వింబుల్డన్: పీరియడ్స్ సమయంలో మహిళా క్రీడాకారులు తెల్లటి దుస్తులు ధరించడం ఆట మీద ప్రభావం చూపుతుందా?

వింబుల్డన్

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, వందన
    • హోదా, ఇండియన్ లాంగ్వేజెస్ టీవీ ఎడిటర్, బీబీస్ న్యూస్

"వింబుల్డన్ ఆడేటప్పుడు మహిళా క్రీడాకారులు తెల్లటి దుస్తులు ధరిస్తారు. ఆ రెండు వారాల్లో పీరియడ్స్ రాకుండా ఉంటే చాలని కోరుకుంటారు. ఇది మానసికంగా ఒత్తిడి తెస్తుంది. మహిళా క్రీడాకారులపై దీని ప్రభావం ఉంటుంది" అంటూ మాజీ టెన్నిస్ ఒలింపిక్ ఛాంపియన్ మోనికా ప్యూగ్ తాజాగా ట్వీట్ చేయడంతో ఈ అంశం చర్చల్లోకొచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎదురుచూసే పోటీ వింబుల్డన్. ఇందులో క్రీడాకారులు తెల్లటి దుస్తులు ధరించడం సంప్రదాయం.

వింబుల్డన్ నిబంధనల ప్రకారం, స్కర్టులు, షార్టులు, ట్రాక్‌సూట్లు అన్నీ తెల్లగా ఉండాలి. తెలుపు అంటే సగం తెలుపు, క్రీం కాలర్ కాదు. తెల్లటి తెలుపుతో మెరిసిపోవాలి.

మోనికా ప్యూగ్ ట్వీట్‌తో టెన్నిస్, మరికొన్ని ఇతర క్రీడలు మహిళలకు వ్యతిరేకంగా ఉన్నాయా అనే చర్చ మళ్లీ ప్రారంభమైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

టెన్నిస్ క్రీడాకారిణి తరుకా శ్రీవాస్తవ ఆసియా క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

"పీరియడ్స్ సమయంలో నొప్పి ఉంటుంది. దానిపైకి, తెల్లటి దుస్తులపై మరకలు పడతాయేమోననే భయం" అంటూ తరుకా స్వానుభవాలను చెప్పుకొచ్చారు.

"పీరియడ్స్ సమయంలో తెల్లటి దుస్తులు ధరించి ఆడడం అసౌకార్యాన్ని కలిగిస్తుందని చాలామంది టెన్నిస్ క్రీడాకారిణులు గొంతు విప్పుతున్నారు. వారు చెప్పేది నిజం. అయితే, ఇక్కడ మనం అడగాల్సిన ప్రశ్న ఏమిటంటే, కోర్టులో ఆడుతున్న మహిళల సౌకర్యం కన్నా, సంప్రదాయం పెద్దదా?" అన్నారు తరుకా.

వింబుల్డన్

ఫొటో సోర్స్, AFP/GETTY IMAGES

వింబుల్డన్‌లో డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది?

  • క్రీడాకారులు తప్పనిసరిగా తెల్లటి దుస్తులు ధరించాలి.
  • తెలుపు అంటే సగం తెలుపు (హాఫ్ వైట్) లేదా క్రీం కలర్ కాదు.
  • షూస్, సాక్స్, టోపీ అన్నీ తెల్లగా ఉండాలి.
  • లోదుస్తులు కూడా తెల్లగా ఉండాలి. చెమట పట్టి లోదుస్తులు కనిపిస్తే, అవీ తెల్లగా ఉండాలి.
  • ఒక సెంటీమీటరు పట్టీ తప్ప అన్నీ తెల్లగా ఉండాలి.

