ద్రౌపది ముర్ము: క్లర్క్ నుంచి రాష్ట్రపతి వరకు... ఆదివాసీ నేత ప్రస్థానం

ఫొటో సోర్స్, SansadTV
- రచయిత, రవి ప్రకాశ్
- హోదా, బీబీసీ కోసం
భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ ఆమెతో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయించారు.
భారత రాష్ట్రపతి పదవికి ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత సిన్హా మీద భారీ మెజారిటీతో విజయం సాధించారు.
మూడో రౌండ్ ఫలితాల తరువాత ముర్ముకు 5,77,777 విలువైన ఓట్లు అంటే 2,161 వచ్చాయి. యశ్వంత్ సిన్హాకు 1,058 ఓట్లు రాగా వాటి విలువ 2,61,062.
భారత రాష్ట్రపతి అయిన తొలి ఆదివాసీగా ముర్ము చరిత్ర సృష్టించడంతోపాటు ఆ పదవి చేపట్టిన రెండో మహిళగా కూడా ఆమె నిలిచారు.
ద్రౌపది ముర్ము ఝార్ఖండ్‌కు తొలి మహిళా గవర్నర్, ఆదివాసీ గవర్నర్ కూడా.
పదవీ విరమణ తరువాత ఆమె తన సొంత రాష్ట్రం ఒడిశాలో మయూర్‌భంజ్ జిల్లాలోని రాయంగ్‌పూర్‌లో నివసిస్తున్నారు. ఇది ఆమె స్వగ్రామం బైదాపోసిలోని బ్లాక్ ప్రధాన కార్యాలయం.

ఫొటో సోర్స్, ANI
ద్రౌపది ముర్ము ఎందుకంత ప్రత్యేకం
జూన్ 21 సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాష్ట్రపతి ఎన్నికలకు ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు.
అప్పటికి ఆమె రాయంగ్‌పూర్ (ఒడిశా)లోని తన ఇంట్లో ఉన్నారు. జూన్ 20న తన 64వ పుట్టినరోజును నిరాడంబరంగా జరుపుకొన్నారు. సరిగ్గా 24 గంటల్లో బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా తన పేరును ప్రకటిస్తుందని ఆమె ఊహించి ఉండరు.
"రాష్ట్రపతి పదవికి నన్ను నామినేట్ చేసినందుకు చాలా ఆశ్చర్యం, సంతోషం కలిగింది. టీవీ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. రాష్ట్రపతి పదవి అనేది రాజ్యాంగబద్ధమైనది. దీనికి నేను ఎన్నికైతే రాజకీయాలకు అతీతంగా దేశ ప్రజల కోసం పనిచేస్తాను. రాజ్యాంగ నిబంధనలు, హక్కుల ప్రకారం పనిచేస్తా’ అని నాడు మీడియాతో మాట్లాడుతూ ఆమె అన్నారు.

ఫొటో సోర్స్, Facebook/BJPOdisha
గుమస్తాగా కెరీర్ ప్రారంభించి..
ద్రౌపది ముర్ము, 1979లో భువనేశ్వర్‌లోని రమాదేవి ఉమెన్స్ కాలేజీ నుంచి బీఏ పాస్ అయిన తరువాత, ఒడిశా ప్రభుత్వంలో క్లర్క్‌గా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. నీటిపారుదల, ఇంధన శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు.
తరువాతి కాలంలో ఆమె ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. రాయంగ్‌పూర్‌లోని శ్రీ అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో గౌరవ ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. కష్టించి పనిచేసే ఉద్యోగిగా ఆమె గుర్తింపు పొందారు.

