YS Vijayamma : వైసీపీ నుంచి విజయమ్మ తప్పుకున్నారా, తప్పించారా? ప్లీనరీ వేదిక మీదే ఎందుకు రాజీనామా ప్రకటన చేయాల్సి వచ్చింది?

రాజీనామా ప్రకటన అనంతరం వైఎస్ జగన్‌, విజయమ్మ

ఫొటో సోర్స్, YSR Congress Party

ఫొటో క్యాప్షన్, రాజీనామా ప్రకటన అనంతరం వైఎస్ జగన్‌, విజయమ్మ
    • రచయిత, శంకర్ వడిశెట్టి
    • హోదా, బీబీసీ కోసం

వివిధ పార్టీల్లో బహిరంగ సభల్లో కొత్త నేతలు చేరడం చాలా సహజం. పార్టీని వీడేవాళ్లు ఓ లేఖ రాసి గానీ, ఓ ప్రకటనతో సరిపెట్టిగానీ పార్టీలను వీడిపోవడం కూడా చూశాము.

కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు అందుకు భిన్నంగా వ్యవహరించారు. పార్టీ మహాసభగా భావించే ప్లీనరీ వేదికగానే తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. కేవలం తన పదవికి మాత్రమే కాకుండా పార్టీ సభ్యత్వాన్నే ఆమె వదులుకుంటున్నట్టు వెల్లడించారు. ఇది రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. వైసీపీ శ్రేణుల్లోనే భిన్నాభిప్రాయాలకు కారణమయ్యింది. ఆమె ప్రకటన చేస్తున్న సమయంలోనే సభలో వద్దు, వద్దు అంటూ వినిపించిన నినాదాలే అందుకు నిదర్శనం.

వైఎస్ విజయమ్మ వైసీపీలో తొలి నాయకురాలు. ఆపార్టీ ఆవిర్భవించగానే గెలిచిన తొలి ఎమ్మెల్యే. అంతేగాకుండా అసెంబ్లీలో ఆపార్టీ బలం పెరగగానే తొలి శాసనసభాపక్ష నేత. మొదటి నుంచి గౌరవాధ్యక్షురాలి హోదాలో ఉన్నారు. అంతేగాకుండా జగన్ జైలు పాలయిన సమయంలో మొత్తం పార్టీ వ్యవహారాలను భుజాన వేసుకున్న నాయకురాలు. 2012 ఉప ఎన్నికల నుంచి 2019 సాధారణ ఎన్నికల వరకూ పార్టీ ప్రచారకర్తల్లో ముఖ్యులుగా ఉన్నారు. అలాంటి నాయకురాలు పార్టీని వీడడం వెనుక కారణాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

వీడియో క్యాప్షన్, వైఎస్ విధానాన్ని మార్చిన జగన్

ప్లీనరీలో విజయమ్మ ఏమన్నారు..

వైసీపీకి మూడో ప్లీనరీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ప్లీనరీ సమావేశాలను ఆడంబరంగా ప్రారంభించారు. వాతావరణ పరిస్థితులను గమనంలో ఉంచుకుని భారీ ఏర్పాట్లు చేశారు. మంగళగిరి సమీపంలోని 40 ఎకరాల విశాల ప్రాంగణంలో విస్తృత ఏర్పాట్లతో రెండు రోజుల సమావేశాలను ఉత్సాహంగా ప్రారంభించారు. విజయమ్మతో కలిసి, జగన్ జెండావిష్కరణ చేశారు. పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయన తొలుత ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఆయన తర్వాత విజయమ్మ వేదికపై ఉద్వేగంగా మాట్లాడారు.

