వైసీపీ ప్లీనరి: 11 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో 5 కీలక దశలు

ఫొటో సోర్స్, Facebook/YSJagan
- రచయిత, శంకర్ వడిశెట్టి
- హోదా, బీబీసీ కోసం
వైసీపీ... వైఎస్సార్‌సీపీ... వైఎస్సార్ కాంగ్రెస్.... వైకాపా... ఇలా ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు. అనేక రకాలుగా ప్రస్తావించే ఆ పార్టీ అసలు పేరు యుజవన శ్రామిక రైతు కాంగ్రెస్. ఈ పూర్తి పేరు చాలామందికి తెలిసే అవకాశం లేదు.
ఎందుకంటే సహజంగానే ప్రాంతీయ పార్టీల్లో నాయకుడే సర్వస్వంగా ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే వైఎస్ జగన్ అనే నాయకుడే ఆ పార్టీకి జెండా, ఎజెండా అన్నట్టుగా ప్రజల్లో ప్రచారం కూడా సాగుతుంది.
సామాన్య జనం కూడా జగన్‌ని గమనంలో ఉంచుకుని మాత్రమే ఆయన పార్టీ గుర్తు ఫ్యాన్‌కు ఓట్లు వేసిన సంగతిని అంతా అంగీకరిస్తారు. వైసీపీ నాయకులు కూడా జగన్‌ను జనం ఆదరించడం వల్లనే తాము గెలిచామని పలు సందర్భాల్లో చెప్పడం గమనార్హం.
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట కేంద్రంగా తన సొంత పార్టీ వైసీపీని 2011 మార్చి 12న ప్రకటించారు జగన్. అంతకు 4 నెలల ముందు 2010 డిసెంబర్‌లోనే ఇడుపులపాయ కేంద్రంగా సొంత పార్టీ ఏర్పాటు పెడుతున్నట్లు జగన్ ప్రకటించారు.
దానికి కొనసాగింపుగా పార్టీ జెండా, ఎజెండా, పేరు సహా అన్నీ వెల్లడించారు. ఇటీవలే పుష్కర కాలంలోకి అడుగుపెట్టి, 12వ వార్షికోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది ఆ పార్టీ.
2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారం దక్కించుకున్న వైసీపీ, 2022లో ప్లీనరీ సమావేశాలకు సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలో వైసీపీ ప్రస్థానంలో కీలక ఘట్టాలు పరిశీలిద్దాం.

ఫొటో సోర్స్, YSRCongress.com
1. వైసీపీ పుట్టుకే సంచలనం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర అనూహ్యం. 2009లో ఆయన తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు.
దానికి ముందు తండ్రి వైఎస్సార్, బాబాయ్ వివేకానంద రెడ్డిల కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అనుభవం ఆయనకు ఉంది. కానీ ఎక్కువగా వ్యాపార వ్యవహారాల్లోనే జగన్ ఉండేవారు.
2008లో సాక్షి టీవీ, దానికి ముందు సాక్షి పత్రిక స్థాపన కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. 2004లో తండ్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్ వ్యాపారాలు బాగా పుంజుకున్నట్టు ఆయన సమర్పించిన ఆర్థిక నివేదికలే చెబుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉన్న కుటుంబం నుంచే అయినప్పటికీ వ్యాపార రంగం నుంచి ఆయన రాజకీయ రంగంలో అడుగుపెట్టారు.
2009 ఎన్నికల్లో కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి, 3.63 లక్షల ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని జగన్ దక్కించుకున్నారు.
ఆనాటి ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే తండ్రి వైఎస్సార్ అనూహ్య మరణం తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. తొలుత తండ్రి వారసత్వంగా జగన్‌కే సీఎం పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది.
ఆనాటి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలోని అత్యధిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్‌కి సీఎం పీఠం అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరుతూ లేఖ రాశారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం అందుకు అంగీకరించలేదు.
ఆ తర్వాత కాంగ్రెస్ నాయకత్వంతో జగన్‌కి దూరం పెరిగింది. తండ్రి మరణించిన పావురాలగుట్ట ప్రాంతంలో జరిగిన సభలో ఇచ్చిన మాట ప్రకారం తాను ఓదార్పు యాత్ర చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.