ఫొటో సోర్స్, Facebook/BJPOdisha
రాజకీయ జీవితం
ద్రౌపది ముర్ము 1997లో వార్డు కౌన్సెలర్‌గా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాయిరంగపూర్ నగర పంచాయతీ ఎన్నికలలో వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. నగర పంచాయతీ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.
తరువాత, రాయరంగ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు (2000, 2009లలో) బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
మొదటి సారి ఎమ్మెల్యే అయిన తరువాత, 2000 నుంచి 2004 వరకు నవీన్ పట్నాయక్ క్యాబినెట్‌లో (బీజేడీ, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం) వివిధ శాఖల్లో మంత్రిగా వ్యవహరించారు. వాణిజ్యం, రవాణా, మత్స్య శాఖలతో పాటు జంతు వనరుల శాఖలను నిర్వహించారు.
మంత్రిగా ఉండి కూడా ఆమె నిరాడంబర జీవితాన్ని గడిపారు. ఆమెకు సొంత వాహనం కూడా లేదు.
ఒడిశాలోని ఉత్తమ ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును ఆమె అందుకున్నారు.
రెండుసార్లు బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా వ్యవహరించారు. 2002 నుంచి 2009 వరకు, 2013 నుంచి 2015 ఏప్రిల్ వరకు ఈ మోర్చా జాతీయ కార్యవర్గంలో సభ్యురాలిగా ఉన్నారు.
దీని తరువాత ఆమెను జార్ఖండ్ గవర్నర్‌గా నామినేట్ చేశారు. ఆ తరువాత క్రమంగా బీజేపీ క్రియాశీల రాజకీయాల నుంచి దూరమయ్యారు.

ఫొటో సోర్స్, Twitter
ఝార్ఖండ్ మొదటి మహిళా గవర్నర్
2015 మే 18న ద్రౌపది ముర్ము ఝార్ఖండ్‌కు తొలి మహిళ, గిరిజన గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆరు సంవత్సరాలకు పైబడి నెలా 18 రోజుల పాటు ఈ పదవిలో కొనసాగారు.
జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నికైన మొదటి గవర్నర్ ఆమె. అయిదేళ్ల పదవీ కాలం పూర్తయిన తరువాత కూడా గవర్నర్‌గా కొనసాగారు.
తన పదవీ కాలంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాలకు దూరంగా ఉన్నారు.

ఫొటో సోర్స్, jharkhand rajbhavan
CNT-SPT చట్టం సవరణ బిల్లు వివాదం
2017లో ఝార్ఖండ్‌లో బీజేపీ నేతృత్వంలోని రఘువర్ దాస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవని చెబుతుండేవారు.
ఆదివాసీల భూములను కాపాడేందుకు బ్రిటిష్ పాలనలో తీసుకొచ్చిన చోటానాగ్‌పూర్ కౌలుదారీ చట్టం (సీఎన్‌టీ చట్టం), సంతాల్ పరగణా కౌలు చట్టం (ఎస్‌పీటీ చట్టం)లోని కొన్ని నిబంధనలను సవరించాలని రఘువర్ దాస్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
ప్రతిపక్షాలు వ్యతిరేకించినప్పటికీ, ఈ సవరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. అనంతరం దాన్ని గవర్నర్ ఆమోదం కోసం పంపారు.
2017 మే, అప్పటికి ఝార్ఖండ్ గవర్నర్‌గా వ్యవహరిస్తున్న ద్రౌపది ముర్ము ఈ బిల్లుపై సంతకం చేయకుండా వెనక్కు పంపారు. దీనివల్ల ఆదివాసీలకు ఏం లాభమని ప్రశ్నించారు. అందుకు ప్రభుత్వం సరైన జవాబు చెప్పలేకపోయింది. దాంతో ఆ బిల్లు ముందుకు సాగలేదు.
అప్పట్లో బీజేపీ నేత, లోక్‌సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా, మాజీ ముఖ్యమంత్రి (ప్రస్తుత కేంద్ర మంత్రి) అర్జున్ ముండా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ గవర్నర్‌కు లేఖ రాశారు.

