Boris Johnson: ప్రధాన మంత్రి స్థాయికి చేరిన జర్నలిస్టు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

తన ప్రభుత్వం నుంచి 50 మంది రాజీనామాలు చేసిన తరువాత ఎట్టకేలకు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దిగొచ్చారు.
సహచరుల డిమాండ్‌కు తలొగ్గి చివరకు ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. కేబినెట్ మంత్రులు, ఎంపీలు బోరిస్ జాన్సన్ మీద విశ్వాసం కోల్పోయారు. దేశాన్ని నడిపే అర్హత ఆయనకు లేదని బోరిస్ కేబినెట్ నుంచి వైదొలిగిన మంత్రులు అన్నారు.
మంగళవారం రిషీ సునాక్, సాజిద్ జావిద్‌ల రాజీనామాలతో గాలివానగా మొదలైన ఈ సంక్షోభం గురువారం నాటికి తుపానుగా మారింది. బోరిస్ ప్రభుత్వంలోని సుమారు 50 మంది మంత్రులు, సహాయకులు రాజీనామాలు చేశారు. బోరిస్‌కు నమ్మకస్తులు అనుకున్న వారు కూడా ఇప్పుడు ఆయనను వదిలేశారు.
సొంత పార్టీ నేతల ఒత్తిడులకు తలొగ్గిన బోరిస్, పదవి నుంచి తప్పుకున్నారు. కన్జర్వేటివ్ పార్టీకి కొత్త నేత వచ్చే వరకు ఆయన ప్రధాని పదవిలో ఉంటారు. ఒక పాత్రికేయునిగా కెరియర్ ప్రారంభించి ప్రధాని స్థాయికి చేరారు బోరిస్.
బ్రెగ్జిట్ డీల్‌ను బ్రిటన్ పార్లమెంటు చేత ఒప్పించలేక టెరిసా మే కాడి పడేసినప్పుడు ప్రధాని పదవి చేపట్టారు బోరిస్ జాన్సన్. బ్రెగ్జిట్ సమస్యకు పరిష్కారం చూపడమే తన లక్ష్యమని ప్రకటించిన బోరిస్, అన్నట్లుగా డీల్‌కు బ్రిటన్ పార్లమెంట్ చేత ఆమోద ముద్ర వేయించగలిగారు.
సంక్షోభంలో బ్రిటన్‌ను ఆదుకున్నాడనే ప్రశంసలు పొందిన బోరిస్, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని తెలిసి కూడా క్రిస్ పించర్‌కు పదవి ఇవ్వడంతో తన ప్రధాని పీఠాన్నే పోగొట్టుకున్నారు.

ఫొటో సోర్స్, Reuters
1.సంక్షోభం ఎలా మొదలైంది?
ఈ ఏడాది జూన్ 30న బ్రిటిష్ న్యూస్ పేపర్ 'ది సన్' ఒక కథనాన్ని పబ్లిష్ చేసింది. దాని ప్రకారం నాటి కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్ క్రిస్ పించర్, లండన్‌లోని ఒక ప్రైవేటు క్లబ్‌లో ఇద్దరు మగవాళ్లను లైంగికంగా వేధించారు.
కొన్నేళ్లుగా పించర్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ వచ్చారంటూ ఇతర బ్రిటిష్ వార్తా పత్రికలు కూడా వరుసగా కథనాలు రాశాయి.
లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తరువాత కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్ పదవికి క్రిస్ పించర్ రాజీనామా చేశారు. పార్టీ నుంచి కూడా ఆయనను సస్పెండ్ చేశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపిన పించర్, 'ప్రొఫెషనల్ మెడికల్ సపోర్ట్' తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