విజయమ్మ తన ప్రసంగంలో వైఎస్సార్ తో అనుబంధాన్ని, ఆయన మరణం తర్వాతి పరిణామాలను గుర్తు చేసుకున్నారు. జగన్ రాజకీయ ప్రస్థానంలో అనేక ఆటంకాలు కల్పించారంటూ వివరించారు. అన్ని సమయాల్లోనూ తమకు తోడుగా మీరున్నారంటూ సభికులనుద్దేశించి అన్నారు. ఆ సమయంలోనే ఇక వైసీపీలో తన ప్రస్థానానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు

"తన అన్నకి ఏ కష్టం కలగకుండా ఉండాలనే తెలంగాణాలో వైఎస్సార్ తెలంగాణా పార్టీ ని షర్మిల ఏర్పాటు చేసింది. ఇద్దరికీ వేర్వేరు విధానాలు ఉండక తప్పని అవసరం వచ్చింది. ఇదంతా ప్రజాహితం కోసమేనని నమ్ముతున్నాను. ప్రజలను నన్ను వైఎస్సార్ భార్యగా అంగీకరిస్తారు. ఎక్కడికి పోయినా ఆశీర్వదిస్తారు. కానీ పార్టీ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. షర్మిల అక్కడ ఒంటరి పోరాటం చేస్తోంది. ఆమెకు అండగా ఉండాలని మనఃసాక్షిగా అనుకున్నాను. కష్టంలో ఉన్నప్పుడు జగన్ తో ఉన్నాను. అక్కడ కష్టంలో ఉన్నప్పుడు నా కడుపున పుట్టిన బిడ్డకు అండగా ఉండడం బాధ్యత అనుకుంటున్నాను. కుటుంబంంలో అంతరాలున్నాయనే ప్రచారానికి, వక్రీకణలకు తావులేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవిలో కొనసాగకూడదని నిర్ణయించుకున్నాను. మీరంతా క్షమించాలని కోరుతున్నాను" అని విజయమ్మ ప్రకటించారు.

ఆమె మాట్లాడుతున్నప్పుడు కొంత ఉద్వేగంగా కనిపించారు. వైఎస్సార్ మరణం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా స్వల్పకాలం పనిచేసినప్పటికీ తన సొంత పార్టీగా భావించిన వైఎస్సార్సీపీని వీడుతుండడం ఆమెకు కొంత కష్టమయిన అంశంగా భావించినట్టు కనిపించింది. ఆమె ప్రసంగం చివరిలో ఇక్కడ జగన్ కి, అక్కడ షర్మిలకి తల్లిగా అండగా నిలుస్తానని చెబుతూ ముగించారు.

వైఎస్ విజయమ్మ

ఫొటో సోర్స్, YSR Congress Party

వైసీపీలో మొదటి ఎమ్మెల్యే.. 151 ఎమ్మెల్యేల పార్టీకి రాజీనామా

వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుమారు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు నాట రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. సొంత పార్టీలో సైతం ఆయన ఆటుపోట్లు తట్టుకుని నిలదొక్కుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగారు. ఆయన రాజకీయ ప్రస్థానమంతా కుటుంబంలో పలువురు చేదోడుగా నిలిచారు. సోదరుడు వివేకానందరెడ్డి వంటి వారు బహిరంగంగా వెంట నడిచారు. కానీ వైఎస్ విజయమ్మ మాత్రం ఎన్నడూ రాజకీయాల్లో కనిపించలేదు. ఆమె పేరు కూడా వినిపించలేదు. వైఎస్సార్ తొలిసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో మాత్రం ఆమె వేదిక మీద కనిపించారు.

వైఎస్సార్ చివరి ప్రయాణంలో హెలికాప్టర్ ఎక్కేముందు ఆమె ఇంటి దగ్గర బయటకు వచ్చి వీడ్కోలు పలుకుతున్న దృశ్యాలు అనాటి తెలుగు ప్రజల్లో గుర్తుండిపోయేలా చేశాయి. కానీ ఆయన ఇక తిరిగిరారని, తానే గడప దాడి రాజకీయ ప్రవేశం చేయాల్సి వస్తుందని ఆరోజు విజయమ్మ అనుకుని ఉండరు. వైఎస్సార్ తర్వాత ఆయన భార్య రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని సన్నిహితులు కూడా ఊహించి ఉండరు. కానీ కాంగ్రెస్ నాయకత్వంతో వైఎస్ కుటుంబానికి క్రమంగా దూరం పెరుగుతూ వచ్చింది. అందుకు అనేక పరిణామాలు కారణమయ్యాయి. ప్రధానంగా తండ్రి తర్వాత తనయుడు జగన్ సీఎం అవుతారని ప్రచారం సాగిన తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం అందుకు భిన్నంగా వ్యవహరించడం ప్రధాన కారణం.