టెన్నిస్ లేదా ఇతర క్రీడలు కావచ్చు.. భారతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఇప్పుడు తెల్లటి దుస్తులకు సంబంధించిన నిబంధనలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సిక్కీ రెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ కోర్టులో లేదా మైదానంలో సౌకర్యంగా ఉంటేనే ఆటగాళ్లు రాణిస్తారన్నారు. 2009 నుంచి సిక్కీ రెడ్డి భారతదేశం తరఫున ఆడుతున్నారు.

"ఏ ప్లేయర్‌కైనా బాగా ఆడడమే ముఖ్యం. వారు సౌకర్యంగా ఉంటేనే ఆటలో రాణించగలరు. ప్రత్యేక దుస్తులు ధరించమని చెప్పడం మహిళా క్రీడాకారులకు సమస్యలను పెంచుతుంది. ఇందులో తప్పొప్పులంటూ ఏమీ లేవు" అన్నారామె.

"నేను ఎలాంటి దుస్తులు ధరిస్తానన్నది తరువాతి విషయం. ముందు నా ఆటతీరు బాగుండాలి. నేనేం వేసుకున్నా, అది నాకు సౌకర్యంగా ఉండాలి. బాగా ఆడడానికి తోడ్పడాలి. ప్రత్యేకమైన దుస్తులు వేసుకోవాలనే నిబంధనలు ఆట మీద నుంచి దృష్టి మరల్చుతాయి. ఇది అనవసరమైన ఒత్తిడి తెస్తుంది" అని సిక్కీ రెడ్డి అన్నారు.

వీడియో క్యాప్షన్, ఈసారి టెన్నిస్ ఆటగాళ్లకు ర్యాంకింగ్స్ లేని వింబుల్డన్

'పీరియడ్స్ ఆలస్యంగా రావడానికి మాత్ర వేసుకోవాలనుకున్నా'

పీరియడ్స్ గురించి క్రీడాకారులు బహిరంగంగా మాట్లాడడం అరుదు. భారతదేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఇది ఇంకా చర్చల్లోకి రాని అంశమే.

బ్రిటన్‌కు చెందిన హైదర్ వాట్సన్ వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మాజీ ఛాంపియన్‌.

"వింబుల్డన్ ఆడే సమయంలో పీరియడ్స్-తెల్లటి దుస్తులపై చర్చ వస్తూ ఉంటుంది. ప్లేయర్స్ మీడియాతో మాట్లాడరు కానీ, తమలో తాము చర్చించుకుంటారు. ఒకసారి వింబుల్డన్ ఆడే సమయంలో పీరియడ్స్ నుంచి తప్పించుకోవడానికి మాత్ర వేసుకోవాలనుకున్నా. మహిళా క్రీడాకారుల మధ్య ఈ రకమైన చర్చలు వస్తూనే ఉంటాయి" అని ఆమె బీబీసీ స్పోర్ట్స్‌తో చెప్పారు.

వింబుల్డన్ చరిత్ర

  • 1877 జూలైలో వింబుల్డన్ ప్రారంభమైంది.
  • అప్పట్లో ఆడవాళ్లకు క్రీడల్లో పాల్గొనేందుకు అనుమతి లేదు.
  • 1884లో మహిళల సింగిల్స్ మ్యాచ్ ప్రారంభమైంది.
  • మాడ్ వాట్సన్ తన సోదరిని ఓడించి తొలి మహిళా ఛాంపియన్‌గా రికార్డు సృష్టించింది.
  • 1913లో మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్ ప్రారంభమయ్యాయి.

మహిళలకు టాయిలెట్ బ్రేక్

పీరియడ్స్ సమయంలో తెల్లటి దుస్తుల గురించి మాత్రమే కాదు. మహిళా క్రీకాడారులు ఎదుర్కొనే పలు సమస్యలు చర్చల్లోకి వస్తున్నాయి. ఆట మధ్యలో టాయిలెట్ బ్రేక్ తీసుకోవడం కూడా అలాంటిదే.