ఈ విషయమై అప్పట్లో జంషెడ్‌పూర్‌లో విలేఖరులతో మాట్లాడిన ద్రౌపది ముర్ము, ఈ సవరణ బిల్లుపై రాజ్‌భవన్‌కు దాదాపు 200 అభ్యంతరాలు వచ్చాయని తెలిపారు. ఈ బిల్లుపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. సవరణ బిల్లుపై ఆమె సంతకం చేయలేదు.
ఆ సమయంలో ఆమె దిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని, ఇతర మంత్రులను కలిశారు. అంతకు ముందు, జూన్ నెలలో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్‌బాల వర్మ, ముఖ్యమంత్రి రఘువర్ దాస్ ఒకరి తరువాత ఒకరుగా గవర్నర్‌ను కలిసి బిల్లు విషయమై చర్చించారు. కానీ, ఈ విషయంలో ద్రౌపది ముర్ము వెనక్కు తగ్గలేదు. ఆమె, తన నిర్ణయంపై గట్టిగా నిలబడ్డారు.
అదే విధంగా, మరోమారు రఘువర్ దాస్ ప్రభుత్వ హయాంలోనే పాతాళగడి వివాదం చెలరేగింది. అప్పుడు, ద్రౌపది ముర్ము ఆదివాసి గ్రామపెద్దలను, మాంకి, ముండాలను రాజ్‌భవన్‌కు పిలిపించి, వారితో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు.
2019 డిసెంబర్‌లో రఘువర్ దాస్ ప్రభుత్వం కూలిపోయి జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. కొన్ని నెలల తరువాత, హేమంత్ సోరెన్ ప్రభుత్వం ట్రైబల్ కన్సల్టేటివ్ కమిటీ (టీఏసీ) ఏర్పాటుకు సంబంధించిన సవరణ బిల్లును గవర్నర్ ఆమోదం కోసం పంపింది. ఈ సవరణ ప్రకారం టీఏసీ ఏర్పాటులో గవర్నర్ పాత్ర ఉండదు. అయితే, ద్రౌపది ముర్ము దానిపై సంతకం చేయకుండా ప్రభుత్వానికి తిరిగి పంపారు.
యూనివర్సిటీలలో మార్పులు
తన పదవీ కాలంలో పాఠశాలల, కాలేజీల పరిస్థితులను సమీక్షిస్తూ వాటి మెరుగుదలకు కృషి చేశారు.
2016లో యూనివర్సిటీల కోసం లోక్ అదాలత్ నిర్వహించారు. వ్యతిరేకత వచ్చినప్పటికీ ఛాన్సలర్ పోర్టల్‌ను ప్రారంభించారు.
యూనివర్సిటీలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్ చేసే మార్గమిది. వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్‌లతో చర్చిస్తూ, గిరిజన భాషల అధ్యయనానికి సంబంధించిన సూచనలెన్నో చేశారు.
ఫలితంగా, యూనివర్సిటీల్లో చాలా కాలంగా మూతపడిన గిరిజన, ప్రాంతీయ భాషల ఉపాధ్యాయుల నియామకం మళ్లీ మొదలైంది.
ద్రౌపది ముర్ము గవర్నర్‌గా ఉండగానే రాజ్‌భవన్‌లో అన్ని మతాలవారికి ఎంట్రీ ఇచ్చారు. రాజ్‌భవన్‌లో హిందూ, ముస్లింలు, సిక్కు, క్రైస్తవులందరికీ సమాన గౌరవం కల్పించారు.

ఫొటో సోర్స్, IPRD
భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతి
రాయరంగ్‌పూర్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు చేరుకునే ప్రయాణంలో ద్రౌపది ముర్ము అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 11 సంవత్సరాల తరువాత మయూర్‌భంజ్ జిల్లాలోని బైదాపోసి గ్రామంలో 1958 జూన్ 20న జన్మించారు ద్రౌపది ముర్ము.
ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. ఆయన సంతాల్ ఆదివాసి తెగకు చెందినవారు. ఆ తెగల పంచాయతీకి అధిపతిగా వ్యవహరించారు.
ద్రౌపది ముర్ము .. శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్నారు. ఆయన చిన్న వయసులోనే మరణించారు. వారికి ముగ్గురు సంతానం. వారిలో, ఇద్దరు కుమారులు చిన్న వయసులోనే అకాల మరణం చెందారు.
కుమార్తె ఇతిశ్రీ ముర్ము, గణేష్ చంద్ర హెంబ్రామ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉంది. ద్రౌపది ముర్ము తన కూతురు, అల్లుడు, మనుమరాలితో ఉన్న ఫొటోలు కొన్ని మీడియాలో వచ్చాయి. ఇతర కుటుంబ సభ్యుల గురించి సమాచారం అందుబాటులో లేదు.
ఇవి కూడా చదవండి:
- నూరేళ్ళు జీవించేందుకు ఫార్ములా ఉందా?
- జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తీసిన ఫొటోల్లోని నక్షత్రాలు 8 దిశల్లో కాంతిని వెదజల్లుతున్నాయి. ఎందుకు?
- సంక్షోభంలో శ్రీలంకకు ఎక్కువ సాయం చేసిందెవరు, చైనానా, భారతదేశమా?
- హిందీ గడ్డపై దక్షిణాది మూవీలు బాక్సాఫీసులు బద్దలుకొడుతోంటే.. బాలీవుడ్ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి?
- ఇళ్లలోనే పుట్టగొడుగుల పెంపకంతో మహిళల జీవితాలు ఎలా మారుతున్నాయంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