ఓదార్పు యాత్ర విషయంలో జగన్ పట్టుదల, కాంగ్రెస్ అధినాయకత్వంతో ఢీకొట్టడం మూలంగా కాంగ్రెస్ నుంచి వైఎస్సార్ కుటుంబం పూర్తిగా వైదొలగాల్సి వచ్చింది. దానికి ముందు కాంగ్రెస్ అధినాయకత్వంతో పలు సందర్భాల్లో విజయమ్మ సహా కుటుంబ సభ్యులంతా సమావేశాలు నిర్వహించారు. సోనియా గాంధీతో విజయమ్మ సమావేశం సందర్భంగా ఓదార్పు యాత్రకి అనుమతి కోరినట్టు ఆనాడు ప్రకటించారు. జగన్ తల్లిగా తాను కోరినా సోనియా అంగీకరించలేదని అప్పట్లో విజయమ్మ విమర్శలు చేశారు.

2010 డిసెంబర్ లో జగన్ తన సొంతపార్టీని ప్రకటించే సమయంలో తల్లి విజయమ్మ తోడుగా ఉన్నారు. అప్పటికే ఆమె కాంగ్రెస్ తరుపున గెలిచిన పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా, జగన్ కడప ఎంపీ సీటుకి రాజీనామా ప్రకటించారు. ఆ తర్వాత 2011 మే నెలలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన తొలి ఎమ్మెల్యేగా ఆమె ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆనాడు జగన్ మరోసారి కడప నుంచి ఎంపీగా గెలిచారు. ఒకే ఒక్క ఎమ్మెల్యేగా ఆమె ప్రారంభించిన ప్రస్థానం ప్రస్తుత ఏపీ అసెంబ్లీలో ఆపార్టీ బలం 151 సీట్లు గెలుచుకునే వరకూ సాగింది.

వీడియో క్యాప్షన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల పాలన ఎలా సాగింది?

విశాఖపట్నంలో ఓటమి.. ఆ తర్వాతా పార్టీకోసం ప్రచారం

2012 జూన్ నెలలో ఏపీలో 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల ప్రచారం సాగుతుండగా వైఎస్ జగన్ ని సీబీఐ అరెస్ట్ చేసింది. చంచల్ గూడ జైలులో బంధించింది. దాంతో ఉప ఎన్నికల ప్రచారం బాధ్యతను స్వయంగా విజయమ్మ తన నెత్తిన వేసుకున్నారు. పార్టీ ప్రారంభించి ఏడాది తిరగగానే అధ్యక్షుడు జైలు పాలుకావడంతో మొత్తం వ్యవహారాలను విజయమ్మ పర్యవేక్షించాల్సి వచ్చింది.

అదే సమయంలో ఆమె కుమార్తె షర్మిల కూడా రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా ఆరంగేట్రం చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగన్ తల్లీ , చెల్లి ప్రచారం ఆ ఎన్నికల్లో వైసీపీకి ఉపయోగపడింది. 18కి 15 చోట్ల విజయం దక్కింది. సభలో బలం పెరిగిన తర్వాత శాసనసభ పక్ష నేతగా విజయమ్మను ఎన్నుకున్నారు.