కానీ దానికి కాంగ్రెస్ నాయకత్వం మాత్రం అనుమతినివ్వలేదు. అయినప్పటికీ జగన్ తన యాత్ర చేపట్టారు. అది కూడా జగన్‌కు, కాంగ్రెస్ పార్టీకి దూరం పెరగడానికి కారణమయ్యింది.
చివరకు తన తండ్రి స్థానంలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్న తల్లి విజయమ్మతో కలిసి 2010లో కాంగ్రెస్‌ను జగన్ వీడారు. వెంటనే సొంత పార్టీ స్థాపించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ ఏర్పాటు కోసం జగన్ ఆలోచిస్తున్న దశలోనే 2009లో కె.శివకుమార్ అనే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ న్యాయవాది ఆ పేరుతో పార్టీని ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించారు.
దాంతో చివరకు జగన్ ఆ పార్టీలో చేరి, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినట్టు ఈసీకి తీర్మానాలు పంపించడంతో వైఎస్సార్ కాంగ్రెస్ ఆయన సొంతమైంది.
2011 ఫిబ్రవరిలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకుని మార్చి 12న పార్టీ పేరు, జెండా అధికారికంగా ప్రకటించారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీనే పొడి అక్షరాల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌గా పేర్కొంటూ పార్టీని కొనసాగిస్తున్నారు.
దివంగత ముఖ్యమంత్రి తనయుడిగా రాజకీయ ఆరంగేట్రం చేసిన ఏడాదిన్నరకే సొంతంగా పార్టీని నడపాల్సిన స్థితికి జగన్ మళ్లడం అప్పట్లో ఓ సంచలనం.

ఫొటో సోర్స్, Oneindia
2. ఉప ఎన్నికలు- జగన్ జైలు పాలు
జగన్ సొంత పార్టీ, పురుడు పోసుకున్న రెండు నెలలకే 2011 మేలో ఉప ఎన్నికల బరిలో దిగింది. తాను, తన తల్లి... రాజీనామాలు చేసిన సొంత స్థానాలకు మళ్లీ పోటీ చేశారు. కడప లోక్ సభ స్థానం నుంచి జగన్, పులివెందుల అసెంబ్లీ బరిలో వైఎస్ విజయమ్మ పోటీ చేశారు. వైసీపీ తరుపున వీరే తొలి అభ్యర్థులు కావడం విశేషం.
ఉప ఎన్నికలతో ఈ పార్టీ తెరమీదకు రావడం ఆసక్తికరం. ఆ ఎన్నికల్లో 5.45 లక్షల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డిని ఓడించారు జగన్.
పులివెందుల అసెంబ్లీ సీటులో విజయమ్మకు 90వేల ఓట్ల మెజార్టీ దక్కింది. తద్వారా పోటీ చేసిన రెండు సీట్లలోనూ ఆ పార్టీ భారీ విజయాలు సొంతం చేసుకుని ఘనమైన ఆరంగేట్రం చేసింది.
కానీ అంతలోనే జగన్ ఆస్తుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. సీబీఐ, ఈడీ విచారణకు దిగాయి. కాంగ్రెస్ నేత శంకర్ రావు, టీడీపీ నాయకుడు ఎర్రన్నాయుడు వేసిన పిటీషన్లపై కోర్టు ఆదేశాల మేరకు జగన్ ఆస్తుల మీద విచారణ చేసిన దర్యాప్తు సంస్థలు పలు కేసుల నమోదు చేశాయి.
ఆ కేసుల విచారణలో భాగంగా జగన్ ని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు.
ఆ సమయానికి జగన్ తన పార్టీ అభ్యర్థుల తరుపున ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. 2009 నుంచి వరుసగా జరిగిన పరిణామాలతో కాంగ్రెస్, టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కొందరు జగన్ వైపు మొగ్గారు.
కొందరు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయగా, మరికొందరు అసెంబ్లీలో సొంత పార్టీల విప్ ధిక్కరించి అనర్హతకు గురయ్యారు. దాంతో 18 స్థానాలకు ఉపఎన్నికలు వచ్చాయి.
