార్కెట్ వ్యాపారం అవుతుంది.

అయితే, ఈ మార్కెట్‌లు ఆ స్థాయిల్లో ఎప్పుడు ఉంటాయో అర్ధం చేసుకోవడం అసాధ్యం.

1820లో లండన్ లో ఎలుగుబంటి శునకాల మధ్య పోటీ

ఫొటో సోర్స్, Getty Images

బుల్, బేర్ అని ఎందుకు అంటారు?

స్టాక్ మార్కెట్‌లో విలువలను బుల్, బేర్ అని ఎందుకంటారో చెప్పేందుకు చాలా సిద్ధాంతాలున్నాయి.

ఇంగ్లండ్‌లో 16-19 శతాబ్దాల మధ్యలో ప్రాచుర్యం పొందిన జంతు ప్రదర్శనల నుంచి ఈ పేరు వచ్చిందని కొందరంటారు.

నిర్బంధించిన ప్రదేశంలో పెట్టిన శునకాలపైకి బుల్ (ఎద్దు), బేర్ (ఎలుగుబంటి)ని వదిలిపెట్టే ఆచారాన్ని బ్రిటన్ పార్లమెంట్ 1835లో నిషేధించింది.

ఆ శునకాలను ఎద్దులు కింద నుంచి పైకి తలను ఊపుతూ ఎదుర్కోగా, ఎలుగుబంట్లు పై నుంచి కిందకు తల ఊపుతూ ఎదుర్కొనేవి. 1801లో ఏర్పాటైన లండన్ స్టాక్ ఎక్స్చేంజి ఈ పదాలను తమ వాడుకలోకి చేర్చి ఉండవచ్చని చెబుతారు.

జంతువుల క్రీడలో ఎలుగుబంటి పూర్తిగా ఎద్దుకు విరుద్ధంగా ప్రవర్తించడంతో వ్యాపారంలో ఏర్పడే నష్టాలను బేర్‌తో పోల్చేవారని అంటారు.

అయితే, కొంత మంది దీనికి మరొక సులభమైన సిద్ధాంతాన్ని చెబుతారు. ఎద్దు శక్తికి, శారీరక దృఢత్వానికి, దూకుడుతనానికి ప్రతీకగా ఉండే జంతువు. ఎలుగుబంటి సిగ్గుతో, బద్ధకంగా, దీర్ఘ కాలం సుప్తావస్థలో ఉంటుంది.

ఈ జంతువులకుండే లక్షణాల వల్ల స్టాక్ మార్కెట్‌లో షేర్లకు కూడా బుల్, బేర్ అనే పేర్లు వచ్చినట్లు చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)