2014 ఎన్నికల్లో ఆమె పార్టీ తరుపున విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విజయమ్మ బరిలో ఉంటే వైసీపీ విజయాలకు దహదపడుతుందని ఆలోచించి ఆమెను బరిలో దింపారు. కానీ ఆమె 4,76,344 ఓట్లు సాధించినప్పటికీ 90,488 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. టీడీపీ, జనసేన మద్ధతుతో బీజేపీ తరుపున కంభంపాటి హరిబాబుకి విజయం దక్కింది. ఆ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్ సభ స్థానం పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటుని కూడా వైసీపీ దక్కించుకోలేకపోయింది. రెండు సార్లు పులివెందుల నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఆమెకు ప్రత్యక్ష ఎన్నికల్లో ఇదే తొలి ఓటమి.

ఎన్నికల పరాజయం తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో ఆమె కనిపించారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జగన్ నిర్వహించిన వివిధ కార్యక్రమాలకు హాజరయ్యారు. స్వయంగా ఆమె కూడా కొన్ని దీక్షలు చేశారు. తద్వారా పార్టీకి అవసరమయిన అన్ని సందర్భాల్లో విజయమ్మ తోడుగా నిలిచారు.

2019 ఎన్నికల్లో కూడా అటు షర్మిల, ఇటు విజయమ్మ కూడా ప్రచార బాధ్యతలు నెత్తిన వేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జగన్, విజయమ్మ, షర్మిల అసెంబ్లీ నియోజకవర్గాలను పంచుకుని పార్టీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం నిర్వహించారు. వైసీపీకి అధికారం దక్కడంలో తమ వంతు పాత్రను పోషించారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, YSR Congress Party

జగన్ సీఎం అయ్యాక పార్టీకి దూరంగా.. లోటస్‌పాండ్‌కే పరిమితంగా..

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమంలో విజయమ్మ పాల్గొన్నారు. 2004లో ఎల్బీ స్టేడియం వేదికగా హైదరాబాద్ లో వైఎస్సార్ ప్రమాణస్వీకారం ప్రత్యక్షంగా చూసిన ఆమె, 2019లో విజయవాడ మునిసిపల్ స్టేడియంలో జరిగిన జగన్ ప్రమాణస్వీకారానికి కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. నాడు సీఎంకి భార్యగా, ఆ తర్వాత మరో సీఎంకి తల్లిగా ఆమె ఆనందాన్ని పంచుకున్నారు.

ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికార నివాసంగా మారిన తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీసులో ఆమె కొంతకాలం పాటు ఎక్కువగా కనిపించేవారు. కానీ రానురాను ఆమె మకాం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ కి మారింది. ఆ సమయంలోనే 'నాలో.. నాతో వైఎస్సార్' అనే పేరుతో ఆమె ఓ పుస్తకాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని 2020 జూలై 8న వైఎస్సార్ జయంతి సందర్భంగా జగన్ ఆవిష్కరించారు.

పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించిన వైఎస్ విజయమ్మ, షర్మిల కూడా రానురాను తాడేపల్లికి రావడడమే తగ్గిపోయింది. వారిద్దరూ హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అదే సమయంలో 2021 జూలై 8న గత ఏడాది వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ తెలంగాణా పార్టీ పేరుతో వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేశారు. తెలంగాణా రాష్ట్రంలో వైఎస్సార్ ఆశయాల సాధన కోసం తమ పార్టీ ప్రయత్నిస్తుందని ప్రకటించారు. ఆ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలతో పాటుగా వివిధ సందర్భాల్లో వేదికపై విజయమ్మ దర్శనమిచ్చారు.

వీడియో క్యాప్షన్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బీబీసీ ప్రత్యేక ఇంటర్వ్యూ

‘ఆ కుటుంబంలో అంతకుమించిన సమస్యలు..’