క్రీడల్లో పురుషులకు, మహిళలకు ఒకే రకమైన నిబంధనలు ఉండకూడదని కొందరు వాదిస్తున్నారు. ఇది మహిళల ఆటతీరుపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

టెన్నిస్ గ్రాండ్ స్లామ్ మ్యాచుల్లో పురుషులకైనా, మహిళలకైనా టాయిలెట్ బ్రేకులు ఇంకా తగ్గించాలని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విరామాన్ని ఆటగాళ్లు తమ కోసం అదనపు సమయం పొందేందుకు వినియోగించుకుంటున్నారని వాళ్ల వాదన.

వింబుల్డన్

ఫొటో సోర్స్, Getty Images

అయితే ఒక మహిళగా తరుకా భిన్నాభిప్రాయం వెలిబుచ్చారు.

"ఒక క్రీడాకారిణికి పీరియడ్స్ మొదలైన రోజు కోర్టులో ఆడుతోంది అనుకుందాం. శానిటరీ నాప్కిన్ మార్చుకోవాలంటే ఒక సెట్ పూర్తయ్యే వరకు వేచి చూడాలి. ఎందుకంటే, టాయిలెట్ బ్రేకులపై పరిమితి ఉంటుంది కదా. ఇది మహిళలకు చాలా కష్టమైన పరిస్థితి. మహిళల అవసరాలు వేరు, పురుషుల అవసరాలు వేరు. వింబుల్డన్ నిబంధనలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది" అని తరుకా అన్నారు.

నిబంధనల ప్రకారం, మ్యాచ్ మధ్యలో మహిళలకు మూడు నిమిషాల బ్రేక్ ఉంటుంది. ప్యాడ్ లేదా బట్టలు మార్చుకోవాలంటే అయిదు నిమిషాలు బ్రేక్ తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ సమయం తీసుకుంటే వారికి పెనాల్టీ పడుతుంది.

పీరియడ్స్ కారణంగా మరో బ్రేక్ తీసుకోవాలంటే దాని గురించి అందరి ముందూ అంపైర్‌తో మాట్లాడవలసి ఉంటుంది. అంపైర్ మైక్రోఫోన్ ఆన్ ఉంటుంది, కెమెరాలు చూస్తూనే ఉంటాయి. ఇది మహిళలకు అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు.

వింబుల్డన్

ఫొటో సోర్స్, AFP

'కోర్టులో ఉన్నప్పుడు నేను పురుషుడినైపోతే బాగుందును'

వింబుల్డన్ మాత్రమే కాకుండా ఇతర టోర్నమెంటుల్లో ఎదురయ్యే సమస్యల గురించి కూడా మహిళా క్రీడాకారులు చెబుతున్నారు. 2022 ఫ్రెంచ్ ఓపెన్‌లో 19 ఏళ్ల టెన్నిస్ ప్లేయర్ యాంగ్ చిన్విన్ ఆట క్రీడాభిమానులకు గుర్తుండే ఉంటుంది.

ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్‌తో తలపడ్డ మ్యాచ్‌లో చిన్విన్‌కు క్రాంప్స్ (నొప్పులు) వచ్చాయి. ఈ మ్యాచ్‌లో ఆమె ఓడిపోయారు. ఆట ముగిసిన తరువాత యాంగ్ చిన్విన్ మాట్లాడుతూ, "పీరియడ్స్ వల్లే తనకు ఆ నొప్పులు వచ్చాయని" చెప్పారు.

"టెన్నిస్ కోర్టులో ఉన్నప్పుడు మాత్రం నేను పురుషుడినైపోతే బాగుందును" అన్నారు చిన్విన్. యాంగ్ చిన్విన్ చెప్పిన మాటలు చాలా విషయాలను బయటపెడతాయి.

వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను గత ఏడాది ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. బీబీసీ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్‌ 2021 అవార్డు అందుకున్నారు.