2012 జూన్ 12న పోలింగ్ తేదీగా ప్రకటించారు. నాడు తన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారానికి సిద్ధమవుతుండగా, 2012, మే 27న సీబీఐ జగన్ ను అరెస్ట్ చేసింది. చంచల్ గూడ జైలుకి తరలించింది. అక్కడే ఆయన 16 నెలల పాటు జైలులో ఉన్నారు.
అయినా ఆ ఉపఎన్నికల్లో వైసీపీ జెండా ఎగిరింది. 18 సీట్లలో పోటీ చేసి 15 సీట్లు కైవసం చేసుకుంది. అసెంబ్లీలో ఆ పార్టీ బలం 16కి చేరింది. మరింత మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు జగన్ వైపు మొగ్గు చూపేందుకు ఈ ఎన్నికలు దోహదపడ్డాయి.
ఎన్నికల ప్రచార భారాన్ని జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల తీసుకున్నారు. దాంతో ప్రజల్లో సెంటిమెంట్, నాయకుల్లో నమ్మకం పెంచుకుని వైసీపీ ముందడుగు వేసింది.

ఫొటో సోర్స్, YSRCP
3. తొలి సాధారణ ఎన్నికల్లో ఓటమి
దాదాపు ఏడాదిన్నర పాటు జగన్ జైలులో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలు మాత్రం ఆగలేదు. జగన్ సోదరి షర్మిల స్వయంగా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టారు.
ప్రస్తుతం వైఎస్సార్టీపీ నాయకురాలుగా ఉన్న ఆమె ఉమ్మడి ఏపీలో వైఎస్సార్సీపీ తరపున సుదీర్ఘ పాదయాత్ర చేసిన మహిళా నేతగా రికార్డులకెక్కారు.
అప్పటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న షర్మిల... తండ్రి మరణం, అన్నయ్య కేసుల్లో చిక్కుకోవడం వంటి పరిణామాల మధ్య పాలిటిక్స్‌లో అడుగుపెట్టారు.
2012 ఉపఎన్నికల్లో పార్టీ ఘన విజయం దక్కించుకోవడంతో ఆ ఊపు కొనసాగించడమే లక్ష్యంగా 2012 అక్టోబర్ 18న ఇడుపులపాయ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. 2013 ఆగష్టు 4 వరకు 3వేల కిలోమీటర్ల యాత్ర చేశారు.
ఆమె పాదయాత్ర ముగిసిన కొన్ని రోజులకే జగన్ జైలు నుంచి బెయిల్ మీద విడుదలయ్యారు. 2013 సెప్టెంబర్ 24న జగన్ బయటకు వచ్చారు.
రాష్ట్ర విభజన మూలంగా ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా బరిలో దిగిన జగన్ ఆంధ్రప్రదేశ్‌లో తమకు అధికారం ఖాయమని భావించారు.
కానీ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ముందు స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. 67 సీట్లకే వైసీపీ పరిమితమయ్యింది. తొలి సాధారణ ఎన్నికల్లో ఓటమి పాలుకావడం వైసీపీని ఇరకాటంలోకి నెట్టింది.
మూడేళ్లు గడిచేసరికి 67 మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో 23 మంది పార్టీ ఫిరాయించేశారు. టీడీపీ పక్షాన చేరిపోయారు. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగానూ మారిపోయారు. అదే సమయంలో జగన్ రాజకీయంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.
చివరకు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి బయటకు వచ్చారు. తదుపరి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నట్టు 2017లో జరిగిన పార్టీ ప్లీనరీ వేదికగా ప్రకటించారు.

ఫొటో సోర్స్, YSRCongress.com
4. విజయయాత్రకు దారితీసిన పాదయాత్ర
సరిగ్గా తన సోదరి షర్మిల పాదయాత్ర ప్రారంభించిన ఐదేళ్లకు ఇడుపులపాయ నుంచే జగన్ కూడా ప్రజా సంకల్పయాత్రకు శ్రీకారం చుట్టారు.