"సాంకేతికంగా రెండు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు పార్టీల్లో ఉండడం సమస్యగా కనిపించదు. కానీ అంతకుమించిన సమస్యలు ఆ కుటుంబంలో ఉన్నట్టు చాలాకాలంగా ప్రచారంలో ఉంది. పలు కథనాలు కూడా వచ్చాయి. అధికారం వచ్చిన తర్వాత పదవుల విషయమే కాకుండా, ఆర్థిక వ్యవహారాల్లో వాటాలపై కూడా అన్నా, చెల్లెలు మధ్య వివాదం ఉందనే ప్రచారం సాగింది. దానిని నిజమే అనిపించేలా షర్మిల కొత్త పార్టీ పెట్టారు. విజయమ్మ కూడా కొడుక్కి దూరమయ్యారు. చివరకు ఇప్పుడు అధికారికంగా పార్టీకి దూరమయ్యారు. నిజానికి ఆమె చాలాకాలంగానే జగన్ తో లేరు. ఈరోజు ఆమాట వేదిక మీద చెప్పించడంతో విజయమ్మకి వైసీపీతో బంధం తెగిపోయినట్టయ్యింది" అంటున్నారు రాజకీయ విశ్లేషకుడు చెవుల కృష్ణాంజనేయులు.

వైఎస్ కుటుంబమంతా కలిసి ఇడుపులపాయలో వేడుకలు నిర్వహించుకోవడం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఉన్నప్పటి నుంచి ఒక ఆనవాయితీ అయినప్పటికీ గత ఏడాది వైఎస్ కి నివాళులు అర్పించే సమయంలో వేరువేరుగా పాల్గొనడం అందరికీ తెలిసిందేనని ఆయన గుర్తు చేశారు. ఈ ఏడాది మాత్రం విజయమ్మ సహా అందరూ కలిసి పాల్గొన్నప్పటికీ వారి మధ్య విబేధాలు కొనసాగుతున్నాయనే సంకేతాలను తాజాగా పార్టీని వీడుతున్నట్టు చేసిన ప్రకటన చెబుతోందని ఆయన బీబీసీ వద్ద అభిప్రాయపడ్డారు.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద విజయమ్మ, జగన్

ఫొటో సోర్స్, YSR Congress Party

‘జగన్ దూరం పెట్టారు..’

వైఎస్ విజయమ్మ తో కలిసి తెలంగాణలో పార్టీ వ్యవహారాల్లో షర్మిల ముందకు సాగుతున్నారు. కానీ అదే సమయంలో షర్మిల భర్త అనిల్ కుమార్ మాత్రం కొంతకాలం క్రితం ఏపీలో రాజకీయ కార్యాచరణకు ప్రయత్నించారు. పలు చోట్ల సమావేశాలు నిర్వహించారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో సమావేశమయ్యారు. దాంతో ఏపీలో కూడా రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే ప్రచారం సాగింది. కానీ అనూహ్యంగా ఆయన మళ్లీ మౌనంగా ఉండిపోయారు.

వైఎస్ జగన్, షర్మిల మధ్య విబేధాలున్నాయనే విషయాన్ని వైసీపీ నేతలు కూడా అంగీకరించారు. చిన్న చిన్న విబేధాలున్నప్పటికీ అవన్నీ సర్థుకుపోయేవే అంటూ గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబంలో ఎవరూ చిచ్చు పెట్టలేరని కూడా అన్నారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రాజకీయ కేంద్రం లేకుండా చూసుకునే యత్నం జగన్ చేశారనే వాదన ఉంది. దానికి అనుగుణంగానే చెల్లిని ఆయన దూరం పెట్టారని సీనియర్ జర్నలిస్ట్ దారా గోపీ అభిప్రాయపడ్డారు.