ఫొటో సోర్స్, PA Media
2.బోరిస్ జాన్సన్ చేసిన తప్పు ఏంటి?
ఈ ఏడాది ఫ్రిబవరిలో క్రిస్ పించర్‌ను బ్రిటన్ పార్లమెంటులో కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్‌గా నియమించారు బోరిస్ జాన్సన్. పించర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల గురించి తెలిసి కూడా ఆయనను బోరిస్ ఆ పదవిలో నియమించారనేది ప్రధాన ఆరోపణ.
బోరిస్ జాన్సన్‌కు లైంగిక వేధింపుల ఆరోపణల గురించి ముందు తెలియదని, పించర్‌ను పదవిలో నియమించిన తరువాతే తెలిసిందని... జులై 1న విడుదల చేసిన ప్రకటనలో ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.
ఆ తరువాత బోరిస్ జాన్సన్ కేబినెట్‌లోని చాలా మంది మంత్రులు కూడా అదే చెబుతూ వచ్చారు.
కానీ పించర్ మీద ఉన్న లైంగిక వేధింపుల ఆరోపణల గురించి బోరిస్‌కు ముందే తెలుసంటూ జులై 4న బ్రిటన్ ప్రధాని అధికార ప్రతినిధి వెల్లడించారు. 'లైంగిక వేధింపుల మీద అధికారికంగా ఫిర్యాదు ఏమీ రాలేదు. వాటి మీద విచారణ జరగలేదు. సరైన ఆధారాలు లేని ఆరోపణల కారణంగా పించర్‌ను నియమించుకుండా ఉండటం సరైనది కాదు.' అని ప్రతినిధి వివరించారు.
కానీ పించర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ అధికారికంగా ఫిర్యాదు వచ్చిన సంగతి బోరిస్‌కు తెలుసు అనే విషయం, అదే రోజు మధ్యాహ్నం బీబీసీ వెలుగులోకి తీసుకొచ్చింది.
అధికారికంగా వచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టగా పించ్ వేధింపులకు పాల్పడినట్లు తేలింది.
ఆ తరువాత బీబీసీతో మాట్లాడిన బోరిస్ జాన్సన్, తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. 'నాడు నా దృష్టికి ఫిర్యాదు వచ్చింది. అదీ చాలా కాలం కిందట. లిఖిత పూర్వకంగా కాకుండా నోటి మాట ద్వారా ఫిర్యాదు చేశారు. కానీ నేను దాని మీద స్పందించి చర్యలు తీసుకోని ఉండాల్సింది.' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
3.బోరిస్ జాన్సన్‌ను ఎందుకు విశ్వాసాన్ని కోల్పోయారు?
వాస్తవాలను దాచారంటూ బోరిస్ జాన్సన్ మీద సహచరులు నమ్మకాన్ని కోల్పోయారు. పార్టీగేట్‌లోను బోరిస్ జాన్సన్ చిక్కుకున్నారు. కరోనా సంక్షోభంలో లాక్‌డౌన్ విధించినా పార్టీ చేసుకోవడం ఆయనకు మచ్చ తెచ్చింది.
పించర్ మీద ఉన్న లైంగిక వేధింపుల గురించి ముందు తనకు తెలియదు అన్న బోరిస్, చివరకు తెలుసు అని ఒప్పుకోవాల్సి వచ్చింది. క్రిస్ పించర్‌ను కన్జర్వేటివ్ పార్టీ డిప్యూటీ హెడ్‌గా నియమించక ముందు ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే విషయం తనకు తెలియదని బోరిస్ చెప్పారు. అదే నిజమని నమ్మిన ఆయన కేబినెట్ మంత్రులు, బోరిస్‌ను వెనుకేసుకు వచ్చారు. కానీ చివరకు తన తప్పును బోరిస్ ఒప్పుకోవడంతో మంత్రులు మోసపోయినట్లుగా భావించారు.

ఫొటో సోర్స్, Getty Images
4.తరువాత ఏం జరుగుతుంది?
కన్జర్వేటివ్ పార్టీ కొత్త నేతను ఎన్నుకునే వరకు బోరిస్ జాన్సన్ ప్రధాని పదవిలో ఉంటారు. ఆ పార్టీ లీడర్ పదవికి బోరిస్ రాజీనామా చేశారు కాబట్టి, కొత్త లీడర్ కోసం త్వరలోనే ఎన్నికలు జరుగుతాయి.
కన్జర్వేటివ్ పార్టీలో సుమారు లక్ష మంది సభ్యులున్నారు. వీరంతా కలిసి కొత్త నేతను ఎన్నుకుంటారు. ఆ తరువాత తన రాజీనామాను క్వీన్ ఎలిజబెత్-2కు బోరిస్ సమర్పిస్తారు. అప్పుడు కన్జర్వేటివ్ పార్టీ ఎన్నుకునే కొత్త నేతను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా రాణి ఆహ్వానిస్తారు.
ఇవి కూడా చదవండి:
- పంజాబ్ సీఎం భగవంత్ మాన్ పెళ్లి చేసుకోబోతున్న గురుప్రీత్ కౌర్ ఎవరు?
- పీటీ ఉష: మారుమూల పల్లె నుంచి రాజ్యసభను చేరుకున్న అలుపెరుగని అథ్లెట్
- రంప తిరుగుబాటుకు, అల్లూరి కి సంబంధం ఉందా?మోదీ ఏమన్నారు, చరిత్ర ఏం చెబుతోంది?- బీబీసీ ఫ్యాక్ట్ చెక్
- ఒక ‘సెక్స్ స్కాండల్’ బ్రిటన్ ప్రధాని పదవికి ఎలా గండం తెచ్చింది
- మహేంద్ర సింగ్ ధోని: ది బెస్ట్ ఫినిషర్ కెరీర్లో 5 బెస్ట్ ఇన్నింగ్స్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