ఒలింపిక్ మ్యాచ్‌కు ఒకరోజు ముందు తనకు పీరియడ్స్ మొదలయ్యాయని, పెద్ద మ్యాచుకు తనను తాను శారీరకంగా, మానసికంగా ఎలా సిద్ధం చేసుకున్నారో మీరాబాయి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మీరాబాయి చాను

ఫొటో సోర్స్, DEAN MOUHTAROPOULOS/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మీరాబాయి చాను

మహిళల సౌకర్యం కన్నాసంప్రదాయం గొప్పదా?

'ది టెలిగ్రాఫ్' వార్తాపత్రిక గత ఏడాది భారత్-ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ సిరీస్‌పై ఒక నివేదికను ప్రచురించింది.

"భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో సగం మంది మహిళలు రుతుక్రమంలో ఉన్నారు. ఒక భారతీయ క్రీడాకారిణికి కూడా పీరియడ్స్ వచ్చాయి. ఇంగ్లండ్ ప్లేయర్ టామీ బ్యూమాంట్ పీరియడ్స్ మొదటి రోజే మైదానంలోకి దిగారు. టెస్టు మ్యాచులకు వేసుకునే సాంప్రదాయక తెల్లటి దుస్తులపై మరకలు పడతాయేమోనని ఆమె భయపడ్డారు. ఎక్కువసార్లు టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తే, మ్యాచ్ మధ్యలో ఎలా కుదురుతుంది? టీవీలో లైవ్ కవరేజ్ వస్తుంటుంది. లైవ్‌లో మరకలు కనిపిస్తే? నా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్‌లో తొలి రోజు ఇవన్నీ ఆలోచించాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదు" అని ఆమె చెప్పినట్టు పై నివేదికలో వెల్లడించారు.

2020లో బీబీసీ జరిపిన ఒక స్పోర్ట్స్ సర్వేలో 60 శాతం మహిళలు పీరియడ్స్ సమయంలో అసౌకర్యం తమ ఆటతీరుపై ప్రభావం చూపుతుందని చెప్పారు. తమ కోచ్‌తో దీని గురించి మాట్లాడడం కుదరలేదని 40 శాతం మహిళలు చెప్పారు.

క్రీడా సంస్థలు ఏం చేస్తున్నాయి?

స్పోర్ట్స్‌కు సంబంధించిన కొన్ని కంపెనీలు దీనిపై కసరత్తు చేస్తున్నాయి. అడిడాస్ సైట్‌లో ప్లేయర్ల కోసం పీరియడ్ ప్రూఫ్ దుస్తులు ఉంచారు. ఈ దుస్తుల్లో ద్రవాన్ని పీల్చుకునే పొర, లీక్‌ప్రూఫ్ పొరలు అదనంగా జతచేశారని సైట్‌లో ఉన్న సమాచారం తెలుపుతోంది.

మహిళల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉత్పత్తులను తయారు చేస్తున్నట్లు అడిడాస్, బీబీసీ స్పోర్ట్స్‌కు తెలిపింది.

వీడియో క్యాప్షన్, నిఖత్ జరీన్: 'తెలంగాణ పేరును క్రీడారంగంలో నా కూతురు స్వర్ణాక్షరాలతో లిఖించింది'

వింబుల్డన్ ప్రకటన

మహిళా క్రీడాకారులు ఎదుర్కునే సమస్యలు అనేకం ఉన్నాయి. కానీ, అందరూ వీటి గురించి బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. కొన్ని సమాజాల్లో, కొన్ని వర్గాల్లో పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడడంపై ఇప్పటికీ ఆంక్షలున్నాయి. లేదా పీరియడ్స్‌ను సాకుగా చూపిస్తున్నారనే అపనింద మోయాల్సి రావొచ్చు.

ఈ నేపథ్యంలో వింబుల్డన్ ఒక ప్రకటన ఇచ్చింది.

"మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని మేం భావిస్తున్నాం. వింబుల్డన్‌లో ఆడే ఆటగాళ్ల ఆరోగ్యం మాకు చాలా ముఖ్యం" అని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)