Sushmita Sen and Lalit Modi: ప్రేమ విషయంలో ఆడవాళ్లే ఎందుకు ‘ట్రోల్’ టార్గెట్ అవుతున్నారు?

ఫొటో సోర్స్, Facebook/Sunitha
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
'డబ్బు కోసమే వృద్ధుడిని పెళ్లి చేసుకుంది.'
సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెను ఇలా ఎంతో మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే బాలీవుడ్ నటి సుష్మితా సేన్ ఎదుర్కొంటున్నారు. సుష్మితా సేన్‌తో ప్రేమలో ఉన్నానంటూ ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ట్వీట్ చేసిన తరువాత ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
డబ్బు కోసమే లలిత్ మోదీతో డేటింగ్ చేస్తోందంటూ సుష్మితా సేన్‌ను విమర్శించడం మొదలు పెట్టారు.
అలా విమర్శించిన వారిలో రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఉన్నారు. 'అనేక నేరారోపణలు ఎదుర్కొంటున్న ఒక ఆకర్షణలేని వ్యక్తితో సుష్మిత ఇప్పుడు ఉంటోంది. అంటే ఆ వ్యక్తి అపర శ్రీమంతుడు కావడం వల్లేనా? అంటే డబ్బుకు తను అమ్ముడు పోయిందా?
అతనితో ఆమె ప్రేమలో ఉండి ఉండొచ్చు. కానీ ఆమె ప్రేమలో ఉందని నేను అనుకోవడం లేదు. డబ్బుతో ప్రేమలో పడే వాళ్లంటే నాకు గౌరవం పోతుంది.' అంటూ ఆమె ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Facebook/Taslima Nasrin
1994లో మిస్ యూనివర్స్ టైటిల్‌ను తొలిసారి గెలిచిన సుష్మితా సేన్, ఆ తరువాత బాలీవుడ్‌లో విజయవంతమైన నటిగా రాణించారు.
నేటికీ ఆర్య వంటి వెబ్‌సిరీస్‌లతో ఆమె అలరిస్తున్నారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆమె ఎన్నో అవార్డులు పొందారు. కానీ 46 ఏళ్ల సుష్మితా సేన్ సాధించిన విజయాలన్నీ ఒకే ఒక్క ట్వీట్‌తో చిన్నవి అయిపోయాయి. 58 ఏళ్ల లలిత్ మోదీ చేసిన ఆ ట్వీట్‌తో ఎంతో మంది సుష్మితా సేన్ మీద విమర్శలకు దిగారు.
సెలబ్రిటీ అయిన సుష్మితా సేన్ విమర్శలకు గురికావడం ఆశ్చర్యమేమీ కాదు. మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న కొన్ని సంవత్సరాలకే ఆమె ఒక పాపను దత్తత తీసుకున్నారు. ఆ తరువాత మరొక అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇన్నేళ్ల తన జీవిత ప్రయాణంలో ఎంతో మందితో రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. కానీ ఆమె వాటిని ఎన్నడూ దాచుకోలేదు. తన తోటి నటులతో డేట్ చేశారు. చివరిసారిగా ఆమె మోడల్ అయిన రోహ్మన్ షావల్‌తో డేట్ చేసి, గత ఏడాది ఆ బంధాన్ని తెంచుకున్నారు.
'మెచ్యూరిటీ కలిగిన ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడే బంధాల గురించి మాట్లాడే హక్కు ఇతరులకు లేదు. ట్రోల్ చేయడం, విలువల గురించి మాట్లాడుతూ తీర్పులు చెప్పడమనేది మంచిది కాదు. ఇటువంటి కామెంట్లు అమ్మాయిలకు చెడు చేస్తాయి' అని ఆర్టికల్-14 వెబ్‌సైట్‌లో జెండర్ ఎడిటర్‌గా పని చేస్తున్న నమిత భండారే అన్నారు.

ఫొటో సోర్స్, Instagram/lalitmodi
భారత్‌లో ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ, పారిపోయి ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు. తాను, సుష్మితా సేన్ ప్రేమలో ఉన్నామంటూ ఆయన చేసిన ట్వీట్ వల్ల మీడియా అటెన్షన్ అంతా మోదీ మీదకు కాకుండా ఆమె మీదకు మాత్రమే వెళ్లింది.
డబ్బున్న వాళ్లతోనే డేటింగ్ చేస్తుందంటూ సుష్మితా సేన్‌ను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ఆమెకు మద్దతుగా వస్తున్నారు. గతంలో ఆమె డేటింగ్ చేసిన వాళ్లలో చాలా మంది అపర ధనవంతులు కాదని చెబుతున్నారు.
సుష్మితా సేన్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఆమె లలిత్ మోదీతో ఎందుకు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు? దానికి గల కారణాలేంటి? డబ్బు కోసమేనా? వంటి అనేక ప్రశ్నలు, జోకులు, మీమ్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వాట్సాప్ ఖాతాల్లో ఫార్వార్డ్ అవుతున్నాయి.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది
చివరకు ఈ ట్రోలింగ్ మీద సుష్మితా సేన్ స్పందించారు.
'చుట్టూ ఉన్న ప్రపంచం ఇంత దుఃఖ పూరితంగా మారడం చూస్తుంటే గుండె పగిలిపోతోంది' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ చేశారు.
'నాతో ఎప్పుడూ స్నేహం చేయని వారు, నేను ఒక్కసారి కూడా కలవని వారు... అందరూ నేడు నా మీద అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. బంగారు చేపల కోసం నేను వల వేస్తున్నానంటూ నా మీద తీర్పులు ఇస్తున్నారు... వీళ్లంతా చాలా పెద్ద మేధావులు' అంటూ సుష్మితా సేన్ రాసుకొచ్చారు.
డబ్బు కోసమే లలిత్ మోదీతో డేటింగ్ చేస్తోందంటూ విమర్శలకు గురవుతున్న సుష్మితా సేన్ వద్ద 10 మిలియన్ డాలర్లు అంటే సుమారు 80 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్ జువెలరీ ఉందనే వార్తలు గతంలో వచ్చాయి.
అందుకే ఆమె ఇలా రాశారు... 'నేను బంగారం కంటే లోతుగా వజ్రాల కోసం తవ్వుతాను. నేను వజ్రాలనే ఎప్పుడూ ఇష్టపడతాను. వాటిని కొనుక్కోగల సత్తా నాకు ఇప్పటికీ ఉంది.'
ట్రోల్ చేసే వాళ్లకు ఆమె ఇచ్చిన ఈ సమాధానాన్ని చాలా మంది మెచ్చుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంక చోప్రా, రణ్‌వీర్ సింగ్ వంటి బాలీవుడ్ నటులు లైక్ చేశారు.
ఇవి కూడా చదవండి:
- ముంబయిలోని కమాఠీపురా రెడ్ లైట్ ఏరియాలో ఒకప్పటి జీవితం ఇలా ఉండేది...
- మల విసర్జన రోజుకు ఎన్నిసార్లు చేయాలి? వస్తున్నా టాయ్‌లెట్‌కి వెళ్లకుండా ఆపుకుంటే ఏం జరుగుతుంది?
- హజ్ యాత్రకు వెళ్లినప్పుడు ముస్లింలు ఏం చేస్తారు?
- ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావాలనే బీజేపీ డిమాండ్, హిందువులకే చేటు చేస్తుందా?
- వైసీపీ పేరు మార్పు..జీవితకాల అధ్యక్షుడిగా జగన్ అన్న పార్టీ నిర్ణయాన్ని ఎన్నికల సంఘం ఆమోదిస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