2017 నవంబరు 16న ప్రారంభించి 15 నెలల పాటు సుదీర్ఘ యాత్ర చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది సుదీర్ఘకాలం పాటు, అత్యధిక దూరం సాగిన యాత్రగా మారింది.
2019 జనవరి 19న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురంలో అది ముగిసింది. 14 నెలల పాటు రాష్ట్రంలోని 13 జిల్లాలోని 125 నియోజకవర్గాల్లో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర ద్వారా జగన్ ప్రజలకు చేరువయ్యారు.
అదే సమయంలో అప్పటి అధికార పార్టీ మీద వ్యతిరేకత, జగన్ హామీలు సహా అనేక పరిణామాలు కలిసివచ్చి 2019 సాధారణ ఎన్నికల్లో అఖండ విజయం నమోదు చేసుకున్నారు.
151 సీట్లను దక్కించుకుని అధికార పీఠం ఎక్కారు. సీఎం కావాలనే తన ఆశను నెరవేర్చుకోవడానికి ఆయన పదేళ్ల కాలం వేచి చూడాల్సి వచ్చింది. తొలి ఎన్నికల్లో పరాజయం పాలయినా నిలదొక్కుకుని విజయం సాధించడం ఇదే తొలిసారి.
2019 మే 30న ఆయన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఫొటో సోర్స్, YSRCongress.com
5. అధికార పార్టీగా వైసీపీ
మూడేళ్లకు పైగా అధికారాన్ని అనుభవిస్తున్న వైసీపీ, మరింత బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలను అందుకు అనుగుణంగా ఉపయోగించుకుంది.
కరోనా మూలంగా పలుమార్లు వాయిదా పడిన స్థానిక ఎన్నికల విషయంలో పలు వివాదాలు చుట్టుముట్టినప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా... పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకూ వార్డు స్థాయి నుంచి కార్పొరేషన్ పీఠం వరకూ అన్ని చోట్లా 80 శాతానికి పైగా విజయాలు తన ఖాతాలో వేసుకుంది.
అదే సమయంలో ప్రత్యర్థి పార్టీకి బలమైన కేంద్రాలల్లో కూడా పాగా వేయగలిగింది.
'కుల సమీకరణాల్లో జగన్ కొత్త పంథా అనుసరించారు. గతంలో కాంగ్రెస్ పూర్తిగా రెడ్ల నాయకత్వంలో ఎస్సీలను సమీకరించే ప్రయత్నం చేసింది. జగన్ మరో అడుగు ముందుకేసి ఎస్సీలతోపాటుగా బీసీలను దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేశారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత పదవుల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. బీసీ కార్పొరేషన్లను కులాల పేరుతో ఏర్పాటు చేసి తమకోసం ఏదో చేస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించారు.’’అంటూ రాజకీయ విశ్లేషకుడు ఐనం ప్రసాద్ విశ్లేషించారు.
‘‘సంప్రదాయకంగా టీడీపీ వెంట ఉన్న బీసీలను జగన్ ఆకర్షించడంతో రాజకీయంగా విపక్షాలకు సవాల్ ఎదురయ్యింది. అది అధికార పార్టీకి అడ్వాంటేజ్‌గా మారుతోంది’’ అని ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ మొదటి నుంచి బలహీనంగా ఉందని, 2019 ఎన్నికల్లో కూడా ఆ పార్టీ కోల్పోయిన సీట్లలో సగం పైగా అర్బన్‌లోనే ఉన్నాయని ప్రసాద్ గుర్తు చేశారు.
‘‘ఆ తర్వాత మునిసిపాలిటీలలో పట్టు సాధించడం ద్వారా తమ బలహీనతలను అధిగమించే ప్రయత్నంలో ఆ పార్టీ విజయవంతమైనట్లు భావించొచ్చు.
కానీ అధికారంలో ఉన్నప్పుడు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో లభించే ఆదరణ జనరల్ ఎన్నికల నాటికి ఉండదనే విషయాన్ని ఆ పార్టీ గ్రహించాలి’’ అని ప్రసాద్ అన్నారు.