"ముఖ్యమంత్రి జగన్ మొదటి నుంచి కుటుంబాన్ని దూరం పెట్టారు. భార్యని, బావమరుదులను కూడా ఆయన పార్టీ వ్యవహారాల్లో కనిపించనివ్వలేదు. ఆ క్రమంలోనే చెల్లి క్రమంగా దూరం జరిగింది. ఇప్పుడు తల్లి కూడా పార్టీని వీడారు. రాజకీయంగా మొదటి నుంచి విజయమ్మ మాత్రం షర్మిల పక్షానే కనిపించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం కూడా ప్రస్తుతం జగన్ కి తన అవసరం లేదని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే షర్మిల కోసం ఆమె జగన్ కి దూరమయ్యారు" అంటూ ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి హోదాలో జగన్ రాజకీయంగా తన తల్లి, చెల్లిని అధికారానికి దూరంగా ఉంచడమే కారణమా లేక ఇతర కుటుంబ వ్యవహారాలు కూడా దోహదపడ్డాయా అనే దానిపై పలు అభిప్రాయాలున్నప్పటికీ విజయమ్మ ఏపీ రాజకీయాల నుంచి తన సుమారు పుష్కరకాల ప్రయాణానికి ముగింపు పలకడం కీలక పరిణామం.

అయితే కష్టకాలంలో జగన్ కి తోడుగా నిలిచామని చెప్పిన విజయమ్మ, మళ్లీ అవసరమయితే ఏపీ వ్యవహారాల్లో కనిపించే అవకాశం లేకపోలేదని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

వీడియో క్యాప్షన్, ‘ఏపీలో క్లారిటీ ఉన్న నాయకుడు వైఎస్ జగనే’ - మంత్రి కన్నబాబు

వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. మొన్న చెల్లి వెళ్లిపోయిందని, ఇప్పుడు తల్లి వెళ్లిపోయిందంటూ సెటైర్లు వేశారు. జగన్ అందరినీ వాడుకుంటున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

‘రెండు పార్టీలలో ఉన్నాననే విమర్శలకు తావు లేకుండానే..’

వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి తప్పుకుంటూ విజయమ్మ చేసిన ప్రకటనపై షర్మిలను విలేఖర్లు ప్రశ్నించారు. ఆమె నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ ప్రశ్న రాగానే "ఎక్కడో ఏదో జరిగిందని, ఇక్కడ మాట్లాడమనడం, ఈ మాటలను హైలెట్ చేయడం సరికాదు. అది రాజశేఖర్ రెడ్డిని అవమానించినట్టవుతుంది" అంటూ షర్మిల స్పందించడం విశేషం.

పార్టీ నుంచి విజయమ్మ నిష్క్రమించినప్పటికీ జగన్ కి ఆమె ఆశీస్సులుంటాయని చెప్పిన విషయం మరచిపోకూడదంటూ వైసీపీ నేత కే పార్థసారధి అన్నారు.

"పార్టీ నాయకురాలి కన్నా ముందు ఆమె తల్లి. రాజకీయాలు ఎలా ఉన్నా తన బాధ్యత తను నిర్వహిస్తున్నారు. భర్త వైఎస్సార్ బాటలో తనయుడు జగన్ ని తీర్చిదిద్దారు. ఏపీకి జగన్ పాలనలో న్యాయం జరుగుతుందని విజయమ్మ అన్నారు. అభివృద్ధి జరగడం లేదనే విమర్శలను కూడా ఆమె తిప్పికొట్టారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంకన్నా అభివృద్ధి ఏమిటని ఆమె ప్రశ్నించారు. కూతురికి ఇప్పుడు తన అవసరం ఉండడం వల్లనే రెండు పార్టీలలో ఉన్నాననే విమర్శలకు తావు లేకుండా చేస్తున్నట్టు స్పష్టతనిచ్చారు. అలాంటప్పుడు వారి మధ్య విబేధాలున్నాయనే ప్రచారానికి ఆస్కారమే లేదు. ఆమె ఎక్కడ ఉన్నా జగన్ కి తల్లి, కొడుకు బాగు కోరుకునే మనిషి" అంటూ ఆయన బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.

జగన్ అన్ని వ్యవహారాల్లోనూ ఎంత పారదర్శకంగా ఉంటారన్నది ప్లీనరీలో విజయమ్మ సాక్షిగా బయటపడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)