వైసీపీ పాలన చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ స్థానంలో అధికార యంత్రాంగం పెత్తనమే ఎక్కువ గా కనిపిస్తోందని సీనియర్ జర్నలిస్ట్ పెద్దాడ నవీన్ అభిప్రాయపడ్డారు.
'జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత క్షేత్రస్థాయి వరకూ కొత్తగా డెలివరీ మెకానిజం వచ్చింది. కానీ ప్రజా నాయకుల పాత్ర పరిమితమైపోయింది. గ్రామ సచివాలయం, వాలంటీర్లు ఎవరికి బాధ్యులు అనేది సమాధానం లేని ప్రశ్నగా ఉంది.
కింద స్థాయి నుంచి ఎమ్మెల్యేల వరకూ అందరి పాత్ర పరిమితమైపోయింది. ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించడం లేదు’’ అన్నారు నవీన్.
‘‘ఒక రాజకీయ పార్టీగా వైసీపీ వ్యవహరించలేకపోతోంది. గతంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వం, పార్టీ రెండు కన్నుల్లా ఉండేవి. ఇప్పుడు పూర్తిగా ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితమయ్యారు.
ఇలాంటి సమయంలో పార్టీ నిర్మాణం మీద, కార్యకలాపాల మీద దృష్టి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్లీనరీల వల్ల ఏం ప్రయోజనం ఉంటుందన్నది సందేహమే’’ అని నవీన్ అన్నారు.
ఎన్టీఆర్ మాదిరిగానే జగన్‌కు కూడా సొంత ఛరిష్మా ద్వారా అధికారం దక్కినా ఎన్టీఆర్ తరహాలో ఓ యంత్రాంగాన్ని జగన్ సిద్ధం చేసుకోలేకపోయారని నవీన్ అభిప్రాయపడ్డారు.
ముగ్గురు, నలుగురు మినహా పాలన, పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే వారే కనిపించని స్థితి తెచ్చుకున్నారని ఆయన చెప్పుకొచ్చారు.
కరోనా సహా వివిధ కారణాలతో గడిచిన మూడేళ్లుగా స్థానిక ఎన్నికలు మినహా వైసీపీ రాజకీయ కార్యాచరణ పెద్దగా కనిపించలేదు. తాజాగా ఇటీవల నియోజకవర్గ ప్లీనరీలు, జిల్లా స్థాయి ప్లీనరీలతో సమావేశాలు నిర్వహించారు.
ఆయా సమావేశాల్లో పలువురు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఎమ్మెల్యేలు సైతం కార్యకర్తల సమస్యల గురించి వాపోవాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో పార్టీ క్యాడర్ సంక్షేమానికి సంబంధించి రాష్ట్ర ప్లీనరీ వేదికపై నుంచి సీఎం ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పార్టీ నిబంధనావళిలో కూడా కొన్ని మార్పులకు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్లీనరీ తొలిరోజే దానికి సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు.
ఇతర పలు తీర్మానాలు, ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన విధానాల గురించి ఎక్కువగా ప్రస్తావించేందుకు సిద్ధమవుతున్నారు.
తదుపరి ఎన్నికలకు వైసీపీ వ్యూహం ఎలా ఉండబోతోందన్నది ఈ ప్లీనరీ వేదికగా సూచనప్రాయంగానైనా వెల్లడించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
దాంతో సీఎం అయిన తర్వాత పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్ తొలి ప్రసంగం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తిగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ‘కింగ్’ కాకుండా ‘కింగ్ మేకర్’ పాత్ర పోషించగలరా? పొత్తుల కోసం పవన్ కల్యాణ్‌కు ‘పట్టం’ కట్టగలరా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు, చరిత్ర ఏం చెబుతోంది
- కోనసీమకి ఆ పేరు ఎలా వచ్చింది? ఈ ప్రాంతం అంత ప్రత్యేకంగా ఎలా నిలిచింది?
- నిజాం రాజుల దగ్గర ఉన్న 12 కేజీల భారీ బంగారు నాణెం ఇప్పుడు ఎక్కడుంది?
- బందరు లడ్డూను ఎలా తయారు చేస్తారు? దీనికి అంత ప్రత్యేకత ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











